ఆవలి తీరంలోనూ


ఆవలి తీరంలోనూ…. 

వారం రోజుల నుంచీ సాగుతున్న వాగ్వివాదానికి తెర దింపుతూ తన మనసులోని భావాన్ని తెరకెక్కించాడు శేఖర్.

“ఈ మాట అంటున్నది నువ్వేనా శేఖర్!!”, దిగ్భ్రాంతిగా అతన్నే చూస్తూ ఉండిపోయింది మహి.
ఆమె చూపుల తీవ్రతను తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మనసులో సుడులు తిరుగుతున్న ఆవేదనతో అక్కడే కూర్చుండిపోయింది.

నేనసలు నమ్మలేక పోతున్నాను! నువ్వేనా అలా మాట్లాడింది? ప్రాక్టిసుకు టైం కుదరదని, హెక్టిక్ అయిపోతుందనీ , ఇన్నేళ్ళ తర్వాత చెయ్యగలవా? ఎందుకులే రిస్క్, టైర్డ్ అయిపోతావేమో…..ఇలా నువ్వు చెపుతున్న కారణాల వెనుకున్న భావం ఇదా? శేఖర్ నీ దగ్గర నుంచీ ఇలాంటి రెస్పాన్స్ నేనేప్పుడూ ఎక్ష్పెక్ట్ చెయ్యలేదు… తనలో తనే మాట్లాడుకుంటూ అలా ఉండిపోయింది.

మహి కళ్ళలో సన్నటి తడి.

“మహీ, గ్రోసరీ కొనటానికి వెళ్దామన్నావు”, శేఖర్ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు.

“గివ్ మి సమ్ టైం”, తన తడి కళ్ళను అతని కంట పడనీయలేదు. ఎదో నామోషీ…

మహి చదువుకునే రోజుల్లో భరతనాట్యం నేర్చుకుంది సుమారు పదేళ్ళ పైనే సాగింది ఆమె నాట్యాభ్యాసం. స్కూల్ లో, కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్లోనూ ఆమె నృత్య ప్రదర్శన వుండేది. కొన్ని స్టేజి షోలు చేసింది, అవార్డులూ అందుకుంది. పుట్టింట్లో ఒక షోకేస్ నిండా ఆమె అవార్డులు, కప్పులే ఉంటాయి. మహి నాన్నగారు వాటిని ఏంతో అపురూపంగా చూసుకుంటూ వుంటారు. ఇండియా వెళ్ళినప్పుడల్లా ఆ కప్పులనన్నింటినీ శుభ్రంగా తుడిచి అల్మైరా సర్దుకుంటుంది. తండ్రీ కూతుర్లిద్దరూ వాటి గురించిన జ్ఞాపకాలను తలుచుకుంటూ అద్వితీయమైన ఆనందాన్ని పొందుతారు.

డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు తన చివరి నృత్య ప్రదర్శనను ఇచ్చింది. ఆ తర్వాత పెళ్ళి, పరదేశ ప్రయాణం, ఉద్యోగం, పిల్లల పర్వంలో నృత్యం అట్టడుగు పొరలో నిక్షిప్తమైపోయింది. పెళ్ళైన కొత్తలో అప్పుడప్పుడు శేఖర్ కు డాన్స్ చేసి చూపించేది. ఆ తర్వాతర్వాత ఆ సంగతే మరిచిపోయింది.

మళ్ళీ ఇన్నాళ్ళకు ప్రదర్శన ఇవ్వాలన్న ఆలోచన కలిగింది, దానికి తగ్గట్టుగా అవకాశమూ వచ్చింది. అక్కడ తెలుగు సంస్థ వారు ప్రతీ ఏడాది దీపావళి పండుగ సంబరాలు జరుపుతారు. అందులో భాగంగా సాంస్కృతిక సభలు జరపడానికి భారతదేశం నుండి కళాకారులను పిలిపిస్తారు. ఈసారి స్థానికులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించి, నృత్యం, సంగీతం మీద ఆసక్తి ఉన్న వారి పేర్లు నమోదు చేయవలసినదిగా ఈమెయిలు పంపించారు.

