నాన్న ఎందుకిలా చేసావు? (Story)


నాన్న ఎందుకిలా చేసావు?

నాన్నా….!

నాన్న, నువ్వు  భౌతికంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి అప్పుడే  ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. అమ్మ గుండెలవిసేలా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచి నీళ్ళన్నా తాగకుండా, గొంతు చీల్చుకుపోయి మంట మండుతున్నా ఆపకుండా ఎక్కిళ్ళు పెడుతూనే ఉంది. అమ్మ కళ్ళల్లో భయం, దైన్యం, అసహాయత ఎప్పుడూ కనిపించినట్లే ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. నాకేమి అమ్మ కొత్తగా అనిపించట్లేదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అమ్మ కళ్ళలో బాధను చూస్తూనే ఉన్నాను.

తేడా ఏమిటంటే ఈ రోజు అందరి ముందు దాచుకోకుండా ఏడుస్తుంది. భహిరంగంగా సిగ్గు పడకుండా, స్వేఛ్చగా ఏడుస్తుంది.నాకిదే మంచిదనిపిస్తుంది వింతగా! నిన్నటి దాక అమ్మ తన దుఃఖాన్ని తనలోనే దాచుకునేది. తన కష్టాలు పదిమందికీ తెలిస్తే ఎక్కడ కుటుంబం పరువు పోతుందో, ఎక్కడ తన భర్త అందరికీ చులకన అవుతాడో అని తనలోనే తను కుళ్ళి కుళ్ళి ఏడిచేది. ఇంట్లో అందరు నిద్ర పోయాక తనోక్కటే ఏడుస్తూ జాగారం చేసేది. నేను ఎన్నో రాత్రులు అమ్మను గమనిస్తూ, నిద్ర పోతున్నట్లు నటించేదాన్ని, అమ్మకు తెలీకుండా.

పొర్లి పోర్లి ఏడుస్తున్న అమ్మను చూస్తుంటే నాకు వింతగా ఉంది. అమ్మా, నువ్వు ఇప్పుడు కొత్తగా కోల్పోయినదేమిటి? అని అడగాలనిపిస్తుంది. అమ్మ తన పెళ్లి నాటి నుంచి పడ్డ కష్టాలకు మొట్టమొదటి సారిగా తనివితీరా ఏడుస్తుందా అని కూడా అనిపిస్తుంది.

నాలో రేగుతున్న ఈ ఆలోచనలకు నామీద నాకే అసహ్యంగా ఉంది. ఇలా అనుకోవటం తప్పు అని నాకు తెలుస్తూనే ఉంది. కానీ నా ప్రమేయం లేకుండా నా బుర్రలో సుడిగుండాలు తిరుగుతున్నాయి. వీటిని ఆపటం నా వల్ల కావట్లేదు. ఎంతగా అదిమి పెడదామంటే, అంతగా చేలరేగి పోతున్నాయి.

అమ్మ చుట్టూ అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు మొహాల నిండా విచారాన్ని నింపుకుని కూర్చున్నారు. “ఏడవకు, ధైర్యం తెచ్చుకో”, అంటూ అమ్మను ఓదారుస్తున్నారు. నాకైతే వాళ్ళందరిని గదిలో నుంచి బయటకు పంపేసి, అమ్మ మొహాన్ని నా హృదయానికి హద్దుకుని, “అమ్మా ఏడువు, నీకు అలుపు వచ్చి నిదుర వచ్చే దాకా ఏడువు. నీ జీవితమంతా పడ్డ కష్టాలు మరిచి పోయేదాకా ఏడువు. ఎవరన్నా చూస్తారేమో అనే సంశయం లేకుండా స్వతంత్రంగా ఏడువు”, అని చెప్పాలని ఉంది. కానీ నాకా అవకాశం ఇప్పట్లో దొరికేటట్లు లేదు. ఏప్పుడు చూసినా అమ్మా చుట్టూ జనాలే.

నేను అమ్మా ఉన్న గదిలోకి అడుగుపెట్టగానే, అమ్మా నన్ను చూసి మరీ బిగ్గరగా ఏడుస్తుంది. నాకు అక్కడ ఉండాలో, వెళ్ళాలో తెలియక అలా నుంచుని పోయాను. అమ్మ పక్కనే కూర్చున్న చిన్నత్త లెగిసి వచ్చి నన్ను అమ్మ పక్కన కుర్చోపెట్టింది. నేను అమ్మ చేతిని సున్నితంగా నా చేతుల్లోకి తీసుకున్నాను.ఏదేదో అమ్మతో చెప్పాలనిపిస్తుంది. కానీ ఒక్క మాట కూడా నోట రావట్లేదు. అమ్మతో నాకు ఏకాంతం లేకో తెలిదు, నాకు నాకే ఏమి మాట్లాడాలో తెలీకో తెలీదు. ఇంక అక్కడ ఎక్కువ సేపు కూర్చోలేక లెగిసి ఇవతలకు వచ్చేసాను. ఓ మూల నుంచున్న చిన్నత్త నా వైపు అదోలా చూసింది.

