హక్కు బాధ్యతే (కధ)


హక్కు బాధ్యతే 

“వాట్?”

“అవును..హాస్పిటల్లో అడ్మిట్ చేసాము”

“నేను నమ్మలేకపోతున్నాను”

“మా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకా షాక్ లోనే ఉన్నాము?”, బొంగురుపోయిన గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేసాడు దీపక్.

శ్రావణి ఆత్మహత్యా ప్రయత్నం. నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను విన్నది నిజమేనా? నాలుగు రోజుల క్రితమే మాట్లాడాను. ఎప్పుడూ వుండే సమస్యల గురించే మాట్లాడుకున్నాం. ఇంతలో కొత్తగా ఏమైంది? అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఎందుకు..ఎందుకు? కారణం ఏమిటి?….బహుశా నాకు తెలుసేమో? తెలుసా? తెలుసా?…..

“ఆర్ యు ఓకే?”, రెండు చేతులతో తలను పట్టుకుని కిందకు చూస్తూ ఆలోచనలో మునిగిపోయిన నేను ఉలిక్కిపడ్డాను.

“ఐయాం ఓకే. ఐ నీడ్ యువర్ హెల్ప్”, నావైపు ఆందోళనగా చూస్తున్న కొలీగ్ తో అన్నాను.

విషయం చెప్పి, నేను అర్జెంట్ గా చెయ్యాల్సిన పనిని తనకు అప్పగించి హాస్పిటల్ కు పరుగులు తీసాను.

కొంగుతో మాటిమాటికీ కళ్ళు తుడుచుకుంటూ, దుఖాన్ని దిగమింగుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ ఆంటీ ఐసియు ముందు కనిపించారు. నన్ను చూడగానే కట్టలు తెచ్చుకున్న దుఖంతో నా చెయ్యి పట్టుకుని, “చూసావా తల్లి, ఎంత పని చేసిందో శ్రావణి”, గుండెల్లో బాధ మాటల్లో ధ్వనించింది.

“ఇప్పుడెలా ఉందాంటీ?” , అడిగాను.

“48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు”

“ఏం చేసుకుంది”, అడగలేక అడగలేక అడిగాను.

“వాళ్ళత్త గారి నిద్ర మాత్రలు మింగేసింది. సమయానికి ఆవిడ చూసుకోబట్టి సరిపోయింది. వెంటనే అంబులెన్సు పిలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేసారు”

“కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది”, ఆంటీ భుజం చుట్టూ చెయ్యివేసి పట్టుకున్నాను.

లిఫ్ట్ లో నుంచి వస్తున్నా అంకుల్ ని చూసి లేచి నించున్నాను. అంకుల్ వెనుకాలే దీపక్ ముర్తిభవించిన శోఖగ్రస్తుడిలా ఉన్నాడు. జుట్టు రేగిపోయి, ఎర్రబడ్డ కళ్ళతో మొహం పీక్కుపోయి ఉన్నాడు. దిగ్భాంతి, దుఖం కనిపిస్తున్నాయి అతని ప్రతి కదలికలోనూ.

“పరువు తీసేసిందమ్మా నీ ఫ్రెండ్”, అంకుల్ గొంతులో బాధతో సమానంగా కోపమూ వినిపించింది. అలా అనకండి అని సూటిగా అనలేక, “ప్లీజ్ అంకుల్..” అన్నాను. నాకా సమయంలో ఇంకేమి మాట్లాడాలో అర్థం కాలేదు.

దూరంగా గోడకు ఆనుకుని నుంచున్న దీపక్ దగ్గరకు వెళ్లాను.

“డాక్టర్ ఏమంటున్నారు దీపక్?”, పలకరించాను.

“పరిస్థితి విషమంగానే ఉందంట. షి టుక్ హెవీ డోస్ అఫ్ స్లీపింగ్ పిల్ల్స్”, కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళు కనిపించకుండా పక్కకు చూస్తున్నాడు.

