మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది


మార్పు  వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది

10487441_10202294150177112_2338276987061959354_n

అనగనగనగా ఒక ఊరన్నమాట. ఆ ఊర్లో రామయ్య గారనే ఓ మోతుబరి. నాట్లు, కోతల దగ్గర నుంచీ కౌలులెక్కలు, కూలీ నాగాలు అన్నీ ఆయనకు కరతలామలకం. అంత సమర్థులు వారు. ఇంట్లో అందరికీ ఆయనంటే భయం. ఆయన వస్తుంటే పిల్లలు పుస్తకాలలో తలలు దూరుస్తారు. భార్య భయంతోనూ, భక్తితోను నీళ్ళ చెంబును ఆయనకు అందిస్తుంది కాళ్ళు కడుక్కోవటానికి. భోజనం వడ్డించి, విసనకర్రతో విసురుతూ పక్కనే కూర్చుంటుంది. ఆయనకు అన్ని సమకూర్చి పెట్టటంలో ఏ పొరపాటు రానీయదు ఆవిడ. ఆ మహా ఇల్లాలు తలెత్తి  సూటిగా ఆయన కళ్ళలోకి ఏనాడు చూడలేదు. ఆ కుటుంబంలోని నిర్ణయాలన్నీ ఆయనవే.  అందరూ ఆవిడను అనుకూలవతి అంటుంటారు.

అనగనగా అదే ఊరన్నమాట. ఆ ఊర్లో ఓ  జానకయ్య గారు. మన అయ్యవారు సర్వవేళ సర్వావస్థలందున విహారయాత్రల్లోనే ఉంటారన్న మాట.  పేకముక్కలు ఎగిరిపడుతుంటాయి, ఆస్తులు హారతి కర్పూరాలవుతుంటాయి. పొద్దస్తమానూ ఏడుస్తూ కూర్చుంటే సంసారం గడుస్తుందా! ఆయన భార్య పాడి గేదెలతోనూ, దొడ్లో పెంచిన కూరగాయలతోను పిల్లల పొట్టలు నింపుతూ, ఉండి లేక వారిని బడికి పంపుతూ ఉంటుంది. అందరూ ఆవిడను ఓర్పురాలు అంటుంటారు. పెద్ద పెద్ద నిర్ణయాలు, అంటే,  ఆస్తిపాస్తుల విషయాలలోనూ, పిల్లల పెళ్లి సంబంధాల సమయాలలోనూ ఆవిడ గట్టిగా నోరెత్తి  తన అభిప్రాయం చెపితేను, ఇలాగే జరగాలి అని పట్టుపడితేను అందరూ ఆవిడను ఆడపెత్తనం అని చులకన చేస్తుంటారు.

సరే, ఇదంతా బ్లాక్ అండ్ వైట్ కాలం. ఇప్పుడు ఈస్టమన్ కలర్ లోకి వచ్చేదాం.

బాపుగారి గోరంత దీపం సినిమా. కూతురిని అత్తగారింటికి పంపుతూ తండ్రి చెప్పే హితబోధల్లో ఇదొకటి , ” నువ్వు హాయిగా ఉన్నప్పుడే  కన్నవారిని గుర్తుతెచ్చుకో, వారిని చూడ్డానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడో, కష్టపడుతున్నప్పుడో నాకు చెప్పకు, అది నా పెంపకానికి అవమానం.”

[ భగవంతుడా….. పెళ్లంటే సర్దుబాటు తప్పదమ్మా. ఓర్పుగా, ధైర్యంగా సరిదిద్దుకో అని చెప్పి నీకే కష్టం వచ్చినా నేనున్నాను అని ధైర్యం చెప్పి జీవితంలోకి పంపించాలి కానీ ఇదేమిటి, నా పెంపకానికి అవమానం కలిగించకు అంటారు !!! ఓకే, ఎవరి కష్టాలు వారే తీర్చుకోవాలి. ఓ మాట సాయానికి, ఓ ఓదార్పుకు అండగా మేముంటాం అని తల్లిదండ్రులే చెప్పకపోతే ఇక ఎవరు చెపుతారు. పెళ్లవగానే ఇంక నీకు మాకు సంభందం లేదంట!!!! ఆ రోజుల్లో ఇదంతా తట్టుకుని నిలబడిన స్త్రీలకు హాట్స్ ఆఫ్ .]

