అమూల్య


ఉదయం నుంచీ వాన ముసురులా కమ్ముకుంది. మనసంతా మహా చెడ్డ చిరాకుగా ఉంది. జోరున కురిసి పోకుండా, ఇలా చినుకు చినుకులా సాగే వానంటే నాకసలు ఇష్టం ఉండదు. విసుగ్గా బాధగా ఉంది… లోపలేదో కెలుకుతున్నట్టు.

అలుముకుంటున్న చీకట్లు గ్లాస్ విండోలో నుంచీ మరింత చిక్కగా కనిపిస్తున్నాయి. పగలంతా పారిపోయినా, రేయిలో వదలని సలపరాల రంగు నలుపేనేమో కదూ!

అమ్మ గొంతులోని జీర పదే పదే చెవుల్లో వినిపిస్తుంది. నాలో ఎన్ని జీరలు బొంగురు పోయాయో నాకు తప్ప ఎవరికి తెలుసు?

నాన్న వణికే కంఠం….. కాదనలేను. కానీ, క్షమించలేను.

చీ, ఈ వెధవ కన్నీరు. Iఐ హేట్ టియర్స్. ముసురులా కమ్ముకునే ఈ దుఖం. భోరున ఏడుపు రాదు, ఒక్కో చుక్క తలగడను ముద్ద చేసే ఈ చుక్కలు …ఐ హేట్ ఇట్.

ఇప్పుడంతా సర్దుకుంది కదా! (?), ఇంకా నాకెందుకీ బాధ?

అన్నీ వదిలించుకున్నాను కదా!(?), అయినా ఎందుకీ వెంపర్లాట?

“ఒక్కసారి ఆలోచించమ్మా”, అమ్మ అర్థింపు.

“అయిందేదో అయిపొయింది… అందరూ అలా వుండరు”, నాన్న సముదాయింపు.

నాకు మీపై కోపం నాన్న…. కోపం! అబ్బబ్బ మళ్ళి ఈ కన్నీరు….

నాన్న నా హీరో అనుకుంటూ పెరిగాను కదూ! నాకేం, నాన్న ఉన్నారు అనే ధైర్యం ఒక్కసారిగా నాపైనే కుప్ప కూలిపోయిన రోజున, మూడు ముళ్ళు కాదు పది పీట ముడులలో నా నమ్మకం చిక్కుకుపోయి చచ్చిపోయింది నాన్న.

“కార్డులు పంచితే పంచాం. అనివార్య కారణాల చేత పెళ్లి కాన్సిల్ అయిందని పేపర్లో ప్రకటన ఇచ్చేద్దాం అంటే వినకపోయాడు అన్నయ్య. “, పాలల్లో ముంచి తీసిన నా చేతిని వాళ్లకు అప్పగించిన తర్వాత బాబాయ్ ఎవరితోనో అంటుంటే వినిపించిన మాటలివి.

తాంబూలాలు మార్చుకుని, పిలుపులు అయ్యాక అబ్బాయి గురించి, ఆ కుటుంబం గురించి తేడాగా తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి కాన్సిల్ చెయ్యలేకపోయారు? మరీ ముఖ్యంగా నాకు ఆ విషయాలన్నీ తెలీకూడదని ఎందుకు అతి జాగ్రత్త వహించారు? పొరపాటు జరిగితే తలరాత అనుకుందును. తెలిసి తెలిసి చేతులారా చేసారే?

అమ్ములూ అంటూ ఎంత ప్రేమగా పిలిసేవారు నాన్న మీరు. అలాంటి ఈ అమ్ములు కన్నా సమాజం, ఆ సమాజంలోని పరువు ఎక్కువైపోయింది కదూ మీకప్పుడు? పది రోజులు ప్రశ్నించే లోకం కోసం నా నమ్మకాన్ని పణంగా పెట్టారు కదా నాన్న… అందుకే నాకు కోపం మీ పై.

మర్యాదలు సరిగ్గా జరగలేదని, అబ్బాయికి పెట్టిన గొలుసు సన్నగా ఉందని, ఆడపడుచు కట్నం తక్కువయిందని…పెళ్ళిలో అడుగడుగుకీ రభసే. కొత్త పెళ్లి కూతురి మనసుపై ఇవన్ని ఎలా ముద్రించుకుంటాయో ఏనాడైనా ఆలోచించారా?

నగలన్నీ నా సూటుకేసులో సర్ది కొంగుతో కళ్ళు తుడుచుకున్న అమ్మ చేతకానితనమంటే నాకు కోపం. ఈ పాడు కన్నీరు వదిలిపెట్టవు….
అత్తమామలతో కలిసి వుండవు. ఎక్కడో పరాయి దేశంలో ఉంటారు మీరిద్దరూ, అంతా బాగానే ఉంటుందని పలాయనాన్ని మార్గంగా నూరిపోసిన బంధు వర్గమంటే కోపం.

అన్నింటికీ మించి నేనంటే నాకు కోపం. సర్దుకుపోవాలి, అణిగిమణిగి ఉండాలనే నీతులు విని వినీ, ఆ తీరులోనే బతకాలి అనే భ్రమలో, ప్రశ్నించటాన్ని మర్చిపోయి జీవితంలోని కొన్ని వసంతాలను వ్యర్ధం చేసుకున్నందుకు.

బహుశా, వ్యథా భరితంగా గడిచిన ఆ రోజులే జీవించాలి అనే కోరికను నాలో బలంగా నాటి ఉంటాయి.

అతని మాటలు భరించాను, నిరాదరణను సహించాను….కానీ, కానీ….

మనసుని తాకలేని అతని చేతులు శరీరాన్ని నలిపేస్తుంటే, “నీకేం హక్కుందని?” ప్రశ్నించాను. రిజిడ్ అన్నాడు. అవును రిజిడ్ నే…

ప్రేమ, నమ్మకం, గౌరవం లోపించిన చోట కేవలం మాంసం ముద్దను. నీకు అవసరం, నాకు ప్రేమకు పరాకాష్ట.

ఏ బలాత్కారపు చుక్క నన్ను దాటుకుని నాలో ప్రవేశించిందో, నా రక్తాన్ని పంచుకుని నాలో స్పందనలను తీసుకొచ్చింది.

బండి పట్టా లెక్కుతుందని అమ్మ ఆశ పడింది.

“బిడ్డ మొహం చూసి….. “, మరో కోణం జతయింది. ఎన్ని కోణాలలో ఇరుక్కుపోయి నలిగిపోను?
మొహంపై ఉమ్మేసిన క్షణాలను, సంఘటనలను నాన్న చొక్కాతోనో, అమ్మ కొంగుతోనో తుడుచుకోలేను కదా! ఈ అడుగు వెయ్యటానికి సంపాదన ఇచ్చిన ఆసరా కన్నా, కష్టం నేర్పించిన తెగువ నాకు ఊతమిచ్చింది.

IIT లో సీటు వచ్చినప్పుడు గర్వం తొణికిసలాడిన నాన్న కళ్ళు, “నా బతుకు నేను బతుకుతాను” అన్ననాడు పాతాళం లోనికి వాలిపోయాయి.

పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు ఆనందం వినిపించిన అమ్మ గొంతు, “విడిపోవాలని నిర్ణయించు కున్నాను” అన్ననాడు విషాదంతో మూగబోయింది.

వద్దు వద్దు గతంలోనికి వెళ్లొద్దు. ఆ గోతులలో తడుముకుంటూ, చీకటిని నిందిస్తూ….. వొద్దు వొద్దు.
అమ్మతో ఫోన్ లో మాట్లాడిన దగ్గర నుంచీ ఇక్కడే కూర్చున్నాను. ఈ ఆలోచనలు నన్ను వదలట్లేదు.
నన్ను రక్షించటానికే అన్నట్టు మనార్ మెయిన్ డోర్ తాళం తీసుకుని లోపలి వచ్చింది.
“ఇంకా నిద్ర పోలేదా?”, అరబ్ ఆక్సెంట్ ఇంగ్లీష్ లో అడిగింది. పలకరింపుగా నవ్వాను.
సన్నటి పిన్నులను జాగ్రత్తగా తీసి, తలకు చుట్టుకున్న హిజాబ్ ను తొలిగిస్తుంది. నేను తననే చూస్తున్నాను.
“అర్ యు అల్ రైట్”, అడిగింది. మనార్ నా మోహంలోని భావాలను ఇట్టే చదివేస్తుంది. ఎంతైనా phd స్టూడెంట్ కదా.
“చాలా లేట్ అయింది, థీసిస్ ఎంత వరకు వచ్చింది?”
“ఆల్మోస్ట్ డన్. ఐదేళ్ళ కష్టం కొలిక్కి రాబోతుంది. అలా వున్నావ్? ఇంటికి కాల్ చేశావా?”
“అమ్మ నాన్న తో మాట్లాడాను. అదే అర్థింపు. వాళ్ళ ఆత్రుత అర్థం అవుతుంది. బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్”
“ఆక్సెప్ట్ చెయ్యటానికి వాళ్లకు కొంత సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టు”, అనునయంగా అంది.
“ఐ అమ్ ఓకే మనార్. ఏవో పాత జ్ఞాపకాలు… అంతే”
“అఖిల్ నిద్రపోయాడా?”
“ఊ”
“ఇన్నాళ్ళ నుంచీ కలిసి ఉంటున్నాం. ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకుని ఓదార్పు పొందాం. వ్యవస్థను నిందించావే కానీ, ఎప్పుడూ అతని గురించి మాట్లాడలేదు”

“నేను అనుభవించిన క్షోభ మాత్రమే నాకు తెలుసు మనార్”

మనార్ నాకొక ఇన్స్పిరేషన్. కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచీ వచ్చింది. మత ఛాందసుడైన అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని వస్తే, మనార్ తల్లిదండ్రులు తమ కూతురి అదృష్టానికి మురిసిపోయారంట. చస్తానని బెదిరించి ఇంట్లో నుంచీ బయటకు వచ్చేసింది.
నేను ఇంటి కోసం డెస్పరేట్ గా చూస్తున్న సమయంలో నా స్నేహితురాలు మనార్ గురించి చెప్పింది. మొదట్లో మతం గురించి జంకాను. నాకప్పుడు మరో ఛాన్స్ లేక బాబుతో సహా వచ్చేసాను. అప్పటికే నా సంగతులు సూచాయిగా నా స్నేహితురాలి ద్వారా తనకు తెలిసినట్టుంది. ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నట్టు నా చేతిని ఆప్యాయంగా పట్టుకుని ఇంట్లోకి ఆహ్వానించింది.

మనార్ కళ్ళలో కనిపించే వెలుగు, తన మాటల్లోని తెగువ నాకెంతో నచ్చేది. కొద్ది రోజుల్లోనే ఎంతో కాలంగా పరిచయమున్నంత స్నేహం కలిసింది మా ఇద్దరికీ. నాకెప్పుడైనా ఆఫీసులో ఆలస్యం అయితే బాబును డే కేర్ నుంచీ తనే తీసుకొచ్చి , నేను వచ్చే వరకు వాడి అవసరాలు శ్రద్ధగా చూసేది.

“మనార్, నువ్వెందుకు హిజాబ్ ధరిస్తావ్?”, అడిగానోసారి
“నవీనత్వంలో నేనెన్ని అడుగులు వేస్తున్నా, నా ముందు పరదా తెరలు ఉన్నాయన్న సత్యాన్ని మరిచిపోకుండా ఉండటానికి, ఇప్పుడా ఘోషాలు కనీకనిపించకుండా మోసం చేస్తున్నాయనే స్పృహలో ఉండటానికి”, నవ్వుతూ చెప్పింది.
మనార్ పెదవులైతే నవ్వుతున్నాయి, కానీ ఆమె కళ్ళలోని లోతులు నన్నేక్కడో తట్టాయి.

***

“అమ్మ నిన్ను చూడాలని గొడవ చేస్తుంది. ఈ వీకెండ్ వస్తావా అక్కా”, మేనత్త కూతురు రమ ఫోన్ చేసింది. రమ డెలివరీకి అత్త ఇండియా నుంచీ వచ్చింది.
నేను, అఖిల్ వెళ్ళాము.

అఖిల్ బుగ్గలను ముద్దాడి, నన్ను కౌగిలించుకుంది. అత్త కళ్ళలో సన్నటి తడి… నా కళ్ళలో కూడా…
కుశల ప్రశ్నలు, అక్కడి ఇక్కడి ముచ్చట్లు అయ్యాక…. అమ్మ పంపించిన ప్యాకెట్ నా చేతికందిస్తూ, “అమ్మా, నాన్నా చాలా బెంగపెట్టుకున్నారమ్మా”, అంది అత్త.

నా కెంతో ఇష్టమైన అరిసలు, అఖిల్ కు బట్టలు పంపించింది అమ్మ.
“నీకు తెలియనిదేముంది అమ్ములు, పిల్లాడున్నాడని ఏ సంబంధాలు రావట్లేదు. రాక రాక వచ్చిన సంబంధాన్ని కాదంటున్నావంట కదా! అబ్బాయి గురించి వాకబు చేసాం. కుటుంబమూ మంచిదేనంట. మొదటి పెళ్ళిలోని అమ్మయికి ఏవో తేడాలున్నయంట. అబ్బాయి బుద్ధిమంతుడు. ఆలోచించమ్మా”

“అత్తా, ప్లీజ్”
“అఖిల్, మనిద్దరం పజిల్ ఆడుకుందాం రా”, రమ అఖిల్ ను తీసుకుని పక్క గదిలోకి వెళ్ళింది.
“అంత మొండి పట్టుదల ఉండకూడదు అమ్ములు. ఆడవాళ్ళం అన్నాక సర్దుకుపోవాలి. అందరూ నీలా పెళ్లి చేసుకోము అంటే సృష్టి సాగుతుందా?”, అత్త గొంతులో కోపం, అసహనం వినిపిస్తున్నాయి.
“సృష్టి భారమంతా నా పైనే ఉన్నట్టు త్యాగాల మూటను నా వీపుకు తగిలించకు అత్తా. నా భారాన్ని నన్ను సమర్థంగా మోసుకోనీ ముందు ”, నవ్వుతూనే అన్నాను.

“ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా?”, ఆర్తిగా అడిగింది అత్త.
“అలా ఏం లేదత్తా. మనసుని హత్తుకునే తోడు దొరికినప్పుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. పెళ్లి కోసం వ్యక్తిని వెతకటం, లాభనష్టాలు ఆలోచించి, బేరసారాలతో పడే ముడిని బంధమనుకునే భ్రమలో నేను లేను”
“దేశం కాని దేశంలో ఒంటరిగా ఉంటున్నావు”
“దేశం కాని దేశం కాబట్టే నా బతుకు నేను బతకగలుగుతున్నానేమో అత్తా! వ్యక్తిగత జీవితంలోకి ఎవరు చొచ్చుకు వచ్చేయ్యరు ఇక్కడ. అమ్మ నాన్న అక్కడకు వచ్చెయ్యమని ఎంత గొడవ చేసినా రానిది అందుకే”
“అమ్మా, ఇంక ఆపేశేయ్. అక్కకు తెలుసులే”, అఖిల్ ను పక్క గదిలో వదిలి వచ్చింది రమ.
“అత్త, మరోలా అనుకోకు. మీరందరూ నా మంచి కోరే ఇదంతా చెపుతున్నారని నాకు తెలుసు. మన సంస్కృతి, సంప్రదాయం, పెళ్లి, సంసారం అంటూ మీరెన్ని చెప్పినా నా అనుభవాల పాఠాలే నా నిర్ణయాలకు కారణం. అమ్మ నాన్నకు చెప్పు నేను ఇక్కడ బాగానే వున్నానని”, అత్త చేతిని నిమురుతూ అన్నాను.

“అమ్మ, అక్క ఇక్కడేదో కష్టాలు పడిపోతుంది అని అనుకోకండి. షి ఇస్ డూయింగ్ ప్రెట్టి గుడ్. ఇదిగో మీరిలా ఒత్తిడి తెచ్చినప్పుడు అత్తయ్య మామయ్యా తన మూలాన బాధ పడుతున్నారే అని తను కూడా అప్సేట్ అవుతుంది. ఇంక ఈ టాపిక్ ను వదిలెయ్యండమ్మా”, రమ ఆనకట్ట వేసింది.

అత్త ఏం చెప్పిందో, అమ్మా, నాన్నా మరెప్పుడూ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు.

***

“లివ్ ఇన్ రిలేషన్ గురించి నీ అభిప్రాయం ఏంటి?”, మనార్ ఓ రోజు అడిగింది. యధాలాపంగా అడగలేదు, ఎదో ఆలోచనతోనే ప్రశ్నించింది.

“లివ్ ఇన్ రేలేషన్ అయినా, పెళ్ళైనా జనరలైజ్ చేసి ఇది మంచి ఇది చెడు అని తేల్చేయ్యలేం. ఆయా వ్యక్తులపై, వారి బంధంపై ఆదారపడే విషయం ఇది”

“జెఫ్ ప్రపోస్ చేసాడు. ఐ లవ్ హిం టూ ”, అంది మనార్.

“మరేంటి ఆలోచన?”, అడిగాను.

“రిలేషన్ ను లీగలైజ్ చెయ్యటం ఎందుకు అని ఏదో ఆలోచన….అంతే”, మనార్ కళ్ళు నవ్వుతున్నాయి.

“మరీ ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం, గౌరవం ఉంటే చాలు…నీకు తెలీనిదేమీ కాదుగా”

“జెఫ్ పెళ్లి చేసుకుందాం అన్నాడు. బాబా (నాన్న) నాతో మాట్లాడరు. మామాకు (అమ్మకు) కాల్ చేసి చెప్పాను. నా కారణంగా వెలివేయబడ్డారంట. మామా శాపనార్ధాలు పెట్టింది.”

“పోన్లే మనార్. ఈ ఇల్లే నీ పుట్టిల్లనుకో. పుట్టింటివారు పెళ్లి కూతురికి ఏమేం పెడతారో చెప్పు. నేను ఉన్నాను కదా”, మనార్ చేతిని అందుకుంటూ అన్నాను.

“యు నో వాట్! మా మతంలో అమ్మాయిలు కట్నాలు ఇవ్వరు తెలుసా. బట్టల దగ్గర నుంచీ సామాను వరకు జెఫ్ కొనాలి”, నవ్వేసింది.

***

రోజులు వేగంగా గడిచిపోతున్నాయి.

సింగల్ మదర్ అనే సెల్ఫ్ సింపతీ నా దరికి చేరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నా , తల్లి పాత్రను సరిగ్గా నిర్వహిస్తున్నానా అనే సంశయం నన్ను వేధిస్తూ ఉండేది. తండ్రి పాత్ర లేదనే గిల్టీ ఫీలింగ్ నాలో ఏమూలనో ఉండేది అనుకుంటా! ప్రేమ, బాధ్యత పదింతలుగా నా దినచర్య అఖిల్ చుట్టూ తిరిగేది.

మదర్స్ డే రోజున స్కూల్లో వక్తృత్వ పోటీ నిర్వహించారు. పని ఒత్తిడి వలన అఖిల్ ను ఆ కాంపిటిషన్ కు ప్రిపేర్ చెయ్యలేక పోయాను.
అ రోజు ఒక అర్జెంట్ మీటింగ్ లో ఉండగా అఖిల్ టీచర్ ఫోన్ చేసారు. ఏమైందో అనుకుంటూ కంగారుగా ఫోన్ ఎత్తాను.

“Your son gave an extraordinary speech on you, we all had tears “

నా ఆనందమంత కప్పును తీసుకొచ్చి నా ఒళ్లో పెట్టాడు, “అమ్మా నేను గెలిచాను”, అనుకుంటూ.

“నేను నేర్పించలేకపోయానురా కన్నా”, కప్పును నిమురుతూ అన్నాను.

“కొత్తగా నేర్చుకునేదేముంది మామ్. రోజూ నిన్ను చూస్తూనే ఉన్నానుగా “, ఆ క్షణం వాడిని కౌగలించుకుని మనసారా ఏడ్చేసాను .

ఆ చిన్న సంఘటన నాలోని భయాలను, సంశయాలను దూరం చేసేసింది.

***

రెండేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. నాన్న కాలం చేసారు. ఇప్పుడు అమ్మ నాతోనే ఉంటుంది. జెఫ్ ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినా, మనార్ తో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకో ఈ మధ్య మనార్ డల్ గా మాట్లాడుతుంది.

హఠాత్తుగా ఒక అర్థరాత్రి మనార్ తలుపు తట్టింది. తన కళ్ళలో ఎర్ర జీరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బయట చలి తీవ్రంగా ఉంది. మంచు తుఫాను సూచనలనుకుంటా.

“ధృఢమైన వ్యక్తిత్వం……”, చెప్పబోతున్నది ఆపేసి ముఖాన్ని అరచేతుల్లో దాచుకుంది. ఏడుస్తుందేమోనని తన భుజంపై చెయ్యి వేసాను ఓదార్పుగా.

