పేచి జీన్స్ ఎక్కడికి పోతాయి!
జీవితంలో ప్రతి స్టేజీలోనూ కష్టాలుంటాయండి, నిజం!
కాళ్ళు చేతులు టపటపా కొడుతూ, ఉంగా ఉంగాలు చెపుతూ అడేసుకునే చంటిదాని నోట్లో వాళ్ళమ్మ పాలపీక పెట్టెస్తుందా! చిట్టితల్లి తాగినన్ని తాగి ఇంక వద్దంటున్నా , అమ్మేమో తృప్తి పడదు. పాపం, ఎంత కష్టం!
బుజ్జిది ఇంకొంచెం పెద్దవగానే…. లక్కపిడతల్లో అన్నం,పప్పు, కూర, చారు వండి వార్చి పెట్టాలా ఇంట్లో అందరికీను! బంగారు తల్లి ఎంత బిజీ! అమ్మేమో….ఒక్క ముద్ద, ఇంకొక్క ముద్ద అంటూ నస పెట్టేసి విసిగించేస్తుంది. పాపం ఎంత కష్టం!
నాక్కూడా అచ్చం ఇలాంటి కష్టాలే చిన్నప్పుడు. అమ్మకు పనిపాట ఏం లేదు. ఎప్పుడు చూసినా ఇది తిను, అది తిను అంటూ నా ప్రాణం తీసేది.
హమ్మా! నేనేమన్నా తక్కువా??
ఒక ఇంచు పోడుగయ్యే సరికి రాకేట్టులా దూసుకెళ్ళే తెలివితేటలు(ఆ…ఆ … అదేలేండి…దొంగ పనులు) నేర్చేసుకున్నా ఎంచక్కా.
ఇంట్లో ఎవరికీ ఉహకు సైతం అందని రహస్య స్థావరాలు వెతుక్కున్నా. BTW ఇలా చదివేసి అలా మర్చిపోండి. ఎవరికన్నా చెపితే మర్యాదగా ఉండదు. ప్రామిస్..గాడ్ ప్రామిస్! డాడ్ కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా!!!
ఇష్టపడని పదార్థాల లిస్టు రాస్తే చాంతాడంత అవుతుంది. అందుకని కొన్ని చెపుతా.
ఎగ్ వైట్…యాక్!! ఎలా ఎక్కడ పడేయ్యోచ్చంటే……మిగతా అన్నం తినేసాక నోట్లో దాచేయ్యాలి. బుగ్గల్లో పెట్టకూడదండోయ్, తెలిసిపోగలదు. నాలుక పై జాగ్రత్తగా బాలన్స్ చేసి టాయిలెట్ లోకి వెళ్లి, ఇంకేం ఉంది ఫ్లష్ ఇట్ అవుట్ ట్ట్ ట్ట్ ట్ట్…as simple as that 🙂
ఈ టేక్నిక్ చానళ్ళు పనిచేసింది. ఓవర్ కాన్ఫీడేన్స్ ఎక్కువై, ఓ రోజు క్షణంలో తినేసా అని చెప్పేసరికి అమ్మకో నాన్నకో అనుమానం వచ్చి…ఓపెన్ యువర్ మౌత్ హాహా అనేసరికి రేడ్ హాడేడ్ గా దొరికిపోయి, వీపు విమానం మోత మోగింది 😦
ఇప్పడు ఇంకో టేక్నిక్, వంటిట్లో ఎవరూ లేని ఛాన్స్ దొరికితే, చేతికి దొరికిన పనిముట్టు..గరిటె, స్పూన్, పట్టుకార, లైటర్ ఎదో ఒకదానితో డస్ట్ బిన్ లో గొయ్యి తీసి గుడ్డు గారిని సమాధి చేసేయ్యటం. కాకపొతే, ఈ పద్దతి ఎక్కువ రోజులు నడవలేదు. మా పనమ్మాయి అస్సలు మంచిది కాదు. బిన్ లో గుడ్డు కనిపిస్తే గమ్మున ఉండకుండా అమ్మగారూ అంటూ రుజువులతో సహా చెప్పేసింది. నేను కాదని ఘంటాపదంగా బల్లి గుద్ది, టేబుల్ రుద్ది చెప్పినా ఎవరూ నమ్మలేదు. అవన్నీ నీ పనులే అనుకుంటూ పనిష్మెంట్ ఇచ్చేసారు. 😦
