తోడు
నువ్వూ నేనూ రెండు విరుద్ద భావాలను వ్యక్తీకరిస్తున్నాం అనుకుంటున్నాం
తరచి తరచి చూస్తే వాటి మూలం ఒకటే నేస్తం!
నువ్వన్నావు, కష్టాన్ని పంచుకునే తోడొకటి లేకపోవటమే పెద్ద లోటని
నేనన్నాను, సంతోషాన్ని పంచుకోలేని తోడు ఒక తోడే కాదని
హుటాహుటిన పెద్ద పెద్ద గ్రంధాలను మోసుకోచ్చావ్
నీ చూపుడు వేలితో
ఆ నీతుల వెంట పరుగులు పెడుతూ
కన్నీటిని తుడిచే చెయ్యే ముఖ్యమన్నావ్
అయ్యో నా ప్రియ నేస్తమా, నీకెలా చెప్పనూ?
అ ముని వేళ్ల నుంచీ ధారలుగా కారుతున్న జాలిని దాటుకుని
నాలుగడుగులు ముందుకెళ్ళి
ఓ సారి వెనక్కి తిరిగి చూడు
చప్పట్ల మోతలు కాదని అవి మెటికల శబ్దాలని తెలుసుకుని నివ్వెర పోతావ్!
అందుకే అంటాను, సంతోషాన్ని పంచుకునే సాహచర్యమే అసలైన తోడని
కేవలం మాటల అర్ధాలని దాటిపోయిన లోతైన భావమేదో ఉన్నది ఈ కవితలో
ధన్యవాదాలు కొత్తపాళీ గారు.