శ్రీ రమణగారి ధనలక్షి కధ. భలే ఉంటుంది. ధనలక్షి మహా సమర్ధురాలు. భర్త కాస్త అమాయకంగాను, కొంత అసమర్ధంగాను ఉంటాడు. ధనలక్షి ఎడం చేత్తో కిరాణా కొట్టుని, కొడుకుని పెంచేస్తూ ఉంటుంది. కుడిచెయ్యి మొత్తం మొగుడు ఇగోను లౌక్యంగా తృప్తిపరుస్తూ ఉంటుంది. రకరకాల మనుష్యులు, అన్నే  రకాల సామర్ధ్యాలు. అందులో తప్పేమీ లేదు.    భర్త అమాయకత్వాన్ని కొంగుకింద దాచుకోవటం కొంత బాధ్యత కూడా. పదిమందిలో మనవారిని లోకువ చేసుకోకూడదు. ఈ కధలో  నేను మీకంటే గొప్ప కాదు, మీరే అంతా అని అడుగడుక్కీ అతని అహాన్ని తృప్తి పరుస్తూ ఉంటుంది.

ఇప్పుడు కెమెరాలు కొంచెం జూమ్ చేద్దాం.

రామయ్య గారి ధర్మపత్నికి  ప్రపంచం ఇల్లయితే వారి మనవరాలి పరిధి ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో మనవడు,మనవరాలు ఒకటే వేగంతో పరుగులు పెడుతున్నారు. ధనలక్షి కోడలు కొడుకుతో పాటు కొట్టులో పనిచేస్తుంది. తన నిర్ణయాలు తనవే అని  చెపుతుంది. ధనలక్షి కొడుకు మారుతున్న కాలంతో కొంత మారుతూ, పెరిగొచ్చిన వాతావరణపు ప్రభావం నుంచీ బయటపడటానికి కొంత సంఘర్షణ పడుతున్నాడు. అతనేనాడయినా అహంకారంగా మాట తూలితే, అది అతని వ్యక్తి తప్పుగా కాక అతను పెరిగిన కాలపు ప్రభావంగా ఆ పిల్ల అర్థం చేసుకుంటే బాగుండు.

ఇంకొంచెం ముందుకొద్దాం.

గ్లోబలైజేషన్ పుణ్యాన ప్రపంచం పల్లెటూరయింది. ఆ పల్లెటూరిలో అనగనగా ఓ వీధంట. అక్కడ భారతీయులే ఎక్కువగా ఉంటారంట.  రామ్, జాన్కి ఓ జంట. ఇద్దరూ కష్టపడతారు, దొరికిన టైంలో సరదాగా బాగానే ఉంటారు. మన జాన్కకమ్మకు ప్రొమోషన్ వచ్చి మేనేజర్ అయింది. Obvious గా పనెక్కువయ్యింది. ఇంటికి లేటుగా వస్తోంది. అడపాదడపా బిసినెస్ ట్రిప్పులకని పక్క సంధులకు ఎగరాల్సి వస్తోంది. పిల్లల హోం వర్కులు రామ్ చూస్తున్నాడు.

ఇంక చూసుకోండి…. వీధి వీధంతా వీకెండ్ పార్టీలో జాన్కి ఇళ్ళు పట్టించుకోవట్లేదని, ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ తిరుగుతోందని ఆడిపోసేసుకున్నారు.  పాపం రామ్ కు పప్పుచారు తాలింపులో  ఎండు మిరపకాయ వెయ్యటం తెలీదని పాట్ లక్ పార్టీలో జోలెడంత జాలి కురిపించేసారు.  ఈ మాటలు విని విని జాన్కి గిల్టీ ఫీలింగ్ ను, రామ్ insult ఫీల్ ను పెంచుకోకుండా ఉంటే బాగుండు .

