సినిమాలు – క్వీన్, ఫిరాక్, Mr and Mrs Iyer
దాదాపుగా ప్రతీ సంవత్సరం ఈ టైంలో బోల్డు ఖాళీ దొరకుతుంది. సమ్మర్ హాలిడేస్ మొదలవ్వక ముందే జాలీ ఫీల్ వచ్చేస్తుంది. ఈసారి సినిమాలు సంగతి చూద్దామనుకున్నాను. రీసెంట్ గా ఒకటి రెండు తెలుగు సినిమాలు చూసి కలిగిన విరక్తిలో నుంచీ బయటపడాలని హిందీ సినిమాల జోలికి వెళ్లాను. అలా ఈ వారం మూడు హిందీ సినిమాలు చూసాను.
క్వీన్ : ఈ మధ్య కాలంలో వచ్చిన చక్కటి సినిమా. మన సంతోషం, దుఖం పూర్తిగా మన అనుకున్న వారిపై ఆధారపడుందని అనుకుంటాం. ఎల్లవేళలా వారి వద్ద నుంచీ ప్రేమను, ఆప్యాయతను, మెప్పును ఆశిస్తాం. ఒకవేళ మన expectations కు భిన్నంగా జరిగితే, మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని తిరస్కరించి వెళ్ళిపోతే…జీవితం మూగబోయి, మన ప్రపంచమంతా విషాదంతో నిండిపోతే… అది ముమ్మాటికీ మనదే తప్పు. మన జీవితాన్ని మనం ప్రేమించుకోలేకపోవటం అత్యంత విషాదం. . కోల్పోయిన చోటే మళ్లి జీవితం మొదలవుతుంది, మొదలుపెట్టాల్సిందే మనం మాత్రమే. ప్రేమ, ద్రోహం, పెళ్లి, విడాకులు, సమాజం వీటన్నింటికంటే జీవితం గొప్పది అని చెప్పే మంచి సినిమా క్వీన్.
తన వెనకబడి, ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి ముందు రోజు నేను నిన్ను చేసుకోనని వెళ్ళిపోతే, ఆ నిరాశతో కొన్ని రోజుల క్రితం ఆశగా పొదుపుచేసుకున్న డబ్బుతో కొనుక్కున్న హనీమూన్ టికెట్లు పట్టుకుని తనొక్కతే పారిస్ బయల్దేరుతుంది కధానాయిక రాణి. ఆ ట్రిప్లోని ఆమె అనుభవాలు, ఆ అనుభవాలు ఆమెను ఎలా మారుస్తాయి అనేదే ఈ సినిమా.
మొదట్లో హోటల్ రూంలో నుంచీ కూడా బయటకు రాదు, దిగులుగా ఉంటుంది. మెల్ల మెల్లగా భయం భయంగా బయటకు వస్తూ కొత్త లోకాన్ని బెదురుగా చూస్తూ ఒక్కో అడుగు వేస్తుంది. వేస్తున్న ప్రతీ అడుగులోను తనలోని తెగువను, ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. తన ఆనందాన్ని తనలోనే వెతుక్కునే రాణి కధ. World scares you until you spread your wings. You will be surprised to see a world in you once you start flying.
ప్రపంచంలో కావల్సినంత మంచి ఉందని రాణికి ఎదురయిన వ్యక్తులు మనకు చెపుతూఉంటారు. It was such a good positive feel in every frame.
కొన్ని రోజుల క్రితం నువ్వు నాకు సరిపడవని వెళ్ళిపోయిన వ్యక్తిని బేలగా కన్నీళ్ళు నిండిన కళ్ళతో చూసిన రాణి, నువ్వు నాకు కావాలని తిరిగొచ్చిన అతని చేతికి వెడ్డింగ్ రింగ్ తిరిగిచ్చి, కౌగలించుకుని thank you అని చెప్పి విశ్వాసం నేర్చిన నడకతో వెళ్ళిపోతుంది.
రాణి ఇచ్చిన పాజిటివ్ ఫీల్ ఎంజాయ్ చేస్తూ, నెక్స్ట్ ఏం సినిమా చూడాలా అని నెట్ లో వెతుకుంటుంటే, Firaaq కంటపడింది.
Firaaq: హ్మ్….ఏమి చెప్పను! ప్రపంచంలో ఇంత విద్వేషం ఉందా, మనిషి మనిషి మధ్య ఇంత లోతైన అంతరాలున్నయా అని ఉలిక్కిపడేలా చేసే చిత్రం. చాన్నాళ్ళ క్రితం చూసిన ముంబై మేరే జాన్, షూట్ ఆన్ సైట్, ఆమీర్ సినిమాల అనుభవాన్నే ఫిరాక్ కూడా మిగిల్చింది.