మనార్ దుఃఖించట్లేదు, భంగపడిన తన ఆశలను ఓదార్చుకుంటుంది.

“నా హిజాబ్…”, తన స్కార్ఫ్ ను చూపిస్తూ, “ఈ పరదా ముస్లిం స్త్రీలు మాత్రమే ధరించట్లేదు అమూల్య. తమకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్నా కూడా ఈ నాటికీ స్త్రీలు మోస్తున్న భారం ఇది. ఈ భారానికి మత, ప్రాంత బేధాలు లేవని జెఫ్ నిరూపించాడు. ఒకప్పుడు నా ధైర్యాన్ని, తెలివితేటలను, చదువును చూసి ప్రేమించిన జెఫ్, ఇప్పుడు ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్ తోనో లేక ఇన్సెక్యూరిటీతోనో బాధపడుతున్నాడు. ప్రేమగా లాలిద్దామని ప్రయత్నించాను. అతని అహం ఇనుపగోడలను కట్టేసింది.”, అంది మనార్.

ఈ మంచు తుఫాన్ నన్ను కుదిపేసింది. ఒకప్పటి నా ప్రశ్నలు నన్ను ఎదురు ప్రశ్నించాయి. అమ్మ ఒళ్లో తలపెట్టి చాలా సేపు ఉండిపోయాను. ఆనాటి నా కోపాలు నన్ను వెక్కిరించాయి….జాలిగా చూసాయి!

“ఎవర్ని తప్పుపడదాం మనార్?”

“నువ్వే చెప్పు అమూల్య….. వ్యవస్థనా? మనుష్యులనా?”

ప్రశ్నను ప్రశ్నించే మరో ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను?

“వ్యవస్థ తయారు చేసిన మనుష్యులను, వ్యవస్థను తయారు చేసిన మనుష్యులను”, రాజ్ ఏ విషయాన్నైనా తేలికగా చెప్పేస్తాడు.
“అందర్నీ కట్టగట్టి తిట్టేసావ్. ఇంక మిగిలిందెవరు?” రాజ్ సీరియస్ గా అంటాడో, జోక్ చేస్తాడో ఒక పట్టాన అర్థం కాదు.

“ఎవరినీ పూర్తిగా తప్పు పట్టలేదు. అందర్నీ కొంత విమర్శించాను. మార్పు అందరిలోనూ, అన్నిట్లోనూ మొదలైంది”.

రాజ్ ఎప్పుడు పరిచయం అయ్యాడో గుర్తు లేదు. వీక్ ఎండ్ పార్టీలలో చాలాసార్లు చూసాను అతన్ని. ఢిల్లీ లో పుట్టి పెరిగాడు. స్టూడెంట్ గా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు.

ఒకానొక చర్చలో, “స్త్రీ కష్టం సమాజానికి కనిపిస్తుంది, అదే పురుషుడి కష్టం ఎవరికీ పట్టదు”, అన్నాడు. మొదటిసారి అతన్ని నిశితంగా చూసాను. అతని అభిప్రాయాన్ని విభేదిస్తూ, “స్త్రీల కష్టాలను అసలు కష్టాలుగా గుర్తించదు ఈ సమాజం” అన్నాను.

ఆ చర్చ తర్వాత అనుకోకుండా ఒకటి రెండుసార్లు కలిసాను అతన్ని. రాజ్ తో సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. అతని మాటలు సూటిగా, నిక్కచ్చిగా ఉంటాయి. తెలిసిన విషయాలనే కొత్త కోణాలలో చూపిస్తాడు.

“కాపురం చెడితే మొగాడ్ని కౄరుడుగా చిత్రిస్తారు. పెళ్ళాం సానుభూతితో ఓదార్పు పొందుతుంది. నాణానికి మరో వైపు కూడా ఉంటుంది”, అన్నాడోసారి. నేను మౌనంగా అతను చెప్పింది విన్నాను.

రాజ్ ఎప్పుడు ఇంత దగ్గరయ్యడో గమనించనే లేదు, కష్టసుఖాలు పంచుకునే స్నేహం మా మధ్యన ఉంది.

***

ఆ రోజు వీక్లీ గ్రోసరీ షాపింగ్ ముగించుకుని కారు దగ్గరకు వెళ్లేసరికి, చిద్విలాసంగా నవ్వుతూ నా కారుకు ఆనుకుని నుంచుని ఉన్నాడు రాజ్.
“నువ్వేంటి ఇక్కడున్నావ్”, ఆశ్చర్యంగా అడిగాను.

“నీతో అర్జెంటుగా మాట్లాడాలి అమూల్య. chat చాట్ తింటూ మాట్లాడుకుందామా”, సుడిగాలికి మరో రూపం రాజ్.

“ Is everything ok raj?”, chat చాట్ ప్లేట్ అందుకుంటూ ఆందోళనగా అడిగాను.

“అల్ ఇస్ వెల్”, ఒక్క నిమిషం ఆగాడు… “మీతో ఒక విషయం మాట్లాడాలని ఇక్కడకు తీసుకొచ్చాను”.

“నీకు తెలుసు కదా, ముప్పై దాటి మూడేళ్ళు ఇంకా నిండనే లేదు, వయసు దాటిపోతుంది అని మా ఇంట్లో తెగ కంగారు పడిపోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పెళ్లి చేసెయ్యాలని కంకణం కట్టుకున్నారు.”

“నా రికమండేషన్ ఏమన్నా కావాలా ఏంటి?”, నవ్వుతూ అడిగాను.

“అందుకేగా నీ దగ్గకు వచ్చింది. లెట్స్ బి సీరియస్”

“అబ్బో..హహ్హ, చెప్పు ఏం చెయ్యమంటావో?”

“అమూల్య…. ఎప్పుడు నాలో ఈ ఫీలింగ్ మొదలైందో తెలీదు. I am in love with you, నీకు ఇష్టమైతే, లెట్స్ గెట్ మారీడ్”, నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు.

ఒక్క క్షణం బిత్తరపోయాను.

“నువ్వు నాకంటే చిన్నవాడివి రాజ్”

“తెలుసు, మూడేళ్ళ చిన్నవాడిని. అదో పేద్ద విషయం కాదు”, అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాను.

“టెల్ మి వన్ థింగ్ అమ్ములు. నీకు నేనంటే ఇష్టం లేదూ?”, సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మనసుకు దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు అమ్ములు అంటాడు.
అతని కళ్ళలో కనిపించే ప్రేమ నాకు తెలియందా? అతని సాంగత్యంలో సేద తీరే నా మనసు అతనిని కోరుకోలేదూ? అట్టడుగు పొరలలో నిక్షిప్తమైన భావాలలో చిన్నపాటి కదలిక.

“అఖిల్…”

“నేనూ మంచివాడినే ”, నా మాటను మధ్యలోనే ఆపేస్తూ అన్నాడు.

“అలసిన శరీరంతో మంచంపై వాలాక, నిద్రలోకి జారుకునే లోపు ఒక చిన్నపాటి ఒంటరితనం వుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్….”, నా మాట పూర్తవనే లేదు.

“ఐ నో అమూల్య. నీ లైఫ్ నీ చాయిస్. ఆ చాయిస్ లోని చిన్నపాటి లోటుని నన్ను పూరించనీ. అందులో నా స్వార్థం కూడా ఉంది. మగాడు చెప్పుకోడు కానీ స్త్రీ ప్రేమ లేకుండా మనలేడు”

చిన్నగా మొదలైన కదలిక వెల్లువై నన్ను ముంచెత్తింది. ప్రేమగా, మనస్ఫూర్తిగా రాజ్ చేతిని ముద్దాడాను.

http://vaakili.com/patrika/?p=2980

Posted in కధలు, Uncategorized | Leave a comment

మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది


మార్పు  వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది

10487441_10202294150177112_2338276987061959354_n

అనగనగనగా ఒక ఊరన్నమాట. ఆ ఊర్లో రామయ్య గారనే ఓ మోతుబరి. నాట్లు, కోతల దగ్గర నుంచీ కౌలులెక్కలు, కూలీ నాగాలు అన్నీ ఆయనకు కరతలామలకం. అంత సమర్థులు వారు. ఇంట్లో అందరికీ ఆయనంటే భయం. ఆయన వస్తుంటే పిల్లలు పుస్తకాలలో తలలు దూరుస్తారు. భార్య భయంతోనూ, భక్తితోను నీళ్ళ చెంబును ఆయనకు అందిస్తుంది కాళ్ళు కడుక్కోవటానికి. భోజనం వడ్డించి, విసనకర్రతో విసురుతూ పక్కనే కూర్చుంటుంది. ఆయనకు అన్ని సమకూర్చి పెట్టటంలో ఏ పొరపాటు రానీయదు ఆవిడ. ఆ మహా ఇల్లాలు తలెత్తి  సూటిగా ఆయన కళ్ళలోకి ఏనాడు చూడలేదు. ఆ కుటుంబంలోని నిర్ణయాలన్నీ ఆయనవే.  అందరూ ఆవిడను అనుకూలవతి అంటుంటారు.

అనగనగా అదే ఊరన్నమాట. ఆ ఊర్లో ఓ  జానకయ్య గారు. మన అయ్యవారు సర్వవేళ సర్వావస్థలందున విహారయాత్రల్లోనే ఉంటారన్న మాట.  పేకముక్కలు ఎగిరిపడుతుంటాయి, ఆస్తులు హారతి కర్పూరాలవుతుంటాయి. పొద్దస్తమానూ ఏడుస్తూ కూర్చుంటే సంసారం గడుస్తుందా! ఆయన భార్య పాడి గేదెలతోనూ, దొడ్లో పెంచిన కూరగాయలతోను పిల్లల పొట్టలు నింపుతూ, ఉండి లేక వారిని బడికి పంపుతూ ఉంటుంది. అందరూ ఆవిడను ఓర్పురాలు అంటుంటారు. పెద్ద పెద్ద నిర్ణయాలు, అంటే,  ఆస్తిపాస్తుల విషయాలలోనూ, పిల్లల పెళ్లి సంబంధాల సమయాలలోనూ ఆవిడ గట్టిగా నోరెత్తి  తన అభిప్రాయం చెపితేను, ఇలాగే జరగాలి అని పట్టుపడితేను అందరూ ఆవిడను ఆడపెత్తనం అని చులకన చేస్తుంటారు.

సరే, ఇదంతా బ్లాక్ అండ్ వైట్ కాలం. ఇప్పుడు ఈస్టమన్ కలర్ లోకి వచ్చేదాం.

బాపుగారి గోరంత దీపం సినిమా. కూతురిని అత్తగారింటికి పంపుతూ తండ్రి చెప్పే హితబోధల్లో ఇదొకటి , ” నువ్వు హాయిగా ఉన్నప్పుడే  కన్నవారిని గుర్తుతెచ్చుకో, వారిని చూడ్డానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడో, కష్టపడుతున్నప్పుడో నాకు చెప్పకు, అది నా పెంపకానికి అవమానం.”

[ భగవంతుడా….. పెళ్లంటే సర్దుబాటు తప్పదమ్మా. ఓర్పుగా, ధైర్యంగా సరిదిద్దుకో అని చెప్పి నీకే కష్టం వచ్చినా నేనున్నాను అని ధైర్యం చెప్పి జీవితంలోకి పంపించాలి కానీ ఇదేమిటి, నా పెంపకానికి అవమానం కలిగించకు అంటారు !!! ఓకే, ఎవరి కష్టాలు వారే తీర్చుకోవాలి. ఓ మాట సాయానికి, ఓ ఓదార్పుకు అండగా మేముంటాం అని తల్లిదండ్రులే చెప్పకపోతే ఇక ఎవరు చెపుతారు. పెళ్లవగానే ఇంక నీకు మాకు సంభందం లేదంట!!!! ఆ రోజుల్లో ఇదంతా తట్టుకుని నిలబడిన స్త్రీలకు హాట్స్ ఆఫ్ .]

శ్రీ రమణగారి ధనలక్షి కధ. భలే ఉంటుంది. ధనలక్షి మహా సమర్ధురాలు. భర్త కాస్త అమాయకంగాను, కొంత అసమర్ధంగాను ఉంటాడు. ధనలక్షి ఎడం చేత్తో కిరాణా కొట్టుని, కొడుకుని పెంచేస్తూ ఉంటుంది. కుడిచెయ్యి మొత్తం మొగుడు ఇగోను లౌక్యంగా తృప్తిపరుస్తూ ఉంటుంది. రకరకాల మనుష్యులు, అన్నే  రకాల సామర్ధ్యాలు. అందులో తప్పేమీ లేదు.    భర్త అమాయకత్వాన్ని కొంగుకింద దాచుకోవటం కొంత బాధ్యత కూడా. పదిమందిలో మనవారిని లోకువ చేసుకోకూడదు. ఈ కధలో  నేను మీకంటే గొప్ప కాదు, మీరే అంతా అని అడుగడుక్కీ అతని అహాన్ని తృప్తి పరుస్తూ ఉంటుంది.

ఇప్పుడు కెమెరాలు కొంచెం జూమ్ చేద్దాం.

రామయ్య గారి ధర్మపత్నికి  ప్రపంచం ఇల్లయితే వారి మనవరాలి పరిధి ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో మనవడు,మనవరాలు ఒకటే వేగంతో పరుగులు పెడుతున్నారు. ధనలక్షి కోడలు కొడుకుతో పాటు కొట్టులో పనిచేస్తుంది. తన నిర్ణయాలు తనవే అని  చెపుతుంది. ధనలక్షి కొడుకు మారుతున్న కాలంతో కొంత మారుతూ, పెరిగొచ్చిన వాతావరణపు ప్రభావం నుంచీ బయటపడటానికి కొంత సంఘర్షణ పడుతున్నాడు. అతనేనాడయినా అహంకారంగా మాట తూలితే, అది అతని వ్యక్తి తప్పుగా కాక అతను పెరిగిన కాలపు ప్రభావంగా ఆ పిల్ల అర్థం చేసుకుంటే బాగుండు.

ఇంకొంచెం ముందుకొద్దాం.

గ్లోబలైజేషన్ పుణ్యాన ప్రపంచం పల్లెటూరయింది. ఆ పల్లెటూరిలో అనగనగా ఓ వీధంట. అక్కడ భారతీయులే ఎక్కువగా ఉంటారంట.  రామ్, జాన్కి ఓ జంట. ఇద్దరూ కష్టపడతారు, దొరికిన టైంలో సరదాగా బాగానే ఉంటారు. మన జాన్కకమ్మకు ప్రొమోషన్ వచ్చి మేనేజర్ అయింది. Obvious గా పనెక్కువయ్యింది. ఇంటికి లేటుగా వస్తోంది. అడపాదడపా బిసినెస్ ట్రిప్పులకని పక్క సంధులకు ఎగరాల్సి వస్తోంది. పిల్లల హోం వర్కులు రామ్ చూస్తున్నాడు.

ఇంక చూసుకోండి…. వీధి వీధంతా వీకెండ్ పార్టీలో జాన్కి ఇళ్ళు పట్టించుకోవట్లేదని, ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ తిరుగుతోందని ఆడిపోసేసుకున్నారు.  పాపం రామ్ కు పప్పుచారు తాలింపులో  ఎండు మిరపకాయ వెయ్యటం తెలీదని పాట్ లక్ పార్టీలో జోలెడంత జాలి కురిపించేసారు.  ఈ మాటలు విని విని జాన్కి గిల్టీ ఫీలింగ్ ను, రామ్ insult ఫీల్ ను పెంచుకోకుండా ఉంటే బాగుండు .

ఆ సంధులోనే రెండు ఇళ్ల  అవతల ఇంకో జంట, రాధ, గోపాల్ అనుకుందాం . రాధ బాగా చదువుకుంది, తెలివైనది. మొదట్లో చెప్పుకున్న రామయ్యగారి భార్యలా ఇంటి పట్టునే ఉండి  భర్తను, పిల్లలను చూసుకోవటమే తనకిష్టం అంది. అంటే, మరీ భర్త పట్ల భయభక్తులున్న  భార్యగా కాదు. మనలో మాట, ఈ భయం భక్తి ఏంటండీ బాబు!  ఒకళ్ళంటే ఒకరికి కాస్త గౌరవం, బోల్డంత ప్రేమ మాత్రమే కదా ఉండాల్సింది. ఉద్యోగం చెయ్యనూ అంది కదా మన రాధమ్మ. ఇంకచూసుకోండి…చుట్టాలుపక్కాలు, తెలిసినోళ్లు, తెలీనోళ్లు  మూకుమ్మడిగా ఇంత చదువుకుని ఇంట్లో అంట్లు తోముతావా అని నానా గొడవ చేసేసారు. కెరియర్లో పైకొచ్చిన జాన్కిని ఇళ్ళు పట్టించుకోవట్లేదన్నారు, ఇప్పుడు నన్నేమో  ఇంట్లోనే కూర్చుంటావా అంటున్నారు. It’s my choice to be a home maker అని నిక్కచ్చిగా చెపితే బాగుండు రాధ.

రెండు ఉదాహరణలు, ఇద్దరు పవర్ఫుల్ బిసినెస్ విమెన్.

Indra Nooyi, Chairperson and Chief Executive Officer of PepsiCo. ఉద్యోగం, ఇల్లు బాలన్స్ చేసుకోవటం చాలా కష్టం అని చెపుతూ ఇంద్రా నోయి ఒక ఇంటర్వ్యూలో  You will die with guilt అన్నారు. నిజం, కొన్ని గిల్టీ మొమెంట్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా పిల్లలు సిక్ అయినప్పుడు డే కేర్ లోనో లేక బేబీ సిట్టర్ దగ్గరో వదిలి వెళ్ళటం గుండెను పిండేస్తుంది. తల్లీ తండ్రీ ఇద్దరూ చెరి సమానంగా ఇంటి బాధ్యతలు పంచుకున్నప్పుడు ఈ hurdles దాటటం అసాధ్యం కాదు, అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమూ రాదు. సమానం అంటే సమానమే, నీకు సాయం చేస్తున్నాను అన్నట్టు కాదు.

మరో మాట, ఈ గిల్టీ ఫీలింగ్ అనేది మగవారికి ఉండదా? ఎందుకు ఉండదు? పగలు రాత్రుళ్ళు పని చెయ్యాల్సిన వచ్చిన సందర్భాలలో మగవారు వారి కుటుంబాలను  మిస్ అవ్వకుండా ఉంటారా చెప్పండి? ఉద్యోగం పురుషలక్షణం అని నూరిపోసి ఇలాంటి సెన్సిటివ్ ఫీలింగ్స్ ఉండవు అన్నట్టు తయారుచేసాం. Men too miss their families. Gents too feel stress. ఇంద్రా నోయి women can’t have it all  అంటారు. Who can have it all? There is no fixed definition for having it all. Every individual, men and women, derives their own derivations for it.

ఇంకొక ఉదాహరణ: Chanda Kochhar is the managing director and chief executive officer of ICICI Bank.

చంద్ర కొచ్చర్  కూతురు అమెరికాలో చదువుకున్న సమయంలో చంద్ర కొచ్చర్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. కూతురు తల్లిని అభినందిస్తూ ఇలా మెయిల్ చేసింది, You never made us realize that you had such a demanding, successful and stressful career. At home, you were just our mother.

ఇంతకన్నా గొప్ప ఇన్స్పిరేషన్ ఏం కావాలి మనకు?

(ఇప్పుడింత ఆవేశం ఎందుకొచ్చిందంటే, ఒక కధ చదివా. శారదా పెళ్లయి అమెరికాకు వచ్చింది. భర్త పరమ రాక్షసుడు. శారీరకంగా, మానసికంగా రోజూ నరకం అనుభవిస్తూ  ఉంటుంది. తల్లి ఆరోగ్యం బాగోలేదు అన్న వంకన ఇండియా వస్తుంది. ఇంకెప్పుడు తిరిగి రాకూడదు అనుకుంటుంది. తండ్రి సమ్మతించక, ఇంక తన బతుకు ఇంతే అని తిరిగి వస్తుంది. ఓ రోజున ఒళ్ళు తెలియని ఆవేశంలో అతనడిని చంపేస్తుంది. రచయిత చివరన, ముక్కు మొహం తెలియనివారికి పిల్లనిచ్చి అమెరికా పంపించేసి చేతులు కడుక్కున్న తల్లిదండ్రులకు అంకితం అని రాసారు.