మహి స్నేహితురాలు లలిత ఫోన్ చేసి, “ఈసారి మనిద్దరం భరతనాట్యం చేద్దామా?” అని అడిగింది. లలిత ఆ ప్రస్తావన తేవటం మహికి ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయి.

లలితకు నాట్యంతో కొంత పరిచయం ఉంది . కాలేజీ రోజుల్లో నేర్చుకుంది. . లలిత భర్త మధు, శేఖర్ ఒకే ఆఫీసులో పనిచేస్తారు.

“ఈసారి దీపావళి సంబరాలలో నేను లలిత కలిసి భరత నాట్యం చేద్దామనుకుంటున్నాం, నువ్వేమంటావ్ శేఖర్”, “ అంటూ మొదలైన సంభాషణ , చిలికి చిలికి గాలివానయై “నా భార్యగా నువ్వు స్టేజీ పైకెక్కి పది మంది ముందు డాన్స్ చెయ్యటం నాకిష్టం లేదు, అది భరత నాట్యమైనా, కూచిపూడైనా మరేదైనా”, అంటూ ముగిసింది.

***

“మహీ, శేఖర్ ఒప్పుకున్నారా?”, లలిత ఫోన్.

“శేఖర్ గురించి కాదు, నాకే కుదురుతుందో లేదోనని నేనే ఆలోచిస్తున్నా లలితా ”, శేఖర్ అన్న మాటను చెప్పలేక అంది మహి.

“మధు ససేమిరా అనేసాడు”, లలిత గొంతులో నిరాశ వినిపించింది.

“అనుకున్నాలే . మధు గారి సంగతి తెలిసిందేగా”

“ఏమిటో మహి చాలా నిరాశగా ఉంది”.

“లలితా అన్నీ సీరియస్ గా తీసుకోకు. ఆఫీసు, ఇల్లు, పిల్లలతోనే సరిపోతుంది కదా మనకు. మళ్ళీ డాన్స్ అంటే ఏంతో సాధన చెయ్యాలి, కష్టమయిపోతుందని మధు ఉద్దేశ్యం అయివుంటుంది! ”, తనే సమన్వయపరచుకోలేని విషయాన్ని లలితకు సర్ది చెప్పాలని ప్రయత్నించింది.

“అది కాదులే మహీ! కుదిరితే సాయంత్రం కలుద్దామా?” అడిగింది లలిత.

“నాకు మూడు గంటలదాకా దాకా క్లయింట్ తో మీటింగ్ ఉంది. మూడున్నరకు మా ఆఫీసు దగ్గరకు రాగలవా?”

ఆ సాయంత్రం మూడున్నరకు వాళ్ళిద్దరూ స్టార్ బక్స్ లో ఒక మూలగా వున్న టేబుల్ దగ్గర కపూచినో తాగుతూ కూర్చున్నారు.

talk3“నేను అనే భావం నాలో అంతర్ధానం అయిపోతుందా అనిపిస్తుంది మహీ ”, నిశబ్దంగా పరుచుకున్న ఆలోచనలను కదిలిస్తూ అంది లలిత.

“అర్ యు అల్ రైట్ లలితా ? ఇంట్లో అంతా బాగానే ఉందిగా?”

“బాగలేదని చెప్పటానికి ఏమీ లేదు మహి. అలాగని బావుందని కూడా అనలేను”

“ఈ డాన్స్ ప్రోగ్రాం గురించి ఏమైనా మాట మాట అనుకున్నారా?” , అడిగింది మహి.

“ఇప్పుడీ వయసులో నేను స్టేజీ ఎక్కి నాట్యం చెయ్యకపోతే కొత్తగా పోయేదేమీ లేదు. అదొక చిన్న ఆలోచన, సంబరము మాత్రమే. కానీ…ఎదో కోల్పోతున్న భావన. ఒకరి ఆధీనంలోనూ, అజమాయిషిలోనూ బతుకుతున్నానా అనే సందిగ్దం”

“పెళ్ళయాక కొంత సర్దుబాటు తప్పనిసరే కదా లలితా ”

“అది సర్దుబాటైతే ఇద్దరికీ వర్తిస్తుంది కదా మహీ ? ప్రతిసారీ నేనే ఎందుకు సర్దుకోవాల్సి వస్తుంది?”

