మూగచేతి బాసలు
వాడు ఆ మాట అనకుండా ఉండాల్సింది.
పెద్దమ్మ కళ్ళలో చివ్వున తిరిగిన కన్నీళ్ళు ఎవరికంటా పడకూడదని, “కాఫీ తీసుకొస్తా” అంటూ వంటింటి వైపుకు పెద్ద పెద్ద అంగలతో వెళ్ళింది. వెనుకాలే వెళ్ళాలో వద్దో ఓ క్షణం అర్థం కాలేదు.
నాకు తెలుసు, అక్కడ తన కన్నిటిని ఆపుచేయ్యాలని విఫల ప్రయత్నం చేస్తూ పాల ప్యాకెట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ లోని పాకెట్ కాలీ అయిపోయింది. ఏ కబోర్డ్ లో పెట్టానో పెద్దమ్మకు తెలీదు. పోనీ వెళ్ళనా…..వెళితే నన్ను చూసి బరస్ట్ అవుతుంది. ఇప్పుడు అందరి ముంది సీన్ చెయ్యటం వొద్దు.
మున్నీని నా దగ్గరకు రమ్మని సైగ చేసి, అమ్మమ్మకి మిల్క్ ప్యాకెట్ కింద సొరుగులో ఉందని చెప్పమన్నాను. అలాగే అమ్మ అంటూ ఎగురుతూ వెళ్ళింది పాప.
కిరణ్ వైపు కోపంగా చూసాను. వాడికి అర్థం అయిందో లేక పట్టించుకోలేదో తెలీదు. చియాకోతో ఏదో మాట్లాడుతున్నాడు. కనీసం ఆ పిల్ల ముందన్నా వాడా మాట అనకుండా ఉండాల్సింది.
“పద్మ కాఫీ తీసుకెల్లమ్మ”, లోపలినుంచే పిలిచింది. పెద్దమ్మ మొహం చూడనన్నా చూడకుండా ట్రే అందుకున్నాను.
అమ్మ నేను సర్వ్ చెయ్యనా అంటున్న మున్నీని వారించి లోపలకు వెళ్లి ఆడుకోమని పంపించేసాను. అమ్మమ్మను వదిలిపెట్టదుగా పాప.
అమెరికా రాజకీయాలు, భారతీయ సంప్రదాయాలు, అమెరికా వింటర్, ఇండియా సమ్మర్…ముక్తాయింపు మాటలు, కొనసాగింపు సంభాషణలు దొర్లుతున్నాయి. చియాకో జపాన్ సంప్రదాయాలు, వర్క్ కల్చుర్ జతచేస్తోంది.
“Where is aunt”, తన జపాన్ యాసలో అడిగింది.
“I will check”, తప్పదన్నట్టు లెగవబోయాను.
“మీకు అభ్యంతరం లేకపోతే నేను లోపలకు వెళ్ళనా?”, చియాకో ఎంతో వినయంగా అడిగింది.
నాకేం చెయ్యాలో తోచలేదు. “ప్లీజ్ గో”, పెద్దనాన్న చెయ్యి చూపించారు.
వంటింటి విండోలో నుంచీ బయట కురుస్తోన్న మంచును చూస్తున్నట్టు నుంచుని ఉంది పెద్దమ్మ.
“పెద్దమ్మ, చియాకో వచ్చింది”, సమాచారం ఇచ్చినట్టుంది నా గొంతు.
పమిటతో గబగబా మొహం తుడుచుకుని తిరిగింది. కొంగు అవసరం చియాకోకు అర్థం కాకపోతే బాగుండు.
వాళ్ళిద్దరి మధ్యన ట్రాన్సిలేటర్ అయ్యాను నేను.
“కిరణ్ ఏమన్నాడో నాకు అర్థం కాలేదు. మీరు హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ప్లీజ్ డోంట్ వర్రీ ఆంట్. బిలివ్ మి”,
తన మాటలు తెలుగులో అనువాదం చేస్తూ చియాకోను చిన్నగా తడిమాను. నా స్పర్శలో కృతజ్ఞత చియాకోకు తెలీకుండా ఉండదని తను మాట్లాడిన ఆ మాట నాకు చెప్పింది.
సంశయిస్తూనే పెద్దమ్మ చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. పెద్దమ్మ మొహమాటంగా నవ్వింది.
రోజు సర్దుమనిగాక పెద్దమ్మ పక్కకు చేరాను. అమ్మంత ఆప్యాయత మా ఇద్దరిలోనూ.