హ్మ్… అలా కాదు. పెళ్ళే నీ జీవితం, అక్కడే ఉండు అక్కడే సర్దుకో, మా దగ్గరకు రాకు, పెళ్లయ్యాక భర్తతోటే బతుకు చావు అని అదిగో ఆపైన చెప్పారే గొప్ప డైలాగులు అలా పెంచిన తల్లిదండ్రులకు.  ఆడపిల్లలకు బతకటం నేర్పించని తల్లిదండ్రులకు అంకితం అని రాయాలి)

Posted in నా ఆలోచనలు, మహిళ, వ్యాసాలు | 3 Comments

సముద్రతో సంభాషణ


సముద్రంతో సంభాషణ

సముద్రపు ఒడ్డున ఒద్దికగా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాను. “కవిత్వం పొంగుకు వస్తుందా,” వెనుకనుంచీ వస్తూ అంది  స్నేహితురాలు. ఒక మాటకు మరోమాటను  జతచేసి వాగే నేను ఆ నిమిషాన మౌనంగా ఉండిపోయాను, మొహమాటంగా నవ్వి ఊరుకున్నాను.  కవిత్వం కాదుకదా కనీసం  ఒక్క భావం కూడా మనసులో నుంచీ తన్నుకురాలేదు, ఒక్క పదం కూడా  గొంతుకలో  కొట్టుకలాడలేదు. ఒకాలాంటి నిశ్శబ్దం నన్ను ఆవరించుకుంది.

DSC_0064
ఒక్కో అల ఒక్కో లయ, ఆ అలల లయలలో  కొట్టుకుపోతున్నానో……

DSC_0297DSC_0349DSC_0350

ఏ సుదూర తీరంలో ఇరుక్కుపోయానో…తెలీదు! DSC_0266

సముద్ర ఘోష  చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. మెల్లమెల్లగా లోలోపలి సెగల సముద్రాలు అలలుగా విచ్చుకుని ఎగిసెగిసి పడటం  మొదలుపెట్టాయి.  నిశ్శబ్దంలో ఎదుగుతున్నానో, ఒదుగుతున్ననో తెలీని సందిగ్దత!

DSC_0253DSC_0038_n

ఇరుకిరుకు సంధుల్లో నుంచీ, గాలి  ఆడని  మనసుల  నడుమ నుంచీ  తప్పించుకుని  పరిగెత్తుకుంటూ వచ్చి ఈ సముద్రం  ముందు  నుంచున్నట్టుంది.  DSC_0046

DSC_0262ఎంత విశాలత్వం….నా రెండు చేతులూ  సాగినంత మేరా జాపినా  ఇంకా  ఇంకా మిగిలుండే  వైశాల్యం. నేనెంత  ఆహ్వానించి ఆస్వాదించినా ఇంకా నా వాకిలిలో తచ్చాడుతూ  ఉండే విశాలత్వం.

DSC_0576

మనుష్యులకే  ఇంత సంకుచిత్వం! ఎవరికి వారే పట్టనంత ఇరుకిరుకు పంజరాలలో కుక్కేస్తున్నారు మనసులను, జీవితాలను. ఆ పంజరపు గోడల్లో  నుంచే  తీర్పులు! ఈ సముద్రం నుంచీ కాస్తన్నా నేర్చుకోగలిగితేనా…..

DSC_0040

ఎన్నింటినో  తనలో కలుపుకోగలిగే మహాసంద్రం  ముందు  ఒద్దికగా ముడుచుకును కూర్చుని  తదేకంగా తననే చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడిపెయ్యొచ్చు కదూ! ఒక్కోసారి అనంతానంత ఆకాశం కిందే దగ్గరతనం అనుభవమవుతుంది.

DSC_0460సంద్రాన్ని మాత్రమే  కాదు సుమా! ఆ ఒడ్డున కేరింతలు కొడుతున్న పిల్లలు, సేద తీరుతున్న పెద్దలను చూడటం ఎంత బాగుందో చూడు.  
DSC_0468

అలలతో ఆడుకుంటున్న ఈ చిన్నోడు  ఇలా నా కెమేరాకు చిక్కాడు.

DSC_0475

DSC_0470DSC_0472

DSC_0467_nDSC_0471DSC_0466DSC_0465

ఓ పక్కగా కూర్చుని, కెమెరా కంటితో పరిసరాలను విక్షించటంలో కవిత్వం ఉంటుంది. It has it’s own immense feel.  కవిత్వం, కెమెరా అంటే ఓ మాట చెప్పాలనిపిస్తుంది,  We may come across people who makes fun of these hobbies/interests, leave them to their sillyside.  DSC_0492-2

సముద్రమూ, సాయం సంధ్య  కలిపి వేసిన చిత్రాలు DSC_0513_nDSC_0517DSC_0523-n

సముద్రంతో మౌనంగా సంభాషిస్తే ఎడతెరిపి లేకుండా సాగుతూ ఉంటుంది సంభాషణ. అందుకే ఒడ్డున నిశ్శబ్దంగా ఉండాలి…..

Posted in Photography, Uncategorized | 5 Comments

ఒక్కో చినుకు ఒక్కో ముత్యం


ఒక్కో చినుకు ఒక్కో ముత్యం

ఒక్కో చినుకు ఒక్కో ముత్యం, ఒక్కో ముత్యం ఒక్కో పద్యం….

DSC_0106DSC_0572

ఆ రాత్రి ఏ జామునో మొదలయ్యింది వాన. ఉదయం నిద్ర లేచేసరికి లోగిలంతా నీళ్ళతో కడినట్టు మెరిసిపోతోంది. సన్నగా వర్షం నాకోసమే ఇంకా కురుస్తూనే ఉంది. కరెంటు తీగలపై ముత్యాల్లా మెరుస్తున్న చినుకులు.

DSC_0039

DSC_0051 రంగులెన్నున్నా నలుపుతెలుపులే  శాశ్వతం. జారిపోయే క్షణమే అయినా, ఆ క్షణాన నిలిచిన చినుకైన జీవితమే ఆనందం.

DSC_0053 ఇప్పుడు ఇక్కడ నేను, కాసేపటికి రెక్కలు చాపుకుని ఎగిరిపోతాను మరోచోటికి. స్తిరత్వం సృష్టిలోనే లేదు.

DSC_0044

వానలో తడవాలి, గంతులేయ్యాలి, అల్లరి చెయ్యాలి…..

DSC_0099
DSC_0059

వాన చినుకులు  అచ్చం అద్దంలాంటివి, మనం నవ్వితే నవ్వుతాయి, ఏడిస్తే ఏడుస్తాయి. మనసు హుషారుగా ఉంటే వాన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మనసు విచారంగా ఉంటే అదే వాన విషాదాన్ని కురిపిస్తున్నట్టు ఉంటుంది. అంతా మనలోనే ఉంటుంది కదూ!

DSC_0074

DSC_0115

ఓ నీటి చుక్కల్లారా  కాసేపలా ఆగిపోదురూ!

DSC_0577DSC_0579DSC_0581

DSC_0582

ఎవరిని చూసి ఎవరు మురుసుకుంటున్నారో! అతిధులుగా విచ్చేసిన చినుకులా లేక ఆతిధ్యం ఇస్తున్న పూరేకులా?

DSC_0351

ఇక వీడ్కోలు….
DSC_0488వాన సవ్వడిలో ఒక లయ ఉంటుంది, ఒక జోల పాట ఉంటుంది, ఒక ఓదార్పు ఉంటుంది.DSC_0586

DSC_0585

DSC_0587

వర్షం ధారలను  కొన్ని అంచులలో, కోణాలలో తరచితరచి చూడాలి…. తన్మయత్వం అంటే ఏమిటో అనుభవమవుతుంది.

DSC_0591_nDSC_0594

ఏ మేఘంలో నుంచీ వచ్చి పడుతున్నాయో నేల తల్లి ఒడిలోకి ఈ చినుకులు!

DSC_0598DSC_0601

DSC_0335

కురిసే ప్రతీ చినుకు స్వాతిముత్యమే……..

 

Posted in నా అనుభవాలు, Photography, Uncategorized | 5 Comments

ఈ దోవ పొడవునా


ఈ దోవ పొడవునా 

ఇదీ గమ్యం అనేది  ఒకటంటూ ఏదీ ఉండదు. అక్కడక్కడా  మజిలీలు ఉంటాయి అంతే. నిజానికి  మనకంటూ  ఉండేది  ప్రయాణం మాత్రమే.

DSC_0162

ఈ  దారి  పొడవునా సాగిపోవాల్సిన పయనం.  ఆస్వాదించాల్సింది జీవితమనే  ప్రయాణానినే.

DSC_0790

మనం వెతుక్కోవాలే కానీ ప్రతీ మలుపులోనూ ఓ అబ్బురం దాగుంటుంది.

DSC_0786

ఇంతేసి కళ్ళేసుకుని  చూసే  మనసే  ఉండాలే  కానీ మార్గమంతా మహా అద్భుతాలే.   ఆకు, కొమ్మ, చెట్టు, పిచ్చుక స్వాగతం  పలుకుతున్నట్టే  ఉంటాయి.

DSC_0732

ఈ  దారిలోనే  ఎన్నో పరిచయాలు, అన్నీ అనుభవాలే. కొన్ని కలలు, మరికొన్ని కలతలు. కొన్ని  బంధాలు, మరికొన్ని బంధనాలు.

DSC_0783

కొందరి  సన్నిధిలో ప్రయాణం సులువుగా సాగిపోతుంది, అప్పుడే అంతదూరం వచ్చేసామా అన్నట్టు. బంధమేదైనా వారితోని అనుబంధపు ముద్ర మనపై ఎంతో ఉంటుంది.

DSC_0730

ఒక్క అడుగులోనూ పాదమైనా కలవని అనివార్యతలు కొన్నుంటాయి. భారమైన కనులు  ఆ నేలనంతా  చిత్తడి చేసి అడుగుల ముద్రలను వదిలేస్తాయి మనలో.

DSC_0625

అందరూ సాటి బాటసారులే, కాసేపే కలిసి ప్రయాణించేది.

DSC_0741

మంచైనా చెడైనా అన్నీ అనుభవాలే, అన్నీ పాఠాలే ఈ బాటలో.

DSC_0633

ఈ ప్రయాణంలో ఒక్కోసారి,  మనమంతకు ముందెప్పుడూ చూడని కొత్త లోకంలోకి నడుచుకుంటూ వెళ్తాము. మరోసారి, మనకు తెలిసిన లోకమే కొత్తగా  కనిపిస్తూ ఉంటుంది.

DSC_0670

కొన్నిసార్లు  ఏ దిశానిర్దేశాలు లేకుండా ఈ మార్గాలలో సాగిపోతూ ఉండాలి, అనంతంలో అతిదగ్గరతనాన్ని హత్తుకోవాలి.

DSC_0649

అంతకుముందే పోతపోసిన విగ్రహాలం కాకూడదు,  ఒక్కో రూపం సంతరించుకుంటూ అపురూపమవ్వాలి.

DSC_0710

ఎంత చెప్పుకున్నా ఒక్కోసారి ఒక్క అడుగన్నా వెయ్యాలేనంత నీరసం వచ్చేస్తుంది. కాస్త విరామం తర్వాత, మనకోసమే  ఏర్పడినట్టు కనిపిస్తుంది మరో దోవ.

DSC_0624

ఏదైనా ఆస్వాదించాలంటే మనలో ఒక స్వచ్ఛత ఉండాలి. హడావుడి ఉండకూడదు నిదానం ఉండాలి, అహం ఉండకూడదు హితం ఉండాలి.  తెలుసా, మన ప్రయాణాలు మనం ఆస్వాదించాలి.

DSC_0621

రోజూ కనిపించే ఆకాశం ఈరోజు కొత్తగా కనిపిస్తుంది, మేఘాలు మునుపెన్నడూ చూడని ఆకారాలలో అలరిస్తుంటాయి.ఈ దారి నిన్న నడిచి వచ్చిన దారిలా అనిపించినా, ఇది సరికొత్త దోవ.

DSC_0613  DSC_0420

హటాత్తుగా వాన చినుకులు ఆతిధులుగా వస్తారేమో, సిద్ధంగా ఉండాలి.  ప్రయాణంలో వాన అసౌక్యరాన్ని కలిగించనూవచ్చు, ఆహ్లాదాన్ని ప్రసాదించనూవొచ్చు.

DSC_0342 DSC_0301DSC_0612

నేనే ఈ ఇరుకు సంధుల్లో, ఎత్తు పల్లాల్లో, ఎగుడుదిగుడు దారులలో పడుతూ లెగుస్తూ వెళుతున్నాననుకుంటున్నా, నీటిచుక్కన్నా లేని దారులలో బాటసారులు ఉంటారని తెలిసేవరకు.

DSC_0174 DSC_0159 DSC_0155  ప్రయాణం, ప్రకృతి నేర్పినన్ని పాఠాలు మరెవరూ నేర్పరు. జీవితం పండగ ఆర్బాటం కానేకాదు.

All these photos were clicked during my trips to our village, Araku and Narsipatnam.

Posted in Photography | Tagged | 5 Comments

ఎప్పటికప్పుడు నిన్ను


ఎప్పటికప్పుడు నిన్ను

rafi

నాకు తెలిసిన మహా అద్భుతానివి నువ్వు
ఏ క్షణంలో ఎలా ఆసీనమవుతావో
మరుక్షణానికి ఎప్పుడు వీడ్కోలు చెపుతావో
తెలీనట్టే ఉంటుంది నీ గమనం.
నీ ఛాయలను తడిమితే చాలు
జీవించిన కాలాలు కళ్ళలో మెదులుతూ
తెరలుతెరలుగా రెపరెపలాడతాయి.

అంచులలో నుంచీ జారిపోబోతున్న చుక్కలా
నిలిచిన నిన్ను
ఒడిసి పట్టుకోనూ లేను
నిన్ను వదిలిపోనూ లేను.
నీలోనే తచ్చాడుతూ
నన్ను వెతుక్కుంటూ ఉంటాను.
దొరికినదేదీ నిలకడైనది కాదని
స్థిరమైన అర్థాలేవీ జీవితంలో ఉండవని
రేపటి శోధనను వదలవద్దని చెప్పి పోతావ్.

రావొద్దని నిన్ను ప్రాధేయపడిన క్షణాలను
నిర్దాక్షిణ్యంగా పక్కకు తన్నేస్తావ్
పెద్ద పెద్ద అంగలతో నా వాకిలిని చిత్తడి చిత్తడి చేస్తావ్
అల్లకల్లోలాలను నాలో నింపి
ఎండుటాకులపై అడుగులేస్తూ
నింపాదిగా వెళ్లిపోతావ్

ఆకారాలను నాలో చెక్కిన
నిరాకార శిల్పివి నువ్వు.
ఉలి పోటులకు నిన్ను ద్వేషించనూలేను
కొన్ని ఆకృతులకు నిన్ను ప్రేమించనూ లేను.

సూత్రధారివీ నువ్వే
మహమ్మారివీ నువ్వే
గొప్ప స్నేహానివి నువ్వే
అంతుపట్టని శేషానివీ నువ్వే.

ఎప్పటికప్పుడు నిన్ను హత్తుకోగలిగితే
జీవితాన్ని ప్రేమించకపోవటానికి ఒక్క కారణమన్నా మిగలదు కదూ!
వేళ్ళ సంధుల్లో నుంచీ జారిపోతున్న నీకు వీడ్కోలు చెప్పగలిగితే
లోతుగా జీవించిన క్షణాలెన్నో మిగులుతాయి కదూ!

Published @  http://magazine.saarangabooks.com/2015/06/18/

Posted in కవితలు, కాలం, గుర్తింపు | 2 Comments

ఎక్కడో ఉంటావ్


ఎక్కడో  ఉంటావ్ 

DSC_0565


ఎక్కడో  ఉంటావ్

ఆకృతులలోనో, అక్షరాలలోనో

గాత్రంలోనో, గానంలోనో

ఎక్కడో  ఉంటావ్!

వర్ణాలలోనో, చిత్రాలలోనో

నూలులోనో, అల్లికలోనో

ఎక్కడో  ఉంటావ్!

అందీఅందనట్టు కలలోనో

తెలిసీతెలియనట్టు కలవరపాటులోనో

ఉండీలేనట్టు ఉంటావ్!


ఎక్కడ నుండో ఉండుండి

జ్ఞాపకమై వస్తావ్ సెలయేరులా,

గురుతులన్నీ ఉండచుట్టి  విసిరేసినట్టు

వెళ్లిపోతావ్ జలపాతంలా.

వెళ్తూ వెళ్తూ మరో ముద్రను వదిలిపోతావ్


భందించి భద్రపరుచుకోవటానికి అస్తిత్వమేదని?

కరిగిపోయే కల నిలిచేదెంత కాలమని!

ఒదిగిపోవటం జీవితానికి తెలిసినంతగా

అదిమిఉంచటం మనసుకు చేతకాదు కదూ!

అందుకే కాబోలు

ఎక్కడున్నా వెతుకులాట సాగుతూనే ఉంటుంది….

Posted in కవితలు, కష్టం, కాలం | Leave a comment

మలిసంధ్య బృందావనాలు


మలిసంధ్య బృందావనాలు

“కన్నమ్మా, రోజులుదగ్గర పడిపోతున్నాయిరా తల్లీ. ఈ లాదిని తొందరగా మర్చిపోతావు కదూ, ఎప్పుడూ నన్ను గుర్తు తెచ్చుకోకే! నా ఆయుష్షుకూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా జీవించు.”

మంచి నిద్రలో ఒత్తిగిలిపడుకున్న పాప లేత చెక్కిళ్ళను ముద్దాడాను.చిన్న కన్నీటి చుక్క నా కంటికొస నుంచి పాప నుదుటిపైకి జారింది వీడుకోలుకు సమాయత్తమవుతూ.

రెండేళ్ళు ఎలా గిర్రున తిరిగిపోయాయో తెలీనే లేదు. నిన్నగాక మొన్న వచ్చినట్టుంది, అంతలోనే పంపించే సమయం వచ్చేసింది. వచ్చిన మొదట్లో ఊపిరికూడా పీల్చుకోవటానికి ఓపికలేనట్టు ఉండేది పాప, ఇప్పుడు కాస్త కోలుకుని ఒళ్ళు చేసింది.

ఇంకొక్క వారం, అంతే!

వీడ్కోలు వేదనకు, స్వాగతించే సంతోషానికి నడుమన ఒక సన్నటి గీతను చెరపలేనంతగా గీసేసాను. ఆ గీత నన్ను తూట్లు పొడుస్తున్నా, తీగై నన్ను చుట్టేసి నలిపేస్తున్నా అక్కడే మిగిలిపోతాను. ఓ పెంపకాన్ని ఒదులుకోవటమంటే, మనసును ముక్కలుగా కోసి ఒక్కో ముక్కను ఒదులుకోవటమే. నా ఆయువులోని ఓ భాగాన్ని కోల్పోవటమే.

నాలో రేగుతున్న అలజడి పాపకుతాకిందో ఏమో, ఉలిక్కి పడిలేచి మంచం మధ్యన కూర్చుని లాధీ లాధీఅంటూ కేకలేస్తో౦ది.

పాపను ఎత్తుకుని గుండెలకు దగ్గరగా హత్తుకున్నాను. కాసేపటికే నిద్రలోకి జారుకుంది. పాప వీపును సుతారంగానిమురుతూ మెడపై చిన్నగా ముద్దుపెట్టుకున్నాను. ఈ స్పర్శలోని స్వచ్ఛత కోసమే ఈ జీవితమంతా తాపత్రయపడింది.

***

ఆ రాత్రి నా చెంపలపై తేలిన ఆ వేళ్ళ ముద్రలు, నా అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని నట్టేట ముంచేసాయి. కనీస౦ ఒక్క మాటన్నా చెప్పకుండా హటాత్తుగా మాయమయి పోయిన మనిషి పది రోజుల తర్వాత ఓ అర్థ రాత్రి తిరిగొస్తే, ఎక్కడికెళ్ళారని నిలదీసినందుకు,పాతికేళ్ళ నెపం నిన్నకాక మొన్న వచ్చిన నాపై సునాయాసంగా నెట్టివెయ్య బడింది. పెళ్లినాటి గోరింటాకు ఇంకా నా అరచేతులలో వెలవనేలేదు, నాలాంటి పెళ్ళాలు ఉండబట్టే మొగుళ్ళు ఇళ్ళు పట్టనట్టు తిరుగుతారనే నెపం.

ఇంటి గుట్టు అర్థం చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. ఒక్కడే కొడుకని అతి గారాబంగా పెంచారు. విలాసాలకు అలవాటై ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతారాయన. వ్యవసాయం అంతా మావగారే చూసుకుంటారు. పెళ్లి చేస్తే కుదురొస్తుందని ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసిన పెళ్లి మాది. ఇదంతా నాకు తెలియకూడదని ఎప్పటి కప్పుడు కొడుకును వెనకేసుకొచ్చేది అత్తగారు. కుదిరినప్పుడల్లా కొడుకు మంచితనాన్ని నాకు చెపుతూ ఉంటుంది. ఆ మంచితనమంతా కొడుకు తల్లిని ఎంతలా ప్రేమిస్తున్నాడో, తల్లి ఎంత కష్టపడి కొడుకుని పెంచిందో అనే విషయాల చుట్టూ తిరుగుతూ ఉండేవి.
చేదు జ్ఞాపకాలతో మనసంతా బరువెక్కింది.

