ఇంటికెళ్ళి వచ్చాక….


ఇంటికెళ్ళి వచ్చాక….


రాత్రంతా వర్షం కురిసి
ఇప్పుడే వెలిసినట్టుంది
తడిసిన గుమ్మం
చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి.
సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ
ఆ ఆవరణంతా ప్రేమమయమే!
“బాగున్నావా తల్లి?”, “అలా చిక్కిపోయావే?”
ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే!

నాన్న పడక్కుర్చీ
అమ్మ గాజుల మోత
వంటింట్లో తాలింపు వాసన
వరండాలో బంధువుల సందడి
అబ్బ…ఎప్పటికీ ఇవి ఇలాగే
నేను ఇక్కడే ఉండగలిగితే ఎంత బాగుండు!

కలవాలనుకున్నా కలవలేకపోయిన స్నేహితులు
ఎవరి జీవితాలలో వారు బిజీ అని సాక్ష్యం చెపుతూ
మరో సంవత్సరానికి వాయిదా పడ్డాయి!
కొత్తగా కలిసిన నేస్తాలు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపాయి.

చాన్నాళ్ళకు కలిసిన తోబుట్టువులతో
కబుర్లు తీరనే తీరలేదు!

బాల్యం, కౌమారం, యవ్వనం
ఇవన్ని హడావుడిగా వెళ్లి పోతాఎందుకో?

గమ్యాలు వెతుక్కుంటూ సాగుతున్న ప్రయాణంలో
ఆటవిడుపుగా వెనక్కి వెళ్ళితే
మరి తిరిగి రావాలనిపించదు!

జ్ఞాపకాల అరలలో
స్మృతుల దొంతరలు పేర్చుకుంటున్నా
కాలం కరిగిపోతుందన్న బెంగ తీరక మునుపే
మబ్బులు ముసిరిన ఆకాశం
వర్షించటం మొదలుపెట్టింది
వీడ్కోలిస్తూ…..

This entry was posted in కవితలు, జీవితం, నా అనుభవాలు. Bookmark the permalink.

10 Responses to ఇంటికెళ్ళి వచ్చాక….

 1. బాగుంది….మీరు వచ్చి వెళ్ళాక ….మాలాటి తల్లిదండ్రుల భావాలూ రాయండి.

  • లక్ష్మి గారు@ మీరడిగిన తల్లి దండ్రుల భావాలు జాన్ హైడే గారు అధ్బుతంగా ఇలా రాసారు.
   జాన్ హైడ్ కనుమూరి |నీవు వెళ్ళాక|

   నీకేం!
   ఇలావచ్చి
   అలా వెళ్ళిపోతావు
   ఆశేదో గూడుకట్టిన మేఘమౌతుంది
   నువ్వెళ్ళాక వర్షించడం మొదలౌతుంది

   నీ బాల్యాన్ని భుజంపై మోస్తూ
   నా పనులు చేసున్నప్పుడు
   నీవు చేసిన సవ్వడులు
   ఇప్పుడు జ్ఞాపకాలై రాల్తుంటాయి

   ఎదో మిషతో
   నువ్వెళ్ళకుండా బంధించాలని చూస్తాను
   బాధ్యతల గుమ్మానికి
   ప్రాణాలు తగిలించివచ్చావని గుర్తొస్తుంది
   బంధించాలనే వూహలన్నీ
   పురిలేని దారాలయ్యాయి

   చిన్నిచిన్ని పక్షుల్ని చూసి
   ఎగరటం ఎలా అడిగిన నువ్వు
   అనురాగాలన్నీ
   ప్రక్కనపెట్టి
   హఠాతుగా ఎగిరేందుకు సన్నద్దమౌతావు

   నీకేం!
   ఇలావచ్చి
   అలా వెళ్ళిపోతావు

   నీవు చెప్పిన ఊసుల్తో కొన్నిరోజులు
   దిగమింగిన బాధల్ని తలపోస్తూ మరికొన్నిరోజులు
   నళ్ళీ వచ్చేదెపుడోనంటూ
   ఎదురుచూపుల్ని వాకిట్లో ఆరబెట్టి
   కేలండరును కత్తిరిస్తుంటాము

   అప్పుడప్పుడు
   ఇంటిపైన ఎగిరే విమానం చప్పుడులో
   నీవున్నావని భ్రమపడి
   బయటకొచ్చేలోగా
   విశాలాకాశంలో
   అదృశ్యమౌతుందా తలపు

   నీకేం!
   ఇలావచ్చి
   అలా వెళ్ళిపోతావు

   తలపుల్తో పాటు
   తలపుల్ని మూసి
   చెమ్మగిల్లిన కన్రెప్పల్తో
   నిద్ర రాక తూగుతుంటాము

   **************
   అమ్మలందరికి అంకితం
   **************

   ప్రవీణ కొల్లి రాసిన |ఇంటికెళ్ళి వచ్చాక| చదవగానే మా అమ్మ గుర్తుకొచ్చింది

 2. ఊరి విశేషాలను అందమైన కవితగా చుట్టి మా కోసం తెచ్చారన్నమాట…బహుమానం బావుంది ప్రవీణ గారూ…

 3. Ravi babu says:

  Gundenu pindi ekkado thiyyati gnaapakaalloki theesukeluthundhi mee raathalu. Bhadhalo Aanandham…….