కమ్యూనల్ రైట్స్ చేసిన గాయాలు కాలంతో పాటూ మానినా మనిషి లోపలున్న విద్వేషం ఎప్పటికీ చెరగని మచ్చలా ఉండిపోతుంది….చరిత్రలోను, ఆ దురదృష్టవంతుల జ్ఞాపకాలలోను.
ఈ సినిమా చూసిన తర్వాత చాలా సేపు ఆలోచనల్లో ఉండిపోతాం.
మనిషి మూలం ఏమిటి? ప్రేమా లేక ద్వేషమా? ప్రేమే అయ్యుండొచ్చు, లేకపోతే ఈ పాటికి సర్వనాశనమయిపోదే కాదూ ఈ భూమండలం! అదే నిజమైతే ఇంత hateredness ఎక్కడ నుంచీ వచ్చింది? బహుశా సమయం, సందర్బాన్ని బట్టి ప్రేమ ద్వేషం బయటపడుతుంటాయి కాబోలు. ద్వేషమనే ఎమోషన్ను పెంచి మనుష్యులను ముక్కలు ముక్కలుగా కత్తిరించటం మనుష్యులకే చాతనవును.
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్, దీప్తి నావల్ భర్తకు బయపడుతూ బితుకు బితుకుమనే ఓ మధ్య తరగతి ఇల్లాలు. కర్టెన్ జరుపుతున్నా, కిటికీ తలుపు తెరుస్తున్నా ఫ్లాష్ లా ఓ యువతి కనిపిస్తూ ఉంటుంది. బట్టలు చిరిగిపోయి, ఒళ్ళంతా దెబ్బలతో ఓ లోగ్ ముజే మార్ డాలేగా, ముజే బచావో అని దీనాతి దీనంగా తన గుమ్మంలో అర్ధిస్తూ ఉంటుంది. ఆ రాత్రికి షెల్టర్ ఇచ్చి ఆ యువతిని రక్షించలేకపోయిన తన నిస్సహాయత, అపరాధభావం యువతి రూపంలో పదే పదే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. తనని తాను శిక్షించుకోవటానికి, సలాసలా కాగిన నూనే చుక్కలను తన చేతిపై వేసుకుంటూ ఉంటుంది. మనల్ని వెంటాడే సన్నివేశం ఇది.
రోడ్డుపై కనిపించిన చిన్న బాబును ఇంటికి తీసుకొస్తుంది. ఆకలితో ఉన్న బాబుకు తినటానికి ఇస్తున్నప్పుడు, ఆవిడ చేతిపై ఉన్న బొబ్బలు, పుండులను చూస్తూ, ఆప్ కో భీ జలాదియా ఓ లోగ్, కాల్చివేయబడ్డ తన తల్లిని గుర్తు చేసుకుంటూ అంటాడు.
Mr and Mrs Iyer : మద్రాస్ వెళ్తున్న బస్సు హిందూ ముస్లింస్ గొడవల మూలాన ఒక ప్రాంతంలో ఆగిపోతుంది. కర్ఫ్యూ కారణాన ప్రయాణికులు కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్తితి. బిడ్డతో ప్రయాణం చేస్తున్న తమిళ్ బ్రహ్మిన్ స్త్రీ, బెంగాలీ ముస్లిమ్ రాజు ఒకరికి ఒకరు సాయంగా ఎలా బయటపడతారనే కధ. అదే భావన, ఒకరిని ఒకరు చంపుకునే ద్వేషం, ఒకరిని ఒకరు రక్షించుకునే సాయం.
సినిమా చూస్తే ఎదో ఒక ఫీల్ ఉండాలి. కామెడీ అయితే నవ్వుకున్నాం అనో, సీరియస్ మూవీ అయితే ఆలోచన కలిగించిందనో ..కనీసం ఎదో ఒక భావన మనలో కలగాలి. ఈమధ్య వస్తున్న ఎక్కువ సినిమాలు అసలు ఎందుకు తీస్తున్నారో , మనమెందుకు చూస్తున్నామో, అర్థంపర్థం లేకుండా ఏం తీసినా మనం చూసేస్తామని తీస్తున్నారో, మనం చూస్తన్నామని వాళ్ళలా తీస్తున్నారో..ఏమిటో అంతా అయోమయం, తెలుగువైతే మరీనూ!