“నీకెంత పొగరే, మగాడిలా రెచ్చిపోతావ్. మొదటి రాత్రి నీ ఎచ్చు చూసి దడుచుకున్నాను, నీపై అనుమానం కుడా వచ్చింది. నిఘా పెట్టి విచారించాను. ఎవరు నీ గురించి చెడుగా చెప్పలేదు కాబట్టి నువ్వింకా ఇక్కడున్నావ్. అయినా ఆడదానివి మంచంపై ముడుచుకు నుండాలి కానీ…”
నా గుండెలపై గునపాలతో పొడిచారాయన. పెళ్ళయిన కొత్తలో ఆయనెందుకు ముభావంగా ఉన్నారో అర్థమయి ఖంగుతిన్నాను. ప్రకృతి సహజమైన శరీరపు ఉద్రేకానికి స్పందిస్తూ, తనువుల కలయికకు సహకారంగా కాక సమానంగా ఆస్వాదించటం నేను చేసిన పాపం.నా శరీరం ఆయన అహాన్ని తృప్తి పరచలేదు.

నేనింకా ఇక్కడ ఎందుకుంటున్నాను? ఉండక ఎక్కడికి పోగలను? నా జీవితంలో ఆ రాత్రి కాళ రాత్రి. భూమి బద్దలయ్యి నన్ను తీసుకుపోదేమని ఎక్కి ఎక్కి ఏడ్చిన రాత్రి.

ఆనాటి నుంచీ మరే రాత్రి నా శరీరం స్పందించలేదు. స్పందన లేమి మొదట్లో ఆయన అహంకారాన్ని తృప్తి పరిచినా నాలో ఉధృతమయిన జడత్వం ఆయనలో అంతే తొందరగా అసంతృప్తినీ రాజేసింది. ప్రతీ రాత్రి నా శరీరం యుద్దభూమయ్యింది, నా మనసు క్షతగాత్రమయ్యింది. కొన్ని గాయాలు గది గుమ్మం దాటి రావు.

***

గతాల లోతుల్లోకి జారుతూ ఏ జామున నిద్రలోకి జారుకున్ననో, నిద్రలో ఏ గత జ్ఞాపకం పీడకలలా వచ్చిందో ఉలిక్కిపడి లేచే సరికి పక్కలో పాప లేదు.

“తల్లీ తల్లీ బంగారు..ఎక్కడున్నావ్…ఎక్కడకు వెళ్లిపోయావ్…..అమ్మలూ” కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డంపడి పడబోతుంటే నూకాలువచ్చి తమాయించింది.

“ఎందుకా కంగారు, నీకు కునుకుపట్టిందని పాపను నా పక్కలో వేసుకున్నా”, అంది నూకాలు.

“నిద్రపోతో౦దా పాప”

“ఏమ్మా,మనసు బాగోలేదా?” తిరుగు ప్రశ్న వేసింది నూకాలు.

“అవునే, కాస్త టీపెడతావా”

“ఇప్పుడు టీ ఏందమ్మా, టయిము మూడవుతాంది, పోయి పండుకో రాదూ”

“అందుకే నిన్ను ఇంటికి పొమ్మన్నాను. నాతో పాటూ నీకు నిద్ర ఉండదు. పొద్దున్న లేస్తే ఇళ్ళల్లో పనికి పోవాలయ్యే”

“నీకే౦ అట్టాగే సెపుతావ్, నాకు మనసొప్పదు”

“నేను బాగానే ఉన్నాను. నువ్వు పోయి పడుకో”, అంటూ సోఫాలో జారబడ్డాను.

***

బిగ్గరగా నవ్వకూడదు, నడకలో నడతలో ఒద్దికగా ఉండాలి, ప్రశ్నించకూడదు, నోరెత్తకూడదు, సర్దుకుపోవాలి. నాకేం కావాలో, జీవితంలో నేనేం ఆశించాలో ఆలోచించుకునే వ్యవధే ఇవ్వకుండా చిన్నప్పటి నుంచీ నేనెలా ఉండాలో నూరిపోసిన వాతావరణంలో ఒదుగుతూ ఒదుగుతూ అలిసిపోయాను.
లౌక్యపు పాలు ఎక్కువయిన అత్తగారు, జాలిగా చూసే మావగారి చూపులు, నేనో అడ్డం అనుకునే భర్త.

వంటగదిలో తప్ప ఇంకెక్కడా మెసిలే స్వతంత్రత లేని నా పరాయితనం నన్ను ప్రశ్నలతో వేధించేది. ఈ ఇంటికి నేనెవరు? వంటింటినా?
ఈ ఇల్లు నేను నిర్మించలేదు. ఎన్నో ఏళ్లుగా ఇందులో నివాసముంటున్న వ్యక్తులు నన్ను సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకుని, తమలో నన్ను కలుపుకోకుండా నన్నొక పరాయి వ్యక్తిగా చూస్తుంటే ఈ ఇల్లు నాదెలా అవుతుంది? నేనెవరిని ప్రేమించాలి? నా వాళ్ళు ఎవరు? నేను ఎవరిని ప్రేమించాలో నేను పుట్టక ముందే ఈ సమాజం నిర్ణయించేసింది కాబట్టి మూడుముళ్ళు పడ్డాయని నేను వీళ్ళను ప్రేమిస్తున్నానా? నన్ను ఎవరూ ప్రేమించరా?
ఊపిరాడని ఉక్కపోత నా చుట్టూ… నీ ఇల్లు ఇది, ఇదే నీ ఇల్లని వేన వేల గొంతుకలు నా చుట్టూ అరుస్తుండేవి. ఈ ఇంట్లో నేనెవరిననే నా గొంతుక పీలగా నాలో ధ్వనించేది.

ఒకసారేప్పుడో అమ్మతో పంచుకోబోతే అదంతేనమ్మా అంటూ నీతుల సంకెళ్ళను బిగించింది.

వదలని జ్ఞాపకాలతో మనసును ఎవరో పిండేస్తున్న వ్యధ. గొంతు తడారిపోయిన బాధ, ఎన్ని గుక్కల నీళ్ళు తాగినా దాహం తీరని భావన. తప్పించు కోవటానికో లేక పారిపోవటానికి నాకో సాయం కావాలిప్పుడు. నా పాటల సీడీ లోకం లోకి తొంగిచూసాను — మూగ మనసులు, ఆత్మ బంధువు, మరో చరిత్ర. ఇంకేదో సంగీతం కావాలి. మాటల్లేని సంగీతం, వాయిద్యాల కచేరీ కావాలి. మొన్నీ మధ్యన రావు గారు ఇచ్చిన బీతోవిన్ సిడి దగ్గర నా చేయి ఆగింది. మంద్ర స్వరంలో తొమ్మిదో సింఫనీ నాలో పరుచుకుంది. బీతోవిన్ భావోద్వేకాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్ళి అక్కడనుంచి తోసేస్తాడు, ఆ జారిపోవటంలో లోయల్లోని లోతు తియ్యగా బాధిస్తుంది. ఎవరో తమ చేతులతో నొప్పిని తీసి పడేసినట్టే ఉంటుంది. సింఫనీలో నుంచీ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.

***

“లాదీ లాదీ, పాలు తాగేచా”, పాప మాటలకుమెలుకువ వచ్చింది.

“నాచిన్ని తల్లివే, ఎప్పుడు లేచావ్…అబ్బో అప్పుడే స్నానం కూడా చేసేసావా. ఏది బుగ్గపై దిష్టి చుక్క ఏది”

“నూకాలు పెత్తలా”

“ఆయ్ నుకాలు. ..దెబ్బ పడాలా.”, కిలకిలా నవ్వేసింది పాప.

“నీ బొమ్మలు తీసుకురా, ఆడుకుందాం”, పరిగెత్తుకుంటూ వెళ్లి బొమ్మల బుట్టను లాక్కొచ్చింది.

“కూ ఛుక్ ఛుక్ చూ…ఈ రైలు భలే బాగుందే. నీకు కావాలా”

“ఊ నాది”, నా చేతుల్లోని బొమ్మను లాక్కుంది.

“మరి ఈ డాల్?”

“లాదీ నా డాల్ కి కొత్త గౌను కుడతానన్నావ్ ?”

“అరే మర్చేపోయాను, ఇప్పుడు కుడదామా”, అడిగాను.

చిన్న చిన్న గుడ్డ ముక్కలు, లేస్, బటన్స్ ము౦దేసుకుని కూర్చున్నాం. లాధీ ఈ బటన్ ఇక్కడ కుట్టు, లాధీ ఈ లంగు బాగుంది.బొమ్మకో గౌను కుట్టాను.

“ఈ బొమ్మ నువ్వు తీసుకెళ్తావా? నిన్న నీ కధల పుస్తకాలు పక్కన పెట్టుకున్నవుగా, ఏవి అవి తీసుకురా, నీ బ్యాగులో సర్దుకో, బువ్వ తినేసాక సిస్టర్ అభిగేల్ దగ్గరకు వెళదామా?”, తలూపింది పాప.

“పప్పేసి, నెయ్యేసి… ఈ ముద్ద ఎవరికి పెట్టను? అదిగదిగో పిచ్చుక వచ్చేస్తుంది… పెట్టేసున్నా పెట్టేస్తున్నా రామ చిలుకకు ముద్ద పెట్టేస్తున్నా”, టక్కున నోరు తెరిచింది, “ఈ ముద్ద నా బంగారు తల్లిది”.

“ఆక్కడకు వెళ్ళాక చక్కగా అన్నం తినేయ్యాలి, సరేనా”

“ఓ తినేస్తా, లతా నేను జట్టు. లత పక్కన కుర్చుని తినేస్తా”

“నా బంగారే”, సుళ్ళు తిరిగిన కన్నీటిని పంటి గాటుతో ఆపేసాను.

మా ఇద్దర్నే చూస్తూ సోఫాకు ఆనుకుని కూర్చుంది నూకాలు.

“మరోమారు ఆలోచించమ్మా.పిల్ల కోలుకున్నాది. రేయనక పగలనకా ఆసుపత్రి చుట్టూ తిరుగుతానే ఉన్నావు. ఇప్పుడన్నా పిల్లతో సుఖపడతావ్, పంపమాకమ్మా”,

“అట్టా ఎంత మందిని సాకుతావ్? నీ ఆరోగ్యమూ చూసుకోవొద్దూ? పరాయి బిడ్డలతో బతికేస్తన్నావ్”, అర్ధిస్తోంది నన్ను.

నూకాలు ఎప్పుడు ఎలా పనిలో నుంచీ నా జీవితంలోకి ప్రవేశించిందో గమనించుకోనే లేదు నేను. పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ అంట్లు తోమేసి, అక్కడో చీపురు ఇక్కడో చీపురు వేసేసి నా పక్కన కూర్చుంటుంది. నేనేం తిన్నానో, ఎంత తిన్నానో అని గిన్నెలు పట్టి పట్టి చూస్తుంది. దాని జీతం లెక్కకన్నా నా మందుల డబ్బాలో గోలీల లెక్క దానికి బాగా తెలుసు.

నూకాలుతో నా మాటల ప్రవాహం మెల్లగా మొదలయింది. ఉండుండి దొర్లుతున్న నా మాటలు, దొర్లి దొర్లి గతాల అగాధంలోకి జారిపోతున్నాయి. అగాధంలోని ప్రతిధ్వనులు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రవాహం ఉప్పొంగి ఉప్పొంగి ఆనకట్టను దాటేసి ముంచేస్తుంది అప్పుడపుడు, అచ్చం బీతోవెన్ తొమ్మిదో సింఫనీలా. సోఫాలో నుంచీ దిగి ఎప్పుడు నూకాలు పక్కన కూర్చున్నానో నాకే తెలీదు.

నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, “ ఎందుకమ్మా నీ కింత కష్టం?” అంది నూకాలు. అధాటున నూకాలు ఒడిలో ఒదిగిపోయి, “ నీకెలా చెప్పనే? ఎలా చెపితే అర్థం అవుతుంది? అది కష్టం కాదు, నాకు ఇష్టమ” ని చెప్పినా మళ్ళీ మళ్ళీ అలాగే అంటుంది. దానికి నాపై అంత ఆపేక్ష.
రెండేళ్ళకోసారి మాఇద్దరికీ అలవాటైన భావోత్కర్ష ఇది. అలవాటైనా కూడా ఆ ఉద్వేగం బద్దలయ్యే ప్రతిసారి ఒకరిని ఒకరు కొత్తగా తెలుసుకుంటూనే ఉంటాము.నన్ను చూస్తూ మౌనంగా ఉండిపోయింది నుకాలు. నూకాలు కళ్ళల్లో నుంచి రాలిపడుతున్న భావాలను మౌనంగా ఏరుకుంటున్నాను. మా ఇద్దరిదీ ఓ అద్వితీయ బంధం.

***

ప్రకృతిలో ఋతువులు మారినట్టు పిల్లల రాకతో నాలో కొత్త చిగురులు తొడిగాయి. వారి ఆలనా పాలనలో సమస్తం మర్చిపోయాను. వారి బోసినవ్వులు, నేను కనిపించగానే చేతులు చాపి ఎత్తుకోమని మారాం చెయ్యటం, ఎప్పుడన్నా విసుక్కున్నా కసురుకున్నా ఓ చిన్న పాటి ఏడుపుతో అంతా మర్చిపోవటం నాలో జీవించాలనే కోరికను కలిగించాయి.

కుదురు వస్తుందనే ఆశతో స్నేహితులను బతిమాలి ఆయనకు ఉద్యోగం ఇప్పించి, పిల్లల చదువులనే సాకుతో మమ్ముల్ని మరో ఊరు పంపించారు మావగారు.ఈ ప్రయత్నం సఫలమో విఫలమో పక్కన పెడితే, నా జీవితంలో అదో మలుపు. పంజరంలో రెక్కలు జాపుకునే కొద్దిపాటి స్వేఛ్చ, స్థలం దొరికాయి. పోపుల డబ్బాలోను, చీర మడతల్లోను ఐదో పదో దాచుకోవటం, పక్క పోర్షన్ వాళ్ళతో మధ్యాహ్నాలు కబుర్లు చెప్పుకోవటం.. కొంత ఊరట నాకు.

ఈయనలో పెద్ద మార్పేమీ రాలేదు. సాయంత్రపు సావాసాలు, ఆలస్యపు రాకలు వచ్చి చేరాయి.

ఎప్పటికైనా మారకపోతారా అనే ఆశను సమూలంగా నరికేస్తూ ఆయన లివర్ జబ్బుతో మరణించినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి ఇంక ఏడ్చే ఓపిక పోయాక, ఏనాడూ మనసుని దగ్గరగా తీసుకోని ఆయన నన్ను వదిలేసి పోతే అంత దుఖంనాకెందుకు వచ్చిందని మెలమెల్లగా ప్రశ్నించుకున్నా. ఆ సమాధానం నన్ను నిలువుగా కాల్చేసింది.

ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముసలాళ్ళ బాధ్యతలు భూతాల్లా బయపెట్టాయి. దుఃఖకారణాన్ని తెలుసుకున్నాక నన్ను చూసి నేను నిజంగా భయపడ్డాను.
జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది.

ముసలాళ్ళ మలముత్రాలు ఎత్తిపోస్తూ కొడుకుని మింగేసిన రాక్షసి నన్న నిందనూ మోసాను. పిల్లల్ని పెంచటంలో వాళ్ళు చేసిన ఆర్ధిక సాయమూ మరువలేను, సాయం చేస్తూ నన్ను ఈసడించుకున్న క్షణాలు మరువలేను.

నా పెంపకపు లోపమో, చుట్టూ పరిస్తితుల ప్రభావమో, పిల్లలకు అమ్మంటే అలుసు, చులకన. అమ్మకో మనసుంటుందని, ఆ మనసుకు కష్టం సుఖం ఉంటాయని, అమ్మ మనసు గుర్తింపును కోరుతుందని వాళ్ళు గ్రహించుకోలేదు. నా పిల్లలని నేను వెనుకేసుకొస్తున్నానని కాదు కానీ సమాజం దగ్గర నుంచీ కుటుంబ సభ్యుల వరకూ అందరూ నాతో అలాగే ప్రవర్తిస్తుంటే పిల్లలు మాత్రం ఎక్కడ నుంచి నేర్చుకుంటారు?

ఇప్పడు పెద్దవాళ్ళు పోయారు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేనొక స్వంతత్రురాలిని… నేనొక శ్రమను, వస్తువుని కాదు. ఇప్పుడన్నా నాకోసం నేను బతకాలనుకున్నాను.

ఆలోచించుకున్నాను..నాలోనికి లోలోనికి వెళ్లి శోధించుకున్నాను. నా జీవితకాలంలో నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానా అని కాలాన్ని జల్లెడ పట్టి వెతుక్కున్నాను . నా పిల్లల చిన్నప్పుడు నేనుఆనందంగా ఉన్నాను. పిల్లల ఆ దశ, ఆ పసితనం, ఆ స్వచ్ఛత, ఆ కల్మషం లేని ప్రేమ నాకు కావాలి. నేను మళ్ళీ ఆనందంగా ఉండాలి.

నా కోసం నేను అట్టేపెట్టుకున్న ఆ ఎకరం పొలం నన్ను ఆదుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టలేనప్పుడు, కూతురు కంప్యూటర్ కోర్స్ లో చేరినప్పుడు ఇలా ఎన్నోసార్లు అమ్మేద్దాం అనుకున్నా. కానీ ఏదో శక్తి నన్ను ఆపింది. ఈ పొలం నాది అనే మొండితనం చాలాసార్లే చూపించాను. కొడుకు అమెరికా వెళ్తున్నప్పుడు డబ్బు అవసరం వచ్చింది. వాడు అమ్మెయ్యమని పట్టు పట్టాడు. నేను ససేమిరా అన్నాను. నిన్ను నేను చూడనా, నీకేదన్నా అవసరం వస్తే నేను డబ్బు ఇవ్వనా అని నిష్టురమాడాడు. నేను కుదరదంటే కుదరదన్నాను.

ఆ పొలం అమ్మేసాను. రోడ్డు పక్క పొలం, ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బే వచ్చింది. పాత ఇల్లు అమ్మేసి ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లమ్మటం ఎందుకని పిల్లలు నిలదీశారు, వారికేం తెలుసు నా గాయాల నిలయం ఆ ఇల్లని.

అందరూ నన్ను తప్పుపట్టారు. . పూజలతో కాలక్షేపం చెయ్యమని సలహాలిచ్చారు. వారి పరువు తీస్తున్నానని నా పిల్లలు నన్ను దూషించారు. వారి పిల్లలను చూసుకుంటూ కృష్ణ రామ అంటూ ఉండమన్నారు, ఈ వయసులో నీకు అంతకన్నా కావల్సిందేముందన్నారు. మరి కొందరు నన్ను జాలిగా చూసారు.

జీవితమంతా ప్రేక్షకురాలిలానే బతికేసాను, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోక తప్పింది కాదు, బయటకు నడవలేని నిస్సహాయత, ఆర్ధిక స్వతంత్రత లేదు, బాధ్యతలు వదిలెయ్యాలన్న ఉద్దేశ్యమూ లేదు. ఇంక ఇప్పుడు ఎవరికీ లొంగి ఉండాల్సింది లేదు, ఎవరి మెప్పు పొందాల్సింది లేదు. నాకోసం నా అడుగులను ఈదారిలో వేసాను.

***

వారం ఇట్టే తిరిగిపోయింది. వారం కిందటి బాధ అణువంతైనా లేదు ఇప్పుడు. లేలేత చిగురులు చిగురిస్తున్నట్టు, మరో ప్రస్థానానికి సన్నాహమవుతున్నట్టు మనసు ఉరకలేస్తోంది. కొత్త జుబ్బాలు కొని ఉతికి ఆరేసాను. కొత్త పాల డబ్బాలు, పీకలు వేడినీట్లో మరిగించి పెట్టుకున్నాను. మరో ఆహ్వానానికి ఇల్లంతా సర్వం సిద్ధమయింది. ఈరోజు వేకువ సరికొత్తగా ఉంది.

నేత చీర కుచ్చిళ్ళను తన్నుకుంటూ అనాధశ్రమంలోకి ప్రవేశించాను. నా చిటికిన వేలును పట్టుకుని చిన్ని చిన్ని అడుగులు వేస్తున్న చిన్నది అడుగడుగుకీ నా కాళ్ళకు అడ్డం పడుతూ నడుస్తుంది.

