నేననే ప్రశ్న
నేను అని ప్రశ్నించే వరకే
నీ గొప్పైనా, ఎవరి గొప్పలైనా
ఒక్కసారి
ప్రశ్నించటం మొదలుపెట్టాక
పొరలు వాటికవే విడిపోతూ వుంటాయి
అస్తిత్వ పోరాటాల సామాజిక పరిధిలోనైనా
నాలుగు గోడల హిపోక్రసీలోనైనా…..
నీ దృష్టి కోణంలో
నా చూపేందుకు ఇరుక్కోవాలి?
నీ ధృక్పదంలో
నా బతుకెందుకు బతకాలి?
నా గొంతులోనికి చొచ్చుకు వచ్చిన
మరో గొంతుకను విదిలించి పడేసాక
నాకు నేను స్పష్టంగా వినిపిస్తున్నాను….
నాలుగు గోడల నడుమన కాక
నాలుగు దిక్కులలో ప్రతిధ్వనిస్తున్న
నా ధ్వని
ధృడత్వాన్ని సంతరించుకుని
మూసలో కుంచించుకు పోయిన
మెదళ్ళలో కదలిక తీసుకు రాకపోతుందా!
Excellent