పర్సనల్ స్పేస్
ఆగి ఆగి వీస్తున్న చల్లటి గాలి. గాలి వీస్తున్నప్పుడల్లా సన్నగా కురుస్తున్న వానజల్లు కారు విండోలో నుంచి ముఖంపై పడుతుంది. వాతావరణం ఆహ్లాదంగా వున్నప్పుడు కారు విండో ఓపెన్ చేసి డ్రైవ్ చెయ్యటం నాకెంతో ఇష్టం. తృప్తిగా దీర్ఘ శ్వాస తీసుకున్నాను. చిరుగాలి నన్ను అభినందిస్తున్నట్టు, వాన చినుకులు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నట్టు ఏవేవో ఊహలు.
వాచ్ లో టైం చూసుకున్నాను. తొమ్మిదైంది. ఈయన, సిద్ధు ఏం చేస్తున్నారో? భోజనం చేసారో లేదో?
వర్షం వల్లననుకుంట ట్రాఫిక్ విపరీతంగా ఉంది. కారు నత్త నడక నడుస్తోంది. నాలుగు చినుకులు కురిస్తే చాలు, ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోతుంది.ఇంటికి వెళ్ళటానికి కనీసం ఇంకో అరగంటన్నా పట్టేదట్టుంది. ఈయన కంగారు పడుతున్నారేమో? వెంటనే ఫోన్ చేసాను.
” ఎక్కడున్నావ్?”, ఆ విసుగు నాకు వినిపించకుండా ఉంటే ఎంత బాగుండు!
“వచ్చేస్తున్నానండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇంకో అరగంటలో వచ్చేస్తాను”, ఫోన్ పెట్టేసిన సౌండ్.తిన్నారో లేదో అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసారే. మళ్లీ చేస్తే కోపగించుకుంటారు. భారంగా నిట్టుర్చాను.
ఈ విసుగులు, కోపాలు ఎప్పుడూ వుండేవేలే. ఈ క్షణాన ఈ ఆనందాన్ని ఆస్వాదించనీ…
ఎంత బాగుందీరోజు. నాకు నేనే కొత్తగా కనిపిస్తూ, ఏదో నమ్మకం..మరేదో గర్వం. నాకూ ఓ ప్రపంచం..నా ఊహలు, నా అభిరుచులు, నా ఇష్టాలు కలబోసి నిర్మించుకున్న నా ప్రపంచం. థిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్. ఎంత కాలం తర్వాత ఈ పదాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నాను! ఈ వర్షపు గాలి నా ఈ ఆలోచనలను మాటలుగా వింటూ తలాడిస్తున్నట్టు, ఔనన్నట్టు ఉండి ఉండి వాన చినుకులు నాపై కురిపిస్తున్నట్టుంది.
“హాయ్ అమ్మ, హౌ వస్ యువర్ డే “, ప్రేమగా అడిగాడు నా ఇరవైయేళ్ళ కొడుకు సిద్ధు.
“చాల బాగుంది, ఎంతో నేర్చుకున్నాను. నా వర్క్ ని చాలా మెచ్చుకున్నారు తెలుసా”, నవ్వుతూ సంతోషంగా చెప్పాను.
సోఫాలో అసహనంగా కదులుతూ టీవీ చానెళ్ళు అవిశ్రాంతంగా మారుస్తున్న మా వారి మొహంలోని కోపం నా దృష్టిలో పడకుండా ఉంటే ఎంత బాగుండు!
పొద్దుననగా వెళ్లానేమో, ఇల్లంతా చిందరవందరగా తయారయ్యింది. వంటగదితో సహా అన్ని గదులు సర్దుకుని, రేపటి వంటకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని నడుం వాల్చాను.
సన్నటి గురక. ఏమంత తప్పుచేశానని ఈ సాధింపు? ఇంకో రెండు రోజులు మాటామంతీ లేకుండా వుంటారు కాబోలు. ఎక్కడి లేని నీరసం ఆవరించేసింది. గంటసేపు అటు ఇటు దొర్లాను. ఆలోచనలు వేధించేస్తున్నాయి.
ఇంక లాభం లేదు. ఈ వ్యధని కాన్వాసుపైకి ఎక్కిస్తే కానీ మనసు శాంతించదు. అలికిడి చెయ్యకుండా లెగిసి ఆ గదిలోకి వెళ్ళాను.
కాన్వాసును సరిచేసుకుని, రంగులు బయటకు తీసాను. కుంచె అరచేతిలో అందంగా ఒదిగిపోయింది. ఫలకంలో ఒక్కో రంగు ఒక్కో భావోద్వేకం. రంగుల కలయిక నా తలంపుల మేళవింపు. పెన్సిల్ తో గీస్తున్నాను, బ్రష్ తో రంగులద్దుతున్నాను, మునివేళ్ళతో సరిచేస్తున్నాను. కాన్వాసుపై రూపు దిద్దుకోబోతున్నది ప్రస్తుత నా మానసిక స్తితి.
ఉదయమంతా కొత్త విషయాలు నేర్చుకుంటున్న ఆనందం, ఎందరో చిత్రకారులను కలిసిన సంతోషం….రేయిలో ఓ పెదవి విరుపు, ఓ నుదుటి చిట్లింపు.
ముఖాకృతి…ఓ వైపు పసుపు పచ్చటి వెలుగు కిరణాలు. మరో వైపు నిశీధి రాత్రి చీకటి. సంకెళ్ళు, పరుగులు పెడుతున్న పాదాలు, పాద ముద్రలు. నల్లటి వలయాలు, కన్నీరు, చిరునవ్వు, విశ్వాసం తొనికిసలాడుతున్న కన్ను. దిగంతాలకు సాగిపోతున్న గీతలు. ఈ పైంటింగ్ పరిశీలనగా చూస్తే, చూసే చూపును బట్టి, చూసే వారి మానసిక స్తితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థం అవుతుంది.
వాకిట్లో పేపర్ విసిరిన శబ్దం. అప్పుడే తెల్లారిపోయిందా? తృప్తిగా పైంటింగ్ వైపు చూసుకున్నాను. చిన్న చిన్న సవరింపులు చేసి చివరన ఓ మూల సంతకం చేసి నా పేరు రాసి, డేట్ వేసాను. మనసు దూది పింజెంలా ఎగిరిపోతుంది. నిన్నటి రాత్రి భారం అణువంతైనా లేదు.
“దోసెలు వేసాను. మీకిష్టమని కొబ్బరి చెట్నీ, సిద్ధు కోసం పల్లీల పచ్చడి చేసాను”
……….