“లాదీ లాదీ…ఊగుతా”, ఉయ్యాలను చూపిస్తూ అలవాటైన ప్రాంగణం లోనికి పరుగులుపెట్టింది .కొన్ని జతల కళ్ళు నన్ను ఆశ్చర్యంగా, జాలిగా, వింతగా, కొంత అసహ్యంగా చూస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అలవాటు పడ్డ ఆ చూపులను దాటుకుంటూ సిస్టర్ అభిగేల్ గదిలోనికి దారితీసాను.

“రాధ గారు, ఈసారి బాబు… చెత్తకుండీలో…”, ఇంక చెప్పవద్దన్నట్టు చూసాను.

“చాలా అనారోగ్యం మూటగట్టుకుని పుట్టినట్టున్నాడు. ఉబ్బసం తిరగబెడుతూ ఉంది”

“వయసుతో పాటూ పోతుందిలే. వెళుతూ వెళుతూ డాక్టర్ కు చూపించి మందులు తీసుకెళతాను”

“చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను అనుకోకండి . ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాను. మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారేమో!”

“లేదు లేదు, ఇంకే శిక్షలు నన్ను బాధించలేని స్థితికి చేరాకే ఇక్కడకు వచ్చాను. మీకంతా తెలిసిందే కదా. ఈ పసి ప్రాణాలకు బాధించటం, శిక్షించటం రాదు. ఏ కల్మషము లేని స్వచ్చమైన ప్రేమను వీరు మాత్రమే ఇవ్వగలరు”

“నిద్ర కాచి, శ్రమను ఓర్చి పెంచిన బిడ్డను తిరిగి ఇచ్చెయ్యటం బాధగా ఉండదూ? పోనీ నచ్చిన బిడ్డను దత్తత తీసుకోండి”

“మనుష్యులపై, మనసులపై, మమతలపై నమ్మకం నాలో మిగలలేదు. ఊహ తెలియనంత వరకే ఆ స్వచ్ఛత. పిల్లలకు ఊహొచ్చి లోకాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టగానే నాలో భయం మొదలవుతుంది. బంధాల పోట్లు పడి పడి రాటుతేలిన మనిషిని నేను. అందుకే రెండేళ్ళ పరిధిలో మిగిలిపోతాను. పైపెచ్చు రెండేళ్ళ పిల్లలు ఇట్టే మర్చిపోతారు.ఈ మార్పు వారిని ఇబ్బంది పెట్టకూడదు.”

“ స్పెషల్ కేర్ కావాల్సిన పిల్లలనే తీసుకెళ్తున్నారు, సుఖం కంటే ఆందోళన ఎక్కువ కదూ ఈ పిల్లలతో ”

“ఇదంతా నా స్వార్ధం .అందుకేనేమో అనారోగ్యంతో ఉన్న పిల్లలనే ఎంచుకుంటాను. ప్రేమించటానికి నాకో ప్రాణి కావాలి అనే స్వార్ధం నాది. బోసి నవ్వుల్లో, అపురూపమైన ఆ స్పర్శలో నన్ను నేను మర్చిపోతాను. నేనెంత ప్రేమిస్తానో వారు నన్ను అంతే ప్రేమిస్తారు, అదిగో ఆ ప్రేమ పొందాలనే స్వార్ధం నాది. ”
“మీ చేతుల్లో పెరిగిన పిల్లల్లో ఒక్కరికి కూడా మీరు గుర్తుండరు”

“అందుకే ఎవరితోనూ అమ్మ అనిపించుకోను సిస్టర్. వారికి నేను గుర్తుండాలని ఆశించను. చెప్పానుగా, నాకు ఎదిగిన మనుషులంటే భయం”.

కిటికిలో నుంచి బయటకు చూసాను. ఉయ్యాలలో ఊగుతున్న చిన్నది లాదీ లాదీ అని పిలస్తూ నవ్వుతోంది. ఆరోగ్యంగా మెరుస్తున్న పాప చెక్కిళ్ళు నాకు ఎంతో తృప్తిని ఇచ్చాయి.

“పాపకు ర పలకట్లేదు”, మురిపెంగా అన్నాను.

“కొన్ని రోజులు నా కోసం వెతుక్కుంటుంది సిస్టర్. కొంచెం జాగ్రత్త”, ఆఖరి అప్పగింత చెప్పేసాను.

నా కళ్ళలో భావాలను వెతకాలని సిస్టర్ అభిగేల్ విశ్వప్రయత్నం చేస్తోంది.

నా పరిధిలో అణువణువునీ శోధించి, మలిసంధ్యలో ఈ ముంగిలిలో తేలాను. ఇక్కడ తేలడానికి ముందు ఎన్నెన్ని సంద్రాలు ఈదానో, ఎంత అలసటను నాలో దాచుకున్నానో నా మనసుకు మాత్రమే తెలుసు. తాత్కాలికమైనా సరే బృందావనాలు నాకు కావాలి, కల్మషంలేని ప్రేమ, స్వచ్ఛమైన నవ్వు నాకు కావాలి.
“ ఏం పేరు పెట్టారు”, అనడిగాను.

“కృష్ణ”

రోజుల బాబును చేతుల్లోకి తీసుకుంటుంటే ఇది అని చెప్పలేని ఓ అనిర్వచనీయ భావన. ప్రపంచంలో ప్రతీ బిడ్డ ప్రత్యేకమే,అపురూపమే.

కన్నయ్యతో అనాధాశ్రమమం గేటు దాటుతూ మరోసారి జన్మించాను… నూతనంగా, స్వచ్చంగా, ప్రేమముర్తిగా, తాత్కాలిక తల్లిగా.

**** (*) ****

Published : http://vaakili.com/patrika/?p=7111

Posted in కధలు | 1 Comment

మా పల్లె అందాలు అనుభవాలు


మా పల్లె అందాలు అనుభవాలు 

“నేను ఇండియా  వస్తున్నాను, కుదిరితే కలుద్దాం,” అనగానే నీ డేట్స్ చెప్పు అని తన ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్న జయతికి బోల్డు థాంక్స్ లు. థాంక్స్ ఫర్ కమింగ్ అని నేనంటే — థాంక్స్ ఏమీ కాదు ప్రవీణ, మనమందరం ఆస్వాదించాం అని తనన్నా కూడా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే  జయతి రాకపోయి ఉంటే ఊరెళ్ళి వచ్చేదాన్నే కానీ ఈ ఎక్స్పీరియన్స్  మిస్ అయ్యేదాన్ని.

అసలే మన తోకలకి పొడుగెక్కువ, అందులోనూ నా డియర్ డార్లింగ్ చైతు పక్కన ఉంటే తోకలు వంకర టింకరలు తిరిగి అల్లరల్లరి చేస్తుంటాయి. అంతక ముందు రోజు 24 గంటలు సాగిన మా కబుర్లకు కామా పెట్టి   కొనసాగింపుగా నాతో పాటూ ఊరు వచ్చిన  చైతుకి కూడా చిన్ని థాంక్స్. ( పాపికొండలు ఆశ పెట్టావ్ నాకు, అది తీరాక అప్పుడు చెపుతాలే పెద్ద థాంక్స్ )

ఇంక, మా అల్లరి పిడుగు — వీడిని, వీడి అల్లరిని  ఇంట్లో భరించలేం  కానీ బయటకు తీసుకెళ్తే బాగానే ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెట్టడు,  ఎంజాయ్ చేస్తాడు. మనం తినే అన్నం ఎక్కడనుంచీ వస్తుందో తెలుసుకోవటంలో చిన్నోడి ఆసక్తి, పశువులను తాకుతూ వాటికి గడ్డి తినిపించటంలో వాడి ఆనందం — lovely expressions to see.

“He only had more fun, not me. You cheated me,” వీడి బ్రదర్ కి హ్యాండ్ ఇచ్చి వీడినొక్కడినే  తీసుకెళ్ళిన పాపం సాధింపులా ఇప్పటికీ  నన్ను సతాయిస్తూనే ఉంది. వచ్చే ఏడాది వీడిని తీసుకెళ్ళి ఊరు చూపించే దాకా సాగే హింస ఇది, తప్పదు ఈ నస నాకు 😦 .

“వద్దులే మావయ్య, నీ  పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి,”  అని వారిస్తున్నా కూడా వినకుండా, “మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలీదురా తల్లీ, నేను తీసుకెళ్తానులే, ” అంటూ మమ్మల్ని  పొలాలకు తీసుకెళ్ళిన మావయ్యకు ఎన్ని థాంక్స్ చెప్పుకున్నా తక్కువే.  మాకు తెలీదు అనేకంటే, ముగ్గురం ఆడపిల్లలం వెళుతున్నాం అనే కన్సర్న్ ఎక్కువ ఉంటుంది మావయ్యకు.

అలా నేను, చైతు, జయతి, చిన్నోడు, మావయ్య బయల్దేరాం మా ఊరు. మేము చిన్నప్పుడు ఆడుకున్న ఊరు , నాకు ఎన్నో బాల్యపు జ్ఞాపకాలను కానుకలుగా ఇచ్చిన  అమ్మమ్మగారి ఊరు.

పొద్దున్నే ఉండే పొగమంచు మిస్ అవ్వకూడదు అనుకున్నాం.  ఆత్రంలో అందరం ముందే మరి :). తెల్లారకముందే… ఇంకా ముందే, నాలుగు గంటలకల్లా డ్రైవర్ ని రమ్మన్నాం. అంత పొద్దున్నే ఎందుకు అన్నా కూడా వినకుండా, పాపం మావయ్యను కూడా నిద్ర లేపేసి నాలుగున్నరకల్లా బయల్దేరిపోయాం.  ఆ రాత్రంతా excitementతో నిద్ర పడితేగా!   ఆ ఊరుతో అల్లుకున్న  ఎన్నో అందమైన జ్ఞాపకాలు, కొన్ని కొన్ని కలత ఆలోచనలతోను నిద్ర పట్టలేదు నాకు.

ఇక్కడ చూడాలి మా ఇబ్బంది….. రోడ్లన్నీ ఖాళీ, కారేమో రయ్యిన దూసుకుపోతోంది, ఎంతకీ వెలుగు రాదే!  కారేమో వెళ్ళిపోతుంది, వెళ్ళే దారిలో అన్నీ ఊర్లు — కనిపించవు, చీకటి.  మేముగ్గురం ఒకరి మొహం ఒకరం చూసుకుంటూ, టూ మచ్  చేసాం కదూ అని నవ్వుకున్నాం.  పోనీ కారు పక్కన ఆపేసుకుని వెయిట్ చేద్దామా అనుకుంటుండగానే లైట్స్ తో బాగా డెకరేట్ చేసిన గుడి కనిపించింది. భలే భలే అనుకుంటూ అక్కడ దిగాం. దైవభక్తుడైన మావయ్య హ్యాపీ, ధనుర్మాసం దేవుడి దర్శనం చేసుకుని రండి అన్నాడు.

గుడిలోనుంచీ వినిపిస్తున్న మంత్రాలు, గంటల చప్పుడు, చిరుచలి భలే ఉంది. గుడి ముందు అప్పుడే ఒకావిడ గొబ్బెమ్మలను చేస్తుంది.  ఆవిడతో కొన్ని ముచ్చట్లు చెప్పి గొబ్బెమ్మలపై ముగ్గుతో గీతలు గీసి, పసుపు కుంకుమ పెట్టి, బతిపువ్వులు  పెట్టాం.

దైవదర్శనం చేసుకుని బయల్దేరే టైంకి చెరుకు బళ్ళు ఎదురయ్యాలి. అందులో ఓ బండిని ఆపి చిన్నోడిని ఎక్కించి, వాడితో పాటూ నేను ఎక్కేసి సంబరపడ్డాం. ఫోటోలు తీస్తుంటే ఆ బండి నడిపే ఆయన ఇంకా సంబరపడిపోయాడు.

గంపలను తలపై పెట్టుకుని వెళ్ళే స్త్రీలు, సైకిళ్ళు తొక్కుకుంటూ వెళ్ళే పురుషులు — Day starts much early for many people.

అక్కడనుంచి బయల్దేరి ఇంకాస్త దూరం వెళ్లేసరికి,  దూరాన చలిమంట కనిపించింది. మరి కనిపించదేమిటి ఇంకా అంత  చీకటిగా ఉంటే 😛 .  ఆ మంటలో మా వంతుగా కొంచెం ఎండుగడ్డి వేసి, మేము కూడా చలికాసుకున్నాం.

అప్పటికి కాస్త కాస్త వెలుగు రావటం మొదలుపెట్టింది. దారిలో కనిపించిన చేపల వెండర్. ఈ ఫోటో  ఆయనకు చూపించు అంది జయతి. నేను కెమెరాలో ఫోటో చూపించాను, ఒక చక్కటి  నవ్వు  అయన మోహంలో.

DSC_0150

అప్పటికి వెలుగు వచ్చేసింది, మేమూ  ఊరు చేరుకున్నాం. ఒకసారి అమ్మమ్మ తాతయ్యలకు కనిపించి పొలం వెళ్దాం అన్నాడు మావయ్య.  అమ్మమ్మ నన్ను దగ్గరకు తీసుకుంటూ కళ్ళు తుడుచుకుంది. మా అందరినీ చూసి సంతోషపడ్డారు వాళ్ళిద్దరూ. టిఫిన్ తిని వెళ్ళండి అని గొడవ చేసింది అమ్మమ్మ.  “అమ్మమ్మ..ప్లీజ్..ప్లీజ్.. వచ్చి తింటాం. మంచు కరిగిపోతుంది,” అంటూ హడావుడిగా వెళ్ళిపోయాం.

It was just a perfect time when we reached the fields. చుట్టూ కమ్ముకున్న మంచు, ఆ మంచును కరిగిస్తున్న లేలేత  కిరణాలు, మేఘాల చాటు నుంచి వస్తున్న సూర్యుడు. పొలం గట్టుపై తూర్పు దిక్కుకి   నడుస్తూ ఫోటోలు తీసుకోవటం. ఆ అనుభూతిని చెప్పటానికి నా దగ్గర మాటలు లేవు.

తొలిమంచు కరిగింది తలుపుతియ్యవా ప్రభూ”

DSC_0183

“ఇల గొంతు వణికింది పిలుపు నీయనా .. ప్రభూ”DSC_0182

“నీ దోవ పొడవునా కువ కువల స్వాగతం” DSC_0180

“నీ కాలి అలికిడికి మెలకువల వందనమూ”DSC_0175

“తెలి మంచు కరిగింది తలుపు తీయనా .. ప్రభూ !”DSC_0181

“ఈ పూల రాగాల పులకింత గమకాలు”

DSC_0233“గారాబు కవనాల గాలి సంగతులూ”

DSC_0230  DSC_0240DSC_0251

“భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు ” DSC_0252  DSC_0257 DSC_0259 DSC_0264 DSC_0267 DSC_0276

“నీ రాజసానికవి నీరాజనాలూ”

DSC_0281  DSC_0300 DSC_0303 DSC_0317

DSC_0325ధరణి ఆణువణువూ సూర్యుడి తొలికిరణాలకు స్వాగతం పలుకుతున్నాయి

DSC_0165

DSC_0255

“నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు ”
DSC_0161DSC_0169

“పల్లవించును ప్రభూ..పవళించు భువనాలు..భాను మూర్తీ”

DSC_0190

DSC_0174

“నీ ప్రాణకీర్తన వినీ..పలుకనీ..ప్రణతులని..ప్రణవ శృతినీ”

DSC_0185

“పాడనీ ప్రకృతినీ ప్రధమ కృతినీ”

సూర్యోదయాన్ని చూస్తూ ఆ పొలం గట్టున నడుస్తూ క్షణానికో ఫోటో తీసానో ఏమిటో! అన్ని వందల ఫోటోలలో నుంచీ సెలెక్ట్ చేసుకోవటం నా వళ్ళ కాదు బాబోయ్…చేతికి  వచ్చినవి పోస్ట్ చేసేస్తున్నా.

“పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు..తలయూచూ”

“తరలనీ దారి తొలగై రాతిరినీ”…..

పంట కాలువ, కాలువలో ప్రతిబింబిస్తున్న సూర్యుడు

DSC_0246DSC_0249

“పసరు కవనాలలో పసి కూన రాగాలు”

ఆ పొలం పక్కనే ఓ చిన్న ఇళ్ళు , అందులో భౌ భౌ అని అరుస్తున్న కుక్క. మా అల్లరోడు ఆ కుక్కని ఫ్రెండ్ చేసేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. సీతయ్య ఎవరి మాట వినడు టైపు కదా మరి ఇంకో పొలానికి వెళ్దాం పదరా అంటున్నా కూడా ఆ కుక్క చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఉండే వారు బయటకు వచ్చి ఇలా సాయం చేసారు…It’s a process of making a friend, it’s not difficult. ఎవరికైనా స్నేహహస్తం జాపటం ఎంతో తేలికని బహుశా పిల్లలకు తెలిసింతగా మనకు తెలియదనుకుంట.

It’s a slide show down.

This slideshow requires JavaScript.

పల్లెకారులు కొందరు ఇక్కడ. అక్కడ వంతెనపై బ్రష్ చేసుకుంటూ కబుర్లు కూడా చెప్పేసుకుంటున్నారు 🙂

ఆ పై ఫోటోలో ఉన్న  చిన్న బడ్డీ కొట్టులో గొట్టాలు కొనుక్కుని, వేళ్ళకు తగిలించుకుని తింటూ పుల్లైసులు, జీడీలు, మరమరాలు, అటుకులు తిన్న చిన్ననాటి కబుర్లు గుర్తుతెచ్చుకున్నాం.

ఈ కాలువ గట్టున కాసేపు గడిపి ఇంటికి వెళ్ళాము.

“టిఫిన్ ఆలస్యం అయిపోయింది, అందరికీ ఆకలి వేసేస్తూ ఉంటుంది,”  ఇంటికి రాగానే  అమ్మమ్మ కంగారు పడిపోతుంటే, “మా మనసులు, కడుపులు అన్నీ నిండిపోయాయి అమ్మమ్మా,” అన్నాము.  అమ్మమ్మ ఎక్కడ హైరానా పడుతుందో అని అమ్మ కూరలు అవి వండి ప్యాక్ చేసి ఇచ్చింది. “మీ అమ్మ చెపితే వినిపించుకోదు, ఆ మాత్రం వండలేనా ఏమిటి? పిల్లలకు వొండి పెట్టుకోవటం ఆనందమే, ” అంటూ నాకెంతో ఇష్టమైన కజ్జికాయలు, ఇంకా వెన్నుండలు, చెక్కలు నింపిన  డబ్బాలు మా ముందు పెట్టింది.  ఎందుకమ్మమ్మా ఇవన్నీ వండావు అంటూనే డబ్బాలపై దండయాత్ర చేసాం.

DSC_0457ఆ పెరట్లోని ప్రతీ ఆకు, మొక్క, చెట్టు, పువ్వు నాకు పరిచయమే ఆ అరుగులపై  దొర్లిన క్షణాలు                                     చెప్పుకున్న కబుర్లు, నేస్తాలతో ఆడిన ఆటలు                     ఊగిన ఉయ్యాల, చదివిన పుస్తకాలు,ఎర్రగా పండిన గోరింటాకు
వెన్నెల్లో వేసిన మంచాలు,అమ్మ పాత జడగంటలు                    అమ్మమ్మ గోరుముద్దలు, మామయ్య ముచ్చట్లు             లక్కపిడతల్లో వండిన వంటలు,ధాన్యం బస్తాలఫై  చేసినడాన్సులు వెతికిన కొద్దీ అలమ్మర్రులో కొత్తగా దొరికే వస్తువులు                 తొంగి తొంగి చూసిన బావి, నీళ్ళు నేనూ తోడతా అని చేసిన అల్లరిగడ్డి  తినిపించిన గేదెలు, కోళ్ళతో అడిన కబాడీ, గుడ్డు కోసం వెతుకులాట, కుండలో చల్లని నీళ్లు                      అమ్మానాన్నల పెళ్ళీ ఫోటో…..It’s an endless list.

I am so mad about about place, this is my 4th or 5th post about this village 🙂

మంచో చెడో సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కొన్ని మార్పులు గతపు అస్తిత్వాన్ని కూల్చేసి  కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అమ్మ చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబంతో సందడిగా ఉండేదంట. ఆ తర్వాత అందరూ తలా ఓ దిక్కు పట్నాల వైపుకు వెళ్ళిపోయినా,  మా చిన్నప్పుడు పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేది. మా వేసవి సెలవులు ఇక్కడే గడిచేవి. ఇప్పుడు, మేము పట్నాలు దాటి ఇతర దేశాలు వెళ్ళిపోయాం.  మా పిల్లల చిన్నప్పటికి వచ్చేసరికి ఈ ఊరు, ఇళ్లులు కళ, జీవం కోల్పోయి కేవలం గత వైభవపు జ్ఞాపకాలుగా మిగిలాయి . ఆ తర్వాత అసలు ఆనవాలు లేకుండా పోతాయా…ఏమో!  ఒకప్పటి మా అనుబంధపు తీగ ఇంకా అలా ఉండబట్టి ఊరు ఊరు అనుకుంటున్నామే కానీ, పల్లెలపై ఎవరికి ఆసక్తి ఈరోజుల్లో.