కాఫీ తాగటం కూడా మరచిపోయి ఏటో చూస్తుంది లలిత.

“పిల్లల్ని కంటి నిండా చూసుకోకుండా ఉదయాన్నే డే కేర్ లో వదిలేస్తాను. సాయంత్రం వెళ్తూ తీసుకెళ్తాను. నిద్ర లేచిన దగ్గర నుంచీ ఒళ్ళు హూనం అయ్యేట్టు పనిచేస్తున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నానూ అని”

“నీ కోసం , నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ”

“హూ…..అలాగే సర్ది చెప్పుకుంటున్నా. చెపితే వింతగా ఉంటుందేమో! నెలకు ఇంత సంపాదిస్తున్నానా మహి, నాకు ఆర్ధిక స్వేఛ్చ కూడా లేదేమోననే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగని నన్ను ఏది కొనుక్కోవద్దనడు మధు. ఇంట్లో ఏ వస్తువుకీ లోటు లేదు.

మొన్నీమధ్య నాన్నకు ఆరోగ్యం బాగోలేదని ఇంటికి యాభైవేల రూపాయిలు పంపించాలన్నానని ఎంత రభస జరిగిందో తెలుసా ! ఆ వాదులాటలో మధు వాళ్ళింటికి మూడు లక్షలు పంపించాడని తను అనే దాకా నాకా సంగతే తెలీదు. ఆలోచిస్తే అనిపిస్తుంది, నాకు లేనిది ఆర్ధికస్వేఛ్చ కాదు, భావస్వేఛ్చ.

ఎస్, భావస్వేఛ్చ లేదు మహి నాకు”, లలిత గొంతు బొంగురుపోయింది.

“చదువు, ఉద్యోగాలతో సాధికారత సాధించేసాం అనుకుంటాం. ప్రధానంగా ఉండాల్సిన భావ స్వేఛ్చ ఇప్పటికీ సాధించుకోలేకపోయాం”, లలితతో ఏకీభవిస్తూ అంది మహి.

“మన పిచ్చి కానీ…. ఈ తరంలో చదువులు, సంపాదనతో మనమేదో ప్రగతి సాధించేసాం అనేసుకుంటున్నాం. మా నాయనమ్మ ఆ రోజుల్లోనే ఇంట్లో ఆవులు, గేదెలతో కుటుంబాన్ని నడిపేది. కూలీలను నోటి మాటతో అజమాయిషీ చేసేది. ఆవిడ మంచి వ్యవహారకర్త. మా తాతగారు, నాన్న ఆవిడ మాటను దాటేవారే కాదు. ఇరుగుపొరుగు చాటు మాటుగా ఆడ పెత్తనం అని చెవులు కొరుక్కునేవారు. ఆవిడ అవేవి పట్టించుకునేది కాదు”, అంది లలిత.

“ఆర్ధిక స్వేఛ్చ లేకపోతే ప్రాణమేమీ పోదు లలితా. భావ స్వేఛ్చ లేకపోవటం అంటే మెడకు ఉరితాడు తగిలించుకు బతకటం లాంటిది”, సాలోచనగా అంది మహి.

“యు నో మహి…..నేను టీం లీడ్ గా పనిచేస్తున్నానా. నా భర్త దృష్టిలో నేను వంట, వార్పూ గురించి మాత్రమే మాట్లడటానికి అర్హురాలిని! సమాజం, రాజకీయాల గురించి నాకేం తెలీదని, నేను తెలుసుకోలేనని అతని అభిప్రాయం. ఇలాంటి వాటిల్లో ఎప్పుడైనా నా అభిప్రాయం తెలిపాననుకో ఎగతాళి చేస్తాడు, వ్యంగంగా మాట్లాడుతాడు. ”

“వారికి ఆ స్వేఛ్చ పుట్టుకతోనే వచ్చేసింది లలితా. మనం పోరాడి సాధించుకోవాల్సి వస్తుంది”