“లంచ్ కి ఇంటికి వస్తారా? లేక క్యారేజ్ కట్టనా?”
……
“మిమ్మల్నే మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయా?”
“ఆఫీసు బాయ్ ని పంపిస్తాను”, ముక్తసరి సమాధానం.
“సరే, అన్నం వేడిగా వండి పంపుతాను”.
………
నిట్టూర్చటం తప్పితే నేను చెయ్యగలిగింది ఏమి లేదు.
మేగజైన్ చూస్తూ కూర్చున్నాను. అమ్మ ఫోన్ చేసింది. ఆ మాట ఈ మాట మాట్లాడాక, ” రాత్రి అల్లుడుగారు ఫోన్ చేసారు. ఏదో వర్క్ షాప్ అని వెళ్ళావంట కదా! చీకటి పడింది ఇప్పటిదాకా రాలేదని కోపగించుకున్నారు”
“ఊ”
“ఆ..అంటే నిన్నేమి అనలేదు. నువ్వింకా రాలేదని కంగారు పడ్డారంతే”
“నాకు అర్థంఅయ్యిందిలే అమ్మా. నిన్న చిత్రలేఖనంలో మెలుకువలు చెప్పే వర్క్ షాప్ జరిగింది. దానికి వెళ్ళాను. వర్షం పడి ట్రాఫిక్ జాం అవ్వటంతో ఇంటికి వచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది.”
“ఏమన్నా అంటే నీకు కోపం వస్తుంది కానీ, ఎందుకమ్మా నీకవన్నీ?”
” ఏవన్నీ?”
“అదే, ఆ పెయింటింగ్ లని బోల్డంత డబ్బు తగలేస్తున్నావు, పైగా ఈ తిరుగుళ్ళు….”, అమ్మ మాట ఇంకా పుర్తవ్వలేదు,
“నేను సంపాదించుకుని దాచుకున్న డబ్బు చాలానే ఉంది. పైగా కొద్ది మంది పిల్లలకు, పెద్దలకు పైంటింగ్ క్లాసులు కూడా చెపుతున్నాను. అలా వచ్చిన డబ్బులే నా రంగులకు, ఇతరత్రా సామనుకు సరిపోతుంది”, నెమ్మదిగా సమాధానం ఇద్దామనే అనుకున్నాను. మాట కరుకుగానే పలికినట్టుంది.
నేను చీరలకో, నగలు కొనుక్కోవటానికో షాపింగ్ అని వెళ్లి కాస్త లేటుగా వచ్చి ఉంటే నీకు కానీ, ఆయనకు కానీ ఏ పిర్యాదు వుండేది కాదుగా. నోటిదాకా వచ్చిన మాట పైకి రాకుండా ఆపేసాను.
“పోనీ ఏదన్నా చేయ్యాలనుంటే చీరలపై కుట్లు అల్లికలు వేస్తూ కాలక్షేపం చెయ్యొచ్చు. ఇంట్లోనే ఉంటూ ఎందరో చీరల వ్యాపారాలు చెయ్యట్లేదు? అల్లుడుగారికి ఇష్టం లేని పని చెయ్యటమెందుకు చెప్పు? సంసారాన్ని పాడు చేసుకుంటావెందుకు?” అమ్మ గొంతులో కోపం ధ్వనించింది.
“నాకు ఇష్టమైన పనిని నేను ఇష్టంగా చేస్తేనే పాడయ్యే సంసారంలో నాకు సుఖముందా అని నువ్వేనాడన్నా ఆలోచించావా అమ్మా?”
“ఏమో తల్లి, నీకు చెప్పలేము”, అమ్మ గొంతులోని నిస్సహాయత నన్ను మరి మాట్లాడనివ్వలేదు.
మరో నాలుగు మాటలు మాట్లాడి, నువ్వేమి కంగారుపడకు. ఇక్కడ అంతా బాగానే ఉంది అనే భ్రమను అమ్మకు కలిగించాలని ప్రయత్నించి ఫోన్ పెట్టేసాను.
అమ్మ..పిచ్చి అమ్మ. తనకేం కావాలో కూడా మర్చిపోయి బతికేసిన అమ్మ. తన కూతురు ఎక్కడ ఆ చట్రంలో నుంచి బయటకు వస్తుందో అని బయపడుతున్న అమ్మ.
* * * * * * * * * * * * * * * * * *
చల్లటి చెయ్యి నుదుటిపై తాకేసరికి మెలుకువ వచ్చింది. వళ్ళంతా నొప్పులు, నిప్పులా కాలుతున్న శరీరం.
“నువ్వింకా నిద్ర లెగవలేకపోయేసరికి అనుమానం వచ్చి చూసాను. జ్వరం వచ్చినట్టుంది. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో”, ఈయన టాబ్లెట్, మంచినీళ్ళు చేతికందించారు.
టైం ఏడు దాటిపోయింది. సిద్దూకి ఈ రోజు నుంచీ సెమిస్టరు ఎగ్జామ్స్. తొందరగా వెళ్ళాలి అన్నాడు. గబుక్కున లెగవబోతే కళ్ళు తిరిగాయి.
“నువ్వు పడుకో. మేము మేనేజ్ చేసుకుంటాం” అన్నారీయన.
సోయలేకుండా నిద్రపోయినట్టున్నాను. ఒళ్ళంతా చెమట పట్టి చిరాకేసేసరికి మెలుకువ వచ్చినట్టుంది. జ్వరం తగ్గింది. మెల్లిగా లేచాను.
సిద్ధు కాలేజికి, ఈయన ఆఫీసుకు వెళ్లి పోయినట్టున్నారు. ఏమి వండుకున్నారో, ఏమి తిన్నారో అనుకుంటూ వంటగదిలోకి వెళ్లాను. డైనింగ్ టేబుల్ పైన కూడా చూసాను. ఎక్కడా ఏమీ వండిన, తిన్న ఆనమాలు లేవు. సిద్దుకు అసలే ఎగ్జామ్స్, ఏమీ తినకుండా వెళ్ళిపోయాడా? మనసు చివుక్కుమంది. వెంటనే ఈయనకు ఫోన్ చేసాను.
“మేమిద్దరం కాఫీ, టిఫిన్ హోటల్ ల్లోనే చేసాము. నీకు ఇబ్బందిగా ఉంటే వెంటనే కాల్ చెయ్యి. ఇంక ఉంటా”
కడుపులో సన్నని మంట మొదలయ్యింది. ఆకలి మంట. వండుకునే ఓపిక లేదు. ఫ్రిడ్జ్ లో ఇడ్లి పిండి రెడీగానే ఉంది. ఈయన కనీసం ఇడ్లిలన్నా వేసి వుండాల్సింది కదూ! మనసులోనూ సన్నని బాధ మొదలయింది.