ఆ సంధులోనే రెండు ఇళ్ల  అవతల ఇంకో జంట, రాధ, గోపాల్ అనుకుందాం . రాధ బాగా చదువుకుంది, తెలివైనది. మొదట్లో చెప్పుకున్న రామయ్యగారి భార్యలా ఇంటి పట్టునే ఉండి  భర్తను, పిల్లలను చూసుకోవటమే తనకిష్టం అంది. అంటే, మరీ భర్త పట్ల భయభక్తులున్న  భార్యగా కాదు. మనలో మాట, ఈ భయం భక్తి ఏంటండీ బాబు!  ఒకళ్ళంటే ఒకరికి కాస్త గౌరవం, బోల్డంత ప్రేమ మాత్రమే కదా ఉండాల్సింది. ఉద్యోగం చెయ్యనూ అంది కదా మన రాధమ్మ. ఇంకచూసుకోండి…చుట్టాలుపక్కాలు, తెలిసినోళ్లు, తెలీనోళ్లు  మూకుమ్మడిగా ఇంత చదువుకుని ఇంట్లో అంట్లు తోముతావా అని నానా గొడవ చేసేసారు. కెరియర్లో పైకొచ్చిన జాన్కిని ఇళ్ళు పట్టించుకోవట్లేదన్నారు, ఇప్పుడు నన్నేమో  ఇంట్లోనే కూర్చుంటావా అంటున్నారు. It’s my choice to be a home maker అని నిక్కచ్చిగా చెపితే బాగుండు రాధ.

రెండు ఉదాహరణలు, ఇద్దరు పవర్ఫుల్ బిసినెస్ విమెన్.

Indra Nooyi, Chairperson and Chief Executive Officer of PepsiCo. ఉద్యోగం, ఇల్లు బాలన్స్ చేసుకోవటం చాలా కష్టం అని చెపుతూ ఇంద్రా నోయి ఒక ఇంటర్వ్యూలో  You will die with guilt అన్నారు. నిజం, కొన్ని గిల్టీ మొమెంట్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా పిల్లలు సిక్ అయినప్పుడు డే కేర్ లోనో లేక బేబీ సిట్టర్ దగ్గరో వదిలి వెళ్ళటం గుండెను పిండేస్తుంది. తల్లీ తండ్రీ ఇద్దరూ చెరి సమానంగా ఇంటి బాధ్యతలు పంచుకున్నప్పుడు ఈ hurdles దాటటం అసాధ్యం కాదు, అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమూ రాదు. సమానం అంటే సమానమే, నీకు సాయం చేస్తున్నాను అన్నట్టు కాదు.

మరో మాట, ఈ గిల్టీ ఫీలింగ్ అనేది మగవారికి ఉండదా? ఎందుకు ఉండదు? పగలు రాత్రుళ్ళు పని చెయ్యాల్సిన వచ్చిన సందర్భాలలో మగవారు వారి కుటుంబాలను  మిస్ అవ్వకుండా ఉంటారా చెప్పండి? ఉద్యోగం పురుషలక్షణం అని నూరిపోసి ఇలాంటి సెన్సిటివ్ ఫీలింగ్స్ ఉండవు అన్నట్టు తయారుచేసాం. Men too miss their families. Gents too feel stress. ఇంద్రా నోయి women can’t have it all  అంటారు. Who can have it all? There is no fixed definition for having it all. Every individual, men and women, derives their own derivations for it.

ఇంకొక ఉదాహరణ: Chanda Kochhar is the managing director and chief executive officer of ICICI Bank.

చంద్ర కొచ్చర్  కూతురు అమెరికాలో చదువుకున్న సమయంలో చంద్ర కొచ్చర్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. కూతురు తల్లిని అభినందిస్తూ ఇలా మెయిల్ చేసింది, You never made us realize that you had such a demanding, successful and stressful career. At home, you were just our mother.

ఇంతకన్నా గొప్ప ఇన్స్పిరేషన్ ఏం కావాలి మనకు?

(ఇప్పుడింత ఆవేశం ఎందుకొచ్చిందంటే, ఒక కధ చదివా. శారదా పెళ్లయి అమెరికాకు వచ్చింది. భర్త పరమ రాక్షసుడు. శారీరకంగా, మానసికంగా రోజూ నరకం అనుభవిస్తూ  ఉంటుంది. తల్లి ఆరోగ్యం బాగోలేదు అన్న వంకన ఇండియా వస్తుంది. ఇంకెప్పుడు తిరిగి రాకూడదు అనుకుంటుంది. తండ్రి సమ్మతించక, ఇంక తన బతుకు ఇంతే అని తిరిగి వస్తుంది. ఓ రోజున ఒళ్ళు తెలియని ఆవేశంలో అతనడిని చంపేస్తుంది. రచయిత చివరన, ముక్కు మొహం తెలియనివారికి పిల్లనిచ్చి అమెరికా పంపించేసి చేతులు కడుక్కున్న తల్లిదండ్రులకు అంకితం అని రాసారు.