అమ్మమ్మ అప్పటికే కొబ్బరికాయలు  బుట్టలో  పెట్టి సిద్ధంగా ఉంచింది. కాసిన్ని పూలు కోసుకుని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. జయతి గుడి ఆవరణలోని రావి చెట్టు చుట్టూ ఉన్న అరుగుపై కుర్చుని ఎంచక్కా పక్షుల కువకువలు వింటూ ఫొటోస్ తీసుకుంటూ కూర్చుంది. అసలే మనం స్పెషల్ గెస్ట్ లం  కదా, పూజారి గారు మంత్రాలు చదివి చదివి గంటపైనే  పూజ చేసారు.

గుడిలో నుంచీ బయటకు వస్తుంటే ఆ పక్కనే ఉన్న ఇంట్లో నుంచీ ఒకావిడ బయటకు వచ్చి ,” ఎవరండీ ఆ పాప, మీ మనవరాలా? ” అని అడిగింది. ఆవిడ అడగటం పాపం అన్నట్టు అమ్మమ్మ పుట్టుపుర్వోత్తరాల కధ కహానీ మొదలుపెట్టేసింది. మొహమాటంగా  ఓ నవ్వు నవ్వి, అమ్మమ్మ చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి కారులో కూర్చోపెట్టి, “ఇప్పుడీ కధంతా ఆవిడ అడిగిందా? నువ్వు చెప్పాలా చెప్పు,” అని విసుక్కుంటే, “ఏదోలే ,పెద్దాళ్ళం,” అంది అమ్మమ్మ.

ఇదో గమ్మత్తైన అనుభవం.

దొడ్లో కనీసం మనుష్యుల అలికిడన్నా ఉంటుందని పక్కనున్న గదులను అద్దెకు ఇచ్చాం. ఒకప్పుడు అది వంటిల్లు.

DSC_0509

వాళ్ళు కట్టెల పొయ్యిపై నీళ్ళు కాసుకుంటున్నారు.  ఉల్లిపాయ కాల్చుకుని తింటే భలే ఉంటుంది తెలుసా అంది చైతు. నిజమే బారిబిక్యూ లో ఉల్లిపాయ కాలుస్తాం మేము అన్నాను. Lets do BBQ here అనుకుంటూ మొదలుపెట్టాం.  అద్దెకుంటున్న వారి పిల్లలు (ఇద్దరు ఆడపిల్లలు, సుమారు పదేళ్ళు ఉంటాయనుకుంట), అక్కా చింతకాయలు కూడా కాల్చుకుని తింటే సూపరుగా ఉంటుంది అన్నారు. ఓహ్ అవునా! మరి చింతకాయలు ఎక్కడ దొరుకుతాయి మనకి అనడిగితే, పక్కనే చింతచెట్టు వుందక్కా, వెళ్లి కొసుకుందామా అనడిగారు. అంతకన్నానా  అనుకుంటూ నేను, చైతు రెడీ అయిపోయాం. కానీ ఆ పక్కనున్న ముసలమ్మ తిడుతుంది, పిచ్చబ్బాయి ఉంటాడు  అన్నారు పిల్లలు. ఏం పర్లేదు రండి అని వెళ్ళాం.

ఇంటి పక్కనే చిన్న సందులా ఉంటుంది, అక్కడే ఉంది చింతచెట్టు . మా చిన్నప్పటి నుంచీ అక్కడో పిచ్చబ్బాయి ఉండేవాడు. ఈ మామగారు  అతని తల్లి.

మేము మెల్లగా వెళుతుంటే, “ఎవరే అది……….. ,” ఏమి చెప్పేది! లకారానికి దీర్గం, గుడి దీర్గం…. మకారానికి ఓత్వం, ఔత్వంతో ఊరంతా వినిపించేలా తిట్లు. నేను చైతు కొంచెం దడుచుకుని  ఏం చేద్దాం అనుకుని  చివరికి  లైట్ లే అని కంటిన్యూ అయిపోయాం.

పెద్ద కర్ర సంపాదించి ఎవరు ఎక్కువ కాయలు కొట్టగలరో చూద్దాం అనే లెవెల్లో ఒక్కో చింతకాయ కింద  పడుతుంటే హుర్రే అనుకుంటూ సంచి నిండా కాయలు కోసుకున్నాం.  ఆ తిట్ల పెద్దావిడ ఎందుకో కానీ మావైపు రాలేదు. కోసుకోవటం అయిపోయాక, ఆవిడ మళ్ళి ఎక్కడ తిడుతుందో అని దొంగల్లా మెల్ల మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే, రానే వచ్చింది. పిల్లకాయలను మరో తిట్టుతో దీవించి,  మా దగ్గరకు వచ్చి ఎవరు మీరు అంది నన్ను చైతుని.  వాళ్ళ మనవరాలిని అని నేనంటే, చిన్న దానివా అనడిగింది. కాదు అని నేనెవరో చెప్పేలోపే, నన్ను ఇంట్లో పిలిచే పేరుతో పిలుస్తూ నువ్వే కదూ అంది.   నాకెంత ఆశ్చర్యమో! ఆవిడకు నేను ఎలా గుర్తున్నాను, పైగా నా పేరు కూడా గుర్తుంది.

ఇంక అంతే… వాళ్ళ పెరట్లోకి తీసుకెళ్ళి జామ చెట్టు చూపిస్తూ జామకాయలు కూడా కోసుకోండి అని మా పై ప్రేమ కురిపించేసింది. తన గుడిసెలో నుంచీ నాలుగు కాయలు కూడా తీసుకొచ్చి మాకిచ్చింది ఆవిడ.  మానసిక సమతుల్యం లేని కొడుకుని రక్షించుకునే క్రమంలో ఆవిడ గడుసుగా దురుసుగా మారారు. ఒక్కో జీవితం ఒక్కో కధ, ఒక్కో వ్యధ.

కొన్ని చింతకాయలేమో కాల్చుకున్నాం. మరి కొన్నింటితో పచ్చడి చేసుకున్నాం. అమ్మమ్మ పచ్చిమిరపకాయలు, దనియాలు వేయించి ఇస్తే, గ్రైండర్ వద్దు అని కావాలని  రోట్లో రుబ్బుకున్నాం, ఆ రుచే వేరు.

DSC_0564-2 ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతెంత గొప్ప గొప్ప అందాలను చూసినా కూడా మనూర్లో ఉదయించే సూర్యుడ్ని, మన పచ్చని చేలను, పొలం గట్లను, పంట కాలువలను, మన పల్లెలను  చూసే అందమే అందం.  మన ధనుర్మాసపు పొగమంచును, శరత్కాలపు వెన్నెల రాత్రుళ్ళను, వాన చినుకులను ఆస్వాదించే    ఆనందమే వేరు.

 

DSC_0456-2అనుభవం ఆ  రోజుదే అయినా అనుభూతి కొన్నాళ్ళు మనల్ని  వెంటాడుతూ ఉంటుంది.
రంగు రంగుల అనుభూతులు నలుపు తెలుపుల జ్ఞాపకాలై  మనలో మిగిలిపోతాయి.

ఊర్లో ఉన్నది కొన్ని గంటలే అయినా, అక్కడ తీసిన ఫోటో కలెక్షన్ నుంచీ  రోజుకో రెండు మూడు  ఫోటోలు బయటకు తీసి తనివితీరా చూసుకుని పేస్ బుక్లో అప్లోడ్ చేసుకోవటం, దాదాపు నెల తర్వాత ఈ పోస్ట్ రాయటం చాలా బాగుంది.  ఎప్పుడైనా ఈ పోస్ట్ చదువుకోవటం .. It’s like reliving those moments again.

 

Posted in జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Photography, Uncategorized | Tagged | 12 Comments

చందమామ కధలు


చందమామ కధలు 

వెన్నెల కురిసే  ఓ పౌర్ణమి రోజున హటాత్తుగా సిటీలో కరెంట్ పోతే ఎంత బాగుండు  కదా! (దోమల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దురూ 🙂 )

DSC_0565ఆబాలగోపాలం తమ తమ పరుగులన్నీ పక్కన పెట్టి వెన్నెల్లో గంతులేస్తేనో!

DSC_0570దోసిళ్ళలో వెన్నెలను దాచుకోగలిగితేనో!

DSC_0573కొబ్బరాకుల చాటునో, కొమ్మల మాటునో దోబుచులాడుతున్న చందమామను దొరికేసావోచ్ అని పట్టుకోగలిగితేనో!

DSC_0574ఎర్రగా పండిన గోరింటాకు అరచేతులను వెన్నెల వెలుగుల్లో చూసుకుంటేనో!

DSC_0577పేదరాసి పెద్దమ్మ చెప్పిన చందమామ కధలు చెప్పుకుంటేనో!

DSC_0578 వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి ….. నేనే చందమామను, ఆకాశంలోనుంచీ నీ ఒళ్లోకి ఊడిపడ్డానని నెలరాజు అంటేనో!

DSC_0599ఎంత బాగుండు!!!

పొర్ణమి రాత్రి వెన్నెలను ఆస్వాదించటానికి ఊరు చివరకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనే కోరికైతే తీరలేదు కానీ, ఈ వీకెండ్ పార్కుకు వెళ్ళినపుడు చెట్టు చాటునుంచీ చంద్రుడు ఇలా పలకరిస్తే కొన్ని ఫోటోలు తీసుకున్నాను.

 

 

Posted in నా అనుభవాలు, Photography | 5 Comments

నాకోసం అట్టేపెట్టేయ్యవూ


నాకోసం అట్టేపెట్టేయ్యవూ

 10629746_10202625016488563_2699745010878008259_n

రెండంటే రెండే మాటలు

గుప్పెడంటే గుప్పెడు నీ నవ్వులు

అంతో ఇంతో చిలిపితనం

కాస్తంత అమాయకత్వం

కూసంత పసితనం

నాకోసం అట్టేపెట్టేయ్యవూ….

ఎప్పుడోకప్పుడు

గుప్పిళ్ళ  నిండా పూలను ఏరి

దారాలను పెనవేస్తూ మాలలు అల్లి

నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ రాకపోతానా చెప్పు!

తీరా వచ్చాక

నాదగ్గరేం  మిగలలేదంటే

నేను చిన్నబుచ్చుకోనూ!


వర్షపు చినుకులను

పూల పరిమళాలను

కోనేటి మెట్లను

కాకి ఎంగిలిని

రామచిలుక రంగులను

కొబ్బరాకుల బొమ్మల పెళ్ళిళ్ళను

నెమళీక జ్ఞాపకాలను

కాగితపు పడవ మడతలలో

నాకోసం దాచేయ్యవూ….

అలసినప్పుడో

మనసు చిన్నబోయినప్పుడో

బుంగమూతితో నీ దగ్గరకు రాకపోతానా చెప్పు!

తీరా వచ్చాక

తాయిలాలేం లేవు నా దగ్గరని నువ్వంటే

చెమ్మగిల్లే నా కళ్ళలో ఉబికేవి నీలాలు కాదు

కన్నీరే

Posted in కవితలు, జీవితం, Uncategorized | 3 Comments

నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు


నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు

10501739_10202924104285571_6450727191125881808_n

ఏ హడావుడి, మరే సందడి లేని నిశ్శబ్దంలో
గాలి సవ్వడి, ఆకుల గలగలలు లేని సందర్భంలో
నెలవంక బెదురుబెదురుగా అడుగులో అడుగులేస్తూ
మేఘాల చాటు కెళ్తున్న తరుణంలో,
చూరు నుంచీ జారిపోబోతున్న ఘడియ
అక్కడే స్థంభింభించిపోయిన సమయంలో,
ఆరు బయట నేనుకాక మరెవ్వరూ లేనట్టూ
చుట్టూ ఉన్న మనుష్యులూ, పరిస్థితులూ
ఉన్నఫళంగా ఉన్నవన్నీ మాయమయిపోయినట్టూ,
నన్ను నా ఆలోచనలలోనికి
నా ఆలోచనలు నీ జ్ఞాపకాలలోనికి
నీ జ్ఞాపకాల్లోని నన్ను
నాలోని నిన్ను
ఆర్తిగా హృదయానికి హత్తుకోగలిగితే
నువ్వు లేవన్న లోటు లేనేలేదుగా!

1379807_10200809291496573_199867157_n

కన్నెర్ర చేసినా, కన్నీరు పెట్టినా
కెలికివేయబడ్డ రాతను తిరిగి రాయనూలేను.
పాళీ పట్టలేని నిస్సహాయతో, నిస్సత్తువో
అనుభవించేసాక
ఇంకా ఊహలేంటి ఊసులేంటనే తర్కాన్ని
ఆ చివరి మెట్టున పెట్టి
ఇక్కడే దొర్లిన మన కబుర్లను
కుదురుగా కుర్చోపెడతాను మొదటి మెట్టున.
మాటకారివి నువ్వనుకునేవు!
నీతో అల్లుకున్న నా ఆశలు, కలలు, జ్ఞాపకాలే
నా ప్రపంచంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి
వీనులవిందుగా ఆలకిస్తూ ఉంటాను.

నువ్వు గుర్తొచ్చిన ప్రతీసారి కొత్తగానే ఉంటుంది
నీతో కరిగిన కాలం
కొత్త వర్ణాల మేళవింపుతో
సరికొత్త చిత్రాలను నా మనోఫలకంపై చిత్రిస్తూనే ఉంటుంది.
కుంచె పట్టిన చిత్రకారుడువి నువ్వనుకునేవు!
కాన్వాసుపై ఒలికేవన్ని నా నీ స్మృతులే.

అక్కడో ఇక్కడో ఎంతకని తవ్వుకుంటాం కాలాన్ని, గతాన్ని
అప్పుడో ఇప్పుడో ఎన్నని కొలుస్తాం గాయాలను, కన్నీటిని
అంగీకారం భౌతికమై లోకానిదైతే
ఆలోచన ఆధ్యాత్మికమై నాదవుతుంది.

DSC_0271చేజిక్కించుకోలేని బంధాలు
చేజార్చుకున్న ప్రేమలు
ఉండీ లేనట్టుండే సుఖదుఃఖాలు
తనపర జీవితాలు జీవించేసాక
ప్రేమలు విరహాలకు తావే లేదిక.
ఉన్నదంతా రాసులుగా పోగేసుకున్న నీ జ్ఞాపకాలే…. నువ్వు కాదు!

Posted in కవితలు, కష్టం, కాలం | 2 Comments

సువిసైడ్


సువిసైడ్ 

 

ఆ రెండు కన్నీటి చుక్కలు

కనుకోనలలో వేళాడుతున్నాయి

వాలే భుజం లేక…..

 

ఆ రెండు మాటలు

నాలికను చిధిమేస్తూ

గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి

వినే మనసు లేక…..

 

ఆ విసుగు నిస్పృహై

శూన్యంలోకి జారిపోతుంది

ఆశకు ఆసరా లేక…..

 

ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ

మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది

హత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరో

తేల్చుకోలేని ప్రశ్నలను

మనకు వదిలేస్తూ…..

 

మనం

ఆ మనసులను

ఆ ఆ  అంతరంగపు లోతులను తడమగలిగి

వారి ఆత్మలను ముద్దాడిఉంటే

ఒక మాట, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక సహానుభూతి, ఒక ఆశ….ఇచ్చివుంటే

ఎన్ని కొత్త చిగురులు తొడిగేవో కదూ ఆ జీవితాలు.

చిదిమేసుకున్న ప్రతీ జీవితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది…

Posted in కవితలు, కష్టం, Uncategorized | 4 Comments

ఆ కళ్ళలో హరివిల్లు


ఆ కళ్ళలో హరివిల్లు

రెండు రోజుల నుంచీ ఈ లూప్ తెగట్లేదు. ఎక్కడో లాజికల్ మిస్టేక్ ఉంది. డీబగ్గింగ్ లో వేరియబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎండ్ రిసల్ట్ తప్పొస్తుంది. అబ్బా…..భలే విసుగ్గా ఉంది.

ఇంతలో ఫోన్ రింగయ్యింది. ఇప్పుడెవరా అని విసుక్కుంటూ మొబైల్ అందుకున్నాను. రిమైండర్ రింగ్. ఈ రోజు ఆంటీ బర్త్ డే. ఈ పని టెన్షన్లో పడి ఈ రోజు డేట్ కూడా చూసుకోలేదు. మార్నింగ్ సునీల్ చెప్పనన్నా చెప్పలేదు. మర్చిపోయి ఉంటాడేమో! మొన్న ఊరెల్లోచ్చిన కోపం ఇంకా పోలేదు. ముభావంగా ఉంటున్నాడు. బహుశా అందుకే నాతో చెప్పలేదేమో! వెంటనే సునీల్ కి రింగ్ చేసాను.

“ఏంటో తొందరగా చెప్పు,” భూప్రపంచంలో ఇతనొక్కడే బిజీ అన్నట్టు ఫోసులు.

“ఈ రోజు ఆంటీ పుట్టిన రోజు. నీకు గుర్తుందో లేదోనని”

“ఓ అమ్మ పుట్టిన రోజా, ఇప్పుడు అర్జెంటు పనిలో ఉన్నాను. కాసేపయ్యాక ఫోన్ చేస్తాను”, అన్నాడు.

ఆంటీకి రింగ్ చేసి శుభాకాంక్షలు చెప్పాను.

“నీకు గుర్తుందా!!”, ఆంటీ గొంతులో ఆశ్చర్యం.

“నా మొబైల్ గుర్తుచేసింది. అందుకే మొబైల్ ద్వారా విషెస్ చెపుతున్నాను,” నవ్వేసాను.

“విష్ చేసావు. అంతే చాలు,” ఆంటీ గొంతులో ఆనందం.

“ఈ రోజు స్పెషల్స్ ఏమిటి? అంకుల్ మీరు గుడికి వెళ్ళారా?,” అడిగాను.

“స్పెషల్ ఏముంటుంది! మామూలే అన్ని రోజుల్లోలా”

“కొత్త చీర కొనుక్కోలేదా ఆంటీ?”

“నాకెందుకమ్మా ఇప్పుడు కొత్త చీర”

“అదేమిటి అలా అంటారు? అంకుల్ బర్త్ డే కి స్పెషల్ వండారు. గుడికి వెళ్లి అర్చన చేపించారు. పోనీ, లంచ్ కి మీరిద్దరూ హోటల్ కు వెళ్ళండి”

“మీ అంకుల్ కదలొద్దూ! వంట చేసేసాను, పప్పు దోసకాయ వండాను”

ఇంకో నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసాను.

ప్రాబ్లం లూప్ లో కాదు, ఒక పాయింటర్ అడ్రస్ మిస్ అయిందని తెలుసుకోగానే యురేకా అని అరవాలనిపించింది. అరవటం ఆపి ఆ పాయింటర్ దేన్ని అడ్రస్ చెయ్యాలో కనుక్కోమంది బుర్ర. ఆలోచనేమో ఆంటీ మాటల చుట్టూ తిరుగుతుంది. ఈ పాయింటర్ మొదట లోకల్ వేరియబుల్ ని రీడ్ చేసి ఆ తర్వాత ఔటర్ లూప్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఆడ్ చేసుకోవాలి. ఏ ప్రోగ్రామర్ రాసాడో ముందుగా ఈ ప్రోగ్రాంని! లోకల్ వేరియబుల్ని ఇగ్నోర్ చేసి గ్లోబల్ని లూప్లో infinite గా తిప్పాడు.

ఎండ్ యూసర్ టెస్టింగ్ లేకుండా ఎన్ని లూప్స్ మనపై రుద్దేసారో. కుటుంబం, సమాజం నడుమన బొంగరంలా తిరుగుతూ తమని తాము మర్చిపోతున్నారా? అలా మర్చిపోకపోతే స్వార్ధమనే ముద్ర వేసేయ్యటం. ముద్రల సంగతి దేవుడెరుగు, నేను మాత్రం అలా ఉండను. నావారికి నేను ఇచ్చే విలువలో నేనూ ఉండేలా చూసుకుంటాను. హమ్మయ్య ఈ బగ్ ఫిక్స్ అయింది. వేళ్ళను విరుచుకుంటూ సీటులో వెనక్కి వాలాను.

అమ్మ కూడా అంతే, తనని తాను పట్టించుకోదు. నాదేముంది, మీ ఇష్టం అనేస్తుంది ఏ మాటకైనా.

