చెమట వాసన (కధ)


చెమట వాసన

మే నెలాకరు, ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రోహిణికార్తెకు రోళ్ళు పగులుతాయంట, ఈ సంవత్సరం కొండలే పగులుతాయా అన్నట్లు ఉంది. నడి వేసవిలో మిట్ట మధ్యాహ్నం కారులో ప్రయాణం మొదలుపెట్టాను. ఏసి ఫుల్ స్పీడ్ లో తిరుగుతున్నా చల్లదనం సరిపోవట్లేదు. కారు డ్రైవ్ చేస్తుంటే, నున్నటి తారు రోడ్డు మీద కాంతి పరావర్తనం చెంది కళ్ళల్లో పడి మరీ చిరాకుగా ఉంది.

తప్పనిసరి పరిస్తితుల్లో బయలు దేరాల్సి వచ్చింది హైదరాబాదుకు. తమ్ముడి కొడుకు మొదటి పుట్టిన రోజు రేపు. నా భార్య సెలవులకని పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. నువ్వు రా, అందరమూ వెళ్దాము అంటే, నా వాళ్ళ కాదు బాబోయ్ ఈ ఎండల్లో ప్రయాణం. పిల్లలు నలిగిపోతారు, కాస్త ఎండలు తగ్గాక వెళ్లి కనిపించి వస్తాను అంది. అదీ నిజమే, ఈ ఎండల్లో పిల్లలను తిప్పడం ఎందుకు అనిపించింది నాక్కూడా. తమ్ముడు, మరదలు ఫోన్ చేసి గొడవ చేసేసరికి, ఇదిగో ఇలా మిట్ట మధ్యాహ్నం నేను ఒక్కడినే కారులో బయలుదేరాను.

బాబుకు ఏదన్నా డ్రెస్ కొందామని అధునాతనమైన ఓ బట్టల దుకాణం ముందు కారు ఆపాను. కారులో నుంచీ దిగగానే వేడి గాల్పు కొట్టింది. కర్చీఫ్ ముఖానికి అడ్డుపెట్టుకుని షాప్ లోపలి పరుగెత్తాను. అక్కడ వేలాడదిసిన బట్టలు చూస్తుంటే, ఎవరో విసురుగా అరుస్తున్నట్టు వినిపించింది.

“ఏంటి,ఇంత లేట్ గా వచ్చావు? ఒక రోజే కదా సెలవు ఇచ్చాను. ఇప్పుడా వచ్చేది?”
“కాదు సర్, అమ్మకు ప్రాణం బాగోలేదని ఊరు వెళ్ళాను. పోద్దుటేలే బయలుదేరాను. దారిలో బస్సు చెడిపోతే ఆలస్యం అయ్యింది సర్.”
“అదంతా నాకు తెలీదు. సగం రోజు జీతం కట్ చేస్తాను.”
“అలా అనమాకండి సర్, అసలే చాలీ చాలని బతుకులు. మందులకే చాలా ఖర్చు అయిపోతున్నాది.”
“అవన్నీ నాకనవసరం, అవి ని కష్టాలు, నువ్వే చూసుకోవాలి. సరి సర్లే అవతల కస్టమర్లు వున్నారు. వెళ్లి పని చూడు.”
మేనేజర్ అనుకుంటా విసురుగా మాట్లాడుతున్నాడు. సేల్స్ మాన్ టైంకు వచ్చినట్లు లేడు.
“అటువైపు ఖరీదు గల బట్టలు వుంటాయండి. రండి చూపిస్తాను”, చెమట వాసన గుప్పున కొట్టింది. చిరాగ్గా పక్కకు తిరిగి చూసాను.

ఇందాక తిట్లు తిన్న సేల్స్ బాయ్ అనుకుంట. నలిగిన బట్టల్లో వున్నాడు. ఈ షాప్ లో అందరూ యునిఫోర్మ్స్ లో నీట్ గా వుంటారు. నలిగిన బట్టలు, చెదిరిన జుట్టు, జిడ్డుకారుతున్న మొహం చూసి అనుకున్నా ఇతనే లేట్ గా వచ్చిన సేల్స్ మాన్ అని. అతని వెనకాలే నడిచాను వేరే కౌంటర్ దగ్గరకు.