మన తిండి వ్యవాహారం బహుబాగా తెలిసిన డాడ్, నాకు బలవంతంగా అయినా బలవర్ధక ఆహారం పెట్టాలని కంకణం కట్టుకుని, రాత్రుళ్ళు పోడుకునే ముందు నా సైజు అరటిపండుకు నా చేతిలో పెట్టేవారు. నేనేమో మంచం కిందో, పుస్తకాల పక్కనో పెట్టేసి మర్నాడు పడేయ్యటం మర్చిపోయి స్కూల్ కు వేల్లిపోయేదాన్ని. అలా దొరికిపోయినప్పుడు డాడ్ క్లాసు పికేవారు…ప్చ్ ఎందుకులేండి! భూప్రపంచపు బీధ దేశాల లిస్టు నాకళ్ళ ముందు కనిపించేది. 😦
సెలవులకు అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు, పండగే పండగ. పల్లెలో రహస్య ప్రదేశాలకు కొదవే ఉండదు. కుడితి తొట్టి, గడ్డివాము కాదేది రహస్యానికి అనర్హం. మూడో కంటికి తెలీదు, ఒకవేళ తెలిసినా ఏమి అనరు..మరి గారాబం కదా! 🙂
మా అమ్మకు కూడా నా లెవెల్ తెలివితేటలు చాలానే ఉండేవి. తను గట్టిగా చెప్పినా, తిట్టినా మనమేం పట్టించుకునేవాళ్ళం కాదు కదా. అందుకని, ఇడ్లీల్లాంటి గొంతు దిగని వంటలు వండినప్పుడు, “ఇడ్లీ రెడీ, టిఫిన్ కు రండమ్మా ”, అని పిలిచేది కాదు…అరిసేది! ఇక్కడ గూడుపుటాని ఏమిటంటే, ఈ పిలుపు డాడ్ కు వినిపించాలి. న్యూస్ పేపర్ పక్కన పడేసి ఆఘమేఘాలపై వచ్చేసేవారు.
వయసుతో పాటూ ఈ పేచీలు చాలావరకు పోయినా, అమ్మ వంట, తిండి విలువ పోస్ట్ graduation లో హాస్టల్ కు వెళ్ళినప్పుడు తెలిసొచ్చింది. బేసిన్ లో అన్నం, గిన్నెల్లో ఏవేవో కూరలు…రుచి పచి లేని కురల్ని మనమే వడ్డించుకుని తినటం. అప్పుడప్పుడు స్పెషల్ కూరలు వండేవారు. అవి ఏమిటంటే, నూని కారే బెండకాయ fry, పచ్చడైపోయిన వంకాయ కూర. అసలు కామెడి ఏమిటంటే, ఈ సో కాల్డ్ స్పెషల్ కూరలు లిమిటెడ్ గా వడ్డించేవారు. ఒక గరిటెతో ప్లేట్లో వెయ్యటం…హతవిధీ హతవిధీ!!!!
ఆదివారాలు రవ్వదోశ, ఇప్పటికీ నాకు రవ్వ దోశంటే భయం!
సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు, సోమాలియా బాధితురాలిలా తెగ తినేదాన్ని.
గతం గతః. రింగి రింగుల్లో నుంచీ వర్తమానంలోకి వచ్చేదాం.
వండటం, వడ్డించటం, తినటం, కడుక్కోవటం దినచర్యలో భాగాలైపోయాయి ఇప్పుడు.
ఇడ్లినా???!! అని ఇంటాయన అంటే, ప్లేటు పక్కన పెట్టేసి, అయ్యవారిని కూర్చోపెట్టి…..పప్పు నానపోయటం, రుబ్బటం (వెట్ గ్రైండరే అయినా, రుబ్బురోలులో రుబ్బినట్టు), పులవటం (రాత్రంతా పిండి పక్కన కుర్చుని పులుసేటట్టు చేసినట్టు), వండటం, గిన్నెలు కడగటం, బోర్లించటం, సర్దటం దాకా ఉన్న కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు, చెవులకు నొప్పి వచ్చేటట్టు విడమర్చి విశీదికరించి చెప్పెయనూ! మరే! ఇడ్లిలంటే అంత ఈజీ గా ఉందా??హమ్మా…..