నాకా రోజు బాగా గుర్తు. నేను డిగ్రీలో ఉండగా జరిగింది. ఆరోజు అమ్మ పుట్టిన రోజు. నాన్నకు గుర్తు లేకపోవటం చాలా సాధారణమైన విషయం. అమ్మ పుట్టిన రోజని పాయసం వండటం, మేమందరం గుడికి వెళ్ళటం ఎప్పుడు జరగలేదు. నేను, తమ్ముడు విష్ చేసే వాళ్ళం.

నాన్నకు ఇష్టమైన పూర్ణాలు, నాకిష్టమైన కీమా రోల్స్, తమ్ముడి కోసం గులాబ్ జాం….మా పుట్టిన రోజున మాకు ఇష్టమైనవి తప్పకుండా వండేది అమ్మ. అమ్మకి ఇష్టమైన వంటకం ఏంటో మాకు తెలీదు. తనకు ఇష్టమని పలానాది వండుకుని తిన్నది ఏనాడు లేదు.

నేను, తమ్ముడు ఆరోజు అమ్మను surprise చేద్దామనుకున్నాం. కాలేజీ అయ్యాక నేను బేకరీకి వెళ్లి కేక్ కొన్నాను, తమ్ముడు గ్రీటింగ్ కార్డు కొన్నాడు. నాన్నను డబ్బులు అడిగితే ఏమనేవారో తెలీదు కానీ మేము దాచుకున్న పాకెట్ మనీ సరిపోయింది.

మేమిద్దరం ఇంటికి వెళ్లేసరికి యధావిధిగా అమ్మ నలిగిపోయిన కాటన్ చీరలో ఉంది. మేము వచ్చేసరికి ఎదో ఒక స్నాక్ వండటం అమ్మకు అలవాటు. పకోడీలు చేస్తోంది. వంటింట్లోకి వెళ్లి పొయ్యి కట్టేసి చీర మార్చుకోమన్నాను. అమ్మ వింటే కదా!

నాన్న రాగానే కేక్ బయటకు తీసాం. అదిగో ఆ క్షణం అమ్మ కళ్ళలో తళుక్కున మెరిసిన మెరుపు నేను జీవితంలో మర్చిపోలేను. తమ్ముడు ఫోటోలు తీసాడు. కంటితో మేము చూడలేకపోయిన అమ్మ కళ్ళలో దాక్కున్న చిన్నపాటి చెమ్మ ఆ ఫోటోలలో మాకు కనిపించింది.

ఆ రాత్రి అమ్మ మా గదిలోనికి వచ్చి నన్ను, తమ్ముడ్ని దగ్గరకు తీసుకుని….ఉదయం మీరెవరూ విష్ చెయ్యకపోయేసరికి, నా పిల్లలు కూడా మర్చిపోయారే అనుకున్నాను. కొంచెం బాధేసిందమ్మా అంది. మా నుదిటిపై ముద్దిచ్చి వెళ్ళింది.

జ్ఞాపకాలలో నుంచీ బయటపడి, బగ్ ఫిక్స్ అయిందని మెయిల్ చేసి సునీల్ కి మళ్ళీ కాల్ చేసాను.

“ఈవెనింగ్ తొందరగా రా. మీ ఇంటికి వెళ్దాం,” అన్నాను.

“ఆర్ యు క్రేజీ? మాధాపూర్ నుంచీ అమీర్పేట్ కు వర్కింగ్ డే ట్రాఫిక్లో వెళ్తావా? వీక్ ఎండ్లో వెళ్దాం,” అన్నాడు.

“అడగట్లేదు బాస్, వెళ్దామని చెపుతున్నాను. ఈరోజు మీ అమ్మ బర్త్ డే”, అన్నాను.

మొన్న ఊరెల్లినప్పటి కోపం నాకూ ఉంది. పెళ్ళవగానే పెళ్ళాం జీ హుజూర్ అనుకుంటూ మొగుడేనక ఉంటారనుకుంటారో ఏమిటో?!

తొందరగా వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్లాను. ఆంటీకి ఏదన్నా గిఫ్ట్ కొనాలి. ఏం కొనాలో తెలియట్లేదు. కళానికేతన్ లో వెంకటగిరి, గద్వాల్ చీరలు చూసాను. నాకు పెద్దవారి చీరల గురించి అంతగా తెలీదు. వంగపండు రంగుకి సన్నటి జరీ బోర్డర్ పుట్టాడ పట్టు చీర బాగుందనిపించింది. సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. కానీ తృప్తిగా లేదు. వాచెస్, హ్యాండ్ బాగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసాను. బంగారం, బట్టలు ఇవి కాదు, ఇంకా ఎదో కావాలి. ఆంటీ అభిరుచికి నచ్చే గిఫ్ట్ కావాలి.

ఆంటీకి పాత సినిమాలంటే ఇష్టం. అంకుల్ చేతిలో రిమోట్ లేకపోతే పాత సినిమా వస్తుందేమోనని అన్ని చానెల్స్ మారుస్తారు. మ్యూజిక్ వరల్డ్ లో పాత సినిమా సిడిల ప్యాక్ కొన్నాను. సిడి పెట్టుకుని ఆంటీ ఒక్కరే చూసేలా portable సిడి ప్లేయర్ కూడా తీసుకున్నాను. రెండూ అందంగా గిఫ్ట్ వ్రాప్ చేపించి సునీల్ కి కాల్ చేసి నన్ను మాల్ దగ్గర పిక్ చేసుకోమని చెప్పాను.

“ఏంటి విశేషం, అత్తగారిని కాకాపడుతున్నావ్,” కళ్ళేగరేసాడు.

“హలో మిస్టర్ పతి దేవ్…..గ్రో అప్…..గ్రో అప్…..గ్రో అప్ లైక్ అ రేమాండ్ కంప్లీట్ మాన్,” నేనూ కళ్ళేగరేసాను.

ఓ క్షణం అర్థం కాలేదు తనకి. అర్థం అయ్యాక నవ్వాలో లేక నా వైపు కోపంగా చూడాలో అర్థం కానట్టు పెట్టాడు మొహం. నా పెదవులపై సన్నటి నవ్వు అతని చూపుని దాటిపోలేదు.

“మొన్న ఊర్లో పెద్ద ఫోసులు కొట్టావ్,” కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.

“నేనేం ఫోసులు కొట్టలేదు. నాకు ఇష్టం లేని పని నేను చెయ్యలేదు..అంతే,” నేనూ స్థిరంగా చెప్పాను.

“పెద్దవారిని గౌరవించాలని నేర్చుకోలేదా”

“గౌరవించాలని నేర్చుకున్నాను. పెద్ద చిన్న అని కాదు మంచి వారిని గౌరవించాలని గ్రహించుకున్నాను. అయినా నాకు అర్థంకాదు, నీతో పెళ్ళవగానే నీ వాళ్ళందరూ నాకు నచ్చెయ్యాలని, అందరికీ నేను విధేయురాలినై ఉండాలని ఎలా అనుకున్నావ్? అయినా ఇప్పుడేంటి వాదన? ”

కారు ట్రాఫిక్ లో స్లో గా వెళ్తుంది.

“నాకు మీ పెద్దమ్మ నచ్చలేదు. కూపీలు లాగినట్టు ఆవిడ అడిగే ప్రశ్నలు, నిలువునా చీల్చుతున్నట్టు చూసే చూపులు, కోడలిపై మాటమాటకి ఫిర్యాదులు, కూతుర్నేమో ఆకాశానికి ఎత్తడాలు, కూతురి అత్తగారిని తిట్టటం……పైగా నాకు నీతి బోధలు. సంవత్సరం క్రితం జరిగిన మన పెళ్ళిలో మీకు మర్యాదలు సరిగ్గా జరగలేదంట. ఇవన్నీ ఒకెత్తు, ఆ మామగారిని ఎలా విసుక్కుంటుందో చూసావా? ముసలావిడ, అత్తగారు అని కూడా లేకుండా”

“ఏదోలే పెద్దాళ్ళ చాదస్తం”

“ఏదోలే మాఆవిడకు ఇష్టం లేదు అని ఎందుకు అనుకోలేవ్? పెద్ద కామిడి ఏమిటంటే, నువ్వు బాగుండాలని నేను వ్రతాలు పూజలు చెయ్యాలంట. నేను బాగుంటే ఆటోమేటిగ్గా మీ అబ్బాయి బాగుంటాడులే అన్నాను, అబ్బో ఆవిడకు ఎంత కోపం వచ్చిందనుకున్నావ్,” నాకు నవ్వొచ్చింది.

“పెద్దమ్మ నీకు బొట్టు పెట్టి, జాకిట్టు ముక్క పెడుతున్నప్పుడు నువ్వు ఆవిడ కాళ్ళకు దణ్ణం పెడతావనుకుంది. కనీసం వచ్చేటప్పుడైనా ఆవిడ కాళ్ళకు దణ్ణం పెడితే నీకేం పోతుంది”

“ఇది మరీ బాగుంది. నువ్వు మా చుట్టాలింటికి వచ్చినప్పుడేమో నీకు సకల మర్యాదలా! అయినా నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను. ఇంక ఈ వాదన ఇక్కడితో ఆపేయ్”

సునీల్ పెదాలు ఎదో పదాన్ని ఉచ్చరించాయి. నాకు వినిపించకపోయినా అదేమిటో నాకు తెలుసు..పొగరు అంటాడు. అనుకోనీ. అతను నన్ను అర్థం చేసుకోవాల్సిందే.

మొన్నీ మధ్య కూడా ఇంతే, నేను ఆంటీకి ఎదురు చెప్పాను అంటాడు. నేను నా అభిప్రాయం చెప్పాను, అది ఎదురు చెప్పటం కాదంటే వినిపించుకోడే! నా అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పటం అంటీకి కూడా నచ్చలేదని నాకు తెలుసు. ఆ మూస పాత్రల్లో నుంచీ, దోరణల్లోనుంచీ బయట పడదామని కూడా అనుకోరు. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరయినట్టు ఉంటుంది.

మొదట్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా సునీల్ పై కోపం వచ్చేసేది. ఆ తర్వాత ఆలోచించుకుంటే, ఇందులో తప్పంతా సునీల్ ది కాదనిపించింది. అత్త కోడల్ల సంభందం ఎన్ని వంకరలు తిరిగిందో చుట్టూ చూస్తూనే ఉన్నాను. భార్యంటే ఇలాగే ఉండి తీరాలనే అంచనాలు, భ్రమలు మరెన్నోమనలో. చిన్నప్పటి నుంచీ మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న సమాజం, పరిస్తితులు మనల్ని ముద్రల్లా తయారు చేసేస్తాయి. ఇప్పుడు కోపం పోయి నా కర్తవ్యం తెలిసింది.  విమర్శిస్తూ కూర్చోవటం వళ్ళన ఉపయోగం లేదు, అర్థం చేసుకునే అవసరం, ఎదిగే అవకాసం ఇవ్వాలి నేను.

సన్నగా చినుకులు మొదలయ్యాయి. కారు అద్దాలపై పడిన చినుకులు గాలికి పైపైకి వెళ్ళటం చూడటం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆశికి పాటలు ఆన్ చేసాను. తుంబి హో, అబ్ తుంబి హో, జిందగీ అబ్ తుంబి హో పాట కారంతా పరుచుకుంది.

మమ్ముల్ని చూడగానే ఆశ్చర్యం, ఆనందంతో విచ్చుకున్న ఆంటీ మొహం చూస్తుంటే అనిపించింది — మన అమ్మలకు వాళ్లకు వాళ్ళు ప్రాముఖ్యం ఇచ్చుకోవటం తెలీదు. ఇంట్లో అందరికీ అన్నీ సమకూరుస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చేసుకోరు. మనం కూడా అమ్మను taken for granted గా తీసుకుంటాం. అలా ఉండటం అమ్మలకు ఆనందాన్ని ఇస్తుందా? ఏ మాత్రం గుర్తింపు కోరుకోని మనుష్యులు నిజంగా ఉంటారా?

ఆఫీసులో ఆన్యువల్ రివ్యూస్ అప్పుడు జరిగే రభస గుర్తొచ్చింది. ఇక్కడ నచ్చకపోతే ఇంకో కొలువనుకుని వెళ్ళిపోయే పనిలో సరైన గుర్తింపు రాకపోతేనే తెగ బాధ పడిపోతామే, జీవితమే కుటుంబం అనుకుని బతికే అమ్మకు కొద్దిపాటి గుర్తిపును కూడా ఇవ్వకపోవటం ఎంత దారుణం. ఏమన్నా అంటే, త్యాగాల్లాంటి ఒట్టి మాటలు, బరువైన మూటలు నెత్తిన పెట్టేస్తారు. ఆ బరువులో కాస్త భాగం మీరు మోయ్యండి అంటే ఆడవారికి మాత్రమే వర్తించే నీతులు సూక్తులు వల్లెవేస్తారు. బాబోయ్……. హిపోక్రసీ!

నాకెందుకమ్మా ఇవన్నీ అంటూ మొహమాట పడుతూనే కేకు కట్ చేసారు ఆంటీ. హ్యాపీ బర్త్ డే టు యు….క్లాప్స్ కొడుతూ పాటను నేను మొదలుపెట్టాను – సునీల్, అంకుల్ అందుకున్నారు. ఆంటీ సిగ్గుపడ్డారు. చిటికెలో వంట చేసేస్తానన్నారు. ఈ రోజు మీరు సెలెబ్రిటి, పనేం చెయ్యకూడదు అంటూ ఫుడ్ ఆర్డర్ చేశాం.

“ఆంటీ కోసం కొన్నాను. నువ్వు ఇవ్వు“, గిఫ్ట్ ప్యాకెట్ సునీల్ కు అందించాను.

“ఏంటిది?,” అడిగాడు.

“ఆంటీ అభురుచికి నచ్చే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. I am sure she will love it.”

“ఓహ్!”, సునీల్ ఆశ్చర్యార్ధకం.

“మై డియర్ అబ్బాయ్,మన వారిని ప్రేమించటం, గౌరవించటం, గుర్తించటం అంటే ఇది. కాళ్ళకు దణ్ణాలు పెట్టడం కాదు. ఈ సారి నీ బర్త్ డే కి రేమండ్ సూట్ కొనిస్తాలే”, కళ్ళేగరేస్తూ నవ్వేసాను.

“ఈ రేమండ్ మాన్ ఎక్కడ తగులుకున్నాడు, నా ప్రాణం తీస్తున్నావ్”, సునీల్ హాయిగా నవ్వేసాడు.

సునీల్ గిఫ్ట్ ప్యాక్ ఆంటీకి ఇస్తుంటే ఆవిడ కళ్ళలో మెరుపు. కొన్నేళ్ళ క్రితం అమ్మ కళ్ళలో చూసిన అదే మెరుపు. ఆ మెరుపు సునీల్ హృదయాన్నిసూటిగా తాకింది. నన్ను,ఆంటీని కౌగలించుకుంటూ గర్వంగా, కృతజ్ఞతగా నవ్వాడు.

అంకుల్ మోములో దోబూచులాడిన గుర్తింపు ఆ సాయంత్రానికే నిండుదనాన్ని తెచ్చింది.

“మన విలువను తెలియచెప్పటం కూడా మన బాధ్యతే ఆంటీ”, వెళ్తూ వెళ్తూ చిన్నగా అన్నాను. ఓ వాన చినుకు ఆంటీ కళ్ళలో కురిసి హరివిల్లై మెరిసింది.

ప్రచురణ : http://magazine.saarangabooks.com/2014/07/23/%E0%B0%86-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/

Posted in కధలు | 2 Comments

స్విస్ మంచు పర్వతాల సొగసులు


స్విస్  మంచు పర్వతాల సొగసులు

మంచు కొండలను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆరాటం ఆ రోజు మాకు. తెల్లటి మల్లెలు జల్లినట్టు ఉంటుందేమో! చలి ఎక్కువగా ఉంటుందేమో! ఆ మంచు రుచి ఎలా ఉంటుందో? రకరకాల ఊహలతో మౌంట్ టిట్లిస్ బయల్దేరాం.

కేబుల్ కార్ నిదానంగా….

DSC_0092

ఈ చెట్లపై నుంచీ…

DSC_0070

ఈ పర్వతాల పై నుంచీ….

DSC_0079

మేఘాలలో విహరిస్తూ

ఇక్కడకు చేరాం.

DSC_0147

కొండపై తెల్లగా పరుచుకున్న మంచు, ఆకాశంలో మెరుస్తున్న సూర్యుడు

DSC_0210

మబ్బులు, మంచు పోటీ పడుతుంటే మనుష్యలు చిన్న పిల్లల్లా ఆనందపడి పోతునట్టు  లేదూ!

DSC_0203

మరొకొన్ని అందాలు

ఈ కేబుల్ కారు ఎక్కేసి,

DSC_0155

తిరుగు ప్రయాణంలో మరోసారి కొండలను, ఇళ్ళను చూస్తూ కిందకు వచ్చేసాం.

ఆ రోజు సాయంత్రం లుసుర్న్ సిటీలో గడిపాం. చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ చేసి, లేక్ దగ్గర చాలా సేపు కూర్చున్నాం. స్వాన్స్ కి, పావురాలకు బిస్కట్స్ పెట్టం పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.

DSC_0312 DSC_0324 DSC_0396 DSC_0397

స్వాన్స్ కి ఫీడ్ చెయ్యటం కోసం చాలా బిస్కట్స్ కొనుక్కుని మళ్ళి వద్దాం స్విస్ అన్నారు 🙂

దగ్గరలో ఉన్న చర్చికి వెళ్లి ఆ రోడ్లలో తిరిగాం.

DSC_0379 DSC_0389

 

ఇంకో టపా ఉందండోయ్…అదే ఆఖరుది, ఇంక ఆపేస్తా 🙂

Posted in Uncategorized | Leave a comment

స్విస్ స్వర్గం


స్విస్ స్వర్గం

మూడు రోజుల పారిస్ నగర విహారం ముగించుకుని నాలుగో రోజు ఉదయం సుమారు తొమ్మిది గంటలకు బస్సులో Switzerland బయల్దేరాం. స్విస్ చేరేసరికి సాయంత్రం అవుతుందని నేను కెమెరా, ఐపాడ్, నా అమరావతి కధల పుస్తకం అందుబాటులో పెట్టుకున్నాను.

కంట్రీ సైడ్ డ్రైవ్ ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తుంది మనల్ని. బంగారు వర్ణాన్ని పరిచినట్టు గోధుమ చేలు,

DSC_0178

కనుచూపు మేరా పరుచున్న పచ్చటి పొలాలు,

DSC_0063

బొమ్మరిల్లుల్లాంటి ఇళ్లులు,

DSC_0005  రకరాకాల నృత్యాలు చేస్తున్నట్టు గుమికూడిన మేఘాలు

కనులకు, మనసుకు మహా పండుగే.

మరికొన్ని పచ్చదనాలు

రాత్రి సుమారు ఏడు గంటలకు చేరాం. ఫార్మ్ హౌస్ కి తీసుకెళ్ళారు. డే లాంగ్ జర్నీ అలసట, ఆకలి, నిద్ర అన్ని అలా ఎగిరిపోయాయి ఆ farm హౌస్ చూడగానే. పారిస్ ఎంత బాగున్నా, it’s a city at the end. ప్రకృతిలోని అందం ఏ నగరానికి రానే రాదు.

ఓ పర్వతం పైన చిన్న ఇల్లు అది. చుట్టూ పర్వతపు అంచులు, పచ్చటి పొలాలు, మేఘాల మధ్య నుంచీ వెళ్ళనా వద్దా అంటున్న సూర్యుడు…ఓహ్ ఎన్నని చెప్పను. ఈ అందాలతో పాటు కోళ్ళు, రెండు నెమలులు, కుందేళ్ళు, గుర్రాలు, ఆవులు. నావరకు నాకు ట్రిప్ ఇస్ సుస్సేఫుల్ అనిపించేసింది ఆ ప్లేస్ చూడగానే. ఎగిరి గంతెయ్యాల్లన్నంత ఆనందం. అక్కడ చెట్టుకు కట్టిన ఉయ్యాలను చూడగానే చిన్నపిల్లనయిపోయాను నేను.

DSC_0196

ఆ ఇంటి ఆవరణలో రెండు పడక్కుర్చీలు. నా చేతికో పుస్తకం, పక్కనేమో బఠానీలు, మరమరాలు, కుదిరితే వేడి వేడి పకోడీలు, పొగలు కక్కే కాఫీ  ఉంటేనా…. ఆహా నాకీ స్వర్గం చాలు 🙂

DSC_0210

జస్ట్ ఇమాజిన్, ఆ కుర్చీలో కులాసాగా కూర్చుని విలాసంగా ఈ దృశ్యాలు చూడటం

అక్కడున్న ఏవేవో పరికరాలు

ఒక పక్కన నును వెచ్చటి ఎండ, మరో వైపు నుంచీ కమ్ముకొస్తున్న మేఘాలు…ఇదంతా రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యన.

