ప్రేమ రాహిత్యం


ప్రేమ రాహిత్యం

రఘు పుస్తకం ముందు కూర్చున్నాదే కానీ, చూపంతా గుమ్మం వైపే ఉంది. ఎప్పుడెప్పుడు డోర్ బెల్ మొగుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నెలలో రెండో శుక్రవారం, రఘు నాన్న ప్రతాప్ ఆ రోజు తప్పకుండా వస్తాడు హైదరాబాద్ కి . ఆ రోజు ఉదయాన్నే ఫోన్ చేసే కూడా చెప్పాడు, సాయంత్రం కల్లా నీ దగ్గర ఉంటాను అని. ప్రతాప్కి నెలలో రెండో శనివారం సెలవు. శని, ఆది వారాలు కొడుకుతో ఉండటానికి గత మూడు సంవత్సరాల నుంచి  క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాడు.

రాత్రి పది గంటలైంది. రఘు అలాగే పుస్తకాల ముందు కూర్చున్నాడు, నాన్న కోసం ఎదురుచూస్తూ. రఘు అత్త వాసంతి వచ్చి,
“ఏరా ఇంకా పడుకోలా? పది అయిపోయింది.ఇంక పడుకో”, అంది.
“మరే నాన్న…..” అంటూ గొనిగాడు రఘు.
“వస్తాడులేరా మీ నాన్న, ట్రైన్ లేట్ అయ్యివుంటుంది”, అంటూ రూమ్‌లోని  లైట్ తీసేసిందే.
ఆ చీకట్లో, ఆ పసి వాడి కళ్ళు, వాడి నాన్న కోసం తపించి  పోతున్నాయి.
నాన్న వస్తే రఘుకి పండుగ. ఎన్నో చాక్లేట్లు, బిస్కెట్స్, బొమ్మ కార్లు, కొత్త బట్టలు తీసుకువస్తాడు. రఘు ఎదురు చూసేది వీటి కోసం కాదు. నాన్న రాగానే ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. తలపైన ఆప్యాయంగా నిమురుతాడు. బుగ్గలపై ఆత్మీయంగా ముద్దు పెట్టుకుంటాడు, పెట్టించుకుంటాడు. ఆ ప్రేమ కోసం తపించుకుపోతున్నాడు రఘు. నాన్న ఉన్న ఆ రెండు రోజులు రఘుకి ఎంతో సంబరం.   

రాత్రి పదకొండు గంటలకు డోర్ బెల్ మొగిందే. చటుక్కున మంచం మీద నుంచి దూకి హాల్లోకి పరిగెట్టాడు రఘు. ఇంతలో అత్త వాసంతి వచ్చి తలుపు తీసింది. ప్రతాప్ గుమ్మంలో ఉండగానే రఘు వెళ్లి నాన్న కాళ్ళకి చుట్టేసుకున్నాడు.

“నీ కొడుకు నిద్ర కూడా పోకుండా ఎదురుచుస్తున్నాడయ్య నీ కోసం”, అంటూ వాసంతి ప్రతాప్ చేతిలో సూట్ కేసు అందుకుంది.

“ఏరా తండ్రి, ఎలా వున్నావు? బాగా చదువుకుంటున్నావా ?”, అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు ప్రతాప్.

అన్నింటికీ తలూపాడు రఘు.

రఘు ఏడేళ్ళ వయసులో అమ్మ కన్ను మూసింది. ఊహ తెలిసి తెలియని వయసులో ఒంటరి వాడయ్యాడు. ప్రతాప్ భార్య వియోగాన్ని తట్టుకుని బయటపడటానికి  సంవత్సర కాలం పట్టింది. మరో పెళ్ళి చేసుకోమని బంధు వర్గం ఎంతగా చెప్పినా వినలేదు రఘు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు క్షమమే ముఖ్యం అనుకున్నాడు. అదే పరిసరాలలో ఉంటుంటే, పోయిన భార్య ఆలోచనల్లో నుంచి బయట పడలేక పోతుంటే, పని చేస్తున్న కంపెనీలోనే  ఒరిస్సాకు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. 