ఎక్వరియం లో చేపలు ఫీడ్ తినటం చూడటం ఎంత బాగుంటుందో!
ఇంత వరకు కధ బాగానే ఉంది. అసలు వ్యధ ఇప్పుడే మొదలైంది !
మా బుడంకాయలు…బుడుగు, పిడుగు అనుకుందాం. తిండి దగ్గర పేచిలు షరా మామూలే.
KG1 లో జాయిన్ చేసినప్పడు ఇద్దరినీ ఒకే సెక్షన్ లో వేసారు. మేము కుడా పోన్లే ఇద్దరూ ఏడవకుండా ఉంటారు అనుకున్నాం.
ఒకానొక పేరెంట్ టీచర్ మీటింగ్ లో టీచర్ కంప్లైంట్,
“ప్రతీ రోజు టిఫిన్ బాక్స్ చెక్ చేస్తాను. బుడుగు బాక్స్ ఎప్పుడు ఫుల్ గా ఉంటుందని వాడిని కోప్పడుతున్నాను. వాడు కుడా ఎప్పుడు ఏమి అనలేదు. ఒక రోజు పిడుగు తన ఫుడ్ అంతా బుడుగు డబ్బాలా వేసేయ్యటం చూసాను. పాపం, అనవసరంగా బుడుగును తిట్టాను. ఆ రోజు నుంచీ వాళ్ళిద్దరిని పక్క పక్కన కుర్చోపెట్టట్లేదు”, అని సెలవిచ్చారు.
తప్పు అలాంటి పనులు చెయ్యొద్దు , ఫుడ్ తినాలి, తినకపోతే వీక్ బాయ్ అయిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చాం.
KG 2 కి వచ్చారు. ఈసారి చెరో సెక్షన్.
ఓ రోజు బస్ నానీ, “ఈరోజు దోశ పెట్టారా పిడుగుకి”, అని అడిగింది.
ఈవిడేంటి ఇలా అడుగుతుంది అనుకుంటూ అవును అన్నాను.
“అయ్యో, మేడం….మీవాడు రోజూ బస్ సీట్ కింద ఫుడ్ పడేస్తున్నాడు. నేను ఎవరో అనుకున్నా, ఈ రోజు పడేస్తుంటే చూసా”, అని చెప్పింది.
అలా చెయ్యొద్దు అని మెల్లగా చెప్పాం. వాడు వింటేగా! పిర్ర మిద ఒకటిచ్చినా ఉపయోగం లేదు.
ఈ సంవత్సరం, టిఫిన్ బాక్స్ కాళిగా వస్తుంది. ఫుడ్ అమవుతుందో తెలీదు. అడిగితే, చెప్పింది చెప్పకుండా ఏమిటేమిటో చెపుతున్నాడు.. 😦
పిడుగు గాడికి భూప్రపంచంలో ఇష్టమైన ఏకైక వస్తువు…పెరుగు! దానికో కారణం కూడా ఉంది. నోట్లో పెట్టగానే గుటుక్కున మింగేయ్యొచ్చు! భగవంతుడా…….
ఇంత లేదు, అసలు వాడికేం కష్టం! వండి పెడుతుంటే తినకుండా చంపేస్తున్నాడు. తినటానికి కూడా బాధే వాడికి, విసిగించేస్తున్నాడు. అమ్మకేం పనిలేదు, ఎప్పుడు తిండి గోలే అనుకుంటాడు వీడు….(మీరేమి మొదటి లైన్లు గుర్తుతెచ్చుకోనక్కర్లేదు)
నా ఈ గోడు అమ్మతో చెప్పుకుంటే, “మరి ఎవరి సంతానం! నీ తలలో నుంచీ పుట్టుకొచ్చాడు. నేను పడలేదూ నీతో? అనుభవించు!”, అని నవ్వేసింది.
“నువ్వు అమ్మవు అయితే కానీ నా బాధ నీకు అర్థం కాదు”, అనేది అమ్మ మా చిన్నప్పడు. నిజం!
These memories are so fresh. It’s a flow while writing….
Wel said and agreed to every bit of it…well written
no words to express