ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు


ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు

అలారం సైరన్ మోతలాగా మోగుతుంది. అప్పుడే తెల్లారిపోయిందా? కళ్ళు తెరుచుకోవట్లేదు, కనురెప్పలు విడిపడట్లేదు. ఒక్క ఐదు నిముషాలు పొడుకుని లేగుస్తాలే. అమ్మో, పనులు తెమలవు. అతి కష్టంగా మంచం దిగాను. కళ్ళు మండిపోతున్నాయి. నిద్ర సరిపోలేదు. ఇంకాసేపు పడుకోమని దేహం ప్రాధేయ పడుతుంది. 

మనసు చెప్పే మాటలు, గుండె పలికే పలుకులు………ఇలా వింటూ కూర్చుంటే అయినట్టే. మనసు, గుండె, మధి, దేహం….జాన్తా నహీ…..కేవలం గడియారం ముళ్ళు చెప్పే పనులు మాత్రమే చెయ్యాలి.

నిద్ర కళ్ళతోనే మొదలు ఈ ఆలోచనలు. పోనిలే, ఇంకో మూడు రోజులు కష్ట పడితే week end వచ్చేస్తుంది. అప్పుడు నిద్ర పోవచ్చులే. నిద్రను, సుఖాన్ని, సంతోషాన్ని weekend కి reserve/postpone చేసి, ఈ రోజు మాత్రం పనిలో పడాలి.

milk, cornflakes, breakfast, lunch boxes అన్నీ చక చకా తాయారు చేసేసి, పిల్లల్ని లేపాను. నిద్ర కళ్ళతో బద్దకంగా లేగుస్తున్న చిన్నారులను చూస్తుంటే మనసు కలుక్కుమంది. హాయిగా పొడుకోవాల్సిన సమయంలో, వయసులో ఏంటో ఈ పరుగులు. పరుగుల వెనుక పరుగెత్తక పోతే వెనుక పడిపోతామేమోనన్న  భయం.మళ్లీ మొదలు పెట్టావా ఆలోచనలు…..ఆపేయ్…ఆపేయ్…పని చూడు.

“తొందరగా  లేగవండమ్మా. ఫాస్ట్ ఫాస్ట్..brush చేసుకుని milk తాగండి. టైం అయిపోతుంది.”

“అయ్యిందా, పాలు తాగరా?”

“తొందరగా కానివ్వండి. బాగ్ లో బుక్స్ అన్నీ పెట్టుకున్నారా?”

“స్కూల్ బస్సు వచ్చే టైం అయింది, తొందరగా తెమలండి.”

“లంచ్ బాక్స్ పెట్టుకున్నారా. జాగ్రత్త..సరిగ్గా తినండి”

హమ్మయ్య, పిల్లలు వెళ్లారు. ఇంక నేను, ఈయన ఆఫీసుకు పరిగెత్తాలి.

కాసేపు తీరిగ్గా కాఫీ తాగుతూ, న్యూస్ పేపర్ చదువుతూ కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుండు. ఇంటి విషయాల దగ్గర నుంచి ప్రపంచ రాజకీయాల దాకా చర్చించుకుంటూ, వాదించుకుంటూ కాసేపు గడిపేస్తే ఎంత బాగుండు. సరి సర్లే ఆపు ఆపు నస. ఆఫీసు టైం అవుతుంది. 

చక చకా తయారు అయిపోయి, హాయ్  బాయ్ ఒకేసారి చెప్పేసుకుని ఎవరి ఆఫీసులకు వాళ్ళు పరుగులు.

హమ్మయ్య…కొలువుకు చేరా. దీర్ఘంగా శ్వాస పీల్చి వదిలి, కంప్యూటర్ లో లాగిన్ అయ్యి inbox open చేసి, రిప్లైస్ ఇచ్చా. ఇదేమి వింత గోలో. పక్క సీట్లో ఉన్న సహోద్యోగికి కూడా ఉ అంటే మెయిల్, ఆ అంటే మెయిల్, ఎస్ అంటే మెయిల్ ,నో అంటే మెయిల్. ఇదేమిటి అంటే మరి ప్రూఫ్ ఉండాలిగా అంటారు!