నా పరిస్తితి నాకే చిత్రంగా ఉంది. నాన్న పోయినందుకు బాధ లేదు అనలేను కానీ ఏడుపు వచ్చేటంత బాధగా మాత్రం లేదు. కాలమంతా ఘనీభవించినట్లుగా అనిపిస్తుంది. ఈ భావము లేదు, ఏదో నిర్లిప్తత. నా మోహంలో   ఎలాంటి భావమూ కనిపించట్లేదని, ఇంటి నిండా ఉన్న బంధువులు నా వైపు చూస్తున్న చూపుల్లో తెలుస్తూనే ఉంది. బలవంతానైనా నాకు ఏడుపు రావట్లేదు. నామీద నాకే జాలిగా ఉంది. నేనెందుకిలా రాయిలా ఉన్నాను? నా మనసుకు సమాధానం తెలుసేమో?

“వాడికి కూతురంటే పంచ ప్రాణాలు. వాడు పొతే దీని కళ్ళల్లో కనీసం ఏడుపు చుక్కన్నా లేదు”, పెద్దత్త మామయ్యతో అంటుంటే నా చెవిన పడింది. వాళ్ళేదో అనుకుంటున్నారని నాకు బాధగా అనిపించలేదు.

వాకిట్లోకి వచ్చాను. అక్కడంతా మొగవారు గుంపులు గుంపులుగా కుర్చుని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు.

దూరంగా పెదనాన్న రేపటికి చెయ్యాల్సిన ఏర్పాట్ల గురించి ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతున్నారు.

తమ్ముడు కనపడతాడేమోనని వెతికాను. వాకిట్లో లేడు. పెరట్లోకి వచ్చాను. మా వారు తమ్ముడ్ని ఓదారుస్తూ కనిపించారు. వాడు చేతులు కట్టుకుని, తలదించుకుని మా వారు చేప్పేది వింటున్నట్లు తల ఊపుతున్నాడు. ఈయన వాడి భుజాలు తట్టడం నాకు కనిపించింది. నాకు కాస్త ఓదార్పుగా, ధైర్యంగా అనిపించింది.

దేవుడి గదిలోకి వచ్చాను. అదృష్టం అక్కడ ఎవరూ లేరు. ఓ మూలకు వచ్చి కూర్చున్నాను. చీర కొంగును భుజాల చుట్టూ కప్పుకున్నాను. తలదించుకుని నేల వైపు చూస్తూ ఉండిపోయాను. ప్రశ్నలు ప్రశ్నలు అంతు లేని ప్రశ్నలు.  నాన్నను నిలదీసి అడగాల్సిన ప్రశ్నలు. సమాధానం లేని ప్రశ్నలు. సమాధానం చెప్పాల్సిన నాన్న తప్పించుకుని వెళ్ళిపోగా మిగిలిపోయిన ప్రశ్నలు.

ఎందుకు నాన్న ఇలా చేసావు? నువ్వు చనిపోతే, నువ్వు కన్న నాకు కనీసం ఏడుపన్నా రాకుండా ఎందుకు చేసుకున్నావు నాన్న? వ్యసనాలకు బానిసై ప్రాణాలు తీసుకున్న నువ్వు అసలెందుకు పెళ్లి చేసుకున్నావు? పిల్లల కన్నా తాగుడే ఎక్కువైనా నువ్వు అసలెందుకు పిల్లలను కన్నావు?

నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నువ్వు తులుతూనే ఉన్నావు.  అమ్మ మోహంలో సంతోషం నేనేనాడు చూడలేదు. అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ భయమే, భవిష్యత్తు అంటే భయమే. అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ అసహాయతే, ఏమీ చెయ్యలేని అసహాయతే. మా చిన్నప్పుడు నేను, తమ్ముడు తెలిసి తెలియక నీ గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమ్మ సిగ్గుతో చచ్చిపోయేది. నీ వ్యసనాల గురించి మాకు తెలీకుండా ఉండటం కోసం చాల ప్రయత్నించేది. పాపం పిచ్చి అమ్మ ఎన్నని దాయగలదు.  ఎందుకు నాన్న ఇలా చేసావు?