“ఏమి పోరాటాలో ఏమిటో…మనిషికి ఉండాల్సిన ప్రాధమిక హక్కుల కోసం కూడా పోరాటాలు చెయ్యలా? విసుగొస్తుంది…..ప్రతీ రోజూ నన్ను నేను కోల్పోకుండా కాపాడుకోవడానికి జరిగే మానసిక సంఘర్షణలో అలిసిపోతున్నాను మహీ”

“లలిత మానసికంగా కొంత అలిసిపోయినట్టున్నావు. అందుకే నీలో ఈ నిరుత్సాహం. ఒక్కసారి ఊహించుకో… ఈ పోరాటం లేని జీవితం ఎలా ఉంటుందో!”

“ఉహించలేను మహి…తను చెప్పినదానికల్లా తలాడిస్తూ బతకడాన్ని ఊహించలేను”

“దానికి పెద్ద ఉదాహరణ మన వనజే. వాళ్ళను మొదట కలిసింది మీ ఇంట్లోనే. నీకు గుర్తుందో లేదో ఆ రోజు ఎదో చర్చ జరిగింది. మనందరం మన అభిప్రాయాలను చెపుతున్నాం. వనజ మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు . అందరినీ గమనిస్తుందేమో అనుకున్నాను నేను, ” మీరేమి మాట్లాడట్లేదు వనజగారూ ” అని నేనంటే….. “తను చాలా కామ్ అండి. తనకు నేనెంత చెపితే అంతే” అంటూ వనజ భర్త గర్వంగా సమాధానం చెప్పారు. నాక్కాస్త వింతగా తోచినా పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు వనజ మా ఆఫీసుకు జాబ్ ఇంటర్వ్యూ కి వచ్చింది. తన ఇంటర్వ్యూ ఉదయం పూట జరగాల్సింది, అనుకోకుండా పోస్ట్ పోన్ అయి మధ్యహ్నం అయింది. “ఉదయం వంట చేసి రాలేదు ఇంటర్వ్యూ అయ్యాక వెళ్లి చేద్దామనకున్నాను మా ఆయన భోజనానికి ఇంటికి వస్తారు. ఎలానో ఏమిటో” అని చాలా అంటూ గాభరా పడిపోయింది. అదంతా కేరింగ్, ప్రేమ అని నేననుకోను. ఏమిటో కొంచెం తేడాగా ఉన్నదే ఈవిడ అనుకున్నాను. తనకా జాబు రాలేదు.

తీరా చూస్తే వనజ ఉండేది మా కమ్యునిటీలోనే. ఆ తరువాత అప్పుడపుడూ ఫోన్ లో మాట్లాడుకుంటూ వుండేవాళ్ళం. తన మాటలు భర్త, అత్త, ఆడపడుచు, తోటికోడలు పరిధి దాటేవి కావు. ఉద్యోగం చేసే తల్లులు పిల్లలను సరిగ్గా పెంచలేరంటుంది. పోనీ తనేమన్నా ఇంట్లో సుఖంగా ఉందా అంటే అదీ లేదు…ఎప్పుడూ నా బతుకు ఇలా ఏడ్చింది అంటూమొగుడ్నో, అత్తగారినో నిందిస్తూ వుంటుంది”, అంది మహి.

“ఇందులో మిడిల్ క్లాసు జంజాటన చాలానే వుంటుంది మహి. మొన్నో రోజు ఆఫీస్లో ఏవో సమస్యలు వచ్చి బాగా అలిసిపోయాను. ఒక వైపు పేస్ బుక్, మరో వైపు టీవీ రిమోట్ తో బిజీగా ఉన్న మధుని “ఈ పూట నువ్వు వంట చెయ్యి” అన్నాను. అప్పుడు మాట మాట వచ్చి ఆ కోపంలో, నిన్ను నేను ఉద్యోగం చెయ్యమన్నానా? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావ్. యు ఆర్ బీయింగ్ సెల్ఫ్ ఫిష్, సో యు నీడ్ టు నో టు మేనేజ్ యువర్ వర్క్” అన్నాడు”.