వండి వార్చటం అనేది కేవలం నా బాధ్యతే! చివరకు అదే నా జీవితలక్ష్యం అని కూడా నిర్ణయించేయ్యబడింది ఒకప్పుడు. ఒక్క పూట నాకు ఆరోగ్యం బాగోకపొతే నోటికి ముద్ద అందించే వారే లేరా?
కళ్ళలో సన్నటి చెమ్మ ఉదృతం అవ్వకుండా ఆపేస్తూ వంటింట్లోకి వచ్చాను. ఒక రేకు ఇడ్లీలు వేసి, కాఫీ కలిపి తెచ్చుకున్నాను. వేడి వేడిగా కాఫీ గొంతులోకి దిగుతుంటే, ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.
పోస్ట్ గ్రాడ్యుయేసన్ అవ్వగానే పెళ్లి కుదిరిపోయింది. నాకైతే ఒక సంవత్సరం ఉద్యోగం చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలని బలంగా అనిపించేది. పెళ్ళంటూ కుదిరాక అంత కాలం ఆగటం కుదరదమ్మా, అబ్బాయి వారు ఒప్పుకోరు. మంచి సంబంధం అంటూ చదువు అయ్యి అవ్వగానే పెళ్లి జరిపించేసి, సంసారంలోకి అడుగులు వేపించేసారు.
కొత్త జీవితం, కొత్త సరదాలు కొంత కాలం మధురంగానే సాగాయి. ఉద్యోగ ప్రయత్నం తొందరగానే ఫలించి ఉద్యోగిని అవతారం ఎత్తాను.
మరో రెండేళ్లలో బాబు పుట్టాడు. ఈయన వ్యాపారం బాగా పుంజుకుంది. టూర్స్ అని దేశాలు తిరగటం ఎక్కువైంది. నేను బాబు ఆలనాపాలన, ఇంటి పని, వంట పని, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలయిపోయాను.
ఎప్పుడు ఎలా మా మధ్య గ్యాప్ రావటం మొదలయిందో తెలీనే లేదు. తెలిసేటప్పటికి మాటలు కరువయ్యాయి. బాధ్యతలలో కూరుకుపోతూ ఒంటరితనాన్ని తోడుగా హత్తుకున్నట్టున్నాను. పెళ్ళైన కొత్తలో మేమిద్దరమూ కలిసి వండుకున్న వంటలు, చేసుకున్న ఇంటి పని ….రానురాను నేను ఆఫీసు నుంచీ రావటం ఎంత ఆలస్యంమయినా నా కోసమే ఎదురు చూస్తూ ఉండేవి.
“హోటల్ నుంచీ ఆర్డర్ చేస్తాను, నువ్విప్పుడు రాద్దాంతం చెయ్యకు”
“కావాలంటే నువ్వింకో పనమ్మాయిని పెట్టుకో. పనంతా చెయ్యటం నా వల్ల కాదు”
“బట్టలు మడత పెట్టాను కదా, అంతకన్నా ఇంకేమి చేస్తాను నేను”
“కొద్దో గొప్పో సాయం చేస్తాను. అంతే…పనంతా నేనే చేయ్యాలన్నట్టుందే నీ వరస”
రోజూ సాయంత్రాలు ఇంట్లో మాటల యుద్ధాలు జరిగేవి. వాటి ప్రభావం బాబుపై పడకూడదని ఎంత ప్రయత్నించినా, ఒక్కోసారి వాడి ముందే వాగ్వివాదాలు జరిగిపోతూ ఉండేవి.
ఓ పూట సరుకులు తెస్తేనో, మరోపూట బాబును చూసుకుంటేనో…తనేదో నాకు విపరీతమైన సాయం చేస్తున్నట్టు, నేనా విషయాన్ని గుర్తించి తనకు కృతజ్ఞతగా వుండాలని ఆశిస్తూ వుండేవారు. నాకవన్నీ అతి సా ధారణంగా, భార్య భర్త సమానంగా చేసుకోవాల్సిన పనులుగానే తోచేది.
రానురాను మానసికంగా దురమవుతున్న మా బంధాన్ని చూసి కుమిలిపోయాను. తనతో వాదన అనవసరం. ఈ పనంతా నాదే, నేను చేసుకోవాల్సిందే. నా శక్తి మేరకు ఎంత వరకు చెయ్యగలనో అంత వరకే చేస్తాను. ఇల్లు ఫైవ్ స్టార్ హోటల్ లా మెరిసిపోవాలని, ఎక్కడి సామాను అక్కడే వుండాలని, రెండు పూటలా రెండు రెండు కూరలు వండాలనే అత్యాశలకు పోను.బాబు పనుల తర్వాతే మిగతా ఏ పనులైనా. నన్ను నేను బలపరుచుకున్నాను.
అనుకున్నంత ఈజీ కాదు ఒంటి చేత్తో అన్ని పనులు సమతూకంగా చేసుకోవటం. శారీరక శ్రమ కన్నా మానసిక ఒత్తిడి, ఒంటరితనం కుంగదీసేవి.
“ఇప్పుడు ఫైనాష్యియల్ గా బాగానే వున్నాము కదా. నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే ఏమైంది? ఇంట్లో ఉంటూ బాబును చూసుకో రాదు”, బాబుకు ఆరోగ్యం బాగోనప్పుడో, నాకు ఆఫీసు పని ఎక్కువైనప్పుడో వినిపించే మాటిది.
” డబ్బు కోసమే ఉద్యోగం చేస్తున్నట్లయితే ఎప్పుడో మానేసేదాన్ని. ఇళ్ళే ప్రపంచం కాదు. బయట ప్రపంచంలోనూ నాకు భాగస్వామ్యం ఉంది. ఈ నాలుగు గోడలనే నా పరిధిగా నేను వుహించుకోలేను.”
” చదువుకున్నానని పొగరు లేదు, ఉద్యోగం చేస్తున్నానన్న తల బిరుసు అంత కన్నా లేదు. చదువు ఉద్యోగం కోసమే అని నేను అనట్లేదు. ఉద్యోగం బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, వ్యక్తుల గురించి వారి స్వభావాల గురించి తెలియచెపుతుంది. ఇవన్నీ తెలుసుకుని నేను సాధించేది ఏమిటో అర్థం చేసుకునే శక్తి మీకు లేదు. మీ అశక్తికి బాధ్యురాలిని నేను కాదు.”
“ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరిలా అంటున్నారు. ఇబ్బంది తొలిగాక ఇంట్లో ఖాలీగానే ఉంటున్నావుగా అని ఎద్దేవా చేసేది మీరే అవుతారు. కూరలో ఉప్పు తక్కువైనా, టీపాయిపై దుమ్ము కనిపించినా, చివరకు బాబు ఏడ్చినా…ఇంట్లోనే ఉండి ఏమి చేస్తున్నావు అనే మాటలు వస్తాయి”.
ఇలాంటి సమాధానాలు ఎన్నో సార్లు చెప్పాను.
“మీకో సంగతి తెలుసా! ఇంట్లో వుండే టెన్షన్ ను ఆఫీసులో మర్చిపోతాను. ఆ పనే లేకపోతే నాకు పిచ్చేక్కిపోతుంది. ఈ పరుగులే బాగున్నాయి, నెమ్మదిస్తే ఒంటరితనం గూడు కట్టుకుంటుంది”, పెదవి దాటకుండా నాలో దాచేసుకున్న మాటలు కొన్ని. ఒకవేళ ఆ మాట పైకి అనేస్తే, ఆ తర్వాత తలెత్తే వాదులాట నాకు తెలియంది కాదు. నీకు ఇల్లు, సంసారం కన్నా కెరియర్ ఎక్కువపోయింది..ఇలా మొదలయ్యి చివరకు దోషిగా చిత్రించేది నన్నే…ఈయనైనా, అమ్మయినా, సమాజమైనా!
నా సంపాదనతో అవసరం ఉన్నంత వరకు, తనకు తన సౌఖర్యాలలో ఇబ్బంది తలెత్తనంత వరకు…నాకు సంపాదించుకునే స్వేచ్ఛను ఆయన ప్రసాదిస్తున్నట్టు ప్రవర్తించటం నాకు తెలియంది కాదు.
కాలింగ్ బెల్ మోతతో వర్తమానంలోకి వచ్చి పడ్డాను.
“ఈరోజు పేపర్ చూసారా? మీరు అటెండ్ అయిన వర్క్ షాప్ గురించి జిల్లా ఎడిసన్ లో వేసారు. చాలా మంచి స్పందన వచ్చిందంట కదా?”, పక్కింట్లో ఉండే లత వచ్చింది. ఆ విశేషాలన్ని లతతో పంచుకుంటుంటే బాగుంది.
“మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉంది. మీరు ఎంచక్కగా మీ అభిరుచులకు సమయం కేటాయించుకోగలుగుతున్నారు. నాకు ఇంటి పనితోనే సరిపోతుంది. క్షణం తీరట్లేదంటే నమ్మండి”, అంది లత.
“తీరిక ఉండదు లత, మనమే కల్పించుకోవాలి”
“మీ చేతిలో ఆర్టు ఉంది. మిలా పైంటింగ్ వెయ్యటం నాకెలా వస్తుంది?”, పైంటింగ్ వెయ్యటం రావటం కారణంగానే నేను సమయం కేటాయించుకోగలుగుతున్నానన్న అర్థం ధ్వనిస్తూ, అడిగిన ప్రశ్నకు సమాధానం దాటేసింది.
“పైంటింగ్ సంగతి వదిలెయ్యి. నీకోసం నువ్వు ఎంత సమయం కేటాయించుకుంటున్నవో చెప్పు? ఇట్ కాన్ బె అస్ సింపుల్ అస్ సిట్టింగ్ idle . పోనీ ఓ మంచి పుస్తకంలో కొన్ని పేజీలు చదవటం లేక నీకు ఇష్టమైన పాట వినటం, నీకు నచ్చిన సినిమా చూడటం. అదీ కాకపోతే నువ్వొక్కదానివే వాకింగ్ కి వెళ్ళటం…ఏదైనా ఎంత చిన్న పనైనా.ఈ లాభమూ, గుర్తింపు ఆశించకుండా కేవలం నీ తృప్తి కోసం చేసే పని”
“కొత్త సినిమా పాటలు మా వారు డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు, నన్ను పిల్లలను తరచుగా సినిమాలకు తీసుకెళ్తునే ఉంటారు. పుస్తకాలు చదివే అలవాటు నాకెప్పుడు లేదండి. నేను లావుగా లేనుగా..నాకెందుకు వాకింగ్? ఇంకా నాకు తీరిగ్గా కూర్చునే తిరికేది? …..ఆ…రోజూ నాలుగైదు టీవీ సీరియల్స్ క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాను”, నేను ఉదహరించిన ప్రతి పనికి సమాధానం చెప్పేసింది.
“హ్మ్.. లత, ఇంట్లో పనేక్కువైందని ఆ విసుకుని మీ వారి పైనో, పిల్లల మీదో చూపిస్తూ వుంటావా?”, ఆలోచనగా అడిగాను.
“ఆ..ఒక్కోసారి అన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది”, గబుక్కున సమాధానం చెప్పేసి, చెప్పకుండా వుంటే బాగుండేదేమో అన్నట్టు పెట్టింది మొహం.
“అది సహజమే లత. ఒత్తిడి ఎక్కువైనప్పుడు రిలాక్ష్ అయ్యే విధానాలు నేర్చుకోవాలి”, అనునయంగా అన్నాను.
“ఆఫీసులో నాకు ఎంత టెన్షనో, ఆ పని ఎంత ఒత్తిడో ఇంట్లో ఉండే నీకేం తెలుసు అంటూ ఉంటారు మా వారు”, నవ్వటానికి ప్రయత్నించింది.
“నీకేం ఇష్టమో ఆలోచించు. కాలేజి రోజుల్లో ఏర్పడిన అభిరుచో, చెయ్యాలనుకుని వివిధ కారణాల చేత చెయ్యలేకపోయిన పనేదైనా…నీ మనసుకు నచ్చేది ఏదైనా”
“నేను స్కూల్ లో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకునేదాన్ని. మా ఇంట్లో ఒప్పుకోలేదు”
“సంగీతం..మంచి స్ట్రెస్ రిలిజర్. ఇప్పుడు నేర్చుకోవటం ఎందుకు మొదలు పెట్టకూడదు?”
“ఈ వయసులోనా?” నవ్వేసింది.
“నా దగ్గర మంచి కీర్తనల సిడిలు ఉన్నాయి. తీసుకెళ్ళి విను”, సిడిలు చేతిలో పెట్టాను.
నాకు జ్వరం అని తెలిసి, “మీరు వంట చేసుకోకండి, నేను పంపిస్తాను”, అని చెప్పి వెళ్ళింది.
