ఈ దోవ పొడవునా
ఇదీ గమ్యం అనేది ఒకటంటూ ఏదీ ఉండదు. అక్కడక్కడా మజిలీలు ఉంటాయి అంతే. నిజానికి మనకంటూ ఉండేది ప్రయాణం మాత్రమే.
ఈ దారి పొడవునా సాగిపోవాల్సిన పయనం. ఆస్వాదించాల్సింది జీవితమనే ప్రయాణానినే.
మనం వెతుక్కోవాలే కానీ ప్రతీ మలుపులోనూ ఓ అబ్బురం దాగుంటుంది.
ఇంతేసి కళ్ళేసుకుని చూసే మనసే ఉండాలే కానీ మార్గమంతా మహా అద్భుతాలే. ఆకు, కొమ్మ, చెట్టు, పిచ్చుక స్వాగతం పలుకుతున్నట్టే ఉంటాయి.
ఈ దారిలోనే ఎన్నో పరిచయాలు, అన్నీ అనుభవాలే. కొన్ని కలలు, మరికొన్ని కలతలు. కొన్ని బంధాలు, మరికొన్ని బంధనాలు.
కొందరి సన్నిధిలో ప్రయాణం సులువుగా సాగిపోతుంది, అప్పుడే అంతదూరం వచ్చేసామా అన్నట్టు. బంధమేదైనా వారితోని అనుబంధపు ముద్ర మనపై ఎంతో ఉంటుంది.
ఒక్క అడుగులోనూ పాదమైనా కలవని అనివార్యతలు కొన్నుంటాయి. భారమైన కనులు ఆ నేలనంతా చిత్తడి చేసి అడుగుల ముద్రలను వదిలేస్తాయి మనలో.
అందరూ సాటి బాటసారులే, కాసేపే కలిసి ప్రయాణించేది.
మంచైనా చెడైనా అన్నీ అనుభవాలే, అన్నీ పాఠాలే ఈ బాటలో.
ఈ ప్రయాణంలో ఒక్కోసారి, మనమంతకు ముందెప్పుడూ చూడని కొత్త లోకంలోకి నడుచుకుంటూ వెళ్తాము. మరోసారి, మనకు తెలిసిన లోకమే కొత్తగా కనిపిస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు ఏ దిశానిర్దేశాలు లేకుండా ఈ మార్గాలలో సాగిపోతూ ఉండాలి, అనంతంలో అతిదగ్గరతనాన్ని హత్తుకోవాలి.
అంతకుముందే పోతపోసిన విగ్రహాలం కాకూడదు, ఒక్కో రూపం సంతరించుకుంటూ అపురూపమవ్వాలి.
ఎంత చెప్పుకున్నా ఒక్కోసారి ఒక్క అడుగన్నా వెయ్యాలేనంత నీరసం వచ్చేస్తుంది. కాస్త విరామం తర్వాత, మనకోసమే ఏర్పడినట్టు కనిపిస్తుంది మరో దోవ.
ఏదైనా ఆస్వాదించాలంటే మనలో ఒక స్వచ్ఛత ఉండాలి. హడావుడి ఉండకూడదు నిదానం ఉండాలి, అహం ఉండకూడదు హితం ఉండాలి. తెలుసా, మన ప్రయాణాలు మనం ఆస్వాదించాలి.
రోజూ కనిపించే ఆకాశం ఈరోజు కొత్తగా కనిపిస్తుంది, మేఘాలు మునుపెన్నడూ చూడని ఆకారాలలో అలరిస్తుంటాయి.ఈ దారి నిన్న నడిచి వచ్చిన దారిలా అనిపించినా, ఇది సరికొత్త దోవ.
హటాత్తుగా వాన చినుకులు ఆతిధులుగా వస్తారేమో, సిద్ధంగా ఉండాలి. ప్రయాణంలో వాన అసౌక్యరాన్ని కలిగించనూవచ్చు, ఆహ్లాదాన్ని ప్రసాదించనూవొచ్చు.
నేనే ఈ ఇరుకు సంధుల్లో, ఎత్తు పల్లాల్లో, ఎగుడుదిగుడు దారులలో పడుతూ లెగుస్తూ వెళుతున్నాననుకుంటున్నా, నీటిచుక్కన్నా లేని దారులలో బాటసారులు ఉంటారని తెలిసేవరకు.
ప్రయాణం, ప్రకృతి నేర్పినన్ని పాఠాలు మరెవరూ నేర్పరు. జీవితం పండగ ఆర్బాటం కానేకాదు.
All these photos were clicked during my trips to our village, Araku and Narsipatnam.
చక్కని రైటప్ ఎంచక్కని ఫొటోస్ .చాలా బావున్నాయి .
థాంక్స్ రాధిక
Praveena chala bagunnai Pic’s and writeups. Barlapudi lo pic gurthupatta. Manam chese Jeevithapu prayananni chakkaga varninchav.Parichayalu,Anubhutulu,Feelings,Chirakulu,Chinna Chinna anadalu ,Bhavodvegalu inka emani cheppanu meetho tirigi ammo nayano naku vantabatti natlundi.Inka apithe baguntundemo kada. All the best keep writing and keep us happies.
Thanks a lot for every thing Seetaram garu.
స్పందించే మనసుండాలే కానీ దృశ్యం ఏదయితే ఏమిటీ ? ధన్యవాదములు