“నువ్వు జాబ్ చెయ్యలా వద్దా అని నిర్ణయించే హక్కు మధుకి ఎవరిచ్చారు? అసలు వీళ్ళు మారరా?”, కోపంగా అంది మహి.

“ఎంత ఈజీగా అనేస్తారో! పెళ్ళప్పుడు అబ్బాయి చదువు, సంపాదనకు సమానంగా కట్నాలు తీసుకుంటూ అమ్మాయి చదువుని, సంపాదనను కూడా చూస్తారు. ఇద్దరూ ఉద్యోగాలు చెయ్యటం మూలాన సమస్యలు తలెత్తితే వెంటనే నువ్వు మానేయ్ అనేస్తారు. వాళ్ళెంత కాంపిటిటివ్ స్పిరిట్ తో చదువుకున్నారో మనమూ అలాగే నెగ్గుకు వచ్చాను కదా! ఇన్నేళ్ళు ఏర్పరుచుకున్న వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను, చివరకు పోరాట స్పూర్తిని వదిలేయ్ అనటానికి మనసెలా వస్తుంది వీళ్ళకు?”, ఆవేశంగా అంది లలిత.

“కెరియర్ బిల్డ్ చేసుకోవడానికన్నా వదులుకోవటానికి కొన్ని వందల రెట్ల పోరాటస్ఫూర్తి ఉండాలి లలితా. ఆ పనిని మీరే చెయ్యొచ్చు కదా అని అనగలిగే ధైర్యాన్ని మనమూ పెంచుకోవాలి కాబోలు ”.

“ఆ మార్పెప్పుడు మనలోనేనా మహీ? పైగా నేను స్వార్ధపరురాలినట. యువర్ వర్క్ యువర్ వర్క్ అంటున్నాడు. ఏమాటకామాట అతనికి వండి పెట్టటం, అతని బట్టలు ఉతకటం లాంటి పనులు నా పనులెలా అవుతాయి మహీ?”, ఉక్రోషంగా మాట్లాడింది లలిత.

“బంధం కదా లలిత, నువ్వు నేను అని విడమర్చి విడదీసి చూడలేం”

“ఈ బంధం నాకెంత అవసరమో తనకి అంతే అవసరం కాదా ? పిల్లలు కేవలంనాకు మాత్రమే పుట్టారా? విడిపోవాలన్న ఆలోచనైతే లేదు కానీ, ఒక్కోసారి ఎందుకు కలిసుంటున్నాం అనిపిస్తుంటుంది మహి”, లలిత కళ్ళు ఎర్రబడ్డాయి.

“మన కుటుంబాలలో ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా వరకు మారారు. కట్నాలు తప్పకపోయినా చదువుకు ఏమాత్రం తక్కువ చెయ్యట్లేదు. నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి అని నూరిపోస్తున్నారు మనకు. మరి….ఈ భర్త స్థానంలోని వ్యక్తులు ఎందుకు మారట్లేదు మహి? వ్యక్తి దోషమా లేక మన సమాజంలో ఆ స్థానానికున్న బలమా?”, అడిగింది లలిత.

“నిజానికి మగ పిల్లల పెంపకంలో పెద్ద మార్పేమీ రాలేదు. “ఆడపిల్లలా ఏడుస్తావేమిరా? వంటిట్లో నీకేం పని” అనే మాటలు అడపాదడపా వినిపిస్తూనే వున్నాయి. అమ్మకు, మనకు 80 శాతం మార్పుంటే, నాన్నకు, భర్తకు ఆ మార్పు 30 శాతం మాత్రమే ఉంది. మార్పు రావటానికి చాలా సమయం పడుతుంది లలితా. బహుశా మధు కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చి వుంటారు.