టీవీ ఆన్ చేసాను. పది నిమిషాలు న్యూస్ చూసాక, రిమోట్ నొక్కుతూ మరో అరగంట గడిపేశాను. ఇడ్లీలు ప్లేట్లో పెట్టుకుని వచ్చి మేగజైన్ తిరగేస్తూ తిన్నాను. కాస్త కోలుకున్నట్టు ఉంది.
వర్మకు కాల్ చేస్తే? ఆఫీసులో ఉండి ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడేమో? వర్క్ షాప్ గురించి చెప్పనే లేదు అనుకుంటూ ఫోన్ చేసాను.
“నూరేళ్ళాయుష్సు , ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. నిన్ననే చెయ్యల్సింది కుదరలేదు”, ఎప్పటిలాగా హుషారుగా మాట్లాడుతున్నాడు.
“పర్లేదులే, బిజీగా ఉన్నావా? ఓ ఐదు నిముషాలు మాట్లాడితే పర్లేదా?”, అడిగాను.
“తొందరలో నువ్వో ఫేమస్ పెయింటర్ అవబోతున్నావు. అప్పుడు నీ అపాయింట్మెంట్ మాకు దొరుకుతుందో లేదో? అందుకని ఇప్పుడే నీతో మాట్లాడాలి”, అదే హుషారు.
“ఎక్కించు ఎక్కించు మునగచెట్టు బాగా ఎక్కించు”, నవ్వుతూ అన్నాను.
“abstract పెయింటింగ్ పై నువ్విచ్చిన లెక్చర్ అండ్ డెమో ఎంతో అధ్బుతంగా ఉందని మోహన్ అన్నాడు. ఎందరినో ఆకట్టుకుందని కూడా చెప్పాడు”
“అవును వర్మ. నాకెంతో ఆనందంగా ఉంది. మోహన్ గారే నన్ను డెమో ఇవ్వమని ప్రోత్సహించారు. నీకూ ఎంతో రుణపడి ఉన్నాను”, కృతజ్ఞతతో అన్నాను.
“అంత పెద్ద మాటలెందుకులే. ఓ మంచి పార్టీ ఇచ్చేయ్ మాకు”, తేలికగా నవ్వేసాడు.
వర్మ నా జీవితంలోకి మరోమారు తారసపడకపోయి ఉంటే, నేను గానుగెద్దు జీవితాన్నే ఆదర్శంగా తీసుకునే ఆశయంగా బతికేసేదాన్ని.
“నువ్వేనా ఒకప్పుడు నాకు తెలిసిన క్లాస్మేట్వి? నమ్మలేకపోతున్నాను”, ఆశ్చర్యం, దిగ్భాంతి అతని కళ్లలో.
“నాకేం వర్మ? నేను బాగానే ఉన్నాను. ఐదంకెల జీతం, ఎదిగొస్తున్న కొడుకు, సొంతిల్లు, కారు, కాస్తో కూస్తో ఆస్తి, బిజినెస్ చేస్తున్న భర్త, సంఘంలో పలుకుబడి”, తెచ్చిపెట్టుకున్న భరోసాతో చెప్పాను.
అవును నాకేం తక్కువ? మరి మనసులో ఈ వెలితెందుకు?
“అంతేనా? ఇంకేమీ లేవా నీ దగ్గర? డబ్బు, పలుకుబడి సరిపోయాయా”…వర్మ ముఖంలో మారుతున్న రంగుల అర్థాలు.
సూర్యుడు ప్రపంచాన్ని పలకరించక ముందే నేను వంటిట్లోకి అడుగుపెడతాను. పౌర్ణమి వెన్నెలతోనూ, అమావాస్య చీకటితోను సంబంధం తెగిపోయి ఎన్నేళ్ళయిందో నాకే గుర్తులేదు! గడియారపు ముళ్ళులు రెండూ ఒకటయ్యాక నడుము వాలుస్తాను. నా ప్రతీ రోజూ ఇంతే, ఇలా జరగాల్సిందే. అందులో ఏమాత్రం తేడా వచ్చినా నన్ను నేను దోషిని చేసుకుంటాను.
“నీ దినచర్యలో నువ్వు ఎక్కడున్నావు?”, సూటిగా అడిగాడు వర్మ.
“ఎక్కడంటే………”, ఏమని చెప్పను? అసలు నాకు తెలిస్తే కదా చెప్పటానికి? పోనీ జీతం తీసుకున్న రోజని చెప్పనా? అందులో రొటీన్ వుందే కానీ ఆనందం లేదే!?
“ఏమైపోయాయి నీ అభిరుచులు? ఏమైపోయాయి నీ ఆశలు, ఆదర్శాలు? అటకేక్కించేసావా హాబీస్ అన్నీను? మిగతా వారి సంగతేమో కానీ, నువ్వు ..నువ్వు ఇలా అవుతావని నేను ఊహించలేదు”, వర్మ ఇంకా దిగ్భాంతిలోనే ఉన్నాడు.
“అ రోజుల్లో ఎంత సూటిగా, నిక్కచ్చిగా నీ అభిప్రాయాలు చెప్పేదానివి. నీ ధైర్యాన్ని చూసి నేను అబ్బురపడేవాడిని. నీకో విషయం చెప్పనా? ఆ రోజుల్లో నువ్వు తరుచుగా వాడే పర్సనల్ స్పేస్ అనే పదం నాపై ఎంత ప్రభావం చూపించిందంటే…నా జీవితాన్ని నిర్దేశించింది అని చెపితే నువ్వు నమ్మగలవా?”, ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతైంది.
పర్సనల్ స్పేస్..personal space ……పర్సనల్ స్పేస్ అంటే ఫిజికల్ స్పేస్ మాత్రమే కాదు . మన మనసులో, మన జీవితంలో మనకంటూ కొంత స్థానం. మనకున్న సమయంలో కొంత భాగం మన కోసం కేటాయించుకోవటం. కేవలం ఆనందం కోసం చేసే చిన్న పని, తృప్తినిచ్చే అభిరుచి….. లాభనష్టాలు బేరీజు వేసుకోలేని ఏ పనైనా. ఏ ఆత్మవంచన, ఎవరి జోక్యమూ లేని స్థానం. ఎంత మాట్లాడేదాన్ని ఈ పర్సనల్ స్పేస్ గురించి!
“వర్మ, ఇప్పుడు పర్సనల్ స్పేస్ అంటే సెల్ఫ్ ఫిష్ నెస్ అనుకుంటారు”, నవ్వటానికి ప్రయత్నించాను.
“ఒకళ్ళు అనుకునేదేమిటి? మనకి మనకే తెలిదా? త్యాగాలు చేస్తూ సెల్ఫ్ పిటి లోకి జారిపోతూ ఎవరిని ఉద్ధరించాలని? ” చెళ్ళున చెంపదెబ్బ కొట్టినట్టయింది.
