పుటలు


పుటలు 

ఈ పుస్తకంలో
నిర్ణీత కాలం గడిచాక
పక్కకు తిరిగిపోయే ఎన్నో ఎన్నో పుటలు
నిన్నటి పేజీలో మరి రాయలేను
రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు.
నేను, తెల్లకాగితం నేడు నా ముందున్నాయి…

అమ్మ కౌగిలి, కాగితం పడవ
నెమళీక, ప్రేమలేఖ
భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన పుటలలో …
ఎదురుదెబ్బ, నిట్టూర్పుల సెగ, గుణపాఠాల పోటుల
కన్నీటి దారలలో అలకబడిన అక్షరాలు అక్కడక్కడా….

తరచి తరచి చూస్తే
ప్రతి పుటలలోనూ
మునుపెన్నడూ ఎరగని నేనే!
మరల మరల ఆలోచిస్తే
నన్ను నేను వెతుక్కునే ప్రయత్నమే
అన్ని పుటలలోనూ ….

నిన్నటి అనుభవం అక్కడే
నేటి భావం ఇక్కడే
అనుభవం పాఠాలు నేర్పుతుందా?
ఏమో?!
అవును కాదుల నడుమ ఊగిసలాడుతూనే వుంటుంది
పిచ్చి మనసు.

అనుభవాల సారమే సిరా అనలేను
లిఖించేదే వేదమూ కాదు!
అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి
ఆలోచనలు ఎగిసిపడుతూనే ఉంటాయి
ప్రశ్నలు నిలదిస్తూనే ఉంటాయి
ఒక అధ్యాయంలో సమాధానం దొరికినట్టే దొరికి
మరో అధ్యాయం చివరలో
అదే సమాధానం మళ్లీ ప్రశ్నవుతుంది….

ఎన్ని అధ్యాయాలు రాస్తానో తెలిదు
ఎన్ని పేజీలు నింపుతానో అసలే తెలీదు
మార్జిన్లో రఫ్ వర్క్ చేస్తూనే ఉంటాను
అక్కడే కదా జీవితసత్యాలు తెలుసోచ్చేది!

అణుక్షణం ఆత్ర్రం
ప్రతి పుటను ప్రేమగా తీర్చిదిద్దాలని.
నేటితో 365 పేజీలు నిండాయి
అవును…రేపు నా మరో పుట్టిన రోజు.

(Wrote on my B’day)

This entry was posted in కవితలు, జీవితం, నా అనుభవాలు. Bookmark the permalink.

1 Response to పుటలు

Leave a comment