“ఆ మాట అనే హక్కు వాడికి ఉంది. మేమేగా వెతికి పెళ్లి చేసాం, తప్పు మాదే”, బాధగా అంది పెద్దమ్మ.
“పెళ్లి తంతు ప్రస్తావన నేనూ తేకుండా ఉండాల్సింది పెద్దమ్మ. నువ్వన్న ఆ చిన్న మాటకే వాడలా రెస్పాండ్ అవుతాడని అనుకోలేదు”
“ఎంత ఎదిగిన కొడుకైనా, నా జీవితపు నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఇక మీ జోక్యం చాలు అంటే తట్టుకోవటం కష్టమే తల్లీ”, పెద్దమ్మ కళ్ళు తడారిపోయాయి.
“ఎదగటం కాదు పెద్దమ్మ, తగిలిన ఎదురు దెబ్బలు”. అవునన్నట్టు తలూపింది పెద్దమ్మ.
మాట్లాడటానికి ఇంకేం మిగలలేదన్నట్టు కళ్ళు మూసుకుంది పెద్దమ్మ. పెళ్లిలాంటి విషయాలలో మనం మన మూలాల్లోకి ఎంత లోతుగా ఇరుక్కుపోతామో తలగడపై జారిపడిన పెద్దమ్మ కంటి చుక్క చెప్పకనే చెప్పింది
కిరణ్ పెద్దమ్మ పెద్దనాన్నలకు ఏకైక సంతానం. వారిద్దరి ప్రాణాలన్నీ వాడి పైనే. ఉద్యోగరీత్యా వాడు అమెరికా వస్తునప్పుడు వాళ్ళు నాకు అప్పచెప్పిన ఒప్పగింతలు నాకింకా గుర్తే.
“అక్కా నేనేం చిన్న పిల్లాడ్ని కాదు”, అని వాడు విసుక్కుంటున్నా , “అక్కడ నువ్వున్నావన్న ధైర్యమే తల్లీ మాకు” అన్నారు ఇద్దరూ.
కిరణ్ పెళ్లి పెద్దమ్మ కుటుంబాన్ని కుదిపేసింది. ఆ అమ్మాయికి వీడికి పొసగలేదు. నీకు అహంకారం అని మాటలతో తూట్లు పొడిచింది.
“ ఏ అక్కా, మగాడు బండరాయా? నేనెంత ప్రేమగా ఉందామని ప్రయత్నించినా విదిలించేస్తుంది. చాలా ప్రయత్నించాను. ఇంక నావల్ల కాదు. నాకూ ఆత్మాభిమానం ఉంటుంది, ఇగో అని ట్యాగ్ లైన్ తగిలించినా”, తేల్చేసాడు.
ఆ అమ్మాయితో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించాను. నన్ను ఆడపడుచుగా మాత్రమే చూసింది.
ఆ సెపరేషన్ ట్రామా నుంచీ బయట పడటానికి కిరణ్ కన్నా పెద్దమ్మ పెద్దనాన్న ఎక్కువ సమయం తీసుకున్నారు. పెద్దమ్మ పెద్దనాన్న అడపాదడపా అమెరికా వస్తూ పోతున్నా, ఎందుకో తెలీదు…కిరణ్ కు వారికి మానసిక దూరం పెరిగింది.
పైకి మాములుగా కనిపిస్తున్నా, హి ఇస్ కోల్డ్ ఇన్సైడ్. వాడి ప్రేమ, అహం రెండూ దెబ్బతిన్నాయి.
అమ్మాయిల జీవితంలో పెళ్లి పాత్ర ఎంత పెద్దదో నొక్కివక్కాణించే మన వ్యవస్థ అబ్బాయిలను నిర్లక్ష్యం చేసిందని అనిపించింది కిరణ్ ను చూస్తుంటే.
మరో పెళ్ళికి సంభందాలు చాలానే వచ్చాయి. వాడి దగ్గర పెళ్లి మాట ఎత్తటానికే భయపడింది పెద్దమ్మ. ఒకసారేప్పుడో, సంభందం మంచిదమ్మా, నువన్నా వాడితో చెప్పి చూడని పెద్దనాన్న అన్నారని కిరణ్ ను కదిలించాను.
వాడి మార్గంలో వాడిని వెళ్ళనివ్వటం తప్పితే మేము చెయ్యగలిగింది ఏమీ లేదని వాడి మౌనం మా అందరికి చెప్పేసింది.
ఇదంతా జరిగి కొన్నేల్లయింది.