నేను త్యాగాలు చేస్తున్నాననుకుంటున్నానా? అన్ని పనులూ ఒక్కదాన్నే చేసుకోగలుగుతున్నాను అన్న ధైర్యం వెనుక…నేను ఒంటరిని అన్న సెల్ఫ్ పిటి లేదూ నాకు?
కాస్త విశ్రమిస్తేనో, కొంత సమయం నాకోసం కేటాయించుకుంటేనో..అదేదో నేను తప్పు చేస్తున్నట్టు, టైం వేస్ట్ అయిపోతున్నట్టు బాధ పడిపోవటానికి త్యాగం అన్న పేరు పెట్టానా?
ఎక్కడికి జారిపోతున్నాను? జారిపోతూ ఎవరికి ఆసరా ఇస్తున్నాను? పనేక్కువయ్యి బాబును విసుక్కున్న రోజులు కళ్ళ ముందు మెదిలాయి.
నన్ను నేను ప్రేమించుకోగలిగితేనే నిర్మలమైన పేమను నా వారికి పంచి ఇవ్వగలనన్న విషయాన్ని ఎలా మర్చిపోయాను?
ఆర్ధిక ఆలంబన మానసిక స్వేచ్ఛను కలిగించిందా? నా పట్టుదలతో మొండిగా బండగా ఇంటా బయటా నెగ్గుకురావటం నేర్చుకుని, అదే మానసికబలం అన్న అపోహతో ఇన్నేళ్ళు గడిపేసాను. ఈ పోరాటంలో ఆటవిడుపేది? నాకోసం నేను జీవించిన క్షణాలేవి??
ఒకప్పుడు పుస్తకం చదవటం మొదలుపెడితే తిండి నిద్రా కుడా మర్చిపోయేదాన్ని. కాన్వాసుపై కుంచెతో అలవోకగా నృత్యం చేపించేదాన్ని. బ్రష్ మునివేళ్ళలో బంధించి ఎన్నేల్లయిందో? ఇప్పుడు ఒక్క గీతన్నా గియ్యగలనా? రంగుల కలబోతతో కొత్త వర్ణాలు సృస్టించగలనా?
దిగులు మేఘం మనసులో నుంచి పుట్టుకొచ్చినట్టుంది. ఆలోచనలు ముసురులా కమ్ముకున్నాయి. కన్నీరు వరదలై పొంగి నన్ను శుద్ధిచేసాయి.
మర్నాడే నెట్ లో సెర్చ్ చేసి పెయింటింగ్ క్లబ్ గురించి తెలుసుకున్నాను. నగరంలో పైంటింగ్ హాబి వున్నా వారందరూ ఒక కుటమిలా ఏర్పడి పలు కార్యక్రమాలు నిర్వాహిస్తారంట. వెంటనే మెంబెర్ షిప్ తీసుకున్నాను. ఓ సాయంకాలం ఆఫీసు అయ్యాకా బజారుకు వెళ్లి కావాల్సిన సరంజామా కొనుక్కొచ్చాను.
“ఏంటమ్మా ఇవన్ని? నీకు పెయింటింగ్ చెయ్యటం వచ్చా?”, ఇంజనీరింగ్ చదువుతున్న నా కొడుకు ఆశ్చర్యం.
“ఇవన్ని ఎందుకు కొనుకొచ్చావ్”, మా వారి ప్రశ్న.
“మరిచిపోయిన అభిరుచి గుర్తు తెచ్చుకుందామని” నవ్వుతూ చెప్పాను.
గెస్ట్ రూంని నా రూంగా మార్చుకున్నాను.
ఆ రాత్రి పూనకం వచ్చినట్టు కాన్వసును రంగులతో నింపేసాను. ఎంత తృప్తి అంటే ఎంతని కొలిచి చెప్పాను?
మర్నాడు వర్మకు ఫోన్ చేసి కుటుంబంతో భోజనానికి రమ్మని ఆహ్వానించాను. వర్మ భార్య ఏమనుకుంటుందో అన్న సంకోచం అన్నా లేకుండా చిన్న పిల్లలా పెయింటింగ్ చూపిస్తూ సంబరపడిపోయాను.
వర్మ కళ్ళలో కనిపిస్తున్న మెచ్చుకోలు….మా వారి నుదిటి చిట్లిపును దాటవేసేసింది.
పెయింటింగ్ క్లబ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాను. మావారికి నేనిలా వెళ్ళటం నచ్చట్లేదని తెలుస్తూనే ఉంది.
“ఇప్పుడు వెళ్ళటం అవసరమా? ఎందుకు ఈ ఉపయోగపడని పనులు?”..అలా మొదలయిన మాటలు “ఇల్లు పట్టకుండా తిరుగుతున్నావ్” దాకా వచ్చాయి.
తను పేకాటలో గడిపేసిన ఎన్నో సాయంకాలాలు గుర్తు చెయ్యటానికి ప్రయత్నించాను.
“నాతో పోల్చుకుంటావే?”, ఆ మాటలో నేను మగాడిని, నాకు సవాలక్ష వ్యాపకాలు ఉంటాయి అనే అహంకారం ధ్వనిస్తూనే ఉంది.
సిగరెట్టు పొగలో ఖాళి బూడిదైన సాయంకాలాలు, గ్లాసుల గలగలలో కరిగిపోయిన రాత్రుళ్ళు….వీటితోనా పోలిక? నా పెదవి విరుపులోని చులకన మీకు కనిపించలేదా?
కుంచె కొసలకు వేలాడుతున్న వర్ణ బిందువు సుతారంగా జారిపడి రంగులద్దిన సాయంకాలాలు, రేయి రేయంతా రెప్పవాల్చని ఆలోచనల మధనంలో అమృతం ఒలికిన రాత్రుళ్ళు….. పోలికేది? నా కనులలో ఉట్టిపడుతున్న గర్వం మీకు కనిపించిందా?
ఎంత వింత కదూ! ఇంటి గుమ్మం దాటి కొలువులో అడుగుపెట్టి…నెలకింతని సంపాదించటాన్నే స్త్రీ ప్రగతి కింద లెక్కకట్టేసారు. తన మనసుకు నచ్చి తనకు తృప్తిని ఇస్తుందన్న పనిని స్వేచ్చగా చేసే హక్కు స్త్రీ ఈనాటకీ నోచుకోలేదు, సాధించుకోలేదు. చట్రం కొలతలు మాత్రమే మారాయి, నేటికీ పంజరంలోనే ఎగురుతుంది.