అబ్బబ్బ భరించ లేకపోతున్నాను ఈ దుర్వాసనను. ఎన్నాళ్ళయిందో స్నానం చేసి. వేరే సేల్స్ మాన్ దగ్గరకు వెళ్తే బాగుండు అనిపించింది. ఎక్కడో సంస్కారం అడ్డొచ్చింది. తొందరగా డ్రెస్ సెలెక్ట్ చేసుకుని బయట పడ్డాను.
ఎండల వల్ల అనుకుంట రోడ్డు మీద ట్రాఫిక్ ఏమీ లేదు. కారు పరుగులు పెడుతుంది.

ఒకచోట ఏదో పెద్ద భవనం నిర్మాణం జరుగుతుంది. కూలీలు యంత్రాల్లా పనులు చేస్తున్నారు. యంత్రాలకు ప్రాణం, అలసట, చెమట ఉండవు. మరి ఈ కూలీలు మనుషులే కదా, ఇంత ఎండలో ఎలా పని చెయ్యగలుగుతున్నారో? అక్కడ ఎవరూ అలసటను లెక్క చేస్తున్నట్లు కనిపించట్లేదు. ధారలుగా కారుతున్న చెమటను తుడుచుకోవాలన్న స్పృహే వాళ్లకు వున్నట్టు లేదు. ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు.

నాకు తెలీకుండానే కారు స్లో చేసినట్టున్నాను. వేగం పెంచేసాను. దారిలో చిన్న చిన్న బడ్డి కొట్లు, కూరగాయలు మాత్రమే అమ్మే కొట్లు, సైకిల్ రిపైర్ చేసే షాప్లు, కనీసం ఫ్యాన్ సదుపాయం అన్నా సరిగ్గా లేని షాపులు ఎన్నో కనిపించాయి. ఈ వెచ్చటి గాల్పుల్లోను వీళ్ళు షాపులు మూసి ఇంట్లో విశ్రాంతి తీసుకోలేరు పాపం. వీళ్ళ బ్రతుకు ఆధారానికి ఎండా, వేడితో సబందం లేదు. ఆపూట పని దొరకడమే ముఖ్యం, శ్రమ, చెమటకు ప్రాముఖ్యం లేదు.ఆలోచిస్తూ, మధ్య మధ్యలో పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నా. సాయంత్రం ఐదు గంటలు అయింది. ఎండ తీవ్రత తగ్గినా, ఇంకా వేడిగానే ఉంది బయట.

హటాత్తుగా రోడ్డుకు అడ్డంగా చిన్న పిల్లాడు పరిగెత్తాడు. సడన్ బ్రేక్ వేసాను. కారు కీచుమంటూ శబ్దం చేసుకుంటూ ఆగింది. పట్టరాని కోపంతో కారు దిగాను. వాడు బిక్క మొహం వేసుకుని రోడ్డు పక్కన నుంచున్నాడు.
“ఏరా, కళ్ళు కనిపించట్లా. రోడ్డుకు అడ్డంగా పరిగెత్తుతున్నావు?”, కోపంగా అరిసాను.
ఎక్కడ నుంచో వాడి అమ్మ అనుకుంట పరిగెత్తుకుంటూ వచ్చింది.
“ఏందీ సారూ, సిన్న పిల్లాడి మీద అరస్తున్నావు? ఆడికేమి తెలుస్తాది?”, పోట్లాటకు సిద్ధమైయింది.
నాకు విపరీతమైన ఆవేశం వచ్చేసింది.
“చిన్న పిల్లాడు వాడికి తెలీకపోతే, కన్నా దానివి నీకు తెలియాలి, వాడిని రోడ్డు మీద వదలకూడదని”, కోపంతో అన్నాను.
అప్పటికే అక్కడో గుంపు తయారయింది. అందులో ఓ పెద్దాయన, “పోన్లెండి, ఇప్పుడు ప్రమాదం ఏమీ జరగలేదు కద, మీరు కారేక్కండి”, అంటూ నన్ను వారించాడు.
నేను చిరాగ్గా కారెక్కి వేగంగా పోనిచ్చాను.
“చీ వెధవ జనాలు, చదువు సంస్కారం లేని బతుకులు”, విసుగ్గా అనిపించింది. సిగరెట్ వెలిగించి ప్రయాణం సాగించాను.

రాత్రి కల్లా తమ్ముడి ఇంటికి చేరాను. తమ్ముడు, మరదలు నన్ను చూసి చాలా ఆనందించారు. కొత్త చోటు అవడం మూలాన అనుకుంట రాత్రంతా నిద్ర పట్టలేదు.