“డోంట్ వర్రీ, షి విల్ బి ఓకే”, మాటలు కూడబలుక్కున్నాను.

“హోప్ సో”, ఇంక మాట్లాడటం ఇష్టం లేనట్టు పక్కకు తిరిగాడు.

నేను ఆంటీ దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాను. చేతులు రెండూ జోడించి కనిపించని ఏ దైవానికో మొక్కులు మొక్కుతున్నారు. చీరకొంగు నోటికడ్డం పెట్టుకున్నా, ఎగిరెగిరి పడుతున్న గుండెలు దుఖాన్ని దాయలేకపోతున్నాయి. ఆంటీ చేతిని నా చేతుల్లోకి తీసుకుని నిమురుతూ కూర్చున్నాను.

మరో గంట తర్వాత శ్రావణి అత్తామామ వచ్చారు. ఇలాంటి పరిస్తితుల్లో ముందు వెనుక ఆలోచించకుండా బేషరుతుగా నిందారోపణ చేసేది వారి పైనే. వారి కదలికలలో ఆ భావం కనిపిస్తుంది. అత్తగారు దూరంగా ముభావంగా కూర్చున్నారు. మామగారు కొడుకుతో నాలుగు మాటలు మాట్లాడి, మొక్కుబడిగా కాసేపు కుర్చుని వెళ్ళిపోయారు.

నేను రాత్రి దాకా ఉండి ఇంటికి వచ్చాను. ఉదయం ఈ వార్త తెలిసినప్పటి నుంచీ నాలో కమ్ముకున్న దిగులు మేఘాలు ఉరుములు మెరుపులతో వర్షించటం మొదలుపెట్టాయి. తలగడల మధ్యలో మొహాన్ని దాచుకుని ఎక్కి ఎక్కి ఏడ్చాను. నాలో నుంచీ ఎన్ని కడవల కన్నీరు తోడానో తెలియదు. ఇంకా ఇంకా ఊరుతూనే ఉన్న ఈ కన్నీటికి ఆనకట్ట వెయ్యలేక పోతున్నాను. ఇది అని చెప్పలేని ఏదో గిల్టీ ఫీలింగ్ నన్ను దహించేస్తుంది.

శ్రావణి..శ్రావణి…ఇలా ఎందుకు చేసావు? ఎందుకు ఎందుకు?…నీలో భావాల సంఘర్షణను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా? లేక తేలికగా తీసుకున్నానా? నిన్ను నిర్లక్ష్యం చేసానా? నేను సైతం కారణమయ్యానా?
శ్రావణి..శ్రావణి…ప్లీజ్ కం బ్యాక్. వెళ్ళిపోకు…నేనీ గిల్టీ ఫీలింగ్ ని జీవితాంతం మోయలేను . నువ్వు నా బాల్యపు స్మృతివి, నా జ్ఞాపకాల అల్లికలో దారానివి. నువ్వెళ్ళిపోతే మాల చెల్లాచెదరైపోతుంది.

“నీకేదో పోస్టల్ లెటర్ వచ్చింది”

లెటర్..నాకెవరు రాస్తారు? ముత్యాల్లాంటి చేతి రాతతో మా ఇంటి అడ్రస్ రాసి ఉంది. ఆత్రంగా విప్పాను.

నా ఒయసిస్సుకు,

ఆశ్చర్యపోతున్నావా? నేనే శ్రావణిని……ఎడారిలాంటి నా జీవితంలో ఒయసిస్సువి నువ్వు. నా జీవితంలోని ప్రతీ ఘట్టంలోనూ నువ్వున్నావు. నీ చేతిని శాశ్వతంగా వదిలివెళ్ళిపోతున్న నా ఈ చివరి క్షణాలు సైతం నీతో పెనవేసుకుని ఉన్నాయి. నా జీవనాధారానికి వీడ్కోలు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతాను? అందుకే ఈ ఉత్తరం.

ఎంత కాలమైందో పేపరుపై పెన్నుతో తెలుగు అక్షరాలు రాసి. పోనీలే…..చివరి పనైనా అందంగా చేస్తున్నాను.