ఇలాంటి విషయాలలో శేఖర్ కొంత కోపరేటివ్ గా ఉంటాడు. కొంత కాలం క్రితం ప్రాజెక్ట్ పనిపై ఆరునెలలు వేరే స్టేట్ వెళ్ళాడు. అప్పుడు మా అత్తగారు తెగ బాధ పడిపోయారు. ఎందుకో తెలుసా?….కొడుక్కి వండి పెట్టటానికి కోడలు దగ్గర లేదట. ఏం తింటున్నాడో ఏమిటో అంటూ ఒకటే నస. అమ్మా అక్కడ నీ కోడలు ఒక్కటే పిల్లలను చూసుకుంటుంది. నా కంటే తన శ్రమే ఎక్కువ అన్నాడు వాళ్ళమ్మతో”, నవ్వుతూ చెప్పింది మహి.

“లలిత నీకింకో విషయం చెపుతాను విను. నేను ఒక ఆన్లైన్ మాగజైన్ కి మంత్లీ కాలమ్ రాస్తాను కదా. సమాజం, మానవత్వం, హుమానిటీ, ఇంకా స్త్రీ సమస్యల గురించి రాస్తుంటాను. మా ఆఫీసులో క్రిష్ అనే కృష్ణ మూర్తి వున్నాడు. ఓ రోజు నేనతన్ని ఫుడ్ కోర్ట్ లో కలిసాను. మాటల్లో అతను “మీరు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అట కదా” అని అడిగాడు. ఫ్రీ లాన్స్ కాలమిస్ట్ ని అన్నాను. ఈ మధ్య ఏది మాట్లాడినా కాంట్రావర్సి అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అతనేదో మంచిగా చెప్తున్నాడనుకుని అంగీకారంగా తలాడించాను. అది అడ్వాన్టటేజ్ గా తీసుకుని ఉచిత సలహాలు విసురుతూ, ఆడవారు మీకేందుకండి ఇవన్నీఅని ముగించాడు.

“నా కాలమ్స్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటారా ?” అని అడిగాను. ఒకటి రెండు సార్లు చదివాడట. “నేను గత నాలుగేళ్ళుగా రాస్తున్నాను, కనీసం నాలుగొందల ఆర్టికల్స్ రాసి ఉంటాను. బహుశా మీకు నేనేం రాస్తానో కూడా తెలిసినట్లు లేదు.

నాకు తలనొప్పులు వస్తాయని మీరు ఇప్పటి నుంచే మాత్రలు మింగకండి క్రిష్. తాటాకులు, అరిటాకులు నాకు తలనొప్పిని తెప్పించలేవు. ఎనీహౌ థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్” అని చెప్పాను”, తన అనుభవాన్ని పంచుకుంది మహి.

“కనిపించని కట్టుబాట్లు మనవాళ్ళలో చాలానే ఉన్నాయి”, అంది లలిత.

“ఈ విషయం శేఖర్ కు చెపుతూ “క్రిష్ భయపెట్టాలనుకున్న తలనొప్పులు భవిష్యత్తులో నాకెప్పుడైనా వచ్చాయే అనుకో….నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావా” అని అడిగాను. “ఎందుకు చెయ్యనోయ్” అని నవ్వేసాడు శేఖర్.

“సపోర్ట్ అంటే నా అభిప్రాయాలను నువ్వు అంగీకరించాలని కాదు, నాకు వత్తాసు పలకాలనీ కాదు. నా ఆలోచనలు నీకు నచ్చకపోతే వాటిని విభేదించటం నీ హక్కు. అదే సమయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉండే నా హక్కుని గుర్తించు, గౌరవించు. నేను నమ్మిన సిద్దాంతంపై నిలబడే మోరల్ సపోర్ట్ నాకివ్వు”

ఇదిగో ఇలానే శేఖర్ తో చాలామాట్లాడాను. “ఆ క్రిష్ పై కోపాన్నంతా నాపై చూపకోయ్” అని నవ్వేసాడు”, చెపుతున్న మహి కళ్ళల్లో ఓ రిలీఫ్.

“హేయ్ ….మహి టైం చూడు ఎంతయ్యిందో! మాటల్లో టైమే తెలీలేదు. మనసు భారంగా ఉందని నీతో మాట్లాడితే తేలికవుతుందని వచ్చాను. నీ సమయం అంతా తినేసాను….పద పద బయల్దేరదాం.”