 4. Ravi babu says:

  John Hide gaariki kooda thanks….

 5. జాన్ హైడ్ కనుమూరి says:

  |నీవు వెళ్ళాక|
  ************
  నీకేం!
  ఇలావచ్చి
  అలా వెళ్ళిపోతావు
  ఆశేదో గూడుకట్టిన మేఘమౌతుంది
  నువ్వెళ్ళాక వర్షించడం మొదలౌతుంది

  నీ బాల్యాన్ని భుజంపై మోస్తూ
  నా పనులు చేస్తున్నప్పుడు
  నీవు చేసిన సవ్వడులు
  ఇప్పుడు జ్ఞాపకాలై రాల్తుంటాయి

  ఎదో మిషతో
  నువ్వెళ్ళకుండా బంధించాలని చూస్తాను
  బాధ్యతల గుమ్మానికి
  ప్రాణాలు తగిలించివచ్చావని గుర్తొస్తుంది
  బంధించాలనే వూహలన్నీ
  పురిలేని దారాలయ్యాయి

  చిన్నిచిన్ని పక్షుల్ని చూసి
  ఎగరటం ఎలా అని అడిగిన నువ్వు
  అనురాగాలన్నీ ప్రక్కనపెట్టి
  హఠాత్తుగా ఎగిరేందుకు సన్నద్దమౌతావు

  నీకేం!
  ఇలావచ్చి
  అలా వెళ్ళిపోతావు

  నీవు చెప్పిన ఊసుల్తో కొన్నిరోజులు
  దిగమింగిన బాధల్ని తలపోస్తూ మరికొన్నిరోజులు
  మళ్ళీ వచ్చేదెపుడోనంటూ
  ఎదురుచూపుల్ని వాకిట్లో ఆరబెట్టి
  కేలండరును కత్తిరిస్తుంటాము

  అప్పుడప్పుడు
  ఇంటిపైన ఎగిరే విమానం చప్పుడుల్లో
  నీవున్నావని భ్రమపడి
  బయటకొచ్చేలోగా
  విశాలాకాశంలో అదృశ్యమౌతుందా తలపు

  నీకేం!
  ఇలావచ్చి
  అలా వెళ్ళిపోతావు

  తలపుల్తో పాటు
  తలపుల్ని మూసి
  చెమ్మగిల్లిన కన్రెప్పల్తో
  నిద్ర రాక తూగుతుంటాము

  **************అమ్మలందరికి అంకితం**************

  ప్రవీణ కొల్లి రాసిన |ఇంటికెళ్ళి వచ్చాక| చదవగానే మా అమ్మ గుర్తుకొచ్చింది
  i am going to post both lines in my blog

  best wishes

 6. జాన్ హైడ్ కనుమూరి says:

  ప్రవీణ కొల్లి శెలవులో ఇండియావచ్చి తిరిగివెళ్ళి ఇంటికెళ్ళివచ్చాక అనే కవిత రాసారు

  అది చదవగానే నా మనసు ఉద్విగ్నానికి లోనయ్యింది. ఓ ముప్పయేళ్ళక్రితం నేను మధ్యప్రదేశ్‌లో పనిచేస్తూ ఇంటికివచ్చి తిరిగివెళ్ళాలనుకున్నప్పుడు అమ్మ చేసిన హడావిడి గుర్తుకొచ్చింది

  ఎప్పటినుంచో గూడుకట్టుకున్న భావనలు ఒక్కసారిగా పెల్లుబికాయి

  ఇక్కడ మీ కోసం రెండు కవితలు మీ కోసం
  http://johnhaidekanumuri.blogspot.in/2012/08/blog-post_23.html

 7. santhosh says:

  ఎదుర్కోవడానికి ఎర్ర తివాచి పరచిన వర్షం
  వీడ్కోలు గీతం ఆలపించడం విచారకరం
  వలస వచ్చినట్లు వచ్చిన వ్యక్తులకు
  వనంతో వసంత కోకిలకున్నట్లు బంధముండదుగా?

  ఇల్లు జ్ఞాపకాల పందిరి అవుతుంది
  ఇంతవరకు జరిపిన ప్రయాణానికి కొలమానం అవుతుంది
  ఇంటికి వెళ్లి వచ్చాక మనసు పీకేసిన పందిరి అవుతుంది
  ఇంటిని ఒంటిగా మార్చుకోవాలనిపిస్తుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s