నేస్తమా, నువ్విచ్చిన ప్రోత్సాహం, నువ్వందించిన సహకారంతోనే ఇప్పటిదాకా ఈ బండిని లాక్కొచ్చాను. ఇంక నా వాళ్ళ కాదు.

ఎందుకీ నిర్ణయం తీసుకున్నానంటే…….. ఎక్కడ మొదలుపెట్టను? ఏమని రాయను? నీకు తెలియకపోతే కదా?!
….
….
……
నాన్న చదువు నేర్పించారు. “నువ్వు ఇంజనీరవ్వాల్సిందే”….. నా మొదటి మైలురాయిని నాన్నే నిర్ణయించారు, సోషయాలిజి చదవాలన్న నా ఆశను మొగ్గలోనే తుంచేస్తూ. ఇళ్ళు, కాలేజి, సబ్జెక్టు పుస్తకాలు…..ఇవే నాకు తెలియాల్సిన నాలోకం ఆనాడు. డాన్స్ నేర్చుకోవాలన్న నా కోరిక, సాహిత్యం చదవాలన్న నా అభిలాష, వీణ వాయించాలన్న నా ఆశ…అనేకానేక అంక్షల సంకెళ్ళలో బంధింపబడి నా స్వేచ్ఛకు ప్రశ్నలుగా మిగిలాయి. పుస్తకాలలో పాఠా లను నేర్చుకున్నాను, బతికే స్థైర్యాన్ని నేర్చుకోలేకపోయాను.

నేను ఎదుగుతున్నానా లేక కుంచించుకుపోతున్నానా అని ఆలోచించే జాస మా ఇంట్లో ఎవరికీ లేదు. మార్కుల జాబితాలో నేనూ ఓ మార్కునే!

ఆరాధనగా చూస్తున్న వెనుక బెంచీ కుర్రాడు నా చేతిలో ప్రేమలేఖ పెట్టిన నాడు, నేనేందుకలా ఏడ్చాను? “ధైర్యం ఉంటే వెళ్లి ఆ అబ్బాయితో మాట్లాడు. పోనీ నన్ను వెళ్లి మాట్లాడనీ. లేకపోతే నోర్ముసుకుని ఊరుకో, ఇలా ఏడుస్తూ ఉండకు”. నువ్వారోజు నన్ను ఓదార్చలేదు, తిట్టావు?…గుర్తుందా?

అమ్మా,నాన్న, ఇళ్ళు, గౌరవం, పరువు, కులం, మతం…..నాకా సాహసం లేదని తేల్చేసి చెప్పేసాను కదూ. అది ప్రేమో ఆకర్షణో తేల్చుకునే అవకాశం కుడా ఇవ్వకుండా మనసు నోరు నొక్కేసాను.

బేరసారాల లెక్కల్లో, లాభనష్టాల బేరీజుల్లో కుదిరిన నా పెళ్ళిలో మూడుముళ్ళు, ఏడడుగులూ అంకెలే. పెళ్ళీ వ్యాపారమే!

“నీ మనసు చెప్పినట్టు విను. నువ్వు జీవితం పంచుకోవాల్సిన నిర్ణయం. కాంప్రమైజ్ అవ్వకు”,నీకు గుర్తుందా? ఆ రోజు నన్నెంత ప్రోత్సహించావో.

నాకు మరో ఛాయస్ లేదు. తలవంచేసాను. అదిగో అప్పుడూ మనసు ఎదురుతిరిగింది. యధావిధిగా నోరు ముసేసాను.