ఒకనాడు నా పుట్టిన రోజున, నేను ఎంతగా చెప్పినా వినకుండా అమ్మ నా స్నేహితులను భోజనానికి పిలిచింది. నీకు గుర్తుందా నాన్న, ఆ రోజు నువ్వు తప్ప తాగి ఇంటికి వచ్చి, నా స్నేహితుల ముందు ఎంత యాగీ చేసావో. ఆ రోజు అర్ధరాత్రి అమ్మ నా దగ్గరకు వచ్చి “నన్ను క్షమించమ్మా, నీకు ఏ సంతోషం ఇవ్వలేకపోతున్నాను. నీ పుట్టిన రోజు కదా, స్నేహితులతో కాస్త సందడిగా గడుపుతావు అనుకున్నాను. నన్ను మన్నిచు తల్లీ”, అంటూ నా చేతులు పట్టుకుని ఎడిచేసింది. ఆ మరునాడు నేను కాలేజ్లో తలెత్తుకుని తిరగలేక పోయాను. ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఎందుకు నాన్న ఇలా చేసావు?

అమ్మ నా పరిక్షలకు డబ్బులు దాస్తే, అమ్మకు తెలీకుండా నీ ఇంట్లో నువ్వే దొంగగా మారి ఆ డబ్బులు తీసుకెళ్ళి తాగి వచ్చావు. అమ్మ తన గాజులు అమ్మి నా పరిక్షలకు కట్టింది. ఓపిక నశించిన అమ్మ ఒక రోజు నీకు ఎదురు చెపితే, నువ్వు అమ్మ చెంప పగలకోట్టావు. అమ్మ చంపపై పడిన నీ చేతి వేలి ముద్రలు నేను నా జీవితంలో మరిచిపోలేను. ఎందుకు నాన్న ఇలా చేసావు?

ఇంటికి ఎప్పుడైనా, ఎవరైనా చుట్టాలు వస్తే అమ్మ గజగజ లాడిపోయేది. ఎక్కడ నీ గుట్టు బయట పడుతుందో అని తెగ బెదిరిపోయేది. పిచ్చిది నాన్న అమ్మ, నీ సంగతి ఎవరికీ తెలీదు అని నమ్మేది. ఆ నమ్మకంలోనే బతికింది. నీ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని నీ గురించి ఎవరికీ చెప్పేది కాదు. ఎందుకు నాన్న అమ్మను అంత బాధ పెట్టావు?

నాకు పెళ్లి వయస్సు వచ్చిన దగ్గర నుంచి, నేను అత్తారింటికి వెళ్ళే దాకా అమ్మ పడిన వేదన నాకు తెలుసు. అమ్మ జీవితం చూసినా తర్వాత నాకు పెళ్ళంటేనే విరక్తి వచ్చేసింది. నన్ను పెళ్ళికి వప్పించటానికి అమ్మ నాకు చూపించిన ఉదాహరణలు ఎన్నో. ఎన్ని అన్యోన్య దాంపత్యాలు చూసినా, నా మనసులో ముద్రించుకు పోయిన నీ  స్వరూపం నన్ను పీడకల లాగా వెంబడించేది. అర్థం చేసుకునే భర్త దొరకటం నా ఏకైక అదృష్టం.

నా మరిది పెళ్ళికి తాగి వచ్చిన నువ్వు మాట్లాడుతుంటే, నీ దగ్గర నుంచి  గుప్పున వచ్చిన వాసనకు, మా అత్త గారు నన్ను చూసినా చూపు పాతాళంలోకి నన్ను విసిరేసినట్లు అనిపించింది. ఎందుకు నాన్న ఇలా చేసావు?

నాకు అత్తారింట్లో కాస్త కష్టమొస్తే ఎవరికి చెప్పుకోను నాన్న? నీతో ఎప్పుడూ కష్టాలు పడే అమ్మకు నేను నా కష్టాలు ఏమని చెప్పుకోగలను. పుట్టింటి ఆసరా లేని ఆడపిల్ల ఎంత అభద్రతకు లోనవుతుందో ఎప్పుడన్నా ఆలోచించావా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేసావు?