చియాకో అనే జపాన్ అమ్మాయితో లివ్ ఇన్ రేలషన్ లో ఉంటున్నాడు. ఆ సంగతి వాడేం దాచలేదు. మా అందరికీ సూటిగా నిక్కచ్చిగా చెప్పాడు.
వాడికో తోడు దొరికితే చాలు అనుకున్న పెద్దమ్మ తల్లడిల్లిపోయింది. ఎవరో పరాయి పిల్లని వాపోయింది.
పరాయి పరిధిని ఎవరు ఎలా గీస్తారో ఎవరన్నా తేల్చగలరా?
పెదనాన్న కొంత పర్లేదు. పెద్దమ్మ తట్టుకోలేకపోతోంది. ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉంది వెళ్ళండి, మీకు అవగాహన వస్తుందంటే వచ్చారు ఇద్దరూను. డైరెక్ట్ గా కిరణ్ దగ్గరకు వెళ్ళటం కంటే నా వద్దకు రావటం పెద్దమ్మకు మంచిదని నాదగ్గర దిగారు.
చియాకోను తీసుకురమ్మని కిరణ్ కు చెప్పను.
“మీ తృప్తి కోసం పెళ్లి తంతు జరిపిస్తే బాగుంటుంది పెద్దమ్మ”, మాటల మధ్యలో అన్నాను.
“మాదేముందమ్మా, అంతా వాడి ఇష్టం”, పెద్దమ్మది అసహనమో అసంత్రుప్తో నిస్టురమో మరి!
“ఇంక మీకా అవకాశం ఇవ్వను”, కటువుగా అన్నాడు కిరణ్. వాడి విసుగుకు పెద్దమ్మ గొంతులో ధ్వనించిన నిష్టురమే కారణం.
ఎవరినీ తప్పుపట్టలేం, ఎవరి పరిధిలో వారు కరక్టే. ఎవరికీ సర్దిచెప్పాల్సిన అవసరమే లేదు. తల్లి ఆపేక్ష కొడుకుకీ తెలుసు, కొడుకు అంతరంగం ఆ తల్లికీ తెలుసు. ఎదో చిన్న అనివార్య అంతరం…మరేదో అపనమ్మకం.
కాకతీయంగా జరిగిన ఈ సంఘటన చిన్నదే కావొచ్చు. హ్యూమన్ ఎమోషన్స్ లోని సేన్సిటివిటికి ఒక ఉదాహరణ. ఆ సున్నితత్వంలోనే మన బంధాలలోని పటుత్వం ఉంది కాబోలు.
వాళ్ళున్న ఆ పది రోజులు ఇంచున్నర మంచు కురుస్తూనే ఉంది. అదీ ఒకందుకు మంచిదే అయింది, మాతో మేము సంభాషించుకునే సమయం చిక్కింది.
ఒక్క రోజు కోసమే వచ్చిన చియాకో ప్రయాణం మంచు కారణాన మరో రోజుకు వాయిదా పడింది.
పెద్దమ్మకు ఇష్టమని బీరకాయ పాలుపోసిన కూర వండుదామనుకున్నా. నాకు వంట చెయ్యటం ఇష్టం అంటూ వంటిట్లోకి వచ్చింది చియాకో. తరుగుతున్న బిరకాయలను నా చేతిలో నుంచీ అందుకుని, “సుషీ రోల్స్ చేసేదా” అనడిగి, “కొంచెం ఇండియన్ టచ్ తో చేస్తాను. కిరణ్ కు చాలా ఇష్టం”, అంది.
“అయితే ఇవ్వాళ మాకు ఇండో జపాన్ క్యుసైన్ అన్నమాట “, ఇన్ గ్రేడియాంట్స్ ఎక్కడున్నాయో చూపిస్తూ అన్నాను.
పూజ పూర్తిచేసుకుని వంటిట్లోకి వచ్చిన పెద్దమ్మ, “ఆ అమ్మాయికి పని చెప్పావా. అయ్యో తనకేం తెలుస్తుందమ్మా, ఇబ్బంది పెట్టమాక”, చియాకో చేతిలోని నైఫ్ ని అందుకోబోయింది.
చియాకో ఏదో అంది. తనేమందో పెద్దమ్మకు అర్థం కాలేదు. “ఈ అమ్మాయి ఏమంటుందో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు”, పెద్దమ్మ విసుక్కుంది.