ప్రతాప్ చెల్లి వాసంతి రఘు భాద్యత తీసుకుంది.  వాసంతి హైదరాబాద్ లో వుంటుంది. తనకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, బాబు. పాప పేరు భవ్య, ఎనిమిదేల్లు. బాబు పేరు భగత్, పన్నెండు ఏళ్ళు. రఘుని  అన్ని విదాల వాసంతి దగ్గర ఉంచటమే మేలు అనుకున్నాడు  ప్రతాప్. చదువుకి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఉంటారు తోడుగా అనుకున్నాడు. అతి కష్టం మీద రఘుని వాసంతికి అప్పచెప్పి జాబులో  జాయిన్ అయ్యాడు. ప్రతీ నెల రెండో శని, ఆది వారాలు క్రమం తప్పకుండా వస్తాడు కొడుకుని చూడటానికి.

వాసంతి రఘుని పెంచటం తన బాధ్యత అనుకుంటుంది. నిర్వహించాల్సిన  బాధ్యతను మనసుతో కంటే  మెదడుతోనే ఎక్కువ అలోచిస్తుంది.

ఒకానొక పండుగకు  వాసంతి పిల్లలు ముగ్గురికి కొత్త బట్టలు తీసుకొచ్చింది. సాయంత్రం  పిల్లలు స్కూల్ నుంచి రాగానే, బట్టల పాకెట్స్ వాళ్ళకు ఇచ్చింది.

“ఎలా ఉంది నా సెలక్షన్?”, అడిగింది వాసంతి.

“సూపర్ అమ్మా, నా గౌను చాల బాగుంది. ఈ ఫ్రిల్ల్స్ చాల బాగున్నాయి”, ఆనందంగా చెప్పింది భవ్య.

“ఏరా భగత్, నీ డ్రెస్ ఎలా వుంది? చెప్పవే?”, భగత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

“అమ్మా, పోయిన సారి కుడా ఈ కలర్ ప్యాంటు కొన్నావు. మళ్లీ అదే రంగు తీసుకోచ్చావేమిటి?”, కాస్త నిరుత్సాహంగా అడిగాడు భగత్.

“కాదురా కన్నా, ఈ ప్యాంటుకి చూడు ఎన్ని జేబులు వున్నాయో. నువ్వు చాలా రోజుల నుంచి అడుగుతున్నవనే కొన్నాను. నీకు నచ్చక పొతే మర్చేస్తానులే”, అనునయంగా చెప్పింది వాసంతి.

అమ్మ ఇచ్చిన వివరణకు తృప్తి పడ్డ భగత్, “మార్చొద్దు అమ్మ. నాకు నచ్చింది”, తృప్తిగా చెప్పాడు.

రఘు తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడు. తనకి అత్త తెచ్చిన డ్రెస్ ఎంతగా నచ్చిందో చెబుదామని.

“అత్తా….”, అని మొదలు పెట్టగానే, వాసంతి “పిల్లలు, మీకు పాలు తీసుకొస్తాను. తొందరగా యునిఫారం మార్చుకుని రండి”, అంటూ వంట గదిలోకి వేళ్లిపోయింది. 

రఘు నిరుత్సాహంగా లోపలికి వేళ్లిపోయాడు. రఘు చిన్నబుచ్చుకున్నాడు అని కూడా  వాసంతి గుర్తించలేదు.

మరో రోజు భవ్య, భగత్ లు కలిసి “మేమిద్దరము ఒకటి, నువ్వు వేరు”, అంటూ రఘుని ఏడిపిస్తున్నారు.

రఘు ఏడుపు విని ఆ గదిలోకి వచ్చిన వాసంతి  భవ్య, భగత్ లను కోప్పడిందే కానీ, రఘుని దగ్గరకు తీసుకుని సముదాయించ లేదు.