నిజం చెప్పొద్దూ…ఎప్పుడో ఎలాగో తప్పిపోయిన లోకంలోకి మళ్లీ వచ్చిపడ్డట్టుంది. ఇప్పుడింక ఒంటరితనం బాధించట్లేదు. ఇంకా చెప్పాలంటే బాధ కూడా ఆనందంగానే ఉంది. మనసు మూగబోయినప్పుడు రంగు సీసాల మూతలు తెరుస్తాను. ఆలోచనలు ఎగిసిపడుతున్నప్పుడు ఎడా పెడా గీతలు గిసేస్తాను. ఆవేశం చల్లారేదాకా చిత్తరువులో చిత్రానైపోతాను. కాన్వాసు నిండిపోయాక మనసు తేలికవుతుంది. ఆ చిత్రాన్ని అలా చూస్తూ ఎన్ని గంటలైనా గడిపెయ్యగలను.
దాదాపు ప్రతీ వారంతరం పెయింటింగ్ క్లబ్ అంటూ ఎక్కువ సేపు బయటే గడుపుతున్నాను. అక్కడ పిల్లలకు, పెద్దవారికి క్లాస్సేస్ కుడా చెపుతున్నాను.
నాలో ఏదో గిల్టీ ఫీలింగ్ మొదలయింది. సిద్దు పెద్దవాడైపోయాడు, నాపై ఆధారపడి లేడు, ఇండిపెండేంట్ గా ఉంటాడు, శ్రద్ధగా చదువుకుంటాడు…కానీ, వాడితో నేను టైం స్పెండ్ చెయ్యట్లేదన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడే కదా నా దగ్గర వుండేది… ఉద్యోగం వచ్చాక, పెళ్ళయ్యాక ఎలాగు వాడు దూరంగానే ఉంటాడు.
ఆలోచనలో పడిపోయాను.
జీవితంలో ప్రయారటీస్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ప్రస్తుతం మార్పు అవసరమైన స్థితిలో నేనున్నాను. నాలో నేను తర్జనబర్జనలాడి ఓ నిర్ణయానికి వచ్చాను.
“వాట్!!?? ఉద్యోగం మానేస్తావా?”, గొంతులోనే తుఫాను హెచ్చరిక.
ఇప్పుడు మానేయ్యల్సిన అవసరం ఏమొచ్చింది? అని మొదలుపెట్టి మానేస్తే నెల నెలా వచ్చే రాబడిలో ఎంత తగ్గుతుంది, ఆర్ధిక లావాదేవిల లాభనష్టాలు విడమర్చి వివరించారు.
“ఇరవై వసంతాలపై నుంచే సంపాదిస్తున్నాను. నా వరకు నాకు మన ఆర్ధిక పరిస్తితి ఉన్నతంగానే ఉంది. ఇంత కాలం పరుగులు పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు పెట్టె ఓపిక లేదని కాదు. జీవితాన్ని మరో కోణంలో నుంచి జివిద్దామని”, నిశ్చయంగా సెలవిచ్చాను.
“నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు కనుక”, తేల్చేసారు.
రెండు నెలల నోటిసు యిట్టె గడిచిపోయింది. తొందరపడుతున్నానా అన్న అనుమానం ఒక్క నాడన్నా రాలేదు.
లాస్ట్ వర్కింగ్ డే..ఆఫీసు బాధ్యతలన్నీ అప్పగించి, అవసరమైతే అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చి ఇంటికి వచ్చాను. తనువు, మనసు గాలిలో తేలిపోతున్న భావన. ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయాను.
ఇంట్లో మొదటి రోజు…. వేడి వేడి కాఫీ, ఇడ్లి చట్ని..ఆస్వాదించకుండా ఏదీ వదలలేదు. సిరివెన్నెల సిడి పెట్టుకుని కదలకుండా చివరిదాకా చూసాను. ప్రతీ డైలాగ్, ప్రతీ సన్నివేశం శ్రద్దగా చూసాను. శ్రీ శ్రీ కవిత్వం చదివాను. ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్న, చెయ్యలేకపోయిన ఒక పనిని చేసాను. స్పెషల్ చిల్డ్రన్ సెంటర్ లో వాలంటరీ సర్వీసుకు అప్లై చేసాను.
నాఈ నిర్ణయాన్ని ఈయన జీర్ణించుకోలేకపోయారు. ఈసారి పది రోజుల వరకు మాట్లాడలేదు. కోపం వచ్చిన ప్రతీసారీ రెండు మూడు రోజులు మాట్లాడకుండా వుండటం ఈయనకు అలవాటే.
రోజులు వేగంగా గడుస్తున్నాయి. నేను ఉద్యోగం మానేసి అప్పుడే రెండు నెలలైపోయింది. వారానికి రెండు రోజులు ఎదిగి ఎదగని పిల్లలకు సాయం చేస్తూ స్పెషల్ చిల్డ్రన్ సెంటర్ లో గడిచిపోతుంది. ఆ పిల్లలను చూస్తుంటే అనిపిస్తూ వుంటుంది..ప్రపంచంలో ఏదీ ఇంత కన్నా పెద్ద కష్టం కాదని.
ఆలోచనలు అన్న పేరుతో నేను గీసిన abstract పెయింటింగ్ కలకత్తాలో జరగబోతున్న ఆర్ట్ ఎక్షిబిషన్ లో ప్రదర్శనకు సెలెక్ట్ అయ్యింది. క్లబ్ మెంబెర్స్ అందరూ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మాకెంతో గర్వకారణం నువ్వు అని నన్ను ఆకాసానికెత్తేసారు.
“అందరమూ వెళ్దామా?”, ఇన్విటేషన్ చేతిలో పెడుతూ అడిగాను.
“సరేలే చూద్దాం”, ఆ మాత్రం ప్రయత్నం చాలు నాకు.
కాలేజీకి సెలవులు, టూర్ లా కూడా వుంటుంది. చుట్టూ పక్కల ప్లేసెస్ కూడా చూసి వద్దాం అని సిద్ధు కూడా గొడవ చేసాడు.
“మీ గీతల్లో అధ్బుతమైన అర్థాలు ఉన్నాయి. ఆ వృత్తాలలో అనంతాలు కనిపిస్తున్నాయి. అర్థం అయినట్టే ఉంటూ ఇంకా ఏదో అర్థం చేసుకోవాల్సిందే మిగిలేఉన్నట్టు ఉంది మీ పెయింటింగ్ మిసెస్ భావన”, ప్రముఖ పైంటర్ రహమాన్ అభినందించారు.
“యు ఆర్ లక్కీ మాన్. యువర్ వైఫ్ హాస్ అ గ్రేట్ టాలెంట్ “, పక్కనే వున్నా ఈయనకు షాక్ హ్యాండ్ ఇస్తూ విష్ చేసారు రహమాన్.