DSC_0248

అదిగో విమానం కనిపించిందా?చిన్నప్పుడు విమానం మోత వినిపిస్తే గబా గబా బయటకు వచ్చి మెడ ఇంత పొడుగునా జాపుకుని చూసేవాళ్ళం కదూ!

DSC_0250

బంగారపు సిరులు

DSC_0257

నిజంగా దేవుడు స్వర్గాన్ని సృష్టించి మనకిచ్చాడు.

మగవాళ్ళందరూ ఏవో కబుర్లలో పడ్డారు, ఏముంటుంది ఫుట్ బాల్ గెలుపోటములు తీవ్రాతి తీవ్రంగా చర్చిచేసుకున్నారు. పిల్లలకు అక్కడో ఫుట్ బాల్  దొరికింది, వాళ్ళు ఆటల్లో పడ్డారు.  నేను ఎడా పెడా ఫోటోలు తీసేస్తుంటే, బాబిత అనే ఆవిడ వచ్చి అలా వాక్ కి  వెల్లోద్దామా అని అడిగారు. నేనెక్కడ ఉద్యోగం చేస్తున్నానో, ఆవిడ ఎందుకు జాబు మానేసారో  ఒకరి గురించి ఒకరం చెప్పుకుంటూ ఈ దారిలో నడిచాం.

DSC_0260

బబితకు ఫార్మ్ హౌస్ లో నెమలీక దొరికింది, అలా దొరకటం అదృష్టం అంటూ నాకు చూపించింది. చిన్నప్పుడు నోటు పుస్తకాలో దాచుకునేవాళ్ళమే — వాటికి  చెక్కిన పెన్సిల్ పొట్టు, రబ్బరు  మేతగా కూడా వేసేవాళ్ళం, అవి తలుచుకుంటూ నవ్వుకుంటూ నడిచాం. అప్పుడే సూరీడు అస్తమిస్తూ ఉన్నాడు. “నాకో ఐడియా, మీరు నెమలీకను సూర్య కాంతి పడేలా పట్టుకోండి, నేనో ఫోటో తోసుకుంటా”, అన్నాను.

DSC_0271

ఈ ఫోటో చూపించాను. హే భలే ఉందే, ఈసారి మీరు పట్టుకోండి నేనూ ఫోటో తీసుకుంటాను అని తన మొబైల్ లో ఆవిడ క్లిక్ క్లిక్ మనిపించారు.

ఆ పక్కనే ఉన్న ఇళ్ళు.

DSC_0269

ఎంత అందంగా ఉన్నాయి  కదూ ఈ పరిసరాలు. బబిత కూడా నాలాంటిదే. sorry guys, we are peeping into your privacy అంటూ వారి ఆవరణలోకి తొంగి తొంగి చూసాం. పిల్లలు  ఆడుకోవటానికి వాళ్ళు ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి. ఇంతలో ఆ ఇంట్లో నుంచీ ఒకాయన బయటకు వచ్చారు. స్నేహపూర్వకంగా నవ్వారు. ఆయనకు ఇంగ్లీష్ రాదు. మేము పదాలు పదాలు మాట్లాడుతూ మీ ఇళ్ళు, ఈ పరిసరాలు, వాతావరణం చాలా బాగున్నాయి అని చెప్పాం. ఆయన థాంక్స్ థాంక్స్ అన్నారు.

DSC_0286మరో ఇళ్ళు. ఈ ఇంటి ముందు నుంచొని , అదేదో మా ఇల్లే అన్నట్టు ఫోసులు పెడుతూ తెగ ఫోటోలు దిగాం. ఈ వాక్ గుర్తొచ్చినప్పుడల్లా నీకు నేను, నాకు నువ్వు గుర్తోస్తాం అంది బాబిత. ఇంతలో ఇంటాయనలు ఎదురొచ్చారు.

DSC_0263

 

DSC_0310

ఈ పెత్తనాలన్నీ చేసి మేము తిరిగి వెళ్లేసరికి అందరు దాదపుగా భోజనాలు చేసేసారు. అక్కడ నుంచీ వెళ్ళటానికి బస్సు కూడా సిద్దంగా ఉంది. మేము  కూరకపోతే మా బుడంకాయలు తింటారా! హమ్మయ్య అమ్మ లేదు అనుకుంటూ ఎంచక్కా ఆడేసుకుంటున్నారు. గబా గబా కాస్త తిన్నామనిపించి బయలుదేరాం.

టూర్ మేనేజర్ కు హృదయపూర్వక కృతఙ్ఞతలు చెప్పి బస్సేక్కాం. వెళ్ళే ముందు రంగు రంగుల ఆకాశాన్ని తృప్తిగా జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నా.

DSC_0303

I wish I could stay there for some more time. ఎంత సేపున్నా తనివి తీరదు. కెనడా లాంటి దేశాలకు  ఇమ్మిగ్రేషన్ అప్లై చేస్తున్నప్పుడు, చదువుకు ఇన్ని, profession కి ఇన్ని పాయింట్స్ అని ఉంటుందే, అలాగే దేవుడు కూడా మనుష్యులను పుట్టించేటప్పుడు ఎక్కువ పాయింట్స్ వచ్చిన వారిని స్విస్ లాంటి ప్రకృతి అందాల దేశాలలో పుట్టిస్తాడు కాబోలు!

మిగతా స్విస్ విశేషాలు మరో టపాలో……

Posted in Photography, Uncategorized | 12 Comments

పారిస్ ట్రిప్


పారిస్ ట్రిప్

ప్రపంచపు అందాలను చూడాలి.  రకరకాల మనుష్యులను, వారి వారి ఆచారాలను, వ్యవహారాలను, వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవాలి. కోరికల లిస్టుదేముంది, చాంతాడంత ఉంటుంది. ఇలాంటి కోరికలు తీరాలంటే డబ్బు, టైం, అవకాశం చాలా కలిసి రావాలి.

చాన్నాళ్ళ నుంచీ ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దానుకుంటున్నాం. పిల్లలు ఈ వయసులో జంతువులను ఇష్టపడతారని మొదట కెన్యా  అనుకున్నాం. మేము కాంటాక్ట్ చేసిన ట్రావెల్ ఏజెంట్ లేడీ. బహుశా ఆవిడకు కూడా మా పిడుగుల్లాంటి పిల్లకాయలు ఉండిఉంటారు. వాళ్లనేసుకుని ఆవిడ కెన్యాకు వెళితే వాళ్ళు అక్కడ చుక్కలు కాకుండా టోటల్ గలాక్షి చూపించేసారేమో! పదేళ్ళ లోపు పిల్లలతో కష్టం అనేలా మాట్లాడింది. అలా ఆ ప్లాన్ డ్రాప్ అయింది. ఆ తర్వాత శ్రీలంక అన్నాను, అది కూడా కుదరలేదు.

పిల్లలు అన్నం సరిగ్గా తినలేదు, వాళ్లకు నిద్ర సరిపోలేదు లాంటి సీన్స్ నువ్వు చెయ్యను అంటే పారిస్, స్విస్ వెళ్దామననే ప్రపోసల్ వస్తే, నేను ఇప్పుడు కొంచెం ఎదిగానులే అంటూ ఫైనలైజ్ చేసేసాం.

స్నో జాకెట్స్, బూట్స్, గ్లోవ్స్ వగైరాలు షాపింగ్ చేసి, బియ్యం, పప్పు, ఎలేక్టిక్ కుక్కర్ (టిపికల్ ఇండియన్ మదర్ 🙂 ) సర్దుకుని బయలుదేరాం. రెండు టింకిల్ బుక్స్, నాకోసం అమరావతి కధల పుస్తకం హ్యాండ్ బాగ్యేజ్ లో సర్దేసా.

అన్నిటికన్నా ముఖ్యమైన నా కెమెరా బాగ్ ఎవరికీ ఇవ్వకుండా నేనే అతి భద్రంగా పట్టుకున్నా.

KLM లో రాత్రంతా ప్రయాణించి ఆమ్స్టర్డామ్ ఎయిర్ పోర్ట్ లో మరో ఫ్లైట్ మారి పారిస్ చేరాం. ఫ్లైట్ లో ఎందుకైనా మంచిదని రెండు వెజ్ చెపితే వాడు ఉడకబెట్టిన పాలకూర పెట్టాడు. మావాడు KLM వేస్ట్, ఎమిరేట్స్ బెస్ట్ అనేసాడు. ఎమిరేట్స్ లో  చీస్ దట్టించిన కిడ్స్ మీల్ ఉంటుందిగా.

ఆమ్స్టర్డామ్ లో వెయిటింగ్ అప్పుడు తీసిన ఫోటో.

DSC_0006

పారిస్ లో ల్యాండ్ అయ్యేటప్పుడు,

DSC_0028 పారిస్ ఎయిర్ పోర్ట్ లో మా టూర్ మేనేజర్ మమ్ముల్ని రిసీవ్ చేసుకున్నాడు. హోటల్కి వెళ్లి లంచ్ చేసి గబాగబా రెడీ అయి బయట పడ్డాం.  మొదట ఈఫిల్ టవర్ వెళ్ళాం. దర్జాగా ఇంతెత్తున నుంచున్న టవర్ పై నుంచీ సిటీ అందాలు….

ఆ తర్వాత Seine రివర్ క్రూజ్. చరిత్రను భద్రపరుచుకోవటం పారిస్ దగ్గర నుంచే నేర్చుకోవాలి.సీన్ నది చుట్టూ శతాబ్దాల నాటి భవనాల అందం ఒకెత్తయితే, ఎవరి ప్రపంచంలో వారు విహరిస్తున్న మనుష్యలు ఒకెత్తు.

People seems to be happy in their own world. Friends chatting, couple romancing, book readers, walkers…what not!  I loved to see these scenes.

ఆ క్రూజ్ అయ్యేసరికి రాత్రయిపోయింది. అయినా ఎండ మండిపోతూ ఉంది. సూర్యాస్తమయం రాత్రి తొమ్మిది, పది గంటలకు కానీ అవ్వదు. అప్పటికే నిద్ర లేకపోవటం, సరైన తిండి లేక ఒంట్లో ఓపిక పూర్తిగా అయిపోయింది నాకు.

అదృష్టమేమిటంటే, మంచి ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్లారు ఆ పూట. డిన్నర్ అయ్యాక లోకల్ గైడ్ మాతో జాయిన్ అయి సిటీ టూర్ వేల్దామంది. బస్సు సిటీలో తిప్పుతూ ఏ బిల్డింగ్ ఏ సెంచురీలో కట్టారో, ఏ రాజు గారు కట్టించారో అనర్గళంగా చెప్పేస్తుంది. మొదట్లో కాస్త ఓపిక తెచ్చుకుని శ్రద్ధగా వినాలని  ప్రయత్నించాను.  నన్నోదిలేస్తే వెళ్లి నిద్రపోతా అన్నట్టుంది నా పరిస్తితి.  హెన్రీ  అదేదో నెంబర్, నెపోలియన్ మల్లి ఇంకో నెంబర్, ఫ్రెంచ్ రేవల్యుషన్ పదాలు సగం నిద్రలో పదే పదే వినిపించాయి.

అక్కడ నాకు నచ్చిన విషయం ఈ సైకిల్స్. ప్రతీ లేన్ లోను ఇలాంటి స్టాండ్స్ ఉన్నాయి. కార్డుతో డబ్బులు పే చేసి, దగ్గరలోని పనులన్నీ అవచేసుకుని మళ్ళి సైకిల్ అక్కడ పెట్టేయ్యొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సైకల్స్ చూడటం భలే బాగుంది.

DSC_0066

ఇప్పుడు టైం ఎలాగూ రాత్రి 12 అయింది, సూర్యడు అస్తమించాడు, ఇంకొంచెం సేపట్లో ఈఫిల్ టవర్ ఇల్లుమినేషన్ ఉంటుంది, అది చూసుకుని వెళ్దాం అన్నారు. ఇంతలో బస్సు డ్రైవర్ టైం అయిపొయింది అనేసాడు. అక్కడ డ్రైవర్ సీట్ కింద టైం, స్పీడ్ ట్రాకర్ ఉంటుందంట. రోజుకి నిర్దేశించిన గంటల కంటే ఎక్కువ డ్రైవ్ చెయ్యకుడదంట.  భలే ఉంది కదూ, మన దగ్గర అలా ఉంటే బాగుండు.

We had a glance of Eiffel tower illumination.

DSC_0311

నెక్స్ట్ డే డిస్నీ ల్యాండ్…కిడ్స్ కుష్. డిస్నీ ల్యాండ్ చూడటానికి ఒక రోజు సరిపోదు. కనీసం రెండు రోజులన్నా ఉండాలి. పెద్దలు పిల్లలైపోయే ల్యాండ్ అది.

మూడో రోజు Lauvre మ్యూజియం వెళ్ళాం. ప్రపంచంలో మూడో అతి పెద్ద మ్యూజియం. తిండి నిద్ర లేకుండా ఒక్కొక్క మాస్టర్ పీస్ ను  మూడంటే మూడు సెకన్లు చూస్తూ వెళితే ఆ మొత్తం  మ్యూజియం చూడటానికి మూడు నెలలు పడుతుందంట. మా గైడ్ కొన్ని సెలెక్టెడ్ పెయింటింగ్స్ దగ్గరకు తీసుకువెళ్ళింది. Every painting tells many stories.

ఈ పెయింటింగ్ లో ముగ్గురు యోధులు యుద్ధానికి బయల్దేరుతున్నారు. ఆ ముగ్గురిలో ఒకరే తిరిగి వచ్చారు, ఎవరో చెప్పగలరా? కాస్త గమనించి చూడండి.

10532552_10202438802113320_4994045620714756544_n

కుడి చేతి వైపు, మొదటగా ఉన్న వ్యక్తీ మాత్రమే వీరుడిగా తిరిగొచ్చాడు. అతను తన కుడి కాలిని ముందుకు జాపాడు, మిగతా ఇద్దరూ తమ ఎడమ కాలిని ముందుకు పెట్టారు. ఎడమ కాలు మంచికి నిదర్శనం కాదంట వారి ఆచారంలో. అటు పక్కన స్త్రీలు దుఃఖిస్తూ ఉన్నారు. ఒకరి భర్త యుద్దానికి వెళ్ళేది తన అన్నపై, మరొకరి అన్న తన భర్త పై యుద్ధానికి వెళ్తున్నారు.

ఈ కింద పెయింటింగ్లోని స్త్రీ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యానికి పప్రతినిధి. తుపాకీ పట్టుకున్న యువకుడు ధనికులను రేప్రేసేంట్ చేస్తే, మరో వైపు కాళ్ళ వద్ద ఉన్న యువకుడు పేదలను రేప్రేసేంట్ చేస్తాడంట .

DSC_0477

ఈ పెయింటింగ్స్ చూస్తూ గైడ్ చెపుతున్నది వింటుంటే –అసలు మనిషి సుఖపడిందేప్పుడు? అనాదిగా యుద్ధాలతోను, కుట్రలతోను బతికేసాడు అనిపిస్తుంది.

oops…I forgot to include Mona Lisa! I am updating the post. మోనాలిసా….లియనార్డో డావిన్సి ఎంతో ప్రేమించిన చిత్రం, మరెన్నో conspiracies తనలో దాచుకున్న పెయింటింగ్. ఆ పెద్ద గదిలో మనల్ని ఆకట్టుకునే విషయాలు, ఒక వైపు గోడకు అతి పెద్ద పెయింటింగ్ ఉంటుంది, మరో వైపు గోడకు అతి చిన్న పెయింటింగ్ మోనాలిసా. ఇక్కడ ఇన్ని అధ్బుతమైన పెయింటింగ్స్  ఉండగా ఒక్క మోనాలిసానే ఎందుకు ఫేమస్ అయింది అనిపిస్తుంది. అదే అడిగాను గైడ్ ని, ఆ సమాధానం కోసమే నేనూ వెతుకుతున్నాను అని నవ్వేసింది.  డావిన్సి ఈ పెయింటింగ్ ను మొదట ఒక బ్యాంకర్ కోసం చిత్రిచాలనుకున్నాడంట. ఆ  బ్యాంకర్ చాలా కాలం ఎదురు చూసి విసుగొచ్చి వదిలేసాదంట.  డావిన్సి ఈ చిత్రాన్ని అమితంగా ప్రేమించాడంట, ఎల్లవేళలా తన సంచిలోనే పెట్టుకుని తిరిగేవాడంట. చివరకు ఫ్రెంచ్ కింగ్ కు బహుమతిగా ఇస్తే, ఆ కింగ్ దానిని ఫేమస్ చేసాడంట. మోనాలిస గురించి ఇంకెన్నో విశేషాలు, నవ్వుతుందని, కాదు కాదు కోపంగా ఉందని, కనుబొమ్మలు లేవని. మరో ఆసక్తి కరమైన విషయం, పళ్ళు కనిపించకుండా నవ్వటం  ఆ రోజుల్లో స్త్రీలపై ఉండే నియమాలల్లో ఒకటంట. అందుకే మోనాలిసా అలా నవ్వుతుందని.

మోనాలిసా కళ్ళు మనం వెళ్తున్న వైపు తిరుగుతూ మనల్నే చూస్తున్నట్టు  ఉంటాయంట. నిజానికి ఆ పెయింటింగ్  ఫేమస్  అవటానికి ఆ రోజుల్లో మొదటగా వాడిన ఆ టెక్నిక్ కారణం అంటారు కొందరు. అలా చూడటానికి ఛాన్స్ ఉంటే కదా. ఇదిగో ఇంత రష్, పక్క నుంచీ చూసేసి వచ్చేసాం.

నాకు ఈ మ్యూజియం చాలా నచ్చేసింది. పైగా మా గైడ్ ఒక్కొక్క పెయింటింగ్ వెనుక కధలను చెపుతుంటే ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ, మా పిల్లకాయలు మమ్ముల్ని పీకి పాకం పెట్టేసారు, సరిగ్గా వినను కూడా విననివ్వలేదు. ఈ బాబు, కొడుకులను డిస్నీ ల్యాండ్లో వదిలేసి నేనొక్కదాన్నే రావాల్సింది.

చర్చిలో కొన్ని ఫోటోలు

మన ఇండియా గేటులా వాళ్ళ పారిస్ గేటు

పారిస్ లో నచ్చిన విషయం…సిటీ అయినా కూడా పరుగులు, హడావుడి లేకపోవటం.

అంతే పారిస్ ట్రిప్ అయిపోయింది. మర్నాడు స్విస్ బయల్దేరాం.స్విస్ అంటే  స్వర్గామేనండి. నాకు సగం జీతం ఇచ్చినా పర్లేదు, అక్కడో ఉద్యోగం ఇస్తే ఎంచక్కా వెళ్ళిపోతాను. ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిలో భాగంలా జీవించటం అంటే స్విస్ ….ఆ విశేషాలు మరో టపాలో.

Posted in Photography, Uncategorized | 10 Comments

వింటాను


వింటాను

నువ్వు ఏవేవో చెపుతూ ఉంటావు
నీ మాటల ప్రవాహం సాగిన మేరా
నేను నిన్ను వింటున్నాననుకుంటావు.
నిజానికి నేను వినేది నీ మాటలను కాదు

ఓ సంభాషణ ముగించి
మరో సంఘటనకు మాటల రూపం ఇచ్చే వ్యవధిలో
నువ్వు పడే యాతన
ఓ సుదీర్ఘ నిశబ్దాన్ని నాకు వినిపిస్తుంది.

కన్నీరు అడ్డొచ్చి
వెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలో
నీ మౌనాన్ని వింటాను.

నీలో నువ్వు పడుతున్న సంఘర్షణను
వ్యక్తపరచలేని నీ మాటల లేమి నాకు వినిపిస్తుంది.

పదాల కోసం వెతుక్కునే నీ నిస్సహాయతను వింటాను
అక్షరాలలో ఒదగలేని నీ భావాలను నా కళ్ళతో చూస్తాను

మాట్లాడుతూ మాట్లాడుతూ
నువ్వు హటాత్తుగా ఆగిపోతావే
అప్పుడు
నీ నిట్టూర్పులు నా చెవులలో విస్పోటకాలవుతాయి….

 

Posted in కవితలు, కష్టం | 7 Comments

Shopping Mall -2


Shopping Mall -Part2

ఆ పర్షియన్ షాప్ అతనికి థాంక్స్ చెప్పి మళ్ళి దిక్కులు చూడటం మొదలుపెట్టా.

ఈ షాప్ లో కేవలం పిల్లోస్ మాత్రమే అమ్ముతారు. చాలా ఖరీదే, కానీ ఎంత కలర్ఫుల్ ఉన్నాయో చూసారా.

DSC_0578

పచ్చని ఆకు ఎక్కడున్నా అందమే.

ఆ తర్వాత హోం సెంటర్, వీళ్ళ decorative pieces చాలా బాగుంటాయి.

హోం సెంటర్ లో ఆర్టిఫిసియల్ ఫ్లవర్స్,