ఈ రోజు నువ్వు మమ్మల్ని కొత్తగా వదిలి వెళ్ళింది ఏమీ లేదు నాన్న. అసలు నువ్వెప్పుడు మాకు దగ్గర అవ్వలేదు. నువ్వు నీ వ్యసనాలకు మాత్రమే తండ్రివి, భర్తవి, బందువువి. నువ్వు భౌతికంగా మా మధ్యలో లేవు అన్నమాటే కానీ, అంతకు మించి ఏమీ తేడా లేదు.

నిన్ను కోల్పోయాము అన్న బాధ మనసులో ఎక్కడో ఉంది. కానీ ఆ బాధ నన్ను కుదిపెయ్యట్లేదు. మనిషిని కోల్పోయాము అని అనిపిస్తుందే కానీ, ఆత్మీయుడిని కోల్పోయాము అని మాత్రం అనిపించట్లేదు.

నాన్న నీ చావులో నేనొక విషయాన్ని తెలుసుకున్నాను. పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులకు పిల్లల మీద స్వభావికంగా ప్రేమ ఉంటుందేమో కానీ, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవం ఉండాలంటే, తల్లిదండ్రులు తమను మంచి తల్లిదండ్రులుగా నిరూపించుకోవాలి.

ఎందుకు నాన్న ఎంత కటినమైన నిజాన్ని నువ్వే నిరుపించావు? ఎందుకు నాన్న ఇలా చేసావు?

బ్రతికుండగా నాన్నని అడగలేని ప్రశ్నలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెలికి వచ్చాయి.

నా కంట్లో ఘనీభవించిన నీరు కన్నీరుగా చెంపలపై జారుతోంది ….. వరదలా ఉప్పోంగుతోంది .

(కౌముదిలో అచ్చయిన నా మొదటి కధ. http://www.koumudi.net/Monthly/2011/july/index.html)

This entry was posted in కధలు, గుర్తింపు. Bookmark the permalink.

12 Responses to నాన్న ఎందుకిలా చేసావు? (Story)

 1. ashwin says:

  praveena garu,
  chaala bagundi.. oka dad thaagubothu aithe aa family anubhavinche kashtaalu adham lo chupinchaaru.. nenu kuda inchu munchu aa kashtaalu anubhavincha ani cheppukovadiniki bhadhapadthunnanu..
  Ee katha vini aina ee generation maari vaala families ni manchiga chusukovalani korukuntunna….
  Hats-off praveena gaaru..

 2. thotakuri says:

  అద్భుతం ….. చాలా చాలా బాగా వ్రాశారు

 3. Ravi Chandra says:

  Bagundandee… Bahusaa ee idea chaalaa streevaada kadhallo chadvinde ayundochu- but the way of presenting it is good. Keep it up..!
  Emee anukokapothey oka chinna salahaa… inthat chakkati alochana and language meeda grip ni pradarsistoo koodaa meeru “legisi” laanti padaalu vaadaalaa..?? “Lechi” anochu kadaa..?? (“Randhraanvesana” anipistondaa..? Sorry) – but chakkati perugu annam tintunnappudu panti kinda raayi kalukkumani tagilinatluntenoo…! Hope you understand.

 4. Chandra Sekhar says:

  తాగడం ఒక ఫేషన్ ఒక వర్గం ప్రజలకి, తాగడం ఒక అలవాటు మరో వర్గం ప్రజలకి, తాగడం వ్యసనం ఇంకో వర్గం వాళ్లకి. ఎవరు తాగినా తప్పే అయినప్పుడు డబ్బున్నవాడికి మంచి లేనివాడికి మరణం ఎందుకవుతున్నావు ఓ మద్యమా పేదల పాలిట మృత్యువా!!!!!

 5. manibhushan says:

  <>

  చాలా బాగా రాశారు.
  ఇది మీ తొలి కథ(?) అంటే ఆశ్చర్యపడేంత గొప్పగా రాశారు.
  అభినందనలు.

 6. suhasini says:

  hi andi gm..hope u r doing good.

  na frnd share cheste chadivanu chala chala bagundi…nija jeevitham lo unde problems chala correct ga chepparu..naku kuda na life gurthochindi….

 7. Anonymous says:

  కన్నీళ్లు ఆగటం లేదు ప్రవీణా…..

 8. విజయ కుమారి.పోతంశెట్టి says:

  అద్భుతంగా ఉంది.ఒక వ్యసనం,దానికి బానిసను చేసేబలహీనత కుటుంబాన్ని ఎంతలా చిదిమేస్తుందో అద్భుతంగా చెప్పేరు.పిల్లల్ని invited guests అని అంటారు వాళ్ళను హింసించే హక్కు ఎవరికీ లేదు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s