ఉదయమే హడావుడి మొదలయింది. చుట్టాలు, స్నేహితులు వస్తున్నారు. తమ్ముడు ఉంటే అపార్ట్మెంట్ లోనే పార్టీ హాల్ ఉంది. అందులో ఏర్పాటు చేసారు బాబు పుట్టిన రోజు వేడుకను. భోజనాలు కేటరింగ్ వాళ్ళకు ఇచ్చేసారు.

నాకు, తమ్ముడుకు చిన్ననాటి నేస్తం శరత్ వచ్చాడు. వాడిని కలవటం నాకు చాలా సంతోషమనిపించింది. వాడికి నాకు ఏ విషంలోను అభిప్రాయాలు కలవవు. మా ఇద్దరికీ ఎప్పుడు వాదనలే. కాస్త ఎమోషనల్ గా, ప్రాక్టికాలిటికి దూరంగా ఉంటాడు అనిపిస్తుంది నాకు. అయినా ఎందుకో వాడంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరమూ ఓ మూల కూర్చొని కబుర్లలో పడ్డాము. శరత్ మధ్య మధ్యలో వెళ్లి ఎవరెవరినో పలకరించి వస్తున్నాడు.

మధ్యాహ్నం భోజనాల సమయానికి కాటరింగ్ మనుషులు వచ్చారు. పదార్ధాల గిన్నెలు టేబుల్ పైన సర్దుతున్నారు. నా కన్ను అందులోని ఒకతని మీద పడింది. ఓ మోస్తరు గిన్నెను మోసుకొస్తున్నాడు. గిన్నె పైన సిల్వర్ ఫాయిల్ చుట్టి ఉంది. అతని జుట్టు నుంచీ కారుతున్న చెమట ఆ సిల్వర్ ఫాయిల్ పైన పడుతుంది.
“అబ్బబ్బ మన వాళ్ళకు శుభ్రతే ఉండదు, అటుచూడు వాడి చెమట ఎక్కడ కారుతుందో”, అసహ్యంగా అన్నాను.
శరత్ చిటికెలో అటువైపు వేగంగా వెళ్లి ఆ గిన్నె అందుకున్నాడు. వంటలు సర్ధడంలో అక్కడ సాయం చేసి తిరిగి వచ్చాడు.

“ఏరా, ఇక్కడ కూర్చొని వంకలు పెట్టకపోతే కాస్త అటువచ్చి చెయ్యందించవచ్చు కద”, నవ్వుతూనే అన్నాడు.
“వాళ్ళకు డబ్బులు ఇచ్చేది ఎందుకంట”, నేను నవ్వుతూనే అన్నాను.

సాయంత్రం అయ్యింది. వచ్చిన చుట్టాలు, స్నేహితులు చాలా మండి వెళ్ళిపోయారు. నేను, శరత్ కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చాము. పక్కన ఇంట్లో సుమారు ఏడెనిమిదేళ్ళు ఉండే పాప అంట్లు తోముతోంది. పనిమనిషి అనుకుంట.

“అటుచూడు చిన్నపిల్లతో పని చేపిస్తున్నారు. అందరికి చదువు అనేది కేవలం కాగితాల వరకే”, అన్నాను.
“నిన్నో విషయం అడగనా?”, నా సమాధానం కోసం చూడకుండా మాట్లాడేసాడు.

“ఏరా, నీ కంఫెర్ట్ జోన్ లో నుంచి బయటకురానంత వరకు ఎన్ని నీతులన్నా చెబుతావు. నీకు ఏమాత్రం చిన్న ఇబ్బంది కలిగినా విసుక్కుంటావు. ఏసి రూముల్లో కూర్చొని, బయట ఎండల్లో చెమటోర్చే పేదవాడి గురించి ఉపన్యాసాలు ఇస్తూ గొప్పగా ఫీల్ అయిపోవడం కాదు, బయటకు వచ్చి ఆ చెమటను తుడిచే చిన్న పనైనా చేసి అప్పుడు గొప్పగా ఫీల్ అవ్వాలి. బరువులు ఇలా మొయ్యాలి, అలా మొయ్యాలి అని దూరంగా కూర్చొని సూక్తులు చెప్పడం కాదు. దగ్గరకు వచ్చి నీ చెయ్యి కూడా కలిపి అప్పుడు చెప్పు సలహాలు. నున్నటి తారు రోడ్డుపై వంద స్పీడ్లో కారు తోలుతూ, చెప్పులన్నా వేసుకునే స్తోమత లేని పేదవాడి గురించి బాధపడక పోయినా పర్వాలేదు, వాడిని రోడ్డుకు అడ్డం అని మాత్రం విసుక్కోకు. సామాజిక బాధ్యత అంటే సాటి మనిషిని గౌరవించాటమే. ” ఆవేశంగా మాట్లాడేసాడు. నాకు నోట మాట రాలేదు.

రాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాను. నిద్ర లేకపోవటం మూలాన అనుకుంట చాలా నీరసంగా ఉంది. మర్నాడు ఆఫీసులో చాలా పనులు ఉండటంతో తప్పక బయలుదేరాను.

నిద్ర ఆపుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను. ఒక్కసారిగా కళ్ళు బైర్లుకప్పాయి, ఎదురుగా ఏదో వస్తుంది, అదుపు తప్పిపోయాను.

కళ్ళు తెరిసి చూసేటప్పటికి మంచం మీద ఉన్నాను. అదేదో చిన్న గుడారంలా ఉంది. ఇంకో ఐదారు మంచాలు ఉన్నాయి. వాటి మీద పేదవారనుకుంట, పడుకుని ఉన్నారు. నేను లెగిసి కూర్చుందామని ప్రయత్నించాను. ఇంతలో డాక్టర్ వచ్చారు. ఆయన వయసులో పెద్దాయన.

“నాకేమయింది”, అయోమయంగా అడిగాను.
“మీరు అదృష్టవంతులు, ఏమీ అవలేదు. మీరు బాగా అలిసిపోయినట్టున్నారు, కారు అదుపుతప్పింది. పెద్ద ప్రమాదం తప్పింది”, చెప్పారు డాక్టర్.

చుట్టూ అయోమయంగా చూసాను.
“ఇది మెడికల్ క్యాంపు. నేను పేదవారి కోసం పల్లెటురులలో ఫ్రీ మెడికల్ క్యాంపులు పెడుతూ వుంటాను. మీకు ప్రమాదం జరిగినప్పుడు, ఈ ఊరి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చారు. పెద్ద దెబ్బలేమీ తగలలేదు. ఫస్ట్ ఎయిడ్ చేశాను అంతే. కంగారు పడకండి”, చెప్పారు డాక్టర్.

నన్ను పరిక్షించటానికి దగ్గరగా వచ్చారు. ఆయన దగ్గర నుంచీ చెమట వాసన గుప్పున కొట్టింది. మధ్యాహ్నం కేటరింగ్ అతని తలలో నుంచీ కారిన అదే చెమట, నిన్న సేల్స్ బాయ్ దగ్గర నుంచీ వచ్చిన అదే వాసన. ప్రస్తుతం నా దగ్గర నుంచీ కూడా అదే చమట వాసన వస్తుంది….!!

Published :  http://www.koumudi.net/Monthly/2011/october/index.html

This entry was posted in కధలు. Bookmark the permalink.

4 Responses to చెమట వాసన (కధ)

  1. Hari Krishna Sistla says:

    Wonderful writing.Very much practical one.Might have been still practical if “ఎక్కడ నుంచో వాడి అమ్మ అనుకుంట పరిగెత్తుకుంటూ వచ్చింది” was been extended with sentence,” Manchi neella tanker daggara binde pattukuni neella kosam aaraata padutunna”.(Instead calling ఎక్కడ నుంచో ) might have been still sentimental – got me ?

  2. Anonymous says:

    baagundi praveenagaru! wonderfully said. saamaajika baadhyata ante ento baagaa cheppaaru. manchi message undi. nenu enno saarlu ilaage anukunnaanu kaani expression lo ledu. very nice 🙂

  3. మీరు ఎంచుకున్న అంశం మనలో చాలామంది వివిధ సందర్బాలలో చేసినవే అయివున్నట్టు తప్పక అనిపిస్తోంది.. మనిషికి మట్టి వాసన మరచిపోతున్నట్టే , చెమట వాసన కూడా మరచిపోతున్నాడు. మనిషి యంత్రంలా మారుతున్న ఈ రోజుల్లో ఇలాంటి గుండె తలుపు తట్టే కథ వ్రాసి నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s