ఎక్కడో ఉంటావ్
ఎక్కడో ఉంటావ్
ఆకృతులలోనో, అక్షరాలలోనో
గాత్రంలోనో, గానంలోనో
ఎక్కడో ఉంటావ్!
వర్ణాలలోనో, చిత్రాలలోనో
నూలులోనో, అల్లికలోనో
ఎక్కడో ఉంటావ్!
అందీఅందనట్టు కలలోనో
తెలిసీతెలియనట్టు కలవరపాటులోనో
ఉండీలేనట్టు ఉంటావ్!
ఎక్కడ నుండో ఉండుండి
జ్ఞాపకమై వస్తావ్ సెలయేరులా,
గురుతులన్నీ ఉండచుట్టి విసిరేసినట్టు
వెళ్లిపోతావ్ జలపాతంలా.
వెళ్తూ వెళ్తూ మరో ముద్రను వదిలిపోతావ్
భందించి భద్రపరుచుకోవటానికి అస్తిత్వమేదని?
కరిగిపోయే కల నిలిచేదెంత కాలమని!
ఒదిగిపోవటం జీవితానికి తెలిసినంతగా
అదిమిఉంచటం మనసుకు చేతకాదు కదూ!
అందుకే కాబోలు
ఎక్కడున్నా వెతుకులాట సాగుతూనే ఉంటుంది….