హ్మ్… అలా కాదు. పెళ్ళే నీ జీవితం, అక్కడే ఉండు అక్కడే సర్దుకో, మా దగ్గరకు రాకు, పెళ్లయ్యాక భర్తతోటే బతుకు చావు అని అదిగో ఆపైన చెప్పారే గొప్ప డైలాగులు అలా పెంచిన తల్లిదండ్రులకు.  ఆడపిల్లలకు బతకటం నేర్పించని తల్లిదండ్రులకు అంకితం అని రాయాలి)

This entry was posted in నా ఆలోచనలు, మహిళ, వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది

  1. Chandrika says:

    మీరు పైన చెప్పిన ‘గోరంత దీపం ‘చలన చిత్రం లోని మాటలు ఒక తండ్రి తన పెంపకం మీద ఉన్న నమ్మకం తో కూతురికి చెప్పే మాటలు. అదే విధం గా ఆయనకి కూతురి మీద నమ్మకం కూడాను. ఇంకో మాట కూడా చెప్తాడు ‘కాలిలో ముళ్ళు గుచ్ఛు కుంటే కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి ‘ అని. అంటే try to be positive in every aspect. కూతురిని వదిలించుకోవాలి అని మాత్రం కాదు. గృహహింస అనుభవించే స్త్రీలు తమకి తమ పై నమ్మకం లేకనే కదా ఎలాంటి హింస అయినా భరిస్తారు!! తల్లితండ్రుల పెంపకం ఆ నమ్మకం కలిగించేది గా ఉండి , ఆ managing skills ఉంటే అసలు తల్లి తండ్రుల అవసరం దేనికి ? గత పదిహేనేళ్ళల్లో చాలా మార్పు కన్పిస్తోంది. మధ్యతరగతి ఆడపిల్లలు, వారి తల్లితండ్రుల డిమాండ్లు మారిపోతున్నాయి. కొన్ని చోట్ల సమానం,స్వేఛ్చ అనే పేరు తో ఆడపిల్లలు కుటుంబ విలువలు లేకుండా తయారవుతున్నారు కూడా.

    మీరు అన్నట్లు కొన్ని చిన్న చిన్న విషయాలలో ఇంకా మార్పు రావాలి. వంట చేయటం, అంట్లు తోమటం, బట్టలు మడత పెట్టడం, బట్టలు ఆరేయటం, కూతురికి జడ కూడ వేయడం ఎంత మంది మగ వారు మనలో ఏ నామోషి పడకుండా చేస్తారు? ‘ఆడంగి’ పనులు అంటూ వాటికొక పేరు తగిలించారు పైగా. కోడలు, అల్లుడు ఇంటికి వస్తే ఏ అత్తగారైన అల్లుడు తిన్న కంచం తీస్తే ఊరుకుంటుందా? కోడలు తీయకపోతే ఊరుకుంటుందా?

    • చివర్లో రాసినట్టు ముక్కు మొహం తెలియనివారికి పిల్లనిచ్చి అమెరికా పంపించేసి చేతులు కడుక్కున్న తల్లిదండ్రులకు అంకితం అని రాసింది చదివినప్పుడు, తమ పిల్లలకు బతకటం నేర్పించని తల్లిదండ్రులకు అంకితం అని రాసి ఉండాల్సింది అనిపించింది. దానిని రిలేట్ చేసుకుంటూ గోరంత దీపంలో తండ్రికి తన పెంపకం, తన కూతురిపై అంత నమ్మకం అని అనుకొవొచ్చు కదా నేను?ఇది కొంచెం కటినంగా ఉండబట్టి నాకలా అనిపించిందా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
      నీ కష్టాలు నువ్వే తీర్చుకోవాలి, ఎవరూ తీర్చరు, తిర్చలేరు అని చెప్పటం నిజంగా నిజం. కానీ నువ్వు హాయిగా ఉన్నప్పుడే కన్నవారిని గుర్తుతెచ్చుకో, వారిని చూడ్డానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడో, కష్టపడుతున్నప్పుడో నాకు చెప్పకు….. ఇది చాల దారుణం. ఎంతటి వీరులకైనా, వీరురాలికైనా మన అనేది కొండంత ధైర్యం. ఇలా చెప్పటం ఒప్పుకోలేను.
      మంచి స్పందనకు ధన్యవాదాలు చంద్రిక గారు.

Leave a comment