మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!?
కన్నుల్లో కడపటి కన్నీటి చుక్క,
కనుసంధుల్లో ఇంకా మిగిలేవుంది(?).
గుండెల సవ్వడి,
లీలగా ఇంకా వినిపిస్తూనే ఉంది(?).
మనసులో స్పందన,
చావుబతుకుల మధ్య ఇంకా బతికే ఉంది(?).
మధిలో మంచితనం,
చేదైన మందులు మింగుతూ,
భారంగా బతుకీడుస్తూనే ఉంది.
మనిషి మనిషికీ అనుబంధం,
అణువై, పరమాణువై,
కృశించుకుపోయినా,
ఇంకా పూర్తిగా అంతరించుకుపోలేదు.
ప్రేమానురాగాలు,
సుధూరతీరాలకు తరలిపోయినా,
కనుచూపు మేరలో ఇంకా కానవస్తూనే ఉన్నాయి.
మనుషుల మధ్య సఖ్యత,
సగమై, మరి సగమై,
నూలుపోగులా ఇంకా వేలాడుతూనే ఉంది.
తోటి వారికి సాయం,
సొంత లాభం అడుగున పడిపోయినా,
ఎప్పుడో, అప్పుడు,
ఇంకా బయటకు వస్తూనే ఉంది.
భార్యాభర్తల బంధం,
అహంల పరమై,సంపాదనల వరమై,
బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమై,
పరువు కోసమో, ప్రతిష్ట కోసమో,
ఇంకా ముడిపడే ఉంది.
అవసానదశలో అమ్మానాన్నలను,
ఆదుకోవలసిన సంతానం,
విహంగాలలో విదేశాలకు వలస పోయినా,
టెలిఫోను తీగల్లో,
బాధ్యత ఇంకా ప్రసరిస్తూనే ఉంది.
అందుకేనేమో,
భూమాత మానవాళిని ఇంకా భరిస్తూనే ఉంది,
సూర్యచంద్రుల రాకపోకలు,
ఇంకా సాగుతూనే ఉన్నాయి.
మనిషి ఇంకా మనగలుగుతూనే ఉన్నాడు.
Really Super!
ధన్యవాదాలు శివ గారు