ఇదొక వ్యాపారం. నేనొక భాగస్వామిననుకున్నాను. పొరపాటు పడ్డాను. ఇదొక కోర్టు. ఈ కోర్టులో నేను శాశ్వత ముద్దాయిని. కూరలో పిసరంత ఉప్పు తక్కువైనా, పిల్లలకు పరీక్షలో మార్కులు తక్కువొచ్చినా, అత్తగారు బిపి టాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయినా, మామగారి షుగర్ లెవెల్ పెరిగినా,చివరకు మావారికి ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనా …..అది ఇది అని కాదు, అన్నింటా అన్ని వేళలా నేనే ముద్దాయిని. ఒకే షాట్ తో అమలయిపోయే ఉరి లాంటి మరణ శిక్షలు వుండవిక్కడ. మాటల కొరడాలు ఝుళిపించే యావజ్జీవ శిక్షలే ఇక్కడన్నీను! ఈ కోర్టులో జడ్జ్ గారికి, లాయర్లకు ఎంత మంచి పేరని!? మంచి సంపాదన, ఆస్తి పాస్తులు, చీరలు, నగలు…నేను అదృష్టవంతురాలినంట!

మనసు ఎదురుతిరిగినప్పుడల్లా నీ భుజంపై వాలిపోయేదాన్ని. “ఎన్నాళ్ళిలా సర్దుకుపోయి బతుకుతావు. నీ ఇష్టాలు చెప్పు, కష్టాలు ఎత్తి చూపు”. నువ్వేన్ని సార్లు చెప్పినా ఆ పని చెయ్యలేకపోయాను. మంచితనం మాటునున్న అసమర్ధత, చేతకానితనం నన్ను కట్టిపడేస్తూనే వున్నాయి ఈ క్షణం వరకు.

ప్రేమ కోసం తపించి తపించి అలిసిపోయాను. నాకొక స్వచ్చమైన కౌగిలి కావాలి, ఆర్తిగా నుదుటన ముద్దు కావాలి. ప్రేమగా మాట్లాడే మాట కావాలి. నా ఇష్టాలు గౌరవించే మనిషి కావాలి. నా పై చూపించే అధికారాన్నే ప్రేమని భ్రమించి బతకలేను. ఎదిరించి నిలదీసి బతికే ధైర్యాన్ని నా జీవితంలో నేను నేర్చుకోలేకపోయాను.

నేస్తమా, నీ ప్రోత్సాహం నన్ను అడుగువెయ్యమంటుంది. నడిచే శక్తి నాకు లేదు. అందుకే ఓడిపోతూ వెళ్ళిపోతున్నాను.

ఇట్లు,
నీ నేస్తం
శ్రావణి.

నా కన్నీటి చుక్కలతో అక్కడక్కడా అక్షరాలు అలుక్కుపోయాయి. ప్రతి వ్యాక్యం శ్రావణి గుండెలో గూడుకట్టుకున్న గుబులును, ఒంటరితనాన్ని తెలియజేస్తున్నాయి.

ఎంత తప్పు చేసాను? నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేసి ఊరుకున్నాను. తను డిప్రెషన్ లోకి కూరుకుపోతుందని గ్రహించలేకపోయాను. కౌన్సిలింగ్ కి తీసుకేల్లాలన్న ఆలోచనే రాలేదు నాకు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చి వుండేది కాదేమో.

* * * * * * * * * * * * * * * * * * * *

“అవుట్ అఫ్ డేంజర్. ఈరోజు రూంకి షిఫ్ట్ చేస్తారంట”, దీపక్ మోహంలో రిలీఫ్.

“అంకుల్, కాఫీ తాగి వద్దామా?”, ప్రమాదం తప్పిందన్న ఆనందం అంకుల్ కళ్ళలో కనిపిస్తుండగా అడిగాను. ఇద్దరం కాఫీ తాగుతూ కార్నర్ టేబుల్లో కూర్చున్నాము.

“అంకుల్, మీరు కోపం తెచ్చుకోను అంటే ఒక మాట చెపుతాను”.

ప్రశ్నార్ధకంగా నా వైపు చూసారు. శ్రావణి రాసిన ఉత్తరం అంకుల్ చేతిలో పెట్టాను. లెటర్ చదువుతుండగా అంకుల్ కళ్ళలో కదలాడిన చెమ్మ నాలో ఆశను పెంచింది.

