విరామం


ATA Souvenir 2012  పత్రికలో వచ్చిన నా కవిత “విరామం”….పేజి నెంబర్ 142

నేను ఎవరో తెలియకపోయినా, నన్ను ఈమెయిలు లో  కాంటాక్ట్ చేసి, ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసి రాయమని ప్రోత్సహించిన శర్కరి బ్లాగర్ జ్యోతిర్మయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు..

విరామం

మనసు అలసట మదికి  తెలుస్తూనే ఉంది
తనువు బడలిక భారమై ఎదను వేడుకుంటోంది
కాస్తంత విరామం ఇవ్వమని…

కాలం పరుగెడుతూనే ఉంది నా పనిలా
కాసేపు…కాసేపంటే కాసేపే
ఈ పనిని పక్కన పెట్టి
ఈ రోజును  నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని
నన్ను నేను అభిషేకించుకోనీ….

నిద్ర లేమి లేని కనులతో
సూరీడి గోరు వెచ్చటి దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడితో కబుర్లు చెపుతూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ….

పువ్వుల పరిమళాలను మోసుకొచ్చిన ఆ చిరుగాలి
మనసు మూలాల్లోకి జొరబడి
సరసాలాడుతూ విసుర్లు విసిరింది
ప్రపంచాన్ని పల్లెటూరన్నావు
మనసులు ఇరుకు సంధులు చేసావు
ప్రకృతికి మేకప్పులేస్తున్నావు
సరి సరి..ఒప్పుకున్నా
ఈ నిట్టూర్పుల  సెగలింక ఈపూటకు పక్కన పెట్టనీ
నీ సరసన నన్ను సేదతీరనీ
వేడుకోలును వయ్యారంగా ఆలకించిన
చిలిపి గాలి నా ముంగురులను ముద్దాడింది
పులకరించిన తనువు అలసటను మరిచింది…

తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న గాలిపటం
గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ ఆ స్తబ్దతను ఆస్వాదిస్తుంటే
మరోమారు జన్మిస్తున్నట్టుంది…

నీలాకాశపు పందిరి కింద
చంద్రవంకను వంగి ముద్దాడి ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా
ఈ రాత్రి
కొబ్బరాకుల నడుమ నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
వెన్నెలను కౌగలించుకుని
మబ్బుల లాలిపాటలో ఓలలాడా…

నిన్నటి రోజున జనించిన
ఆ రాగం
నా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు
మనసు పొరలలో రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో విశ్రమించే వరకు….

ఈ విరామం కొత్త ప్రాణాన్ని నాలో నింపింది..

 

This entry was posted in కవితలు, గుర్తింపు. Bookmark the permalink.

6 Responses to విరామం

  1. wow – very nice. మీ కలం (కీబోర్డు) పదునెక్కుతోంది!!

  2. the tree says:

    ప్రపంచాన్ని పల్లెటూరన్నావు
    మనసులు ఇరుకు సంధులు చేసావు
    ప్రకృతికి మేకప్పులేస్తున్నావు
    very nice, congrats, anuvada lahari lo mee anuvadam choosaara, , congrats again.

    • ధన్యవాదాలు భాస్కర్ గారు..లహరిలో మూర్తి గారి అనువాదం చూసాను, అద్భుతంగా ఉంది..

      In fact the translation version is more sharp and depth ..

  3. Anonymous says:

    Chala bagundi

  4. మీరెవరో మీ కవితలే చెప్పాయి ప్రవీణ గారూ…మీరు ఇలాంటి మంచి మంచి కవితలు మరెన్నో వ్రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Leave a comment