మెట్రో ప్రయాణం
పోయిన వారం ఓ నాలుగు రోజులు కార్పరేట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ట్రైనింగ్లకు పంపించి ఆ తర్వాత expectations తో బాదటం ఆఫీసోల్లకు మహదానందం.
ఆ ఇన్స్టిట్యూట్ లొకేషన్ మ్యాప్ మావారి చేతిలో పెట్టి కాస్త దారి చెప్పవయ్య అంటే, ఆ ప్లేస్ చాలా దూరం. ఫ్లై ఓవర్లు ఎక్కాలి, అండర్ పాసుల్లో దిగాలి, రౌండ్ అబౌట్లు తిరగాలి, ఎగ్జిట్లు తీసుకోవాలి, ఎన్నో సిగ్నళ్ళు దాటాలి…పైపెచ్చు ఆ దారంతా ట్రాఫిక్ మయం. డ్రైవింగ్గుల్లాంటి ఫీట్లు వొద్దు, మెట్రోలో వెళ్లమని ఓ సలహా పడేసారు.
ఇదంతా నాపై కన్సర్న్ అనుకునేరు..అస్సలు కాదండి బాబు. నేను గ్యారెంటీగా దారి తప్పుతాననే తన ప్రగాడ నమ్మకమూను, అలా తప్పి ఎటో వెళ్ళిపోయి, కారు ఏ మూలనో ఆపేసి, ఫోన్ కొట్టి…. I lost my way, ఎక్కడున్నానో తెలీదు, వెతుక్కునొచ్చి తీసుకెళ్లమంటానని ముందు జాగ్రత్తగా తనను తాను రక్షించుకునే దారన్నమాట అది.
అసలు సంగతేమిటంటే…. నేను దిక్కులు చూడటంలో దిట్ట, దారులు గుర్తుంచుకోవటంలో జీరో. అయినా బుజ్జి బుర్రలో ఎన్నని ఎక్కించుకుంటాం చెప్పండి. It needs pampering too, you know 🙂
మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ ఉంది. అక్కడ కారు పార్క్ చేసి, ట్రైన్ ఎక్కి జంక్షన్లో దిగి, అక్కడ స్టేషన్ మారి ఇంకో ట్రైన్ అందుకుని వెళితే, అక్కడ నుంచీ ఇన్స్టిట్యూట్ వాళ్ళ పిక్ అప్ వాన్ ఉంటుంది. దార్లు వెతుక్కునేకంటే ఇదేదో బాగానే ఉందే, ఎంచక్కా కూర్చుని దిక్కులు చూస్తూ ప్రయాణించొచ్చు అనుకున్నా. కూర్చునే అంత ఖాలీ ఉండదు, వేళాడుతూ వెళ్ళాలని నాకప్పుడు తెలీలేదు.
మొదటిరోజు కాస్త ముందుగానే బయలుదేరా. ఒక ట్రైన్ దిగి, ఇంకో ట్రైన్ అందుకునేవారు స్టేషన్లో పరుగులు పెడుతుంటే, వీళ్ళందరికీ ఇంత తొందరేంటి, ప్రతీ ఐదు నిమిషాలకు ట్రైన్ ఉందిగా అని నవ్వుకున్నా కూడా.
ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడ మారాలో తెలిసిపోయిందని మర్నాడు ఆలస్యంగా బయలుదేరి… హి హి హి నేను కూడా పరుగులు పెట్టా.
Travelling in metro gives a glimpse of life.
క్యాండీ క్రష్ ఆడుతున్న వారు, పేస్ బుక్ ట్విట్టర్ పోస్ట్లు చూస్తున్న వారు, వాట్స్ అప్ లో మెసేజింగ్ చేస్తున్నవారు, సన్నటి తీగలతో చెవులను మూసుకున్న వారు… సగానికి పైగా జనాలు తమ అరచేతిలో ఇమిడిపోయిన పరికరంలోకి తమ చూపుడు వేలితో ఇరుక్కుపోయారు.
అక్కడక్కడ న్యూస్ పేపర్ చదువుతున్నవారు ఉన్నారు. వయసులో పెద్దవారు, ప్రగ్నేంట్ స్త్రీలు, చిన్న పిల్లల తల్లులు వస్తే తాము కూర్చున్న సీట్లలోనుంచీ లేచి వారికి కుర్చోమనటం లాంటివి చక్కటి దృశ్యాలు.
కాలేజి కుర్రాడు ఓ పెద్దాయనకు అలా సీటు ఇవ్వబోతే ఆయన నవ్వుతూ వద్దన్నారు.
నేను రిటర్న్ వచ్చే టైంలో ఎయిర్లైన్స్ ఉద్యోగులు కొందరు ఎక్కేవారు. ఒకావిడ ఏకంగా నుంచునే తన మొబైల్లో సినిమా చూసేస్తుంది.
ట్రైన్లోని రాడ్నో లేక కార్నర్ లోనో ఆనుకుని నుంచుని కళ్ళు ముసుకుంటున్న వారిని చూస్తుంటే, లైఫ్ ఇస్ నాట్ ఈజీ అనిపిస్తుంది.
వెళ్ళిన నాలుగు రోజులు పిక్ అప్ వాన్ కోసం వెయిట్ చేస్తూ నాతో పాటూ మరో ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ వేరే కోర్స్ చేస్తున్నట్టున్నారు. నేను పలకరిద్దామన్నా, ఆవిడ చెవుల్లో ప్లే అవుతున్న మ్యూజిక్ నన్ను ఆపేసింది.
చిన్నప్పుడు మనం చేసిన రైలు ప్రయాణాలు గుర్తున్నాయా? రైలెక్కగానే కాస్త మొహమాటంగా సీట్లలో సర్దుకుని, బెర్తులు దించేసరికి పలకరింపులు, పరిచయాలు,స్నేహాలు అయిపోయేవి కదూ.
ఆ నాలుగు రోజుల్లో నేను చూసిన అధ్బుతమైన దృశ్యం…. వయసు డెబ్బైదాకా ఉంటాయనుకుంట! వృద్ధ దంపతులు. ఎవరూ ఆవిడపై పడకూడదన్నట్టు, జర్క్ లకు ఆవిడ ఎక్కడ తూలుతుందో అన్నట్టు ఆ పెద్దాయన తన చేతిని ఆవిడ భుజం చుట్టూవేసి భద్రంగా పొదిగి పట్టుకున్నారు. ఆయన మోహంలో ఎదో కళ, అంతే కంగారు కూడా ఉంది. ఆవిడ మొహం నాకంత కనిపించలేదు. వాళ్ళిద్దరూ ట్రైన్ దిగుతుంటే, ఆయనే తన ఆసరా కోసం ఆవిడను పట్టుకున్నారా అనిపించేలా ఉంది. వారి body language లో చెప్పలేని అన్యోన్యత. నిండు నూరేళ్ళు ఒకరికోసం ఒకరు బతకాలి ఆ పెద్దాలిద్దరూ.
నవ్వుతున్న పెదాలు, ఆలోచనలో ఉన్న కళ్ళు, నీరసంగా కదులుతున్న కాళ్ళు, హుషారుగా పరుగులు పెడుతున్న పాదాలు… ఆ అరగంట గంట ప్రయాణంలో రవ్వంత జీవితం కనిపిస్తుంది.
nice.