ఆంట్ అంటూ పెద్దమ్మ పక్కకు వచ్చి పప్పు డబ్బాను చూపిస్తూ ఒక్కో మాట నిదానంగా ఒత్తిపలుకుతూ నాకు ఇండియన్ కుకింగ్ వచ్చు అని సైగలతో చెపుతోంది. చియాకో తెలుగులో పప్పు పలికిన విధానానికి నేను పెద్దమ్మ నవ్వు ఆపుకోలేకపోయాము. మా నవ్వుకు ఉడుక్కున్నట్టు మొహం పెట్టింది.
పెద్దమ్మ పప్పు పులుసు వండుతోంది, చియాకో రోల్స్ చేస్తోంది. ఒక్కో మాట ఒక్కో సైగ వారిద్దరి మధ్యన ఏర్పడిన నిశబ్దాన్ని చేదించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. చియాకో వ్యాక్యంలో తనకు తెలిసిన ఒకటో రెండో ఇంగ్లిష్ పదాలతో సందర్బాన్ని బట్టి పెద్దమ్మ తోచిన భావాన్ని అర్థం చేసుకుంటోంది.
పెద్దమ్మ ప్రయత్నిస్తున్న సైగలు అర్థం చేసుకోలేక చియాకో ఇబ్బంది పడుతోంది. నేను కావాలనే వారిద్దరి మధ్యకు వెళ్ళలేదు. వంటిట్లోకి వస్తూ పోతూ ఉన్నాను.
వంట దాదాపుగా పూర్తయిపోయింది. పెద్దమ్మ పులుసులో తాలింపు పెడుతోంది.
“ఐ లవ్ కిరణ్, విత్ అవుట్ హిం మై లైఫ్ ఇస్ ఎంప్టీ”, ఇంగువను అందిస్తూ అంది చియాకో. పెద్దమ్మకు ఎంత అర్థం అయిందో తెలీదు కానీ, చియాకో కళ్ళలో పల్చగా కనిపించిన తడి ఆవిడ మనసును తాకకుండా ఉండలేదు.
“టేబుల్ సర్దేయ్యనా”, అడిగాను.
డిన్నర్ ప్లేట్స్ తీసుకొస్తున్న చియాకో వీపును పెద్దమ్మ సుతారంగా నిమిరింది.
పెద్దమ్మ మనసులో ఓ చిన్నపాటి నమ్మకాన్ని నాటి తిరుగు ప్రయాణమయ్యింది చియాకో.
చలి కారణానేమో పెద్దమ్మ మోకాళ్ళు పట్టేసాయి. మేడ మెట్లు దిగటానికి కూడా ఇబ్బంది పడుతోంది. “పెద్దమ్మ నువ్వు కిందకు రాకు, కాఫీ నేనే తీసుకోస్తానుండు”, అంటూ మెట్లు ఎక్కబోతున్నాను.
“అక్కా, నాక్కూడా కాఫే ఇవ్వు. కొన్ని బిస్కట్స్ ట్రే లో పెట్టు, నేను ఎలాగు పైకి వెళ్తున్నా”, అన్నాడు కిరణ్.
పెద్దమ్మకు చిన్న నలత చేసినా కంగారు పడిపోయి గొడవ గొడవ చేసేవాడు చిన్నప్పుడు. వాడు ఎందుకు పైకి వెళ్తానంటున్నాడో నాకు తెలీదూ!
పెద్దమ్మ, పెద్దనాన్న కిరణ్ తో ప్రయాణమయ్యారు.
“వీలు చూసుకుని నువ్వు బావ రండి. వి విల్ హావ్ అ గాధరింగ్”, సూట్ కేసులు డిక్కీలో సర్దుతూ అన్నాడు కిరణ్. నవ్వుకుంటూ వీడ్కోలు చెప్పాను.
ఆ జపాన్ పిల్ల కోసం పెద్దమ్మ ఇండియా నుంచీ తీసుకొచ్చిన ఎర్రంచు కోరా చీర సూట్ కేసు అడుగు మడతల్లో భద్రంగా ఉంది. ఆ చీర కొనే నాటికి పెద్దమ్మకు ఈ జపాన్ పిల్ల పేరన్నా సరిగ్గా తెలిసుండదు. తిరస్కారానికి మనకు ఎన్ని కారణాలు ఉంటాయో , ఆమోదానికి అన్నే కారణాలు ఉంటాయి కదూ. ఇక్కడ అంగీకారం రాత్రికి రాత్రే రాకపోయినా, పెద్దమ్మ మనసులోని సంశయాలకు కాలమే జవాబు చెప్పగలదు , తృప్తి పరచనూగలదన్న నమ్మకం నాకుంది.
ప్రచురణ : తానా పత్రిక జనవరి,2014
Very nice…