బయట నుంచి చూస్తే ఎవరికైనా రఘు అదృష్టవంతుడు, తల్లి లేకపోయినా, అత్త తల్లిలా ఆదరిస్తుంది అనే అనుకుంటారు. కానీ ఆ చిన్ని హృదయం ప్రేమ రాహిత్యంతో తల్లడిల్లిపోతుందే అని ఆ కన్నతండ్రి కూడా గ్రహించుకోలేదు.

ఒకనాడు భగత్ కు బాగా జ్వరం వచ్చింది.  వాసంతి రాత్రి, పగలు భగత్ పక్కనే కూర్చొని కొడుకుని చూసుకుంది. ఆమె చెయ్యి ఆ మూడు రోజులు భగత్ నుదుటి పైనే ఉంది. నాలుగో రోజు కాస్త జ్వరం తగ్గుముఖం పట్టింది. ఒక వారంలో పూర్తిగా కోలుకున్నాడు. 

మరు వారంలో రఘుకి మొదలైంది  జ్వరం. ఈసారి వాసంతి చాలా కంగారు పడిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది. టైం తప్పకుండా కనిపెట్టుకుని మందులు వేసింది. భవ్య, భగత్ లు స్కూల్ కి వెళ్ళిన తర్వాత రఘు ఒంటరిగానే ఉండిపోయాడు రూంలో. ఆ ఒంటరితనంలో,   వాసంతి భగత్ కు చూపించిన తల్లి ప్రేమను తలచుకుని, తను కోల్పోతున్నది ఏమిటో తలుచుకుంటూ కుమిలిపోయాడు. మందులకన్నా ఆ పసివాడికి కావాల్సింది ప్రేమ, ఓదార్పు. అత్త తన నుదుటి పైన కూడా చెయ్యి వేసి, తలని నిమరాలని, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలని కలలు కన్నాడు.

ప్రతాప్ కొడుకుకి  జ్వరం వచ్చిందని తెలిసి, ఒక వారం సెలవు తీసుకుని రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. ఒక రాత్రి తండ్రీ, కొడుకులు వేరుగా రూములో పోడుకున్నారు. ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో,

“నాన్న నేనొకటి అడగనా?”, సంకోచంగా అడిగాడు రఘు.

“ఏమిటి కన్నా”, ప్రేమగా అడిగాడు ప్రతాప్.

“మరి…మరి…”

“చెప్పమ్మా, ఏమిటి సంకోచిస్తున్నావు?”

“నాన్న…నేను నీతో వచ్చేస్తాను”.

ప్రతాప్ షాక్ అయ్యాడు. ఎప్పుడూ రఘు అలా అడగలేదు.

“ఏమ్మా ఎప్పుడూ లేనిది, అలా అంటున్నావు?”

 ఒక నిమిషం ఆగి మళ్లీ మెల్లగా అడిగాడు ప్రతాప్.

“నీకు ఇక్కడ ఇబ్బందిగా వుందా?” భయంగా అడిగాడు ప్రతాప్.

“ఇబ్బంది అని కాదు నాన్న, ఊరికే నీ దగ్గర ఉందామని…”, చెప్పలేక చెప్పలేక చెప్పాడు రఘు.

“అత్త నిన్ను బాగానే చూసుకుంటుంది కద. భవ్య, భగత్ తో కలిసి ఉండవచ్చు. అక్కడకు వస్తే నువ్వు ఒక్కడివే అయిపోతావు. నేను ఆఫీసుకి వెళితే నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? ఇక్కడ మంచి స్కూల్ లో చదువు కుంటున్నావు . అక్కడ అవేమే వుండవు కద.” బాధగా చెప్పాడు ప్రతాప్.

తండ్రి మొహం చూసేసరికి రఘు మరింకేమి మాట్లాడలేక పోయాడు.

