ఆసుపత్రి
వెతుక్కుంటునో లేక దారి తప్పో
ఈ రోజు నేనో చోటుకు వెళ్లాను.
నగరంలో ఓ ములకు విసిరేయ్యబడ్డ స్థలమది.
పచ్చదనాన్ని పట్టించుకోకుండా
అస్తవ్య స్థంగా పెరిగిన పచ్చికను దాటుకుంటూ
ఊహామాత్రపు పరిచయమన్నా లేని
ఆ నాలుగు గోడల నడుమకు చేరాను.
అక్కడందరూ
అదో తరహా మనుష్యులంట!
మతి లేని వారో?
స్తిమితం తప్పినవారో?
సభ్యత తెలియనివారో?
ఓడిన వారో? గెలిచిన వారో?
ఎవరో?…. ఉన్నాడో లేడో తెలియని ఆదేవుడి కేరుక!
నాగరీకుల నివాసం మాత్రం కాదంట!
అక్కడందరూ
భావ స్వేచ్ఛను దోసిళ్ళలో అమృతంగా సేవించినట్టున్నారు.
నిర్భయంగా, నిస్సంకోచంగా
బాహాటంగా, బిగ్గరగా
ఎవరికి తోచింది వారు మాట్లాడేస్తున్నారు.
ఎదుటివారు ఆలకించాలన్న నియమమేమీ లేదంట!
ప్రతీ నియమం అనుసరించాలన్న నిర్భందమూ లేదంట!
కొద్దో గొప్పో ఉన్న సంకెళ్ళన్నీ కంటికి కనిపించేవే
అదృశ్య ఎజెండాలు, స్వలాభాలు లేనే లేవంట!
ఎవరి రాజ్యంలో వారే ప్రజలు, రాజులు.
అబ్బ…..ఎంత స్వేఛ్చని
నివ్వెరపోయేటంత స్వేఛ్చ!!
పంజరం కొలతలలో విశాలత్వాన్ని
కట్టుబాట్లలో జీవితాన్ని ఆపాదించుకున్న
నా రెక్కల కొలబద్దలు
కనీ వినీ ఎరుగని స్వేఛ్చది!
(మీకు చెప్పినా అర్థం కాదు, బహుసా నాకు చెప్పటమే రాదేమో!)
ఆ గది గోడకో గడియారం వేళాడదీసుంది.
అచ్చం మన చేతికున్న వాచీలాంటిదే.
నా దృక్కులన్నీ నా ముంజేతిలో ఇరుక్కుపోయాయా!
ఆశ్చర్యం… అక్కడెవరూ ఆ గోడవైపన్నా చూడట్లేదు!
ఇంతలో,
ఎవరో వైద్యుడంట, నర్సుని వెంబడేసుకుని వచ్చాడు.
వార్డులో వారందరూ
వారిద్దరినీ చూసి వెర్రిగా నవ్వుతున్నారు.
“మీరు జాగ్రత్త”, మర్యాదగా హెచ్చరించాడా డాక్టరు బాబు!
తట్టుకోలేకో లేక నేనోర్చుకోలేకో
ఆ ప్రాంగణంలో నుంచీ బయటపడ్డాను.
ఎత్తైన ఆ ప్రహరీ గోడ గేటు దగ్గరున్న కాపు
నన్ను క్రీగంట చూస్తూ
పెదవంచున పరిహసించాడు.
నాదారిన నేనడుస్తూ ఇంటి దారి పట్టాను.
దారి పొడవునా లక్షల కోట్ల జనాలు
వేల మైళ్ళ పరుగులూనూ!
కాళ్ళకూ, చేతులకూ
జనాభా లెక్కలన్నీ సంకెళ్ళునూ!
ఎవరు ఎవరితోనూ మాట్లాడట్లేదు
ఎవరు ఎవరినీ ఆలకించట్లేదు
అందరి నోళ్ళలోనూ అదే మాట
“ఆసుపత్రి ఆసుపత్రి మానసికాసుపత్రి ”
మిత్రులారా
నా సాంఘిక ప్రజలారా
నా సహచరులారా….చెప్పండి
రోగులు ఎవరు?
ఏది ఆసుపత్రి?
It’s nice Praveena garu. But, I think, the last two stanzas are not necessary.