ఓ చిన్నపాటి మెరుపన్నా ఈయన కళ్ళలో మెరుస్తుందేమోనని తొంగి తొంగి చూసాను.
నా ప్రతీ రోజును అర్థవంతంగా తీర్చిదిద్దుతూ సంవత్సరాలు యిట్టె గడిచిపోయాయి.
“యువర్ హెయిర్ ఇస్ అన్ ఇన్డెక్స్ అఫ్ యువర్ పైంయింగ్స్ “, అక్కడక్కడా హుందాగా పరుచుకున్న తెల్ల వెంట్రుకులను చూసి సిద్ధూ నవ్వుతూ ఉంటాడు.
“మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అపారమైన నమ్మకం, ప్రేమ…గౌరవం. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం”, నన్ను ఆటపట్టిస్తూ చలాకీగా అల్లరిగా నా చుట్టూ తిరుగుతున్న నా కొడుకు అమాంతం ఒక్కసారిగా పెద్దవాడైపోయాడనిపించి అబ్బురపడ్డాను. నిండు మనసుతో ఆశీర్వదించాను.
వాడి నిర్ణయానికి ఈయన షాక్ అయినట్టున్నారు. రెండు రోజులు మా ఇద్దరితోనూ మాట్లాడలేదు.
“ఎందుకమ్మా ఇవన్నీను. మేము బుక్ చేసుకునేవాళ్లము కదా”
హనీమూన్ కని బుక్ చేసిన ఫ్లైట్ టిక్కట్లు కోడలి చేతిలో పెట్టాను.
“ఏదో మా తృప్తి లేరా”, నవ్వేసాను.
సిద్ధూ చేతిని నా చేతుల్లోకి తీసుకుని, “సిద్ధూ రెస్పెక్ట్ హర్ పర్సనల్ స్పేస్ రా కన్నా”.
ఇంకా ఏవేవో చెప్పాలని ఉంది. అన్ని భావాలు మాటల్లో కూర్చలేని భావనను. వాడి కళ్ళలోకి ఓ క్షణం అలా చూస్తూ ఉండిపోయాను. కన్నీటితో చూపు మసక బారలేదు, స్పష్టంగా వాడి భావం నా మనసుకు తాకింది.
“ఐ అండర్ స్టాండ్ మామ్. నీలో ఉన్న కళకు కాదమ్మా….జీవించే కళను నీ దగ్గర నుంచి నేర్చుకున్నందుకు గర్వపడుతున్నాను “, కౌగిలించుకున్నాడు.
“థాంక్ యు ఆంటీ” నుదుటన ముద్దు పెట్టి వీడ్కోలు చెప్పాను.
— స్టొరీ బై ప్రవీణ కొల్లి
ఈ నెల (నవంబర్, 2012 ) చినుకులో వచ్చిన నా కధ. ప్రింట్లో అచ్చయిన నా మొదటి కధ. నన్నెంతో ప్రోత్సహించిన జగతి గారికి, సాయి పద్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
praveena garu your story chaala chala nachindi meeru words chala baaga rastunnaru meeru rasina e words chaduvutunte i feel really great endukante meeru words ni design madiriga kurcharu its really great i like your story nenaithe marks ivvalanukunte matram meeku 100 ki 200% nenu happy ga feel ayyanu keep it up your
genies in word and conversation magic and great stories thank you very much praveena
Super!!
Excellent Praveena. Aadyantham kadha chala chala aasakti ga undi.
I really feel great about u. Go a head, Keep it up.
excellent chala rojula tharuvatha manchi story chadiva…hmm not story may be something which brought liveliness to my life…it just resembles what iam feeling now and what i wanted to tell others..excellent superb
అభినందనలండీ.. కథ చాలా బావుంది.
nice..keep it up. Gunde lothullonchi rasinattundi..
Chaala bagundandi…!! chaduvuthu…..na personal space ni tirigi sampadinchukovalani nirnayinchukunnanu..!!
It is very nice Praveena. I would like to talk to you. Please email me.
praveena garu, meeru cheppindi chala goppa vishayam. chala sunnitamaina vishayanni antakanna sunnitam gaa chala bagaa ardham ayyelaga cheppina teeru chala nachchindi.eee chinna kathanu prathi maggadu, pelli aina 10 years tarvaata… tappakunda rojuku oka saari….kramam tappakundaa konnirojulu chada valasina oka manchi katha….manchi phalitanni echche oka manchi katha…!
nice story
ప్రవీణ గారు చాలా బాగా రాశారు..
Good narration.its the space which every woman need in her life . Anyways good luck
Pingback: చక్కని అమ్మాయి చెప్పిన కవుర్లు | జాజిమల్లి
Congratulations.
కొన్ని కథలకు కాలం, సమయం వర్తించదు. ఎప్పటికి అలా నిలిచి ఉంటాయి, అలాంటిదే ఈ కథ కూడా. ఉన్నదీ ఉన్నట్టు రాయడం, హంగులు, ఆర్భాటాలు లేకుండా, మీకు మనసులో ఎలా అనిపించిందో సరిగ్గా అలాగే రాయడం మీ రచనల్లో గొప్పతనం. ఒక మామూలు పాటకుడు కూడా రిలేట్ చేసుకునే అంశాలు బోలెడు ఉంటాయి మీ కథల్లొ.
Thank you vijay garu.
‘ఎంత వింత కదూ! ఇంటి గుమ్మం దాటి కొలువులో అడుగుపెట్టి…నెలకింతని సంపాదించటాన్నే స్త్రీ ప్రగతి కింద లెక్కకట్టేసారు. తన మనసుకు నచ్చి తనకు తృప్తిని ఇస్తుందన్న పనిని స్వేచ్చగా చేసే హక్కు స్త్రీ ఈనాటకీ నోచుకోలేదు, సాధించుకోలేదు. చట్రం కొలతలు మాత్రమే మారాయి, నేటికీ పంజరంలోనే ఎగురుతుంది.’……..ఇది నిజం ..నిక్కమైన నిజం …ఇవే మాటలు మా ఆవిడ చెబుతుంటుంది ..’కధ’లా రాయరాదు అంటుంటాను ….మీరు రాసేసారు ….చాలా వరకు .. …too good ..మా మాధవి చేత కూడా చదివిస్తాను …కీప్ ఇట్ అప్ …
Chala chala bagundandi..Enni
Samvatsaralu gadichina ee paristhitulu maaravemo…Personal space anedi mana hakku..Adi poradi sadhinchalsi vastundi…