ఏమిటి నీ బాధ? అని రఘుని ఎవరన్నా అడిగితే చెప్పటానికి ఏమీ లేదు. మంచి స్కూల్ లో చదువు, కావలసినవి అన్నీ అమర్చిపెట్టే తండ్రి, వేళకు వండిపెట్టే అత్త. కానీ రఘు మనసంతా శూన్యం. లేనిదల్లా తల్లిదండ్రుల ప్రేమ. ప్రేమరాహిత్యం రఘులో ఆత్మనూన్యతకు దారితీసింది. పద్దెనిమిదేళ్ళు వచ్చేటప్పటికి ఒక ఇంట్రోవర్ట్ గా తాయారు అయ్యాడు. తనకంటూ ఒక వ్యక్తిత్యాన్ని ఏర్పరుచుకునే టీనేజ్ లో , ప్రేమతో దిశా నిర్దేశం చేసే వాళ్ళు లేక, రఘు తనలో తనే కుదించుకుపోయాడు.

అంతలోను అదృష్టము  ఏమిటంటే, రఘు తన ఒంటరితనాన్ని చదువుతో కొంత దూరం చేసుకున్నాడు. ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు. పుస్తకాలే అతని స్నేహితులు. సాహిత్యం నుంచీ రాజకీయాల దాక కనిపించిన పుస్తకమల్లా చదివేవాడు. ఏంతో జ్ఞానం ఉన్నానలుగురిలో మాట్లాడలేడు. భవ్య, భగత్ ల కంటే ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవి. దానితో మరి కాస్త దూరం అయ్యారు. 

కాలక్రమంలో రఘు వైద్యుడు అయ్యాడు. హైదరాబాద్ లోనే ప్రాక్టీసు మొదలు పెట్టాడు.  భవ్య, భగత్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిల్ అయ్యారు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యిపోయాయి.

రఘుకి సరితతో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. పెళ్లెన కొత్తలో సరిత రఘుతో కాస్త ఇబ్బంది పడింది. మనసు విప్పి మాట్లాడడు, ప్రేమ చూపించడు అంటూ అమ్మతో ఎప్పుడూ వాపోయేది. సరిత తల్లి కష్ట సుఖాలు తెలిసిన మనిషి. ఆవిడ కొంత కాలం రఘు, సరిత లతో కలిసి ఉండి, రఘు మనస్తత్వం అర్థం చేసుకుంది. సరితకు అర్థమయ్యేటట్లు చెప్పటంతో, సరిత మనసు కూడా కొన్ని నెలలకు సర్దుకుంది. మెల్లగా రఘుని తన దారిలోకి తెచ్చుకుంది.

ఇప్పుడిప్పుడే రఘు కొంత మారాడు. వృత్తికే అంకిత మయిపోయినా, నలుగురిలో కలవగలుగుతున్నాడు. ప్రతాప్ రిటైర్ అవ్వటంతో, రఘు సంసారంలో వచ్చి చేరిపోయాడు. 

వాసంతికి ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే. పిల్లలిద్దరూ దూర దేశాలలో ఉన్నారన్న బెంగ.

ఒకనాడు రాత్రి   వాసంతి భర్త రఘుకి ఫోన్ చేసాడు, వాసంతి వున్నట్లుండి కుప్పకూలిపోయింది. ఆఘమేఘాల మీద రఘు,ప్రతాప్, సరిత వాసంతి ఇంటికి వెళ్లారు. హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేసారు. గుండెపోటు ఎక్కువగా వచ్చింది. వెంటనే ట్రీట్మెంట్ అందటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రెండురోజుల తర్వాత వాసంతికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిసి తెరవగానే,

“భవ్య, భగత్ వచ్చారా?”, అంటూ నీరసంగా అడిగింది.

“దూరం నుంచీ అంత తొందరగా రాలేరుగా అత్తా”, అనునయంగా చెప్పుడు రఘు.

“రాలేరా?”, ప్రశ్నార్థకంగా, బాధగా గొణిగింది.

“రోజు ఫోన్ చేస్తూనే వున్నారు. డబ్బులు అవసరం అయితే పంపిస్తాము అని కూడా అన్నారు అత్తా”, సముదాయించటానికి ప్రయత్నించాడు రఘు.

“డబ్బులు…ఇలాంటి సమయంలో పిల్లలు పక్కన వుండాలి”, ఇంక మాట్లాడలేక పోయింది.