ఇద్దరూ హ్యాండ్ బాగ్స్ భుజాన తగిలించుకుని వడివడిగా కారు పార్కింగ్ వైపు అడుగులేసారు. ఇద్దరి మనసులు కొంత భారాన్ని దింపుకుని మరికొంత ఆలోచనను మోసుకెళుతున్నాయి.

“కొన్ని తరాల క్రితం వంటగది గమ్మాలలోనో, అరుగులపైనో ఇలాంటి సంభాషణలే జరిగి వుంటాయి. హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపనీలలోని స్త్రీలు కూడా ఇలాగే మాట్లాడుకుంటూ వుంటారేమో కదూ మహి?”

“సప్త సముద్రాల ఆవతలి ప్రవాసీ జీవితంలోనూ ఇలాగే మాట్లాడుకుంటున్నాం. సమస్యలు లేకుండా పోలేదు, వాటి కోణాలు మాత్రమే మారాయి. వ్యవస్థ కోణంలో చూస్తూ మార్పు వచ్చిందనుకుంటున్నాం. వ్యక్తులుగా మారాల్సిన వారు వ్యవస్థ నిండా ఉన్నారు”, నడుస్తూ అంది మహి.

“ఆ మారాల్సిన జాబితాలో మధు ఉన్నాడు. ఈ రొటీన్లో ఆటవిడుపుగా ఉంటుందని డాన్స్ ప్రోగ్రాం అనుకున్నాను. నా భార్యగా నువ్వు స్టేజీ ఎక్కి తైతక్కలాడక్కర్లేదు అన్నాడు మధు.”

“ఓ అదా సంగతి, వి విల్ మేక్ ఇట్ లలితా ”, శేఖర్ మాట ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అయింది మహికి.

***

ఆ రోజు రాత్రి మహి శేఖర్ దగ్గర మధు ప్రస్తావన తీసుకొచ్చింది.

“శేఖర్ , ఆఫీసులో మధు నీతో ఏమన్నా అన్నారా?”

ప్రశ్నార్ధకంగా మహి వైపు చూసాడు శేఖర్

“అదే….లలిత నేను చేద్దామనుకున్న డాన్స్ ప్రోగ్రాం గురించి”

“హ్మ్…చాలా చీప్ గా మాట్లాడాడు మహి”, బాధగా అన్నాడు శేఖర్ .

“నువ్వు లోనవుతున్న ఒత్తిడిని నేనర్ధం చేసుకోగలను. ఈ సోషల్ ప్రషర్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మనల్ని మనలా ఉండనీకుండా చేస్తాయి శేఖర్”

“నీ గురించి చులకనగా మాట్లాడతారేమోనని…”, తన భయాన్ని అస్పష్టంగా వ్యక్తీకరించాడు శేఖర్.

“ఒక్క మాట చెపుతాను శేఖర్…. భార్యను మనిషిగా గుర్తించి గౌరవించే భర్తలను చేతకానివారుగా జమకట్టే వారు మనలో చాలామందే వున్నారు. వారికి వారి జీవితాలలోకి, కుటుంబాలలోకి తొంగి చూసుకునే ధైర్యం లేక పక్కవారిపై వ్యంగాస్త్రాలు వదులుతూ ఉంటారు. మనం ఆ అస్త్రాలను మొయ్యటమే వారికి బలం. మూటగట్టి డైరెక్ట్ గా డస్ట్ బిన్లోకి పడేశావే అనుకో…నీ కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం కూడా ఉండదు వారికి”, మహి మాటల్లో విశ్వాసం ఉట్టిపడింది.

“నువ్వు నీలానే ఉండు శేఖర్ , నేను నాలానే ఉంటాను. ఒకరికి ఒకరం ఆసరాగా ఉందాం”, శేఖర్ కళ్ళలోకి చూస్తూ అంది మహి.

“నువ్వు నా మనసు లోపలికి దూరిపోయి ఎలా చూస్తావోయ్”, నవ్వుతూ అన్నాడు.