“మీకు శ్రావణంటే ఎంతిష్టమో నాకు తెలియంది కాదు. తన కోసం మీరు అన్ని సమకూర్చి పెట్టారు. కానీ అంకుల్…….శ్రావణికి ఇష్టాలు ఉంటాయనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు. మీ కూతురు శ్రమ లేకుండా ప్రయాణిస్తుందని మార్గాన్ని మీరే నిర్మించి ఇచ్చారు. ఆ దారి మీ కూతురికి నచ్చిందో లేదో కూడా అడగటం విస్మరించారు.”

“నేనేది చేసినా తన మంచికే చేసానమ్మా”

“ఐ అండర్స్టాండ్ అంకుల్. కూతురి భవిష్యత్తును కలలుగా కంటూ అదే జీవితంగా బతికారు. మన మధ్యతరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. చట్రంలో ఎంతో పద్దతిగా పెంచుతారు “, ఒక్క నిమిషం ఆగి , “ఊపిరి సలపనంత పద్ధతిగా పెరుగుతాం మేము”, ముగించి తలకిందకు దించేసాను అంకుల్ కళ్ళలోకి చూడలేక.

పది నిమిషాలు ఏమి మాట్లాడకుండా వుండిపోయారు అంకుల్. నేను కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాను.

“మరొక్క మాట…..శ్రావణిని, దీపక్ ను కౌన్సిలింగ్ కు పంపిద్దాము”, అంకుల్ మౌనాన్ని చేధిస్తూ అన్నాను.

“కౌన్సిలింగ్…..అంటే…..అదీ….మరి…నలుగురు ఏమనుకుంటారు”

” మన అమ్మాయి జీవితానికి మించిన పరువా చెప్పండి? “, అంకుల్ కళ్ళలోకి చూస్తూ అడిగాను.
సమాధానం చెప్పలేక తలదించుకున్నారు.

“శ్రావణి చేసింది పొరపాటు పనే. తనలా చెయ్యకుండా వుండాల్సింది. మనమేవ్వరమూ తనను నినదించవొద్దు. కోప్పడి, ఇలా చేసావేంటి అని తిడితే ఇంకా ముడుచుకుపోతుంది. మనసు విప్పి మాట్లాడదు. ప్రేమగా మాట్లాదాం. నీకు మేమున్నామన్న ధైర్యాన్ని తనకు కలిగిద్దాం.”

* * * * * * * * * * * * * * * * * * * *

“దీపక్, నాకు తెలిసిన సైక్రాటిస్ట్ ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే అపాయిట్మేంట్ తీసుకుంటాను”

“చివరకు నన్నా స్థితికి తీసుకొచ్చింది శ్రావణి”

“చదువుకున్న మీరు కూడా అలా అంటే ఎలా?”

“తనకేం తక్కువ చేసాను?”

“ధనం, దర్పం, చీరలు, నగలు..ఇవి అమర్చిపెట్టారు. మానసికంగా తన మనసును హత్తుకున్నారా? శ్రావణి ఎంత ఒంటరితనంతో బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి దీపక్ .”

ఇంకా ఎంతో మాట్లాడాలన్న నా ఆత్రాన్ని ఆపేసుకుంటూ ,”ప్రేమ లేదని కాదు. ఒక కమ్యునికేషన్ గ్యాప్. శ్రావణిని అర్థం చేసుకోండి. కౌన్సిలింగ్ కి వెళ్ళండి దీపక్, ప్లీజ్…ఇద్దరికీ ఉపయోగపడుతుంది”

“సరే, అపాయిట్మేంట్ తీసుకోండి.”

* * * * * * * * * * * * * * * * * * * *

శ్రావణి కాస్త కోలుకుంది. సాలిడ్ ఫుడ్ తీసుకోగలుగుతుంది. మానసికంగా ఎంత ఒత్తిడికి లోనయిందో తన మొహం చూస్తుంటే అర్థం అవుతుంది.

బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారందరికీ ఈ వార్త అందేసినట్టుంది. మ్యుజియంలో బొమ్మను చూడటానికి ఎగబడినట్టు క్యూ కట్టేశారు. సమస్యేంటి అంటూ ఆరా తీసేవాళ్ళు కొందరైతే, ఏమైందంట? ఎందుకిలా చేసిందంట? అంటూ ఇంట్రాగేసన్ చేసేవాళ్ళు మరికొందరు. ఇలాంటి పరిస్థితుల్లో పరామర్శలకు రాకూడదని, పలకరింపుల అవసరం లేదనే ఇంజ్ఞిత జ్ఞానం ఎంత నాగరికత నేర్చుకుంటే తెలిసేది?! కొన్ని కొన్ని విషయాలలో మన ఇండియన్ కమ్యూనిటీ మారాల్సింది ఎంతైనా ఉంది అనిపిస్తుంది.

ఏకాంతం దొరకగానే “శ్రావణి…” అని పిలిసాను. మాట్లాడేలోపే బోరున ఏడ్చేసింది. ఏడవనీ, కరువు తీరా ఏడవని. మనసు కరిగి నీరవ్వనీ. నేను మాట్లాడకుండా తననే చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి కుదురుకుంది.

“నీకు కుదిరినప్పుడు తీసి చదువు. ఏకాంతంలో ప్రశాంత మనసుతో చదువు. ఆలోచించు బాగా ఆలోచించు “, కవరు చేతిలో పెడుతూ అన్నాను.

శ్రావణి,

ఇలా ఉత్తరం రాయాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధ పడుతూనే, కనీసం ఈ అవకాశాన్ని నాకు మిగిల్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

నీ ఉత్తరానికి ప్రత్యుత్తరమే అనుకో! మాటల మూటలు విప్పితే భావాలు అటు ఇటు ఎగిరిపోతాయేమోనని, అక్షరాలలో బంధించి నీకిస్తున్నాను. నీ కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాలనుంది. నీ కన్నీరు ఎక్కడ నా ప్రశ్నల గాఢతను తగ్గిచేస్తుందేమోనన్న అనుమానంతోనూ ఈ ఉత్తరం రాస్తున్నా…..అర్థం చేసుకుంటావు కదూ!

ఏయ్ పిచ్చి మొద్దూ……మమ్మలనందరినీ వదిలేసి అలా ఎలా వెళ్ళిపోదామనుకున్నావు? ఈ పాశం అంత తేలికగా తెగిపోతుందనుకున్నవా?

నీ గురించి ఆంటీ ఎంత తల్లడిల్లిపోయారో మాటల్లో చెప్పలేను. దుఖాన్ని దిగమింగుకుంటూ అంకుల్ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాను. శ్రావణి భవిష్యత్తు కోసం కనని కల లేదు, చెయ్యని ఏర్పాటు లేదు…చివరకు ఇలా అయింది అంటూ ఆంటీ అంకుల్ ఇద్దరూ కుమిలిపోతున్నారు. నువ్వు లేని లోకంలో ఆ వృద్ధ దంపతులు బతకగలరనుకుంటున్నావా?

దీపక్ హటాత్తుగా పదేళ్ళు పై పడినట్టు అయిపోయాడు. “మీరెళ్లి ఫ్రెష్ అయి రండి, నేనుంటాను శ్రావణి దగ్గర”, అని నేనెన్నిసార్లు చెప్పినా, నిన్ను క్షణం కూడా వదిలి వెళ్ళలేదు. ఏ సమయాన ఏ అవసరం వస్తుందో అని కనిపెట్టుకుని కూర్చున్నారు. అతని కళ్ళల్లో కదలాడిన దిగులు వెనుక ప్రేమ లేదంటావా? తనకు నీ పై ఉన్న ప్రేమను వ్యక్తపరచటం చేతకాదను..నేను ఒప్పుకుంటాను. అంత మాత్రానికే ఒదిలి వెళ్ళిపోవాలా? మార్చుకోలేవా ? ఆలోచించు…

శ్రావణి…నీ గుండెలపై చెయ్యి వేసుకుని నిన్ను నువ్వు ప్రశ్నించుకో.నీ ఈ పరిస్థితి కి నువ్వు కారణం కాదంటావా? నీ తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు..చివరకు సమాజం సైతం నీ ఈ స్థితికి కారణమని ఒప్పుకుంటున్నాను. వీటన్నింటికి మించి, నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలని ఎన్నడన్నా ప్రయత్నించావా?