ఓ రెండు గంటలు పని చెయ్యగానే, మళ్లీ మొదలు మనసులో నుంచి ఆలోచనలు.  పిల్లలు ఏమి చేస్తున్నారో? ప్రొద్దున్న సరిగ్గా పాలన్నా తాగలేదు, టిఫిన్ కూడా పొట్ట నిండా తినలేదు. లంచ్ అన్నా సరిగ్గా తింటారో లేదో. ఛ ఈ మధ్య సరిగ్గా వండి పెట్టట్లేదు. సాయంత్రమన్నా వాళ్ళకు ఇష్టమైనది వండాలి. పిల్లలతో సరిగ్గా timeయే spend చెయ్యట్లా. పాపం మొన్న చిన్నాడికి జ్వరం వస్తే మందులు వేసేసి, వదిలేసి వచ్చేసా. అబ్బబ్బా..ఈ ఆలోచనలు నన్ను వదిలి పెట్టావు. బోల్డు పని ఉంది. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికి అయ్యేను ఈ పని. తొందరగా అవచేసుకుంటే సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్లిపోవచ్చు.

అప్పుడే సాయంత్రం ఆరు గంటలైపోయింది. ఈ పని ఎంత చేసిన తరగదు. పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. మిగతా పని రేపు చేసుకుందాములే.

“అమ్మ అమ్మా ఈరోజు స్కూల్ లో ఏమయిందో తెలుసా….”

“అమ్మ మా టీచర్……”

“అమ్మ maths home work….”

“అమ్మా నా ఫ్రెండ్ వాళ్ళు….”

ఏమి కూర వండాలి? అస్సలు ఓపిక లేదు, తొందరగా తెమిలే కూర అయితే బెటర్. దొండకాయ కూరంటే పాపకు ఇష్టం. అబ్బో అది తరగాలంటే చాల టైం పడుతుంది. పప్పు అయితే  కుక్కర్ లో పడెయ్యొచ్చు.

“ఏమండి కాస్త ఇటు వస్తారా? కూరగాయలు తరగాలి”

“వస్తున్నా, వస్తున్నా టీవిలో hot hot discussion వస్తుంది. KCR ఎంటేంటో వాగుతున్నాడు”

“ఆ KCR, YSR, బాబు వచ్చి మనింట్లో కూరగాయలు తరుగుతారా? గిన్నెలు కడుగుతారా?”

“అంత కోపమెందుకోయ్, పాపం YSR ఎప్పుడో పోయాడుగా, చెప్పు ఏమి చెయ్యాలో?”

ఏదో వంట అయింది అనిపించా.

పిల్లలు ఏదో కీచులాట మొదలుపెట్టారు.

“ఏం చేస్తున్నారు?”

“ఈ తెలంగాణా, ఆంధ్రా గొడవలు ఇప్పట్లో ఆగేదట్లు లేవోయ్”

“వాటి సంగతి తర్వాత చూద్దాం లే కానీ, ముందు తమరి సంతానం కీచులాట ఆపండి, వాళ్ళ గొడవ తీర్చండి. తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం హైదరాబాదు ఏమి చెయ్యాలో.”

“మళ్లీ అంత కోపం ఎందుకోయ్? వస్తున్నా…వస్తున్నా”

రోజు గడిచింది. నిద్ర ముంచుకోచ్చేస్తుంది.

చెయ్యాల్సిన పనులు అనంత మంత. చేతిలో సమయం గుప్పెడంత. ఎలా సర్దుబాటు చెయ్యాలి? గడియారం ముల్లును ఇనుప గొలుసులతో కట్టేయ్యాలి.

నిద్ర ఆలోచనలను ఎప్పుడు అంతం చేసిందో తెలీనే తెలిదు… 

కాలమా…..నీకెవరిచ్చారు ఇంత అధికారం? 

ఆలోచనలు…..

This entry was posted in అమ్మ, Uncategorized. Bookmark the permalink.

7 Responses to ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు

  1. latha says:

    బావుందండీ,జాబ్ చేసే ప్రతి అమ్మ ఇలాగే ఆలొచిస్తుంటుంది బాగా రాశారు

  2. sudha says:

    ఎంతబాగా రాసారో… నేను ఉద్యోగానికి పోను కాబట్టి…నాకు మీలాంటి సోదరీమణులను చూస్తే మరీ బాధగా అనిపిస్తుంది. మీ అందరూ… ఐమీన్…మీలాంటి ఉద్యోగినులు పడే బాధలన్నిటికీ ఓ రూపం ఇక్కడుంది చూడండిమరి……
    http://www.illalimuchatlu.blogspot.com

  3. sphurita says:

    చేయాల్సిన పనులు అననంతమంత..చేతిలో సమయం గుప్పెడంత…బాగా రాసారు

  4. లత గారు: more or less ప్రతీ అమ్మ ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది.
    కృష్ణప్రియ గారు: ధన్యవాదాలు
    సుధ గారు: మీ పోస్ట్ చాల బాగుంది. Your flow of thoughts are very good..
    స్ఫురిత గారు: ఎంత చేసినా తరగని పనులు..చాల సార్లు బాగానే ఉంటుదని కానీ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది.

  5. pallavi says:

    chala bagundi akka..

Leave a comment