“అందులో నా గొప్పేమీ లేదు మిస్టర్ పతి. నీ ఏ అహంకారపు పొరా నా చూపును మసక పరచలేదు. క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నావు నాకు”

అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆ మెరుపులో ఆమె కళ్ళు మరింత అందంగా ఉన్నాయి.

ప్రచురణ : http://vaakili.com/patrika/?p=2245

This entry was posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు). Bookmark the permalink.

4 Responses to ఆవలి తీరంలోనూ

 1. thought provoking..బాగా రాశారు, ఐతే ఒకమాట అర్ధం కాలేదండీ.
  “నా ఆలోచనలు నీకు నచ్చకపోతే వాటిని విభేదించటం నీ హక్కు. అదే సమయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉండే నా హక్కుని గుర్తించు, గౌరవించు. నేను నమ్మిన సిద్దాంతంపై నిలబడే మోరల్ సపోర్ట్ నాకివ్వు”

  అన్నారు… బలవంతంగా ఎదుటివారిని తమదోవలోకి తెచ్చుకోవాలనుకోవడం తప్పే భార్యాభర్తల మధ్యన అని కాదు జనరల్‌గా ఇద్దరు వ్యక్తులమధ్య agreement/disagreement of ideas/ideals గురించి మాట్లాడుదాం. person 1 సిద్దాంతం person 2 సిద్దాంతాలకు విరుద్దంగా ఉన్నాయనుకోండి ఇద్దరూ కూడా ఎదుటివారి ఆలోచనను మార్చడానికే చూస్తారు కదా. ఆ ఇద్దరూ ఒకరికిఒకరు ఏమీకానివారైతే agreeable disagreement ఉండొచ్చు they may not force each other even కానీ దగ్గరివారి మధ్య ఇది సాధ్యమేనా ? బిడ్డ ఆలోచనలు్-నడవడిక సరిగా లేదనిపించినపుడు తల్లిదండ్రులు నయానోభయానో మార్చాలని అనుకుంటారు కదా ! విభేదిస్తూ కూడా ఎదుటివారికి(అయినవాళ్ళకు) నైతిక మద్దతు ఇవ్వడం contradicting కదా…అది అసలు సాధ్యమేనా ?

  • నాగార్జున గారు @No two people are alike in every sense in this world. మహీ కుడా అదే అంటుంది ఇక్కడ, నా సిద్దాంతంతో నువ్వు ఎకిభావించాలని నేను అనట్లేదు, కాని నాకంటూ కొన్ని సిద్దాంతాలు ఉంటాయని నువ్వు అర్థం చేసుకో.
   “ఎదుటివారి ఆలోచనను మార్చడానికే చూస్తారు కదా”..భర్యభర్తలు అనే కాదు ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య నైనా ఇక్కడే ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఎదుటి వారిని మార్చాలి అనుకోవాలి మనం? మన సిద్దాంతంపై మనకెంత నమ్మకం వుందో , ఎదుటివారికి కుడా అంతే వుంటుంది కదా! చర్చలు, sharing of opinions వరకు ఓకే. ఆ పరిధి దాటి నేను చెప్పేదే కరెక్ట్, నువ్వు నా అభిప్రాయాన్ని ఒప్పుకునే తీరాలి అనే దోరణి దగ్గరి వారితో ఇంకా ప్రమాదం. We need to respect the gap/line that exist between two of us.
   కధలో మహి ఆన్లైన్ మగజైన్ కి ఆర్టికల్స్ రాసే విషయంపై భర్తతో అంటుంది. While writing she may pick a topic which her husband may not like it, or he may not want her to write on it. He may advise her, but he doesn’t have any right to stop her. ఇక్కడే maturity కనిపిస్తుంది. నేను నీ సిద్దంతంతో ఎఖిభావించకపోవొచ్చు..But be the you are.
   పిల్లలను సరిదిద్దాలి అనే విషయంలో భార్య భర్తలు (తల్లిదండ్రులు ) ఒకే మాటపై వుంటారు, Their way of correcting may be different . ఇక్కడ సరిదిద్దటమే ప్రధానం.

   ధన్యవాదాలు నాగార్జున గారు

 2. Padmaja says:

  మంచి కథ, చాలా బాగుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s