అంకుల్ నీ చదువు, పెళ్ళి నిర్ణయించినప్పుడు….అది నీకు ఇష్టం లేకపోయినా ఎందుకు తలవంచావు శ్రావణి ?

అత్తగారి బిపి, మావగారి షుగర్ నీ భుజాలపై మోపినప్పుడు, నా అధీనంలో లేని వాటిని నేనెలా మోయగలను అని నువ్వెందుకు నిలదీయలేదు?

నిజం చెప్పు..వంట కుదరకపోయినా, పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినా, నిన్ను నువ్వు దోషిని చేసుకోలేదూ?

ఎందుకు శ్రావణి, ఈ మంచి అనిపించుకోవాలన్న ఆరాటం మనకెందుకు?

నీ జీవితంలో అసంతృప్తి రాజ్యమేలుతున్నపుడు పిరికిగా జీవితాన్నే ముగించాలనుకున్నావు. ధైర్యం చేసి ఆ గిరిలో నుంచీ ఒక్క అడుగన్నా బయటకు వెయ్యాలని ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే…పంజరంలో బంధీగా ఉండటంలో నీ స్వార్థం ఉంది. ఆ స్వార్ధం మరేదో కాదు , అది నీ కంఫర్ట్ జోన్. లొంగిపోవటంలో ఉన్న సుఖం ఎదురు తిరగటంలో లేదు. ఇక్కడ వింత ఏమిటంటే…స్వార్థం అట్టడుగున ఉన్న కనీకనిపించని పొర, దానిపై జాలి అనే భావన, దానిపై త్యాగం అన్న పేరు. నీ ఆత్మసాక్షిలోకి తొంగిచూడు, నేను అన్నది నిజమని ఒప్పుకుంటావు. ఏదో పోతుందని భయపడుతూ, నిన్ను నిన్ను కోల్పాయావు.

మన సమాజంలో మగాడు ఎప్పుడూ కంఫర్టబుల్ పోసిషన్ లోనే ఉన్నాడు. తరాలుగా స్త్రీ మగాడి ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. ఒక్క నిమిషం ఆడ,మగ అన్న సంగతి పక్కన పెట్టి ఆలోచించు . ఏ మనిషైనా తన అధికారాన్ని, సౌకర్యాలను ఒదులుకోవటానికి సమ్మతంగా ఉంటారా ?

శ్రావణి, స్త్రీలుగా మన హక్కులను తెలియపరచటం మన హక్కు మాత్రమే కాదు , అది మన బాధ్యత . నీ బాధ్యతను నువ్వు నిర్వహించావా అని కూడా అడగట్లేదు, అసలు గుర్తించావా?

ఈ ముసుగులు తీసెయ్. ఈ హిపోక్రాసి మనకొద్దు. ఇది నేను అనే హక్కును తెలియచెప్పే బాధ్యతను నిర్వహిద్దాం, మన కోసం, మన ముందు తరాల కోసం.

శ్రావణి…..నన్ను క్షమించు. నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవటంలో విఫలమయ్యాను. నా సహకారం నీకు మరి కొంత అందించి ఉండాల్సింది.

ఇట్లు,
నీ స్నేహితురాలు

 

ప్రచురితం: http://koumudi.net/Monthly/2013/february/index.html

This entry was posted in కధలు, గుర్తింపు. Bookmark the permalink.

4 Responses to హక్కు బాధ్యతే (కధ)

  1. david says:

    మీరు రాసిన కథ చాలా బాగుంది ప్రవీణ గారు

  2. Anonymous says:

    Nice story depicting the mental status of a opressed gender in this society.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s