“నేనున్నాను కదత్తా”, ప్రశ్నార్థకంగా, మొహమాటంగా అన్నాడు రఘు.

“నువ్వు వున్నవులే…కాని “, అపేసింది  వాసంతి.

రఘు ఇంక అక్కడ ఉండలేక వెళ్లిపోయాడు.

వారంరోజుల్లో వాసంతి హాస్పిటల్ నుంచి డిస్ఛార్జ్ అయ్యింది. రఘు, ప్రతాప్ ల బలవంతం మీద రఘు ఇంటికి వచ్చింది. రఘు  వాసంతిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. అందులో సరిత సాయం చాలా ఉంది. ఒక నెల రోజుల్లో పూర్తిగా కోలుకుంది.

వాసంతి ఆరోగ్యం బాగోనప్పుడు రోజు భవ్య, భగత్ ల దగ్గర నుంచి వచ్చే ఫోన్లు, మెలమెల్లగా వారంలో ఒక రోజుకు, ఆ తర్వాత పది, పదేహేను రోజులకు ఒకసారి వచ్చేవి. “అదేమిట్ర్రా ఫోన్ చెయ్యలేదు”, అని వాసంతి

 నొచ్చుకుంటే, “అమ్మా, నీకంత చాదస్తం. మాకు ఇక్కడ తీరిక ఏది?”, అంటూ విసుక్కునేవాళ్ళు. వాసంతి ఎంతగానో నోచ్చుకునేది.

ఒకనాడు సాయంత్రం అందరు కలసి భోజనం చేస్తున్నారు.

“రఘు, నేను పూర్తిగా కోలుకున్నాను. ఇంటికి వెళ్లిపోతాను”, అంది  వాసంతి.

“ఎందుకత్త ఇక్కడే ఉండిపోవచ్చుగా?”, అడిగాడు రఘు.

“ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు వున్నాయి కద రఘు. నేను ఏమి ఇబ్బంది పడను “, చెప్పింది వాసంతి.

“సౌకర్యాలు ఉంటే సరిపోతుందా అత్తా? ప్రేమానురాగాలు అవసరం లేదా?”, సూటిగా అడిగాడు.

వాసంతి కంట్లో నుంచి కన్నీటి చుక్క అన్నం తింటున్న కంచంలో పడింది. ఆ కన్నీటి చుక్కలో రఘు చిన్ననాటి మొహం కనిపించింది.   ఆ కన్నీటి చుక్కలో ఎన్నో అర్థాలు, బాధలు కనిపించాయి వాసంతికి.

“అత్తా, నువ్వు ఇక్కడ వుండటం నాకు ఇష్టం. నిన్ను శాసించే హక్కు నాకు లేదు. మరి నీ  ఇష్టం”, అంటూ లెగిసి వెళ్లిపోయాడు రఘు.

*   *   *    *    *     *

Though other stories published before, this was my very first trail of writing a story. Thanks to Koumudi.

Published :  http://www.koumudi.net/Monthly/2012/july/index.html

 

This entry was posted in కధలు. Bookmark the permalink.

3 Responses to ప్రేమ రాహిత్యం

  1. pnrao says:

    It is a very good story , we have to think all…………

  2. Radha says:

    హాయ్ ప్రవీణ గారు,
    మీ బ్లాగ్ ‘మనసుతో ఆలోచనలు’ ఒక వారం నుండి ఫాలో అవుతున్నాను. మీ రచనలు చాలా అద్భుతంగా వున్నాయి. ‘ప్రేమ రాహిత్యం’ కథ చదివాక నా హృదయం చాల బరువెక్కింది . ఇన్నాళ్ళూ మిస్ అయినందుకు భాదపడుతున్నాను. భావిష్య త్తు లో కూడా మీరు ఇలాగే రచనలు చేయాలని కోరుకుంటున్నాను. మీ కొత్త రచనలు ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా అని ఎదురుచూస్తూ…
    రాధ .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s